భాగవత మహా పురాణము
46 - ఉద్ధవుడు గోకులమునకు వెళ్లుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యాదవులలో శ్రేష్ఠుడగు ఉద్ధవుడు సాక్షాత్తు బృహస్పతి శిష్యుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు. ఆయన శ్రీకృష్ణునకు మంత్రి మరియు ప్రియమిత్రుడు.
శ్రీకృష్ణ భగవానుడు శరణాగతుల పీడలను, పాపములను పోగొట్టును. ఆయనకు ఉద్ధవుడు మిక్కిలి ప్రియుడు మరియు అనన్యభక్తుడు. ఆయన ఒకనాడు ఉద్ధవుని చేతిని చేతితో పట్టుకొని ఇట్లు పలికెను.
ఓ ఉద్ధవా! నీవు ప్రియదర్శనుడవు. నీవు గోకులమునకు వెళ్లి మా ఇద్దరి తల్లిదండ్రులకు ప్రీతిని కలిగించుము. నా సందేశములతో గోపికలకు వియోగదుఃఖమునుండి విముక్తిని కలిగించుము.
నాయనా! ఆ గోపికల మనస్సు నామీదే గలదు. వారికి నేనే ప్రాణము. వారు నా కొరకై దేహముతో సంబంధము గల బంధువులను కూడ విడిచి పెట్టినారు. వారు నన్నే ప్రియునిగా, ప్రియతమునిగా, ఆత్మనుగా మనస్సు చే పొందినవారు. ఎవరైతే నా అనుగ్రహము కొరకై ఇహపర సుఖములను, ధర్మములను కూడ వీడి చెదరో, వారిని నేను పాలించెదను.
ఓయీ! గోపికలకు ప్రియతముడనైన నేను వారికి దూరము కాగా, ఆ విరహముచే వారు ఉత్కంఠతో వ్యాకులపడెదరు. వారు నన్ను గుర్తు చేసుకొని అధికమగు మోహమును పొందెదరు.
గోపికలు నాతో అభేదమును పొందిరి. బహుశా వారు నేను తిరిగి రాగలననే సందేశములచే చాల కష్టముతో ఏదో విధముగా ప్రాణములను నిలబెట్టుకొని యుందురు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మహారాజా! శ్రీకృష్ణుడిట్లు చెప్పగా, ఉద్ధవుడు ఆదరముతో ఆ ప్రభుని సందేశమును తీసుకొని, రథమునెక్కి నందుని గోకులమునకు వెళ్లెను.
శోభాయుక్తుడగు ఉద్ధవుడు సూర్యుడస్తమించు సరికి నందుని గోకులమును చేరెను. ఇళ్లకు తిరిగి వెళ్లే పశువుల డెక్కల ధూళిచే ఆయన రథము కప్పివేయబడెను.
పశువుల మందలోని మదించిన ఎద్దులు ఆవులకై పోటీ పడుతూ నాదములను చేయుచుండెను. బరువెక్కిన పొదుగులతో ఆవులు తమ దూడల కొరకు పరుగులు తీయుచుండెను.
ఇటునటు గెంతులు వేయుచున్న ఆవు దూడలు గోకులమునకు అలంకారమాయెను. గోకులమంతా పాలను పితికే శబ్దములతో మరియు పిల్లన గ్రోవుల ధ్వనులతో నినదించెను.
గోపికలు చక్కగా బలరామ శ్రీకృష్ణుల మంగళకరమైన లీలలను గానము చేయుచుండిరి. వారు, గోపాలకులు గోకులము యొక్క శోభను ఇనుమడింప జేసిరి.
అగ్నులు, సూర్యుడు, అతిథులు, గోవులు, వేదవేత్తలు, పితృదేవతలు, దేవతలను ఆరాధించే గోపాలకుల ఇళ్లతో, ధూపదీపములతో, మరియు పుష్పమాలలతో గోకులము శోభిల్లెను.
గోకులమునందు అంతటా పుష్పించిన అడవులలో పక్షులు, శుమ్మెదలు గుంపులు నినదించుచుండెను. పద్మములతో నిండిన సరస్సులు హంసలతో, కారండవ (టర్కీ) పక్షులతో వ్యాప్త మై శోభిల్లెను.
వచ్చిన ఉద్ధవుడు శ్రీకృష్ణునకు ప్రియమైన అనుచరుడు. నందుడు ఆయనను కలిసి ప్రీతిని పొందెను. నందుడు ఆయనను కౌగిలించుకొని, ఈతడు శ్రీకృష్ణుడే అనే భావనతో సత్కారములను చేసెను.
ఉద్ధవుడు శ్రేష్ఠమైన ఆహారమును భుజించి సుఖముగా ఆసనము పై కూర్చుండెను. కాళ్లను నొక్కుట, వీచుట మొదలైన (సేవకుల) సపర్యలచే ఆయన శ్రమ దూరమయ్యెను. అప్పుడు నందుడిట్లు ప్రశ్నించెను.
ఓయీ ఉద్ధవా! నీవు గొప్ప భాగ్యశాలివి. శూరుని పుత్రుడగు వసుదేవుడు మా మిత్రుడు. ఆయన కారాగారమునుండి విడుదల ఆయెను. ఆయన సంతానము, మిత్రులు, బంధువులు మొదలగువారితో కలిసి కుశలముగా నున్నాడా?
పాపియగు కంసుడు తన అనుచరులతో దైవానుగ్రహముచే తన పాపము చేతనే సంహరించబడినాడు. ఆతడు సజ్జనులు, ధర్మశీలురు అగు యాదవులను సర్వకాలములయందు ద్వేషించెడివాడు.
శ్రీ కృష్ణుడు మమ్ములను, తల్లిని, బంధువులను, మిత్రులను, గోపాలకులను, తానే రక్షకుడుగా గోకులమును, గోవులను, బృందావనమును, గోవర్ధన పర్వతమును స్మరించుచున్నాడా?
గోవిందుడు తనవారిని చూచుటకు ఒక్కసారి వచ్చునా? వచ్చినచో, అందమైన ముక్కు, చక్కని చిరునవ్వుతో కూడిన చూపులు గల ఆతని ముఖమును అప్పుడు చూచెదము.
శ్రీకృష్ణుడు గొప్ప మహాత్ముడు. ఆయన మమ్ములను కార్చిచ్చు, గాలివాన, వృషభాసురుడు, అఘాసురుడు మొదలైన అతిక్రమించ శక్యము కాని మృత్యువులనుండి రక్షించినాడు.
ఓయీ! మేము చేసుకుంటూండగా, శ్రీకృష్ణుని పరాక్రమములు, విలాసతోడి ఓరచూపు, నవ్వు, పలుకు గుర్తుకు వచ్చి పనులు చెడిపోవుచున్నవి.
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పాదముల గుర్తులచే అలంకరించబడిన నదీతీరములను, పర్వతసానువులను, అడవులను, ఆట స్థలములను చూస్తూంటే మా మనస్సు ఆయనతో ఐక్యమును పొందుచున్నది.
శ్రీకృష్ణ బలరాములు దేవతల యొక్క గొప్ప ప్రయోజనమును సిద్ధింప జేయుటకై ఇచటకు వచ్చిన దేవనాయకులని నేను తలచెదను. గర్గాచార్యుడు అటులనే చెప్పినారు.
వారిద్దరు పదివేల ఏనుగుల బలము గల కంసుని, చాణూరముష్టికులనే ఇద్దరు మల్లులను, గజరాజును అవలీలగానే, మృగేంద్రుడగు సింహము పశువులను వలె, సంహరించిరి.
మూడు తాటి చెట్ల పొడవు కలిగి మిక్కిలి దృఢమైన ధనుస్సును శ్రీకృష్ణుడు ఒక్క చేతితో, గజేంద్రుడు కట్టెను వలె, విరుగగొట్టెను. ఆయన ఏడు రోజులు నిరంతరముగా గోవర్ధన పర్వతమును పట్టుకొని నిలబడెను.
శ్రీకృష్ణుడు ఈ బృందావనములో ప్రలంబుడు, ధేనుకుడు, అరిష్టాసురుడు, తృణావర్తుడు, బకుడు, అఘాసురుడు మొదలైన రాక్షసులను అవలీలగా పరిమార్చెను. వారందరు దేవతలపై మరియు రాక్షసులపై ఇదివరలో విజయమును సాధించినవారే.
శ్రీశుక ఉవాచ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మనస్సులో శ్రీకృష్ణునిపై అధికమగు అనురాగము గల నందుడి విధముగా పలు మార్లు స్మరించి, ప్రేమ యొక్క ప్రవాహముచే వ్యాకులుడాయెను. శ్రీకృష్ణుని చూడాలనే అతిశయించిన ఉత్కంఠ గల ఆయన మిన్నకుండెను.
శ్రీకృష్ణునియందలి ప్రేనుచే యశోద పాలిండ్లు పాలను స్రవించెను. ఆమె పుత్రుని లీలలు వర్ణించబడుతూంటే వింటూ కన్నీళ్లను వర్షించెను.
యశోదానందులకు శ్రీకృష్ణ భగవానుని పై ఇటువంటి అతిశయించిన ప్రేమ గలదు. దానిని చూచి ఉద్ధవుడు ఆనందముతో నందునితో నిట్లనెను.
ఉద్ధవ ఉవాచ ।
ఉద్ధవుడిట్లు పలికెను --- సమ్మానమునిచ్చే ఓ నందా! ఈ లోకములోని ప్రాణులలో మీరిద్దరు అత్యధికముగా కొనియాడ దగినవారు. ఏలయన, సకల ప్రాణులకు తండ్రియగు నారాయణునిపై మీరు ఇటువంటి ప్రేమను కలిగియున్నారు.
మోక్ష ప్రదాత, పూర్ణ బ్రహ్మ అగు శ్రీకృష్ణుడు జగత్తు యొక్క నిమిత్తకారణము మాయాశక్తియగు బలరాముడు ఉపాదాన కారణము. కాలాతీతులగు వీరిద్దరు ప్రాణులలో ప్రవేశించి, వివిధములైన అంతఃకరణములను అంతర్యాములై నియంత్రించుచున్నారు.
మానవుడు ప్రాణము పోయే సమయములో మనస్సును పరమాత్మ పై ఏకాగ్రము చేసినచో, వాని కర్మరాశి వెంటనే దగ్ధమగును. అట్టివాడు సర్వోత్కృష్టపురుషార్థమగు మోక్షమును పొంది స్వయంప్రకాశపరబ్రహ్మయందు విలీనమగును.
ఆ నారాయణుడే సకలజగత్తునకు ఉపాదాననిమిత్తములగుచున్నాడు. ఆయన దేవకార్యమును చక్కబెట్టుటకై మానవరూపమును దాల్చిన సర్వవ్యాపకుడు. ఆయనయందు మీరిద్దరు నిరతిశయమైన అనురాగమును చేసిరి. మీరింకనూ చేయవలసిన పుణ్యకర్మ మిగిలియున్నదా? (లేదు).
యాదవప్రభుడు (భక్తపాలకుడు) శ్రీకృష్ణ భగవానుడు తొందరలోనే గోకులమునకు వచ్చి తల్లిదండ్రులకు ప్రీతిని కలిగించగలడు.
శ్రీకృష్ణుడు సకలయాదవులకు (భక్తులకు) శత్రువగు కంపని మల్లరంగము మధ్యలో వధించిన వెంటనే మీ వద్దకు వచ్చి ఏ మాటను చెప్పెనో, దానిని ఆయన తప్పక నిలబెట్టుకొనును.
ఓ యశోదానందులారా! మీరు మహాభాగ్యశాలురు. మీరు ఖేదపడకుడు. మీరు తొందరలో శ్రీకృష్ణుని చూచెదరు. కట్టెలయందు అగ్ని వలె, ఆయన ప్రాణుల హృదయము లోపల ఉన్నాడు.
శ్రీకృష్ణుడు దేహాభిమానము లేనివాడు, సమదృష్టి ఆయనకు ఎవడైననూ ప్రియుడు గాని, ప్రియము కానివాడు గాని, ఎక్కువ వాడు గాని, తక్కువ వాడు గాని లేదు. ఆయనకు అన్ని విధములుగా సమానమైనవాడు, అనగా ఉపేక్షించదగినవాడైననూ లేడు.
ఆయనకు తల్లి, తండ్రీ , భార్య, పుత్రుడు, సోదరుడు మొదలగువారు, తన వాడు, పరాయి వాడు, దేహము, పుట్టుక అనేవి లేనే లేవు.
ఈ లోకములో ఈయనకు కర్మబంధము లేదు. ఐనా, లీల కొరకు సత్పురుషులను రక్షించుటకై ఆయన దేవాది. సద్యోనులలో, పశ్వాది అసద్యోనులలో, మానవుడనే మిశ్రయోనియందు స్వేచ్ఛచే ప్రకటమగును.
ఆ మంమాత్మ గుణములకతీతుడు, పుట్టుక లేనివాడు. ఐననూ, ఆయన సత్త్వరజస్తమోగుణములను సేవించును. ఆయన ఈ లోకమునందు క్రీడించును. ఈ లోకమును ఆయన గుణములతో సృష్టించి, పాలించి, తనలో విలీనము చేసుకొనును.
గిర గిర తిరిగే చక్రము పై కూర్చుని తిరిగినప్పుడు భూమియే తిరుగుచున్నట్లు కొనవచ్చును. అదే విధముగా, చిత్తము పనులను చేయుచుండ, దానియందు నేననే తాదాత్మ్యబుద్ధిచే ఆత్మ (తాను) యే కర్తవలె అనుభవమునకు వచ్చును. (ఈశ్వరునియందు కర్తృత్వము లేదు).
ఈ శ్రీకృష్ణ భగవానుడు మీ ఇద్దరికి మాత్రమే పుత్రుడు కానే కాదు. ఎందుకంటే, ఆ ఈశ్వరుడు అందరికీ పుత్రుడు మాత్రమే గాక, ఆత్మ తండ్రి, తల్లి కూడ అగును.
చూచినది, విన్నది, గడచిపోయినది. ఇప్పటిది, భవిష్యత్తులోనిది, పెద్దది, చిన్నది, వస్తువు ఏదైనా ఆ పరమాత్మ లేకుండా దానికి వస్తువుగా మనుగడయే లేదు. సర్వము పరమార్థసద్రూపుడగు పరమాత్మయే.
ఓ పరీక్షిన్మహారాజా! నందుడు, శ్రీకృష్ణుని అనుచరుడగు ఉద్ధవుడు మాటలాడుచుండగనే ఆ రాత్రి గడిచిపోయెను. ఇంతలో గోపికలు (తెల్లవారు జామున) నిద్ర లేచి దీపములను వెలిగించి, ముంగిట వాకిటి మొదలగు వాటిని ముగ్గులతో అలంకరించి, పెరుగులను చిలికిరి.
ఆ గోపికలు కంకణముల వరుసలు గల భుజములతో (పెరుగును చిలికే) త్రాళ్లను లాగుతూ ఉంటే నితంబములు, స్తనములు, హారములు కదలాడుచుండెను. వారి చెక్కిళ్లు కుండలముల కాంతులతో, ముఖములు ఎర్రని కుంకుమతో శోభిల్లెను. ఆభరణములయందలి మణులు దీపకాంతులలో ధగధగలాడుచుండ వారు అధికముగా ప్రకాశించిరి.
గోపికలు పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుని కీర్తిని బిగ్గరగా గానము చేయుచుండిరి. ఆ ధ్వని పెరుగును చిలికే ధ్వనితో కలిసి అంతరిక్షమును తాకి, దిక్కులయందు వ్యాపించి వాటియందలి అమంగళమును పారద్రోలును.
సూర్యభగవానుడుదయించెను. గోకులవాసులు నందుని ఇంటి వద్ద బంగరు రథమును చూచి, ఇది యెవరిది? అని ప్రశ్నించుకొనిరి.
కంసునకు పనులను చేసి పెట్టే అక్రూరుడు వచ్చినాడా యేమి ? ఈతడు పద్మములవంటి కన్నులు గల కృష్ణుని మథురకు కొనిపోయినాడు.
మరణించిన తన ప్రభువగు కంసునకు మనతో పిండములను చేసి సమర్పించునా యేమి? అని స్త్రీలు పలుకుచుండిరి. ఇంతలో ఉద్ధవుడు స్నానాదికమును పూర్తి చేసుకొని వారి వద్దకు వెళ్లెను.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో
ఉద్ధవుడు గోకులమునకు వెళ్లుటను వర్ణించే
నలుబది ఆరవ అధ్యాయము ముగిసినది (46).
Summary of chapter 46 of the Bhāgavata Mahā Purana is as follows:
Desiring to comfort His foster parents Nanda Mahārāja and Yaśodā-devī, as well as the gopīs who were suffering intense pangs of separation (*Viraha*), Śrī Kṛshṇa dispatched His dear friend and minister, Uddhava, to Vṛndāvana with a confidential message. Riding upon a golden chariot, Uddhava arrived in Vṛndāvana at sunset as the cows were returning from pasture. Nanda Mahārāja welcomed Uddhava with warm hospitality, inquiring eagerly about Kṛshṇa's well-being and weeping tears of affection as he recalled Kṛshṇa's childhood pastimes. Uddhava spent the entire night consoling Nanda and Yaśodā, explaining that Kṛshṇa is the Supreme Personality of Godhead who resides perpetually within the hearts of His devotees.