భాగవత మహా పురాణము
62 – ఉషా - అనిరుద్ధుల సమాగమము
రాజోవాచ ।
పరీక్షిత్తు ఇట్లు పలి కెను - మహాయోగివగు శుక మహర్షీ! యాదవశ్రేష్టుడగు అనిరుద్ధుడు బాణాసురుని కుమార్తెయగు ఉషను వివాహమాడెను. ఆ సందర్బములో శ్రీకృష్ణ భగవానునకు శంకరునితో భయంకరమైన గొప్ప యుద్దము జరిగెను. ఆ వివరములనన్నింటినీ తమరు చెప్పదగుదురు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- మహాత్ముడగు బలి చక్రవర్తి వామనరూపుడైన శ్రీహరికి భూమిని ఇచ్చేను. ఆ బలికి వందమంది కొడుకులు గలరు. వారిలో బాణుడు పెద్దవాడు.
ఆ బలికి ధర్మపత్నియందు జన్మించిన పుత్రుడగు బాణుడు సర్వకాల ములలో శివభక్తియందు ప్రీతి గలవాడు, సమ్మానించదగినవాడు, దాత, బుద్ధిశాలి, సత్యమునకు కట్టుబడినవాడు, గట్టి నియమనిష్ఠలు గలవాడు.
వేయి చేతులు గల ఆ బాణుడు పూర్వము శోణితమనే పేరు గల నగరమునందు రాజ్యమునేలెను. ఆతనికి శివుని అనుగ్రహముచే దేవతలు సేవకుల వలె నుండెడివారు. శివుడు తాండవము చేయుచుండగా, ఆతడు వేయి చేతులతో వాద్యములను వాయించి ఆయనను ప్రీతుని చేసెను.
సకలప్రాణులను శాసించే శివభగవానుడు శరణు జొచ్చినవారిని పాలించును. భక్తులయందు గొప్ప ప్రేమ గల ఆ దేవుడు బాణుని వరమును కోరుకొమ్మని ప్రోత్సహించగా, ఆతడు ఆయనను తన నగరమునకు రక్షకుడవు కమ్మని కోరెను.
పరాక్రమముచే మిక్కిలి గర్వించియున్న ఆ బాణుడు ఒకనాడు సూర్యుని వలె ప్రకాశించే కిరీటముతో పద్మములవంటి శివుని పాదములను స్పృశించి ప్రణమిల్లెను. అపుడాతడు తన ప్రక్కనే ఉన్న శివునితో నిట్లనెను.
ఓ మహాదేవా! నీవు లోకములకు తండ్రివి, శాసకుడవు. కోరికలు తీరని వ్యక్తులకు నీవు కోరికలను తీర్చే కల్పవృక్షమవు. నీకు నమస్కారము.
నీవు నాకిచ్చిన వేయి చేతులు కేవలము బరువు మాత్రమే ఆయెను. ముల్లోకములలో నిన్ను మినహాయిస్తే, నాతో సమానుడైన యుద్ధవీరుడు నాకు దొరకుట లేదు.
జగత్కారణుడవగు ఓ శివా! దురదతో నిండిపోయిన చేతులతో నేను యుద్ధమును చేయగోరి కొండలను పిండి చేస్తూ దిగ్గజముల వద్దకు వెళ్లితిని. అవి కూడా భయపడి పారిపోయినవి.
ఆ మాటను విని శివభగవానుడు కోపించి యిట్లనెను -- ఓరీ మూర్ఖా! ఏనాడైతే నీ జెండా విరిగి పడునో, ఆనాడు నాతో సమానమైన వానితో నీకు యుద్ధము జరుగును. దానిలో నీ పొగరు అణిగిపోవును.
ఓ పరీక్షిన్మహారాజా! కైలాసవాసియగు శివుడిట్లు ఆదేశించగా, దుర్బుద్ధియగు బాణుడు హర్షముతో తన ఇంటికి వెళ్లి, తన పరాక్రమమును నశింపజేసే శివుని ఆదేశము (జెండా పడుట) కొరకు ప్రతీక్షించుచుండెను.
వానికి ఉష అని ప్రసిద్ధి జెందిన కుమార్తె గలదు. ఆ కన్య కలలో పూర్వమెప్పుడూ వినని కనని అందగానితో ప్రేమలో పడెను. ఆ అందగాడు ప్రద్యుమ్నుని పుత్రుడగు అనిరుద్ధుడు.
ఆమెకు ఆ స్వప్నములోనే ఆ ప్రియుడు కనబడ లేదు. ఓ ప్రియుడా! ఎక్కడున్నావు? అని పలవరిస్తూ ఆమె సఖుల మధ్యలో నిద్ర లేచి నిలబడెను. అప్పుడామె కంగారునకు, అధికమగు సిగ్గునకు వశమయ్యేను.
బాణుని మంత్రియైన కుంభాండుని కుమార్తె చిత్రలేఖ ఉషకు చెలికత్తె. ఆమె కుతూహలముతో కూడినదై మిత్రురాలైన ఉషను ప్రశ్నించేను..
అందమైన కనుబొమలు గల రాజకుమారీ!(కలలో) నీవెవరిని వెదుకుచున్నావు? నీ అభిలాష యెట్టిది? ఈనాటి వరకు నీకు వివాహము కాలేదు, పాణిగ్రహణము చేసిన భర్త లేడు.
ఊషోవాచ ।
ఉష ఇట్లు పలికెను --- నల్లనివాడు, కలువ కన్నులవాడు, పచ్చని వస్త్రమువాడు, పొడవాటి చేతులవాడు, అతివల హృదయమును దోచే ఒకానొక మానవుడు కలలో కనబడినాడు.
నేనా ప్రియుని వెదుకుచున్నాను. నాకు మధురమైన అధరమునందించి, ప్రేమించుచున్న నన్ను దుఃఖసముద్రములో పారవైచి ఆతడెక్కడికో వెళ్లినాడు.
చిత్రలేఖోవాచ ।
చిత్రలేఖ ఇట్లు పలి కెను --- నీ దుఃఖమును పోగొట్టెదను. నీ మనస్సును దోచిన ఆ మానవుడు ముల్లోకములలో ఉన్నట్లైతే, ఆతనిని తీసుకువచ్చేదను. వాని గురించి చెప్పుము (వానిని గుర్తించుము).
ఇట్లు పలికి ఆమె దేవతలను, గంధర్వులను, సిద్ధులను, చారణులను, నాగులను, రాక్షసులను, విద్యాధరులను, యక్షులను, మానవులను కూడ ఉన్నవారిని ఉన్నట్లుగా బొమ్మలను గీసెను.
మానవులలో కూడ యాదవులను, వారిలో శూరుని, వసు దేవుని, బలరాముని, శ్రీకృష్ణుని, ప్రద్యుమ్నుని కూడ చిత్రించేను. ఉష ప్రద్యుమ్నుని చూచి (పోలికచే ప్రియుని తండ్రియని) సిగ్గు పడెను.
ఓ పరీక్షిన్మహారాజా! అనిరుద్ధుని చిత్రపటమును చూచి ఉష సిగ్గుతో తల వంచి చిరునవ్వుతో, (కలలోని) ఆతడు ఈతడే, ఈతడే, అని పలికెను.
ఓ పరీక్షిన్మహారాజా! చిత్రలేఖకు మహిమలు తెలియును. ఆతడు శ్రీకృష్ణుని కొడుకు కొడుకని ఆమె గుర్తించి, ఆకాశమార్గమున శ్రీకృష్ణునిచే రక్షించబడే ద్వారకకు వెళ్లాను.
ఆమె మాయాశక్తినాశ్రయించి, ఆ ద్వారకలో మంచి మంచముపై నిద్రించుచున్న ప్రద్యుమ్నపుత్రుడగు అనిరుద్దుని శోణితపురమునకు తీసుకువెళ్లి, మిత్రురాలగు ఉషకు ఆమే ప్రేమించినవానిని చూపించెను.
అందగాళ్లలో అందగాడగు ఆ ప్రద్యుమ్నపుత్రుని చూచి ఉష ముఖము ఆనందముతో నిండెను. ఆమె అంతఃపురము మగవాళ్లకు చూడ శక్యము కానిది. ఆమె దానిలో ఆ అనిరుద్ధునితో గూడి రమించెను.
ఆమె అనిరుద్ధునకు మిక్కిలి విలువైన వస్త్రములు, పుష్పమాలలు, ధూపము, దీపము, ఆసనము, తాంబూలము మొదలగువాటిని సమర్పించేను. ఆతనికి పానీయములను, నమిలి తినదగిన మరియు మ్రింగదగిన ఆహారములను సమకూర్చెను. ఆమె అతనితో కబుర్లాడి సేవను చేసి ఆరాధించేను.
ఆ అనిరుద్దుడు అంతఃపురములో రహస్యముగా ఉండెను. నిత్యము వర్ధిల్లుతున్న ప్రేమ గల ఉష ఆతని మనస్సును దోచివేసెను. ఆతనికి చాల దినములు గడిచిన విషయమే తెలియలేదు.
ఆ విధముగా ఆమె యాదవవీరుడగు అనిరుద్దునితో కలిసి రమిస్తూ మహానందముతో నుండెను. ఆమె కన్యాత్వమును కోల్పోయినదని దాచ శక్యము కాని గుర్తులను బట్టి అంతఃపురభటులు గుర్తించిరి.
రాజభటులు బాణాసురునితో ఇట్లు విన్నవించిరి -- ఓ రాజా! కన్యయగు నీ కుమార్తె ప్రవృత్తి కులమును చెడగొట్టుచున్నదని మేము గుర్తించినాము.
ఓ ప్రభూ! మేము క్షణము కూడా తొలగిపోకుండా జాగ్రత్తగా అంతః పురమును కాపాడితిమి. మగవాళ్లకు చూడ శక్యము కాని అంతఃపురములో కన్యను మగవాడు చెడగొట్టిన తీరు మాకు తెలియకున్నది.
అప్పుడు కుమార్తె చెడిపోయినదనే వార్త విని చాల దుఃఖమును పొందిన బాణుడు వేగముగా కన్యకయొక్క అంతఃపురమునకు వెళ్లాను. అచట ఆయనకు యాదవశ్రేష్ఠుడగు అనిరుద్ధుడు కనబడెను.
మన్మథుని పుత్రుడైన ఆ అనిరుద్దునితో సమానమైన అందగాడు ముల్లోకములలో లేడు. నల్లని ఆతడు పచ్చని వస్త్రమును దాల్చెను. పద్మములవంటి కన్నులు, పొడవాటి చేతులు గల ఆతని ముఖమునకు కుండలములు, ముంగురులు, చిరునవ్వుతో కూడిన చూపులే అలంకారములాయెను.
అనిరుద్దుడు సర్వాంగసుందరియగు ప్రియురాలి యెదుట కూర్చుండి ఆమెతో పాచికలాడుచుండెను. ఆతడు ఆమె దేహముతోడి సంగముచే స్తనములయందలి కుంకుమ గల మాలను వక్షఃస్థలము పై దాల్చెను. ఆ మాల వసంతకాలమునందలి మల్లెలతో గ్రుచ్చినది. ఆతనిని చూచి బాణుడు ఆశ్చర్యమును పొందెను.
ఆయుధములను పైకెత్తి పట్టుకున్న అనేకభటులు చుట్టువారి రాగా ప్రవేశించిన బాణుని చూచి, మధువంశీయుడగు ఆ అనిరుద్దుడు లోహమిశ్రమపు గుదీయను పైకెత్తి నిలబడెను. ఆయన సంహరించుటకై కాలదండమును ధరించిన యముని పోలియుండెను.
అనిరుద్దుని పట్టుకొనగోరి ఆ రాజభటులు చుట్టుముట్టిరి. అపుడాతడు, గుంపుకు నాయకత్వము వహించే వరాహము కుక్కలను వలె, వారిని గుదియతో మోదెను. తలలు పగిలి తొడలు, చేతులు విరుగుచుండ వారు భవనమునుండి బయటకు వచ్చి పలాయనము చిత్తగించిరి.
బలిచక్రవర్తియొక్క పుత్రుడగు బాణుడు బలశాలి. ఆతడు తన సైన్యమును సంహరించుచున్న అనిరుద్ధుని నాగపాశములతో కట్టివేసెను. తన ప్రియుడు బంధించబడినాడని విని ఉష మానసిక దుఃఖముతో, శరీరమునందలి నీరసముతో వ్యాకులపడెను. ఆమె కళ్ల నిండా నీళ్లు పెట్టుకొని విలపించెను.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో ఉషా-అనిరుద్ధుల సమాగమమును వర్ణించే అరువది రెండవ అధ్యాయము ముగిసినది (62).
Summary of chapter 62 of the Bhāgavata Mahā Purana is as follows:
In the city of Śoṇitapura ruled the thousand-armed king Bāṇāsura, the eldest son of King Bali. Bāṇāsura, a staunch devotee of Mahādeva Śiva, grew arrogant with his military strength and prayed to Śiva for a worthy opponent to satisfy his desire for battle. Meanwhile, Bāṇāsura's daughter, Ūshā, saw a handsome youth in a dream and fell deeply in love. Her companion, Citralekha, who possessed mystical artistic abilities, drew portraits of various demigods and princes. Upon seeing the portrait of Aniruddha (grandson of Kṛshṇa), Ūshā identified him as her beloved. Using mystic power, Citralekha traveled through the night sky to Dvārakā, abducted Aniruddha while he slept, and brought him to Ūshā's private palace quarters in Śoṇitapura.