స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

32వ అధ్యాయము

భరద్వాజుడు చెప్పెమ:- ఒకనాడు అగస్త్యుడు ప్రాతఃకాల ఆహ్నిక విధులను పూర్తి చేసుకుని శివుని అర్చించుటకై దేవతా మందిరమున ప్రవేశించెను. అపుడు అశరీరవాణి అతడికి వినిపించునట్లు ఇట్లు పలికెను. జపము చేయువారిలో శ్రేష్ఠుడగు అగస్త్యునితో ఆకాశవాణి ఓ మునీంద్రా! ఈ ప్రదేశము ప్రసిద్ధమైనది అయినప్పటికి నది లేకపోవుట వలన శోభస్కరముగా లేదు. జ్ఞానమును, విజ్ఞానమును నేర్చుకొనుటకు ఇష్టపడని బ్రాహ్మణుని వలె, దక్షిణ ఈయని దీక్షవలె, వెన్నెల లేని రాత్రి వలె. నది లేని భూమి ప్రకాశించదు. కనుక లోకముల హితమును కోరుచు ఒక నదిని ఇచట ప్రవర్తింపజేయుము. అగాధములను పాపముల వలన కలిగిన భయమును పోగొట్టునది, ఈ దేవతలందరికి హితమును కలిగించునది, ఇచటి మునులందరు కోరినది. మనుష్యులకు భద్రమును కలుగజేయునది అగు పనిని చేయుము. దేవతలకు, ఋషులకు, మానవులకు హితమును చేయుము. పాపమను పంకమును తొలగించు ఒక మహానదిని ఇచట ప్రవహింపజేయుము.

 భరద్వాజుడు చెప్పెను:- అది విని అగస్త్యుడు కొంతసేపు చింతామగ్నుడయ్యెను. దేవతాపూజను పూర్తి చేసి బయట ఉన్న వేదికపై కూర్చుండెను. అపుడు తన ఆశ్రమమునకు మునులను రప్పించి అశరీరవాణి చెప్పినదానిని వారికి వినిపించెను. ఆ అద్భుతమగు విషయమును విని మునులు ఆశ్చర్యచకితులైరి. మునిశ్రేష్ఠుడగు అగస్త్యునికి నమస్కరించి ఇట్లనిరి.

మునులు పలికిరి:- ఇది ఆశ్చర్యములలోకెల్ల ఆశ్చర్యము, శుభకరమైన వాటిలోకెల్ల శుభకరము. ఓ దయానిధీ! నీ దివ్యమగు చరిత్రకు నీవే సాటి . నీవు హుంకరించినంతనే దేవాధిపత్యమునుండి నహుషుడు భ్రష్టుడై కీటత్వమును పొందెననగా ఇంతకంటే చిత్రము లేదు. భూమినందతటిని చుట్టి తన తరంగములచే ఆకాశమును తాకు సమద్రమును నీవు ఒక గుక్కలో త్రాగివేసితివనగా ఇంతకంటే చిత్రము లేదు. సూర్యుని మార్గమును నిరోధించుటకై వింధ్య పర్వతము నీ వలన తిరిగి యథాస్థితికి వచ్చినదనగా ఇంతకంటే చిత్రము లేదు. నీ ఈ అద్భుతములగు పనులను గూర్చి భూమిపై ఎవరు వర్ణింపగలరు. మా యొక్క భాగ్యవశమున నీవు శరీరమును దాల్చితివి.

 ఓ మహామునీ ముల్లోకములయందు మేము ధన్యులమైతిమి. నీవీ ఆశ్రమమున నివసించుటచే మేము సనాథులమైతిమి. ఈ విషయము నీకు తప్పక వివరించవలసి ఉన్నది ఈ ప్రదేశము అన్ని వస్తువులతో శోభాయమానముగా ఉన్నప్పటికి నది లేకపోవుటచే ప్రకాశించుట లేదు. నది యందు స్నానము చేయని ఈ జన్మమెందులకు? నదిలేని ప్రవేశమునందు నివసించుట కంటే పుట్టకపోవుట మంచిది. మా అదృష్టము పండి ఇంత కాలమునకు నీవు అశరీరవాణిచే నదిని ప్రవహింపజేయుటకు ఆదేశింపబడితివి. నీవు ఎప్పుడు ఈ ప్రదేశమునందు నదిని ప్రవహింప జేయుదువో అపుడు మేము ధన్యులము కాగలము. కనుక ఏమి చేయవలేనని ఇక ఆలోచింపక నిశ్చయముగా గట్టి ప్రయత్నము చేయవలయును. లోకములను ఆరాధనీయమగు నదిని తీసుకొని వచ్చుటకు ఇది తగిన సమయము.

  భరద్వాజుడు చెప్పెను:- అనువారి మాటలను తనమనస్సుకు నచ్చినవిగా భావించి అగస్త్యుడు తప్పక ఒక నదిని ఆచటకు తెచ్చుటకు నిశ్చయించుకొనెను. సువర్ణముఖి ఆవిర్భవించుటకు అగస్త్యుడు చేసిన తపస్సు యొక్క ప్రకారము. మునీశ్వరుల వద్ద అనుమతిని తీసుకుని, దేవతలను పూజించి, శివుని విశేషముగా విధిపూర్వకముగా అర్చించెను. అనేక కష్టములు కలిగిన ఒక వ్రతమును చేయుటకు నిర్ణయించుకుని ఇతరులకు సాధ్యముకాని గొప్ప తపస్సును ప్రారంభించేను. ఫరములగు ఎండాకాలపు దినములయందు చుట్టూ అగ్నిని పేర్చుకుని సూర్యునిపై దృష్టి నిలిపి కలుగుచున్న కష్టమును లెక్కచేయక నిలచెను. వర్షాకాలపు దినములయందు సహింపరాని సుడిగాలి వీచుచున్నప్పటికి జల్లులు బాధించు చున్నప్పటికి సరకు చేయక ఉండెను. చలికాలమునందు గొంతు వరకు చలినీటిలో నిలబడి జపము చేయుచు ధ్యానమందుండి కొంచెము కూడ వికారమును పొందలేదు.

  తరువాత కొంత కాలము వరకు తాను కోరినది ఫలించక పోవుట చూచి మరింత ఉగ్రముగా లోకములు భయపడునట్లు తపస్సును తీవ్రతరము చేసెను. మనస్సును నీశ్చలముగా చేసి ఆహారమును వదలివేసి, ఎటువంటి కదలిక లేక రాయి వలె స్థిరముగ నిలచి పోయెను. ఈ విధముగా తపస్సు చేయుచున్న అగస్త్యుని ప్రతి అవయవము నుండి అగ్ని పుట్టేను. ఆకాశమునందు జ్వాలలతో భయంకరమై విశ్వమంతటా వ్యాపించెను, అద్భుతమైన ఆ అగ్ని తన శిఖలతో అన్ని దిక్కులను నింపివేయగా ప్రజా సమూహము భయపడి గగ్గోలు పెట్టెను. ఆ విధముగా లోకములన్నియు సంక్షోభమునను భవించుచుండగా దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్లి నమస్కరించి ఇట్లు విన్నవించిరి.

  అగస్త్యుని ఆశ్రమమునకు బ్రహ్మ వచ్చుట:- తన వద్దకు వచ్చిన దేవతలను ఊరడించి సిద్దులు, గంధర్వుల చేత సేవింపబడు బ్రహ్మ తపస్సు చేయుచున్న అగస్త్యుని ఎదుట ప్రత్యక్షమయ్యెను. ఆ విధముగా తన ఎదుట ప్రత్యక్షమైన బ్రహ్మను ఆగస్త్యుడు వివిధములైన స్తోత్రములచేత ఆనందింపజేసెను. వినయముతో తనకు నమస్కరించుచున్న

            బ్రహ్మ చెప్పెమ : దుష్కరమైన నీ తపస్సు వలన సంతోషించింతిని. నీకు ఇష్టమైన వన్నియు కోరుము. వాటిని తప్పక ఇచ్చేదను-.

 అగస్త్యుడు అవేమ:- ఓ దేవా! నీ దయవలన నేను కోరినవన్నియు లభించినవి. ఈ కోరికను తీర్చెదనన్నట్లయితే ఎటువంటి సందేహము లేక తెల్పెదను. ఈ ప్రదేశము ఏ నదీ లేక ఉండుట చూచి నాకు మిక్కిలి విచారము కలిగినది. అర్థము తెలియని వేదపఠనము వలె నిష్ప్రయోజకముగా ఉన్నది. భూమిని పావనము చేయుటకు, రక్షించుటకు శక్తి కల్గిన ఒక గొప్ప నదిని ఇచట ప్రవహింపజేయుము. ఇదియే నా కోరిక.

   ఆగష్యుని ప్రార్థన వలవ బ్రహ్మ గంగమ ఆదేశించుట:

భరద్వాజుడు చెప్పిన:- అగస్త్యుని మాట విని అట్లే అగుగాక అని పలికి బ్రహ్మ స్వర్గ లోకమునందు ప్రవహించు గంగను మనసులో తలచుకొనెను. సురగంగ బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై తలపై చేతులు జోడించి నమస్కరించెను. తాను ఆదేశించిన పిమ్మటే వచ్చినిలచినది. అన్ని లోకములకు జీవనాధారమైనది అగు గంగతో బ్రహ్మ ఇట్లనెను. 

బ్రహ్మ పలికెన:- ఓ గంగా, లోకములకు ఉపకారము చేయుటకై నిన్ను ఆదేశించుచుంటిని. నీవు కూడా నావలె లోకోపకారము కొరకే ఉంటివి. నదిలేని ఈ ప్రదేశమునందు లోకహితమును కోరి, అగస్త్యుని కోరిక తీర్చుటకై ప్రవహించుము. కనుక నీవు భూమిపైకి నీలోని ఒక అంశను పంపి భూమిపైగల జనులను పవిత్రులను చేయుము. ఇతడు చూపిన మార్గమున పొమ్ము. నీవు భూమిపై ప్రవహించుట మొదలు పెట్టిన తరువాత సిద్ధి పొందగోరు దేవతలు, మునిశ్రేష్ఠులు ఎల్లప్పుడు నిన్ను సేవింతురు. నదులలో ఉత్తమమైనది అను ఖ్యాతిని పొంది జనులను రక్షించుచు ఈ అగస్త్యుని కోరిక తీర్చుము. వెళ్లిరమ్ము.

భరద్వాజుడు చెప్పెను- అని పలుకగా అగస్త్యుడు, గంగానది బ్రహ్మను నమస్కారము, అర్చనము, స్తోత్రము మున్నగు వాటిచే సంతోషింపజేయగా అంతర్థానమయ్యెను.

అగస్త్యుని వద్ద గంగ తవ అంశతో ఒక వదిలి ప్రవహింపజేయుట:- అపుడు గంగానది ఆ మునిశ్రేష్ఠుని ఎదుట తన అంశనుండి పుట్టినది, దివ్యతేజస్సు కలిగినది అగు మూర్తిని చూసి ఇట్లు పలికెను.

గంగ పలికెను:- నా ఈ అంశ భూమిని చేరి నదీ రూపమును పొంది నీ కోరికను తీర్చును.

భరద్వాజుడు చెప్పెను:-అని పలికి దేవనది వెళ్లిపోగా ఆ నదీ అంశ ఏ మార్గమును అనుసరింపవలెను అని మునినడిగేను.

అగస్త్యుడు చెప్పెను:- శుభకరమగుదానా! నీకు తగినటువంటి దారిలో నేను ముందు నడచెదను. నీవు నన్ను అనుసరింపుము. అని పలికిన మునితో ఆ నది ఓ అనఘా నీకు ఏది ఇష్టమో అది చేసెదను అని పలికెను. అపుడా ముని ఆ కొండ పై నుండి దిగి నదీరూపమును పొంది ఆ గంగాఅంశతో మిక్కిలి ఆనందమును పొందిన మనస్సు గలవాడై ముందు నడవగా ఆ నది అతడిని అనుసరించెను.

ఎనభైఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచలమాహాత్మ్యమున సువర్ణముఖి ఆవిర్భవించుట అను ముప్పై రెండవ అధ్యాయము.