భాగవత మహా పురాణము
61 - అనిరుద్దుని వివాహము - రుక్మి సంహారము
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ యువతులు ప్రతి ఒక్కరు శ్రీకృష్ణునకు పదేసిమంది చొప్పున పుత్రులను కనిరి. వారు తమయందలి సమస్త మైన రూపొదిసంపత్తిచే తండ్రికి తీసిపోనివారు.
శ్రీకృష్ణ భగవానుడు ఆ రాజకుమార్తెల ఇళ్లలో దూరము కాకుండా స్థిరముగా నుండెను. దానిని చూచి ఆ యువతులు ప్రతివారు తామే ఆయనకు మిక్కిలి ప్రియమైనవారని తలపోసిరి. వారికి ఆయన - ఆత్మారాముడని తెలియదు.
శ్రీకృష్ణ భగవానుని అందమైన పద్మపు మొగ్గవంటి ముఖము, పొడవాటి చేతులు, విశాలమైన కళ్లు, ప్రేమతో కూడిన చిరునవ్వు, రసమయమగు చూపు, మనోహరమగు పలుకులు ఆ యువతులను సమ్మోహపరచినవి. కాని, పోరు మాత్రము తమ విలాసలచే పరిపూర్ణుడగు ఆయన మనస్సును జయించలేకపోయిరి.
పదునారువేల భార్య లైతే చిరునవ్వుతో కూడిన ప్రక్క చూపులతో ప్రేమను సూచిస్తూ, కనుబొమల త్రిప్పుటలచే మనస్సును దోచివేసెడి వారు. ప్రేమమంత్రమునందు సమర్థములైన మన్మథబాణములను వారు చూపుల ద్వారా విసి రెడివారు. ఇంతేగాక, హావభావములు మొదలైన ఇతరోపాయములను కూడ ప్రయోగించెడివారు. కానీ, వారు ఆయన మనస్సును కల్లోలపరచలేకపోయిరి.
బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగువారు లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని పొందే ఉపాయమును తెలియకున్నారు. కాని, ఆ యువతులు మాత్రము ఆయననీ విధముగా - భర్తగా పొందిరి. వారి ఆనందము నిరంతరముగా వర్ధిల్లుచుండెను. వారు ప్రేమతోడి నవ్వు, అనురాగపు చూపులు, కొత్త కలయికయందలి ఉత్కంఠ మొదలగు హావభావముల నాయన యెడల నేరపి.
ఆ శ్రీకృష్ణ భార్యల వద్ద వందలాది దాసీలు ఉండిరి. అయినా, ఆ ప్రభునకు ఎదు రేగుట, ఆసనమునిచ్చుట, త్రాగే నీరు మొదలగు శ్రేష్ఠమగు ఉపచారములను చేయుట, కాళ్లను కడుగుట, తాంబూలమునిచ్చుట, కాళ్లను నొక్కి శ్రమను తొలగించుట, వీచుట, గంధమునలదుట, పుష్పములనిచ్చుట, జుట్టు దువ్వుట, ప్రక్కనమర్చుట, స్నానమునకు వ్యవస్థ చేయుట, భోజనమును ఫలహారమును ఇచ్చుట మొదలగు పరిచర్యలతో సేవ చేసిరి.
శ్రీకృష్ణుని భార్యలకు పదేసి పుత్రులు గలరు. ఆ భార్యలలో ఎనమండు గురు పట్టమహిషుల గురించి ఇదివరలో చెప్పడమైనది. వారి పుత్రులైన ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలగువారి గురించి నీకు చెప్పెదను.
శ్రీకృష్ణ భగవానునకు రుక్మిణియందు పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు, తరువాత పరాక్రమశాలురగు చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారు దేహుడు, సుచరుడు, చారుగుపుడు, భద్రాచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే పదిమంది కొడుకులు, తండ్రికి తీసిపోనివారు, కలిగిరి.
భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతీభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే పది మంది సత్యభామ యొక్క పుత్రులు.
జాంబవతి పెద్ద కొడుకు సాంబుడు. సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్ర కేతువు, వసుమంతుడు, ద్రవిడుడు, క్రతువు అనే తొమ్మిదిమంది తరువాతి వారు. వీరియందు తండ్రికి ప్రేమ యెక్కువ.
వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడు, శంకుడు, వసువు, శోభాయుక్తుడగు కుంతి అనువారలు నగ్నజిన్మహారాజుయొక్క కుమార్తెయగు సత్యయొక్క పుత్రులు.
శ్రుతుడు, కవి, వృషుడు, సుబాహుడు, భద్రుడు, ఏకలుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, ఆఖరివాడగు సోమకుడు అనే వీరులు కాలిందియొక్క పుత్రులు.
ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనువారు మద్రరాజకుమారియగు లక్ష్మణయొక్క పుత్రులు.
వృకుడు, హరుడు, అనిలుడు, గృధ్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనువారు మిత్రవిందయొక్క పుత్రులు.
సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, శూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు భద్ర పుత్రులు.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానునకు పదునారు వేలమందిలో ఒకరగు రోహిణి వలన దీప్తిమంతుడు, తాత్రేతపుడు మొదలగు పుత్రులు కలిగిరి. ప్రద్యుమ్నునకు రుక్మీయొక్క కుమార్తెయగు రుక్మవతి అనే భార్యయందు భోజకటమని ప్రసిద్ధమైన నగరములో అనిరుద్ధుడు కలిగెను.
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణునికి జన్మించిన సంతానమునకు తల్లుల సంఖ్య పదునారు వేలు మించెను. వీరి కొడుకులు, మనుమలు కోట్లాది ఉండిరి.
రాజోవాచ ।
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- జ్ఞానివగు ఓ మహర్షీ! రుక్మి యుద్దములో శ్రీకృష్ణునిచే పరాభవించబడి, ఆయనను హతమార్చుటకు అవకాశమునకై ఎదురు చూచుచుండెను. అట్టివాడు కుమార్తెను శత్రువు పుత్రునికిచ్చి వివాహమునెట్లు చేసెను? శత్రువులైన శ్రీకృష్ణరుక్మిల మధ్యలో పరస్పరము వివాహసంబంధము ఎట్లు కలిగెనో చెప్పడు.
జ్ఞానులు భూతభవిష్యద్వర్తమానములను, ఇంద్రియములకు అతీతమైనవాటిని, దూరమునందున్న వాటిని, కప్పివేయబడినవాటిని కూడ సాక్షాత్తుగా దర్శించేదరు.
శ్రీశుక ఉవాచ ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- దేహము లేని మన్మథుడు దేహము పొంది సాక్షాత్తుగా ప్రద్యుమ్నుడైనాడు. రుక్మవతి ఆయనను స్వయంవర ములో వరించెను. ఆయన ఒక్కడు రథము మాత్రమే గలవాడై, స్వయం వరమునకు వచ్చిన రాజులను జయించి, ఆమెను దోడ్కొని వెళ్లాను.
ఒకప్పుడు శ్రీకృష్ణుడు తనకు చేసిన అవమానము రుక్మికి గుర్తు ఉండెను. అయినా, ఆతడు చెల్లెలు రుక్మిణికి ప్రీతిని కలిగించుటకై ఆమె కొడుకగు ప్రద్యుమ్నునకు తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను.
ఓ పరీక్షిన్మహారాజా! రుక్మిణికి చారుమతి అనే నిడివి కన్నుల కుమార్తె ఉండెను. ఆ కన్యను కృతవర్మ పుత్రుడగు బలి వివాహమాడెను.
ఆసక్తి అనే పాశమునకు బద్దుడైన రుక్మి చెల్లెలు రుక్మిణికి ప్రీతిని కలిగించగోరెను. అట్టి వివాహము అధర్మము (ఒక వైపు ద్వేషము, రెండో వైపు పెళ్లి అని తెలిసి కూడా ఆతడు శ్రీకృష్ణ భగవానుని (రుక్మిణియొక్క) కొడుకు కొడుకగు అనిరుద్ధుని కొరకు తన పుత్రుని కుమార్తెయగు రోచననిచ్చి వివాహము చేసెను.
ఓ పరీక్షిన్మహారాజా! ఆ మంగళకార్యము నిమిత్తముగా రుక్మిణి, బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు, సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు మొదలగువారు భోజకటనగరమునకు వెళ్లిరి.
ఆ వివాహము సమాప్తమయ్యెను. అప్పుడు గర్వించియున్న కలింగదేశాధిపతి మొదలగు రాజులు రుక్మితో, బలరాముని జూదములో జయించుము, అని ప్రోత్సహించిరి.
ఓ పరీక్షిన్మహారాజా! ఈ బలరాముడు జూదము తెలిసినవాడు కానే కాదు. కాని, ఆ వ్యసనము బలమైనది. ఈ విధముగా రాజులచే ప్రోత్సహించబడిన రుక్మి ఆయనను పిలిచి పాచికలతో జూదమాడెను.
ఆ జూదములో బలరాముడు వరుసగా వంద, వెయ్యి, పదివేల వరహాలను పందెము కాసేను. కాని రుక్మి ఆ పందెములను నెగ్గెను. అప్పుడు కలింగదేశరాజు విరగబడి నవ్వుతూ నాగలి ఆయుధముగా గల బలరాముని పరిహసించగా, ఆయనకు కోపము వచ్చెను.
తరువాత రుక్మి లక్ష వరహాలను పందెము కాయగా, బలరాముడా పందెమును నెగెను. కాని, రుక్మి మోసము చేసి తానే నెగ్గితినని చెప్పెను.
సహజముగా ఎర్రని కన్నులు గల శోభాయుక్తుడగు బలరాముడు కోపముచే, పర్వదినమునాడు సముద్రము వోలె, కల్లోలితుడాయెను. ఆయన అధికమగు కోపముతో పది కోట్ల వరహాలను పందెము ఉంచెను.
బలరాముడు ఆ పందెమును కూడ న్యాయముగా జయించెను. కాని, మోసము చేయుచున్న రుక్మి - ఈ పందెములో కూడ నేనే నెగ్గితిని; ఈ ప్రక్కనున్న సాక్షులు సాక్ష్యమును చెప్పెదరు గాక!-అని పలికెను.
అప్పడాకాశవాణి ఇట్లు పలికెను -- ధర్మముగా బలరాముడే పందెము గెలిచినాడు. కాని రుక్మి నిశ్చయముగా అసత్యమును చెప్పుచున్నాడు.
దుష్టులగు రాజులచే ప్రేరితుడైన విదర్భరాజకుమారుడు రుక్మి ఆ మాటను నిరాకరించెను. ఆతడు మృత్యువుచే ప్రేరితుడై బలరాముని పరిహసిస్తూ ఇట్లు పలికెను.
అడవులలో తిరుగుతూ పశువులను కాచుకునే మీకు జూదములో నేర్పు లేదు. పాచికలతో మరియు బాణములతో క్రీడించేది రాజులు గాని, మీవంటివారు కాదు.
రుక్మి ఈ విధముగా తిట్టుటచే మరియు రాజులు పరిహసించుటచే కోపించిన బలరాముడు ఇనుపగుదియను పైకెత్తి వానిని సంహరించెను.
కలింగరాజు పళ్లను బయట పెట్టి నవ్వుతూ పరిహసించెను గదా! ఆతడు పారిపోవుచుండగా కోపించియున్న బలరాముడు పది అడుగులలోనే వానిని పట్టుకొని పళ్లను ఊడగొట్టెను.
బలరాముడు ఇనుపగుదియతో మిగిలిన రాజుల చేతులను, తోడలను, తలలను విరుగకొట్టి పీడించెను. వారు రక్తము స్రవించుచుండగా భయపడి పారిపోయిరి.
ఓ పరీక్షిన్మహారాజా! బలరాముడు తన బావమరదియగు రుక్మిని సంహరించగా, శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణియొక్క ప్రేమకు భంగము కలుగునేమోననే భయముతో బాగున్నది అని గాని, బలరాముని ప్రేమకు భంగము కలుగుననే భయముతో బాగులేదు అని గాని చెప్పలేదు.
బలరాముడు, సాంబుడు మొదలుగా గల యాదవులకు శ్రీకృష్ణ భగవానుడే ఆశ్రయము. వారికి సకలప్రయోజనములు సిద్ధించినవి. వారప్పుడు పెళ్లికొడుకు అగు అనిరుద్ధుని . పెళ్లికూతురుతో సహా రథమెక్కించి, భోజకటమునుండి ద్వారకానగరమునకు వెళ్లిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో అనిరుద్ధుని వివాహమును, రుక్మి సంహారమును వర్ణించే అరువది ఒకటవ అధ్యాయము ముగిసినది (61).
Summary of chapter 61 of the Bhāgavata Mahā Purana is as follows:
This chapter documents the vast royal genealogy descending from Śrī Kṛshṇa's eight principal queens and sixteen thousand royal wives. Each of the 16,008 queens gave birth to ten sons and one daughter, resulting in over 160,000 royal princes in Dvārakā. The text details the ten prominent sons born to Rukmiṇī (led by Pradyumna and Cārudeshṇa), Satyabhāmā, Jāmbavatī, and the other principal queens. The chapter records the marriage of Pradyumna's son, Aniruddha, to Rochanā (the granddaughter of Rukmī). During the wedding festivities at Bhojakāṭa, a game of dice was arranged between Balarāma and Rukmī. When Rukmī cheated and arrogantly mocked Balarāma in public, an unembodied voice declared Balarāma the true victor. When Rukmī continued his insults, Balarāma struck Rukmī dead with His club, demonstrating the severe consequences of insulting divine personages.