భాగవత మహా పురాణము
17 - శ్రీకృష్ణుడు గోకులవాసులను దావాగ్నినుండి కాపాడుట
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- కాలియుడు సర్పములకు నివాసస్థానమగు రమణకద్వీపమును విడిచి పెట్టుటకు కారణమేమి? ఆతడొక్కడే గరుడునకు చేసిన అప్రియ మెట్టిది?
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- గొప్ప బాహువులు గల ఓ పరీక్షిన్మహారాజా! పూర్వము రమణకద్వీపములో గరుడునిచే సర్పములు భక్షించబడుచుండగా, పురవాసులగు వాసుకి మొదలగువారు ఒక వ్యవస్థను చేసిరి. అదేమంటే, ప్రతి నెలా గరుడునకు ఆహారమును చెట్టు మొదట్లో పెట్టవలెను.
సర్పములన్నీ తమ రక్షణ కొరకై గొప్ప శరీరబలము గల గరుడునకు ప్రతి అమావాస్యనాడు తమ వంతు ఆహారమును సమర్పించెదరు.
కాలియుడు కద్రువు పుత్రుడు. విష శక్తిచే ఆతనిని గర్వము ఆవేశించేను. ఆతడు గరుడుని తిరస్కరించి ఆ ఆహారమును తానే తినెను.
ఓ పరీక్షిన్మహారాజా! పూజనీయుడగు గరుడుడు శ్రీహరి భగవానునకు ప్రీతిపాత్రుడు. కాలియుడు తన ఆహారమును తినినాడని విని గొప్ప వేగము గల ఆ గరుడుడు కోపించి, వానిని చంపగోరి తరుముకు వచ్చెను.
దూరమునుండి విషమును, దగ్గరనుండి కోరలను ఆయుధములుగా వినియోగించే కాలియుడు అనేకములగు పడగలను పైకెత్తి వేగముగా మీదకు వచ్చుచున్న ఆ గరుడుని ఎదుర్కొనుటకై ముందుకు వెళ్లాను. దీర్ఘముగా నిట్టూర్చే ఆతని నాలుక, కన్నులు భీతిని గొల్పుచుండెను. ఆతడు గరుడుని కోరలతో కాటు వేసెను.
మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీహరికి వాహనమైన గరుడుడు మిక్కిలి భయంకరమగు వేగము గలవాడు. కశ్యపుని పుత్రుడగు ఆయన - పరాక్రమము భీతిని గొల్పును. ఆయన కోపించి కద్రువు పుత్రుడగు ఆ కాలియుని త్రోసివేసి బంగరు కాంతి గల ఎడమ రెక్కతో కొట్టెను.
గరుడుడు రెక్కతో కొట్టగా కాలియునకు అవయవముల స్వాధీనత తప్పెను. ఆతడు యమునానదియొక్క ఆ కుండమును ప్రవేశించెను. అది ఇతరులు ప్రవేశించుటకు కాని, గరుడుడు వచ్చుటకు కాని శక్యము కానిది.
ఒకనాడు గరుడుడు ఆకలితోనుండెను. ఒకానొక చేప ఆయనకు ప్రియమైన భక్ష్యము. సౌభరి మహర్షి నివారించిననూ, ఆయన ఆ సరస్సులో ఆ చేపను బలాత్కారముగా కొనిపోయెను.
గరుడుడు చేపల రాజును తీసుకుపోగా, చేపలు చాల దుఃఖించి దీనములై యుండెను. వాటిని చూచిన సౌభరి మహర్షికి దయ కలిగెను. ఆ కుండములోని ప్రాణులకు క్షేమమును కలిగించగోరి ఆయన ఇట్లనెను.
ఆ గరుడుడు ఈ కుండములో ప్రవేశించి చేపలను తిన్నచో, వెంటనే ఆతని ప్రాణములు పోవును, నేను చెప్పిన ఈ మాట యథార్థము.
ఆ విషయము కేవలము కాలియునకు మాత్రమే తెలియును. మిగిలిన సర్పములు వేటికీ తెలియదు. గరుడునకు భయపడిన కాలియుడు ఆ కుండములో నివసించెను. శ్రీకృష్ణుడాతనిని అచటనుండి పంపివేసెను.
శ్రీకృష్ణుడు కుండమునుండి బయటకు వచ్చేను. ఆయన ప్రకాశించే మాలలను, గంధమును, వస్త్రములను దాల్చి, గొప్ప. మణుల సమూహములతో బంగారముతో అంతటా అలంకరించబడి యుండెను. ఆయనను చూచి గోపాలకులందరు, ప్రాణము వచ్చిన ఇంద్రియములు వలె, లేచి నిలబడిరి. వారి మనస్సులు మహానందముతో నిండిపోయెను. వారాయనను ప్రేమతో గట్టిగా కౌగిలించుకొనిరి.
యశోద, రోహిణి, నందుడు, గోపికలు, గోపాలకులు కూడ శ్రీకృష్ణుని కలుసుకొనిరి. వారిలో మరల చేష్ట వచ్చెను. వారి మనోరథము సిద్ధించెను.
శ్రీకృష్ణ భగవానుని ప్రభావము తెలిసిన బలరాముడు కూడ ఆయనను కౌగిలించుకొని నవ్వెను. చెట్లు, ఆవులు, ఎద్దులు, దూడలు అతిశయించిన ఆనందమును పొందినవి.
ఓ పరీక్షిన్మహారాజా! వేదవేత్త లైన గురువులు భార్యలతో కూడి నందుని వద్దకు వచ్చిరి. వారాయనతో - నీ పుత్రుడు కాలియునిచే పట్టుకొనబడి విముక్తుడైనాడు; ఇది మంగళము; శ్రీకృష్ణుడు విముక్తుడైన కారణముగా బ్రాహ్మణులకు దానమునిమ్ము -- అని పలికిరి. అప్పుడు నందుడు మనస్సులో ప్రీతి గలవాడై ఆవులను, బంగారమును దానము చేసెను.
పతివ్రతయగు యశోద గొప్ప భాగ్యవంతురాలు. ఆమెకు కనబడకుండా పోయిన పుత్రుడు మరల లభించినాడు. ఆమె శ్రీకృష్ణుని కౌగిలించుకొని, ఒడిలో కూర్చుండబెట్టుకొని, పలుమార్లు కన్నీటి బిందువులను విడిచెను.
ఓ గొప్ప రాజా! గోకులవాసులు, గోవులు ఆకలిదప్పికలతో మరియు అలసటతో కృశించియుండిరి. వారా రాత్రి యమునా నది ఒడ్డునకు దగ్గరలో నివాసము చేసిరి.
అప్పుడు వేసవి కాలపు అడవినుండి పుట్టిన కార్చిచ్చు రాత్రి నిద్రించిన గోకులజనమును అన్ని వైపులనుండి చుట్టివేసి కాల్చుటకు ఉపక్రమించెను.
అప్పుడు కాల్చివేయబడుచున్న ఆ గోకులవాసులు కంగారు పడుతూ లేచి శ్రీకృష్ణ భగవానుని శరణు వేడిరి. ఆయన మాయచే మానవరూపమును దాల్చిన ఈశ్వరుడే.
ఓ శ్రీకృష్ణా! కృష్ణా! ఓ బలరామా! నీ పరాక్రమము హద్దులు లేనిది. ఈ అగ్ని నీ వారమైన మమ్ములను నిశ్చయముగా మ్రింగి వేయుచున్నది.
ఓ ప్రభూ! మృత్యురూపమైన ఈ అగ్నిని అధిగమించుట సుతరాము శక్యము కాదు. మేము నీ వారము, మిత్రులము. మమ్ములను దీనినుండి కాపాడుము. మేము నీ పాదమును విడిచి పెట్ట లేము. నీ పాదము నాశ్రయించువారలకు దేనినుండైననూ భయము ఉండదు.
శ్రీకృష్ణుడు జగన్నాథుడు, అనంతమగు శక్తిని ధరించువాడు, కాలాతీతుడు. ఆయన తన జనుల వ్యాకులతను చూచి భయంకరమగు ఆ అగ్నిని త్రాగివేసెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు దావాగ్నినుండీ గోకులవాసులను రక్షించుటను వర్ణించే పది హేడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 17 of the Bhāgavata Mahā Purana is as follows:
After subduing Kāliya, the exhausted residents of Vṛndāvana spent the night sleeping on the banks of the Yamunā. At midnight, a ferocious forest fire (*Dāvānalam*) erupted, encircling the sleeping cowherds and threatening to consume Gokula. Terrified, the cowherds awoke and took shelter of Śrī Kṛshṇa, crying out for His divine protection. Instructing them to close their eyes, Śrī Kṛshṇa swallowed the entire raging forest fire in a single breath, demonstrating His supreme power over natural elements and saving His associates unharmed.