భాగవత మహా పురాణము
54 - శిశుపాలాదులను ఓడించి శ్రీకృష్ణుడు రుక్మిణిని పరిణయమాడుట
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఆ రాజులకు చాల కోపము వచ్చెను. వారు కవచములను ధరించి, ధనుస్సులను చేతబట్టి, వాహనములనెక్కి, తమ తమ సైన్యములు చుట్టువారి రాగా, శ్రీకృష్ణుని వెనుకనుండి తరిమిరి..
రాఓ పరీక్షిన్మహారాజా! వారు తమ మీదకు వచ్చుటను ఆ యాదవ సైన్యముల అధ్యక్షులు చూచి తమ ధనుస్సులను టంకారము చేసి నిలిచి వారిని ఎదుర్కొనిరి.
యుద్దనిపుణులగు ఆ రాజులు గుర్రములపై, ఏనుగుల పై, రథములలో ఉన్న యాదవుల పై బాణముల వర్షములను, మేఘములు కొండల పై జలములను వలె, కురిపించిరి.
భర్తయగు శ్రీకృష్ణుని సైన్యము బాణముల ధారలతో కప్పివేయబడుటను చూచి - రుక్మిణి కన్నులు భయముతో వ్యాకులమయ్యెను. ఆమె సిగ్గు పడుతూ ఆయన ముఖమును చూచెను.
శ్రీకృష్ణ భగవానుడు నవ్వి యిట్లనెను -- ఓ అందమైన కన్నులదానా! భయపడకుము. ఇప్పుడే నీ పొరలు (మేము) ఈ శత్రు సైన్యమును మట్టుబెట్టగలరు.
గదుడు, బలరాముడు, సాత్యకి మొదలగు వీరులు జరాసంధాదుల ఆ పరాక్రమమును సహించ రైరి. వారు గుర్రములు, ఏనుగులు, రథములపై యుద్ధము చేయువారిని వాడి బాణములతో కొట్టిరి.
రథికుల, గుర్రపు రౌతుల, ఏనుగుల పై యుద్ధము చేయువారల తలలు కోట్లాదిగా నేల పై కూలినవి. ఆ తలలకు కుండలములు, కిరీటములు, తలపొగలు ఉండెను.
కత్తులు, గదలు, ధనుస్సులతో కూడిన చేతులు, ముంజేతులు, తొడలు, కాళ్లు నేలపై పడినవి. గుర్రములు, కంచర గాడిదలు, గాడిదలు, ఏనుగులు, ఒంటేలు, మనుష్యులు అనువాటి తలలు కూడ నేల గూలినవి.
జయమును కోరే యాదవులు జరాసంధుడు, శిశుపాలుడు మొదలుగా గల రాజుల సైన్యసమూహములను సంహరింప జొచ్చిరి. అపుడా రాజులు వెనుదిరిగి వెళ్లిపోయిరి..
శిశుపాలుడు భార్యను పోగొట్టుకున్నవాడు వలే దుఃఖితుడై యుండెను. ఆతనిలో కాంతి గాని, ఉత్సాహము గాని లేవు. ముఖములో రక్తము లేకుండెను. ఆ రాజులు ఆతని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి.
ఓయీ రాజా! నీవు మానవులలో శ్రేష్ఠుడవు. ఈ నిరుత్సాహమును విడిచి పెట్టుము. ప్రాణుల జీవితములలో సుఖము గాని, దుఃఖము గాని స్థిరముగా ఉండవని అందరికీ అనుభవమే.
చెక్కతో చేసిన యువతి బొమ్మ దానినాడించేవాని ఇచ్చకు తగ్గట్లుగా నాట్యమాడును. అదే విధముగా ఈశ్వరునకు వశవర్తి యైన జీవుడు కూడా సుఖదుఃఖముల విషయములో (అస్వతంత్రుడై) ప్రవర్తిల్లును.
నేనైతే ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యముతో శూరవంశీయుడగు శ్రీ కృష్ణుని పై పది హేడు పర్యాయములు దండెత్తి ఓడిపోతిని. కాని, నేను ఒక్క యుద్ధమును జయించితిని (అని జరాసంధుడు ఓదార్చెను).
అయినప్పటికీ, నేనే కాలమునందైననూ దుఃఖమును గాని, హర్షమును గానీ పొందను. ఎందుకంటే, ప్రారబ్దముచే ప్రవర్తిల్ల జేయబడే కాలము జగత్తును క్షోభ పెట్టుచుండునని నాకు తెలియును.
యాదవుల సైన్యము చిన్నదే. కాని వారిని శ్రీకృష్ణుడు రక్షిస్తున్నాడు. మనమందరము వీరులము, సేనానాయకులకు కూడ నాయకులము. అయినప్పటికీ, వారు మనలను ఓడించినారు.
కాలము తమకు అనుకూలించుటచే ఈ నాడు శత్రువులు జయించినారు. కాలము అనుకూలమైనప్పుడు మనము జయించగలము.
మిత్రులీ విధముగా , నచ్చజెప్పగా, చేదిదేశ రాజకుమారుడగు శిశుపాలుడు అనుచరులతో కూడి తన నగరమునకు వెళ్లాను. సంహరించ బడగా మిగిలిన ఆ రాజులు కూడ తమ తమ నగరములకు వెళ్లిరి.
బలశాలియగు రుక్మి కైతే శ్రీకృష్ణునియందు ద్వేషము. చెల్లెలిని శ్రీకృష్ణుడపహరించి వివాహమాడుటనాతడు సహించలేకపోయేను. ఆతడు అక్షౌహిణీ సైన్యము వెంట రాగా ఆయనను వెనుకనుండి తరిమెను.
రుక్మి గొప్ప బలశాలియే. కాని, ఆతనికి సహనము లేదు, కోపము యెక్కువ. ఆతడు కవచమును వేసుకొని, ధనుస్సును చేతబట్టి, రాజులందరు వినుచుండగా ప్రతిజ్ఞ చేసెను.
యుద్దములో శ్రీకృష్ణుని సంహరించి రుక్మిణిని వెనుకకు తీసుకు వచ్చెదను. అట్లు చేయలేని పక్షములో నేను కుండిన నగరమును ప్రవేశించను. నేను మీకీ మాటను యథార్థముగా చెప్పుచున్నాను.
రుక్మి ఇట్లు పలికి వేగముగా రథమునెక్కి సారథితో నిట్లనెను -- కృష్ణుడున్నచోటికి గుర్రములను తోలుము. నాకు, ఆయనకు యుద్ధము జరుగనున్నది.
మిక్కిలి దుష్టబుద్దియగు శ్రీకృష్ణుడు నా చెల్లెలిని బలాత్కారముగా తీసుకువెళ్లినాడు. నేనీనాడు వాడి బాణములతో వానికి పరాక్రమము వలన కలిగిన గర్వమును దూరము చేసెదను.
సర్వసమర్థుడగు శ్రీకృష్ణుని ప్రభావము తెలియని దుర్బుద్ధియగు రుక్మి గొప్పలు చెప్పుకొనెను. ఆతడా తరువాత ఒకే రథముతో శ్రీకృష్ణుని వెంబడించి, నిలు నిలుమంటూ యుద్ధమునకు కాలు దువ్వెను.
ఆతడు ధనుస్సును గట్టిగా లాగి శ్రీకృష్ణుని మూడు బాణములతో కొట్టి, ఇట్లు పలికెను -- ఓయీ! నీవు యాదవవంశమునకు కళంకమవు. ఇచట క్షణకాలము నిలుము.
ఓరీ మందుడా! హోమద్రవ్యమును కాకి వలె నా చెల్లెలిని అపహరించి ఎచటకు వెళ్లెదవు? నీవు మాయావివి, కపటయుద్ధము చేసెదవు. నేనీనాడు నీ గర్వమునడంచెదను.
ఎంతలో నా బాణములచే కొట్టబడి నీవు నేల గూలెదవో, ఆ లోపులోనే కన్యను విడువుము, అని (రుక్మి పలి కెను). శ్రీకృష్ణుడు నవ్వుతూ ఆరు బాణములతో వాని ధనుస్సును విరుగకొట్టి వానిని కూడ కొట్టి పీడించెను.
శ్రీకృష్ణుడు ఎనిమిది బాణములతో నాలుగు గుర్రములను, రెండింటితో సారథిని, మూడింటితో జెండాను కొట్టగా, ఆ రుక్మి కూడ ఇంకో ధనుస్సును తీసుకొని ఆయనను ఐదు బాణములతో కొట్టెను.
ఆ బాణముల గుంపులచే కొట్టబడిన శ్రీకృష్ణ భగవానుడైతే వాని ధనుస్సును (బాణముతో) విరుగకొట్టెను. ఆతడు మరల ఇంకో ధనుస్సును తీసుకోగా, వినాశము లేని భగవానుడు దానిని కూడ విరుగకొట్టెను.
ఇనుప గుదియ, అడ్డ కత్తి, శూలము, డాలు, కత్తి, శక్తి, చిల్లకోల మొదలైన ఏయే ఆయుధములను రుక్మీ తీసుకోనేనో, వాటినన్నింటినీ ఆ శ్రీకృష్ణ భగవానుడు (బాణములతో) విరుగకొట్టెను.
తరువాత రుక్మి కోపించి చేతిలో కత్తితో రథమునుండి క్రిందకు దుమికి, శ్రీకృష్ణుని సంహరించే కోరికతో, మిడత అగ్నిలోకి వలె, ఆయనకు అభిముఖముగా పరుగెత్తెను.
శ్రీకృష్ణుడు మీదకు దుముకుచున్న ఆ రుక్మియొక్క కత్తిని, డాలును బాణమలతో నుగ్గు నుగ్గుగా విరుగకొట్టెను. ఆయన వానిని సంహరించుటకు సంసిద్దుడై పదునైన కత్తిని చేతిలోనికి తీసుకొనెను.
భర్త తన అన్నను సంహరించుటకు సిద్దపడుటను చూచి పతివ్రతయగు రుక్మిణి భయముతో కంగారు పడెను. ఆమె భర్త పాదములపై పడి దీనముగా ఇట్లు పలికెను.
ఓ మంగళస్వరూపా! యోగులకు ప్రభుడవగు నీ స్వరూపమును తెలియుట అసంభవము. దేవతలకు ప్రభుడవగు నీవు జగత్తును పాలించే దవు. నీ భుజబలము గొప్పది. నీవు నా అన్నను సంహరించుట తగదు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --- ఆ రుక్మిణి అవయవములు భయము వలన విశేషముగా కంపించెను. దుఃఖముచే ఆమె ముఖములో రక్తము లేకుండెను. ఆమే కంఠము గద్గదమాయెను. ఆదుర్గాచే బంగరు మాల. జారిపోవుచుండగా ఆమె ఆయన పాదములను పట్టుకొనెను. దయాళువగు శ్రీకృష్ణుడు రుక్మియొక్క వధ నుండి విరమించెను.
ఆ శ్రీకృష్ణుడు అపరాధియగు రుక్మిని వస్త్రముతో కట్టివేసి మీసమును గెడ్డమును గొరిగి వికృతరూపునిగా చేసెను. అంతలో యాదవవీరులు శత్రువుల సైన్యమును, ఏనుగులు సరస్సును వలే, ఆశ్చర్యము కలిగే వీధముగా కలిచి వేసిరి.
వారందరు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి బంధించబడిన రుక్మిని చూచిరి. ఆతడు ఆ విధముగా వికృతరూపుడై చచ్చినవానితో సమానముగా నుండెను. సర్వసమర్థుడు, దయాళువు అగు బలరామ భగవానుడు వానిని విడిపించి, శ్రీకృష్ణునితో నిట్లనెను.
ఓ శ్రీకృష్ణా! నీవు చేసిన ఈ పని మంచిది కాదు. ఇది మనము ఏవగించుకునే పని. బంధువును గెడ్డమును, మీసమును గొరిగి, విరూపునిగా చేయుట ఒక విధముగా వానిని చంపుటయే.
ఓ సాధ్వీ! రుక్మిణీ! నీ సోదరుని విరూపుని చేసినారని మాయందు తప్పును ఎన్నకుము.మనిషికి సుఖదుఃఖములను మరియొకడు ఈయడు. ఎందుకంటే, జీవుడు తన కర్మల ఫలమునే అనుభవించును.
బంధువు వధించదగిన తప్పే చేసినా, బంధువు బంధువును సంహరించరాదు. బంధువును విడిచి పెట్టవలెను. ఎందుకంటే, వాడు తన తప్పు చేతనే చంపబడినాడు. వానిని మరల వధించవలెనా? (కూడదు).
క్షత్రియులకీ ధర్మమును ప్రజాపతి ఏర్పాటు చేసినాడు. దాని ప్రకారముగా సోదరుని సోదరుడే సంహరించవచ్చును. కాబట్టి ఈ క్షత్రియధర్మము మిక్కిలి ఘోరమైనది.
దురభిమానులు ధనగర్వముచే వివేకజ్ఞానమును కోల్పోయి రాజ్యము, భూమి, ధనము, స్త్రీ, అభిమానము, అవమానమును సహించకుండుట ఇత్యాది కారణములతో (బంధువునైననూ) తిరస్కారము చేసెదరు. ఇది నిశ్చయము.
ఓ రుక్మిణీ! నీ సోదరులు సకలప్రాణులయందు దుర్బుద్ధిని కలిగియున్నారు. కాని నీవు అజ్ఞాని వలె వారికి ఎల్లవేళలా మంగళమే. కలగాలని తలపోయుచున్నావు. ఈ నీ తలంపు సరైనది కాదు. బంధువుల కైనా చేసిన తప్పుకి శిక్షను వేయుటయే మంగళము.
దేహమే ఆత్మ అని తలపోసే జనులకు విష్ణుమాయ మిత్ర-శత్రు-ఉదాసీనులు అనే ఈ బుద్దిమోహమును కలిగించుచున్నది.
ఎందుకంటే, సకలప్రాణులకు కూడ ఆత్మ, ప్రకాశించే సూర్యాదులు వలె, ఆకాశము వలే, ఒక్కటియే. అది ప్రకృతికి అతీతము. అజ్ఞానులు ఆత్మలు అనేకమా అన్నట్లు తలపోయుదురు.
పంచభూతములు, పంచప్రాణములు, పంచతన్మాత్రలు, మూడు గుణముల సమాహారమైన ఈ దేహము పుట్టుక, మరణము గలది. అజ్ఞానముచే ఈ దేహము ఆత్మయందు ఆరోపించబడి (ఆత్మగా గ్రహించబడి) దేహధారిని సంసారిని చేయుచున్నది.
ఓ సాధ్వీ! చూపు-రూపముల ఉనికి, ప్రసిద్ది (తెలియుట) సూర్యుని వలననే. అయిననూ, సూర్యుడు వాటికంటే విలక్షణుడే. అదే విధముగా, దేహముయొక్క ఉనికి, ప్రకాశము ఆత్మమూలకములే. కాని, ఆత్మ దేహముకంటే విలక్షణము. ఆత్మకు మిథ్యాభూతములైన దేహాదులతో యథార్థ మైన సంయోగము గాని, వియోగము గాని లేవు.
వృద్ధిక్షయములు కళలకే గాని చంద్రునకు లేవు. అదే విధముగా, పుట్టుక, ఉండుట, పెరుగుట, పరిణామమును చెందుట, క్షీణించుట, నశించుట అనే వికారములైతే దేహమున కే గాని, ఆత్మకు ఏనాడైననూ లేవు. కళల అంతము చంద్రునకే అమాపొస్యయా యన్నట్లు వ్యవహా రము. అదే విధముగా దేహము యొక్క మృతి ఆత్మ పై ఆరోపించబడును.
నిద్రించే వ్యక్తి స్వప్నములో యథార్థమగు వస్తువులు లేకున్నా దేహమును, భోగ్యములను, వాటి భోగమును కూడ అనుభవించును. అదే విధముగా, అజ్ఞాని కూడ సంసారముననుభవించును.
స్వచ్చమగు చిరునగవు గల ఓ రుక్మిణీ! శోకము అజ్ఞానమునుండి పుట్టి అంతఃకరణమును కృశింపజేసి మోహ పెట్టును. కాబట్టి నీవు ఆత్మతత్త్వము నెరింగి ఆ శోకమును పారద్రోలి శాంతమగు చిత్తమును కలిగియుండుము.
శ్రీశుక ఉవాచ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలి కెను --- బలరామ భగవానుడిట్లు ఉపదేశించగా, సుందరియగు రుక్మిణి శోకమును విడిచి వివేకబుద్దితో మనస్సును ప్రసన్నము చేసుకొనెను.
శత్రువులు రుక్మియొక్క బలమును, కాంతిని విధ్వస్తము చేసి ప్రాణములను మాత్రమే మిగిల్చి విడిచి పెట్టినారు. ఆతడు తాను వికృతరూపునిగా చేయబడిన విషయమును గుర్తు చేసుకొనుచుండెను. ఆతని మనోరథములు వ్యర్థమాయెను.
ఆతడు భోజకటము (భోజుని శపథము) అని ప్రసిద్ధి గాంచిన పెద్ద నగరమును నివాసముకొరకు నిర్మించుకొనెను. శ్రీకృష్ణుని సంహరించకుండా, చెల్లెలిని వెనుకకు తీసుకురాకుండా కుండిననగరమును ప్రవేశించను, అని చెప్పి ఆతడు రోషముతో అక్కడనే నివసించెను.
కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడీ విధముగా రాజులను జయించి, భీష్మకుని పుత్రియగు రుక్మిణీని ద్వారకా నగరమునకు తీసుకువచ్చి, యథావిధిగా వివాహమాడెను.
ఓ పరీక్షిన్మహారాజా! యాదవుల నగరియగు ద్వారకయందు ప్రతి ఇంట్లో జనులకు శ్రీకృష్ణునిపై నిష్కపటమగు ప్రేమ. అప్పుడు వారందరు పెద్ద ఉత్సవమును చేసుకొనిరి.
స్వచ్చమగు మణులు పొదిగిన కుండలములను దాల్చిన స్త్రీలు, పురుషులు కూడ ఆనందముతో ఆ కొత్త దంపతులకు బహుమతులనిచ్చిరి. ఆ దంపతులు రంగు రంగుల వస్త్రములను ధరించిరి.
యాదవుల నగరమగు ఆ ద్వారక బాగా ఎత్తున ఎగురవేయబడిన పంచవన్నెల జెండాలతో, రంగు రంగుల పుష్పమాలలతో, వస్త్రములతో, రత్నాల తోరణాలతో ప్రకాశించెను. అచట ప్రతి ద్వారమునందు మంగళద్రవ్యముల కడవలు పూర్తిగా నీరు నింపి ఏర్పాటు చేయబడినవి. వాటి చుట్టూ అగురు ధూపములు, దీపములు పెట్టబడినవి.
ద్వారకలోని మార్గములలో నీటిని చల్లిరి. ఆహ్వానమునందుకొని విచ్చేసిన రాజుల ఏనుగులు మదమును స్రవిస్తూ, ద్వారములయందు అలంకరించబడిన అరటి, పోక చెట్లను స్పృశించుచుండెను.
ఆ నగరమునందు కురుసృంజయ కైకేయవిదర్భయదుకుంతివంశముల వారు ఇటునటు కంగారుగా తిరుగుతూ పరస్పరము కలిసి ఆనందించిరి. .
రుక్మిణిని శ్రీకృష్ణుడు తీసుకొని వెళ్లినాడని జనులు అక్కడక్కడ కీర్తించుచుండగా విని రాజులు, రాజకన్యలు కూడ చాల ఆశ్చర్యపడిరి.
ఓ పరీక్షిన్మహారాజా! లక్ష్మీపతి శ్రీకృష్ణుడు కాగా, లక్ష్మియే రుక్మిణి ఆయేను. ద్వారకయందు వారిద్దరి కలయికను చూచి నగరవాసులు మహానందమును పొందిరి. శ్రీమద్భాగవత దశమస్కంధము ఏబది నాల్గవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 54 of the Bhāgavata Mahā Purana is as follows:
Enraged by Kṛshṇa's daring abduction, Jarāsandha, Śiśupāla, and their allied kings pursued Kṛshṇa's chariot, but were routed by Balarāma and the Vṛshṇi warriors. Rukmiṇī's arrogant brother, Rukmī, swore a solemn vow never to return to Kuṇḍina unless he killed Kṛshṇa. Rukmī chased Kṛshṇa's chariot and unleashed a torrent of arrows. Śrī Kṛshṇa easily shattered Rukmī's weapons and bow, drew His sword, and prepared to execute him. Rukmiṇī fell at Kṛshṇa's feet, begging for her brother's life. Yielding to her tears, Kṛshṇa spared Rukmī's life, partially shaving his head and mustache as a mark of humiliation before releasing him. Śrī Kṛshṇa brought Rukmiṇī to Dvārakā, where they were wed according to Vaidika rites amidst grand celebrations.