భాగవత మహా పురాణము
34 - శ్రీకృష్ణుడు సుదర్శనుని శంఖచూడుని ఊద్ధరించుట
శ్రీ శుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- ఒకప్పుడు (శివరాత్రి) మహాదేవుని పూజకై యాత్రను చేయాలనే ఉత్సాహము ఆ గోపాలకులకు కలిగెను. వారు బళ్లకు ఎద్దులను పూన్చి అంబికావసము అనే క్షేత్రమునకు వెళ్లిరి.
ఓ పరీక్షిన్మహారాజా! అచట వారు సరస్వతీనదిలో స్నానము చేసిరి. వారు సర్వవ్యాపకుడు, జీవులకు అధీశ్వరుడు అగు మహాదేవునకు, జగన్మాతయగు పార్వతీదేవికి భక్తితో ఉపహారములనర్పించి పూజించిరి.
వారందరికి మహాదేవుడు తమ యెడల ప్రీతిని జెందుటయే లక్ష్యము దాని కొరకై వారందరు గోవులను, బంగారమును, వస్త్రములను, తేనెను, మధురమైన ఆహారమును శ్రద్ధతో బ్రాహ్మణులకు దానము చేసిరి.
నందుడు, సునందుడు (నందుని తమ్ముడు) మొదలగు గోపాలకులు గొప్ప పుణ్యాత్ములు. వారు శివరాత్రి వ్రతదీక్షను పూని నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొని, సరస్వతి నది ఒడ్డున ఆ రాత్రి నివసించిరి.
ఆ అంబికావనములో ఒక పెద్ద కొండ చిలువ ఉండెను. అది ఆకలి గొని అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) పాకుతూ (కనబడకుండా) వచ్చి (శివరాత్రి మరునాడు) నిద్రిస్తున్న నందుని పట్టుకొనెను.
కొండ చిలువ పట్టుకొనగా ఆ నందుడిట్లు ఆక్రోశించెను -- ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! ఈ పెద్ద పాము నన్ను మ్రింగుచున్నది. అబ్బాయీ! ఆపదలో పడి శరణు వేడిన నన్ను విడిపించుము.
ఆయన ఆక్రందనమును విన్న గోపాలకులు కూడ వెంటనే నిద్ర లేచి పాము చే పట్టుకొనబడిన నందుని చూచి కంగారు పడిరి. వారా పామును కాగడా కర్రలతో కొట్టిరి.
కాగడాలతో ఒళ్లు కొలుచున్నా పాము ఆ నందుని విడిచి పెట్టలేదు. అప్పుడు యాదవులకు (సత్త్వగుణప్రధానులగు భక్తులకు, పాలకుడగు శ్రీకృష్ణ భగవానుడు ఎదురుగా వచ్చి దానిని కాలితో తాకెను.
శ్రీకృష్ణ భగవానుని శోభాయుక్తమగు పాదము తాకుటచే ఆ సర్పము యొక్క పాపములు పూర్ణముగా నశించెను. అది పాము దేహమును విడిచి విద్యాధరులయందు పూజించబడే అందమగు రూపమును పొందెను.
బంగరు మాల గల ఆ విద్యాధరుడు వెలిగిపోవుచున్న దేహముతో నమస్కరించి దగ్గరకు వచ్చి నిలబెడను. ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణ భగవానుడు ఆతనిని ఇట్లు ప్రశ్నించెను.
నిన్ను చూస్తే ఆశ్చర్యము కలుగుచున్నది. నీవు సర్వోత్కృష్టమగు శోభతో ప్రకాశించుచున్నావు. నీవెవరు? ఈ పాము జన్మ జుగుప్సను కలిగించేది. పర (కర్మ) వశుడవై నీవీ జన్మను పొందుటకు కారణమేమి ?
సర్ప ఉవాచ ।
సర్పమై ఉండిన విద్యాధరుడిట్లు పలికెను -- నేను ఒక విద్యాధరుడను. సుదర్శనుడని నాకు ప్రసిద్ధి. సంపద, సౌందర్యసమృద్ధి గలవాడనై నేను విమానము పై దిక్కులలో సంచరించితిని.
అందముతో గర్వించిన నేను అందము లేని అంగిరసగోత్రీయులగు మహర్షులను పరిహాసము చేసితిని. నాచే పరిహసించబడిన ఆ ఋషులు నా పాపమునకు ఫలముగా ఈ జన్మను కలిగించిరి.
దయామయులగు ఆ మహర్షులు ఆ మహర్షులు నన్ను అనుగ్రహించుటకే నాకు శాపమునిచ్చిరి. ఎందుకంటే, జగత్తునకు తండ్రివగు నీవు నన్ను కాలితో తాకగా నా పాపములు నశించినవి.
పాపములను, దుఃఖములను పారద్రోలే ఓ శ్రీకృష్ణా! సంసారమునకు భయపడి శరణు జొచ్చినవారి భయమును నీవు పారద్రోలెదను. నీ పాదము తాకుటచే నాకు శాపమునుండి విముక్తి కలిగినది. నేను వెళ్లుటకు అనుమతిని అడుగుచున్నాను.
ఓ దేవా! నీవు యోగీశ్వరుడవు, పురుషోత్తముడవు. సజ్జనులను పాలించే నీవే సకలలోకములకు, లోకపాలకులకు ప్రభుడవు. నేను నిన్ను శరణు పొందుచున్నాను. నాకు అనుమతి నిమ్ము.
ఓ అచ్యుతా! నీ దర్శనము వలన నేను వెంటనే మహర్షుల శాపమునుండి విముక్తుడనైతిని. నామమునుచ్చరించువాడు శ్రోతలనందరినీ తనను కూడ వెంటనే పావనము చేయును. అట్టి నీ కాలితో నేను స్పృశించబడితిని. ఇంతకంటె గొప్ప భాగ్యమేమి గలదు? (లేదు).
సుదర్శనుడు విధముగా దశార్హవంశీయుడగు శ్రీకృష్ణుని అనుమతిని పొంది ఆయనకు ప్రదక్షిణమును, నమస్కారమును కూడ చేసి స్వర్గమునకు వెళ్లెను. నందుడు కూడ ఆపదనుండి విముక్తుడాయెను.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని ఆ అసాధారమగు మహిమను చూచి గోకులవాసులు మనస్సులో ఆశ్చర్యమును పొందిరి. వారు ఆ అంబికా వనమునందు శివరాత్రి వ్రతమును ముగించుకొని అచటనుండి మరల గోకులమునకు వచ్చిరి. వారు ఆదరముగా ఆ వృత్తాంతమునే చెప్పుకొనిరి.
ఒకనాడు గోవిందుడు మరియు బలరాముడు కూడ బృందావనములో రాత్రియందు గోపికల మధ్యలో ఉండి విహరించిరి. శ్రీకృష్ణుని (రాబోవు) పరాక్రమము అచ్చెరువును గొలుపును.
దృఢమైన ప్రేమ గల గోపికలు బలరామకృష్ణుల కీర్తిని మనోహరముగా గానము చేయుచుండిరి. వారిద్దరు స్వచ్ఛమగు వస్త్రములను దాల్చి, బాగా అలంకరించుకొని, చందనాదులనలదుకొని వనమాలలను ధరించిరి.
రాత్రి ఆరంభమయ్యెను. నక్షత్రరాజగు చంద్రుడు నక్షత్రములతో కూడి ఉదయించెను. మల్లెల పరిమళముచే తుమ్మెదలు మత్తెక్కి యుండెను. కలువల మీదనుండి గాలి వీచుచుండెను. ఆ రాత్రి యొక్క శోభను బలరామకృష్ణులిద్దరు కొనియాడిరి.
వారిద్దరు స్వరసమూహము యొక్క సంగతులను (ఆరోహ - అవరోహణములను) ఒకేసారి కల్పిస్తూ సకల ప్రాణులకు మనస్సునకు, చెవులకు సుఖము కలిగే విధముగా పాడిరి.
ఓ మహారాజా! వారిద్దరి పాటను విన్న గోపికలకు మోహము కలిగెను. దానిచే వారికి తమ దేహము తమకే తెలియలేదు. జారిపోవుచున్న పై కొంగును, జారిన జుట్టుముడిలోని మాలను వారు గుర్తించలేదు.
వారిద్దరు ఈ విధముగా పిచ్చివారు వలె యథేచ్ఛగా విహరిస్తూ పొడుచుండిరి. అప్పుడు శంఖచూడుడని ప్రసిద్ధి గాంచిన కుబేరుని అనుచరుడు అచటకు వెళ్లెను.
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరు చూచుచుండగనే భయము లేని ఆతడు ఆక్రోశిస్తున్న గోపికల సముదాయమును ఉత్తరదిక్కు వైపు తరిమెను. ఆ గోపికలకు బలరామకృష్ణులు మాత్రమే రక్షకులు.
తమ వారైన గోపికలు ఓ శ్రీకృష్ణా! ఓ బలరామా! అని ఆక్రోశించిరి. చోరుడు (పెద్దపులి) గోవులను తీసుకొని పోవుచుండగా వెంట పరుగెత్తే విధముగా, వారిని చూచి అన్నదమ్ములిద్దరు వెంబడి పరుగెత్తిరి.
రామకృష్ణులిద్దరు భయపడకుడని శబ్దము చేస్తూ వేగముగా పరుగెత్తిరి. వారు చేతులలో మద్ది చెట్లు పట్టుకొనిరి. వారు వేగముగా పరుగెత్తి శీఘ్రముగా యక్షులలో అధముడగు ఆ శంఖచూడుని సమీపించిరి.
కాలుడు, యముడు వలె వెంటబడిన వారిద్దరిని దగ్గరలో చూచి మూర్ఖుడైన ఆ శంఖచూడుడు భయపడెను. వాడు గోపికల సమూహమును విడిచి పెట్టి బ్రదుకుమీది తీపితో పరుగెత్తెను.
ఆ శంఖచూడుడు ఎక్కడెక్కడికి పరుగెడితే శ్రీకృష్ణుడు అక్కడక్కడికి వాని వెనుకనే పరుగెత్తెను. వాని తల మీది రత్నమును లాగవలెనని ఆయన కోరిక. బలరాముడు స్త్రీలకు రక్షకుడుగా ఆగిపోయెను.
ఓ పరీక్షిన్మహారాజా! సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు వానిని సమీపించి ఎదురుగా పచ్చి పిడికిలితో గుద్ది దుర్బుద్ధియగు వాని వాని తలను, చూడామణిని ఒకే సారి ఊడబెరకెను.
ఈ విధముగా శ్రీకృష్ణుడు శంఖచూడుని సంహరించి ప్రకాశించే చూడామణిని తెచ్చెను. దానినాతడు గోపికలు చూచుచుండగనే ప్రేమతో అన్నగారికి ఇచ్చెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో
శ్రీకృష్ణుడు సుదర్శనుని, శంఖచూడుని ఉద్ధరించుటను వర్ణించే
ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).
Summary of chapter 34 of the Bhāgavata Mahā Purana is as follows:
On the holy night of Śivarātri, Nanda Mahārāja and the cowherds traveled to the Ambikāvana forest to worship Mahādeva Śiva and Goddess Ambikā. While sleeping near the Sarasvatī River, a huge, hungry python slithered out and began swallowing Nanda Mahārāja by his feet. Hearing Nanda's cries, the cowherds struck the snake with burning logs, but the python refused to let go. Śrī Kṛshṇa stepped forward and touched the serpent with His lotus foot. Instantly, the python gave up its body and transformed into a radiant Vidyādhara named Sudarśana, who had been cursed by rishis for mocking their physical form. Later, while Kṛshṇa and Balarāma were enjoying forest pastimes with the gopīs, a demonic associate of Kuvera named Śaṅkhacūḍa attempted to abduct the maidens. Kṛshṇa pursued the demon, killed him with a single blow to the head, and retrieved his divine crest jewel, presenting it to Balarāma.