స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
40వ అధ్యాయము
సూతుడు చెప్పెను :- అంజనాదేవి ఆ విధముగ వరము పొంది భర్తతో కలసి ఆనందించెను. బ్రహ్మాదులు అచటకు వచ్చుటచూచి మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. పిమ్మట కొంతసేపటికి భర్తతో కలసి స్వస్థురాలయ్యెను. బ్రహ్మాదులు అనుజ్ఞ ఇవ్వగా వేదములన్నియు తెలిసిన వ్యాసుడు మేఘ గర్జనమువంటి గంభీరమగు కంఠస్వరముతో ఆ అంజనాదేవితో ఇట్లు పలికెను.
వ్యాసుడు చెప్పెను:- ఓ ఆంజనా! అన్ని లోకములకు ఉపకారము చేయు నా మాటలు వినుము. మతంగ మహర్షి చెప్పిన విధముగ నిర్మలమగు మనస్సుతో వేంకటాద్రికి వచ్చి మిక్కిలి కష్టమగు తపస్సు చేసితివి. నీకు మూడు లోకములయందు పరాక్రమముకల పుత్రుడు కలుగును. కనుక వాయువు నీకు ప్రత్యక్షమైన దినమున ముల్లోకములయందున్న గంగాది తీర్థేములన్నియు ఈ తీర్థేమునకు వచ్చును.
వేంకటాద్రితో సమానమైన తీర్థేము బ్రహ్మాండమందు లేదు. అచట కూడ స్వామి పుష్కరిణి మిక్కిలి పుణ్య ప్రదము. ఈ తీర్థేము దానికంటే ఉత్తమమైనది. వాయువు నీకు ప్రత్యక్షమైన దినమున ఇచట స్నానము చేసినవారు మిక్కిలి పుణ్యమును పొందుదురు. మేష సంక్రమణము, చైత్రపౌర్ణమినాడు ఇచట స్నానము చేసినవారికి లభించు ఫలమును చెప్పెదను వినుము, గంగాది తీర్థేములయందు పన్నెండు సంవత్సరములు దానములు చేసినచో ఏ ఫలము లభించునో ఆ ఫలము ఇచట ఒక్కసారి చేసినంతనే లభించును.
అంజన అడిగెను :-ఈ వేంకటాద్రిపై ఏయే దానములు చేయవలయును అవి అన్నియు వేదములన్నియు తెలిసిన నీవు నాకు తెల్సుము.
అన్నదానము, వస్త్రదానము ఈ రెండు ముఖ్యమైనవి వేంకటాద్రిపై చేసిన పితృ శ్రార్ధము విశేషమైనది ఆగును. విష్ణుప్రీతికై ఎవరు బంగారమును ఇచట దానమిచ్చుదురో వారు ఉత్తమమగు అన్నిలోకములను పొందుదురు. ఈ కొండపై శాలగ్రామశిలను దానమిచ్చువారు అంగభంగమును పొంది తమను తాము తెలుసుకొందురు. ఇంద్రియ నిగ్రహముకల గృహస్థునకు ఆవును దానమిచ్చినవారు శరీరములో ఎన్ని రోమములుండునో అంతకాలము వైకుంఠమున నివసింతురు. కుటుంబము కల బ్రాహ్మణునికి భూమిని దానమిచ్చినవానికి కలుగును పుణ్యఫలము ఇంత అని ఎవరు చెప్పగలరు. వేదము చదివిన బ్రాహ్మణునికి కన్యను ఇచ్చినవాడు పితరులతో కలసి వైకుంఠమును చేరి ఆనందింతురు.
వేసవికాలమందు చలిపందిరివేసి చల్లని నీరు ఏర్పాటు చేసినవారికి కలుగు పుణ్యమును వర్ణింప ఆదిశేషునికైన శక్తిచాలదు. వేదము చదివిన కుటుంబీకునికి నువ్వులు దానము చేసినచో అన్ని పాపములు నశించి వైకుంఠమును చేరుదురు. ధాన్యము దానమిచ్చుట శ్రేష్ఠమని వేద విదులు చెప్పుదురు. ధాన్యదానమిచ్చినవారు బ్రహ్మపుత్రులుగా జన్మింతురు. బ్రాహ్మణులకు గంధము, సంపెంగ మొదలగు పూవులు, ఛత్రచామరములు, తాంబూలము, కర్పూరము మొదలైనవి ఇచ్చువారు చిరకాలము ఈ లోకమున భోగములను అనుభవించి స్వర్గమును చేరుదురు. అచట అనేకవేల దివ్య వర్షములు అనేక భోగములనుభవింతురు. పిమ్మట సార్వభౌములై భూమిని పరిపాలించి, వేదవేదాంతముల సారమెరిగిన బ్రాహ్మణులుగా జన్మింతురు. పిమ్మట విష్ణువు అనుగ్రహము వలన ముక్తిని పొందుదురు. ఓ అంజనా! ఈ విధముగా నీకు వేంకటాచలముయొక్క వైభవమును చెప్పితిని.
సమాప్తమిదం స్కాందపురాణాంతర్గతం శ్రీ వేంకటాచలమాహాత్మ్యమ్
ఎవరు ఈ కథను విందురో, చెప్పుదురో వారు సకల పాపములనుండి ముక్తులై వైకుంఠమునకు పోవుదురు . అని పూర్వము స్వయముగ వ్యాసుడే చెప్పెను. దీనిని విన్నవారు, చదివినవారు ధన్యులగుదురు . వారి వంశమున పుట్టిన వారందరు ముక్తిని పొందుదురు. దేనియందు సందేహము లేదు .
ఎనభై ఒక వేల శ్లోకములు కల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమందు శ్రీ వేంకటాచల మాహాత్మ్యమునందు అంజనాదేవి వరమును పొందుట,
ఆకాశగంగయందు స్నానము చేయుటకు కాలనిర్ణయము
అనునవి వర్ణించుట అను నలభైయ్యవ అధ్యాయము.
