స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
14వ అధ్యాయము
సుమతి అను బ్రాహ్మణుని వృత్తాంతము:- సూతుడు చెప్పెను: నైమిశారణ్యమునందు నివసించు ఓ తపోధనులారా స్వామితీర్థము యొక్క మాహాత్మ్యమును మరింత చెప్పెదను వినుడు. పూర్వము సుమతి అను బ్రాహ్మణుడు ఒక బోయదాని సంగమము వలన ఏ విధముగ మద్యమును సేవించినది, స్వామి పుష్కరిణియందు స్నానముచేసి విముక్తి పొందినది చెప్పెదను.
ఋషులు పలికిరి:- ఈ సుమతి ఎవరి పుత్రుడు, ఎట్లు మద్యమును సేవించెను. బోయదానియందు ఎందుకు ఆసక్తిని పొందెను. ఓ పౌరాణికోత్తమా చెప్పుము. ఈ కథ అంతయు విస్తరముగా ఇప్పుడు చెప్పుము. సూతుడు చెప్పెను: మహారాష్ట్ర దేశము నందు వేదవేదాంగములయందు పండితుడైన యజ్ఞదేవుడను ఆస్తికుడైన బ్రాహ్మణుడు కలడు.అతడు మిక్కిలి దయకలిగినవాడై, అతిథులను సేవించుచు, శివుని,విష్ణువుని అర్చించుచుండెను. అతడికి సుమతి అను కుమారుడు కలడు.
ఆ సుమతి తండ్రిని, పతివ్రత అయిన భార్యను వదలి పెట్టి విటుల గోష్ఠియందు మనసు కలవాడై ఉత్కల దేశమునకు వెళ్లాను అచట యువకులకు మోహము కలిగించునది, వారి ధనమును ప్రలోభపరచి లోబరచుకొనునది అయిన ఒక బోయది ఉండెను. బ్రాహ్మణాధముడైన సుమతి ఆమె ఇంటికి చేరెను. ధనము లేనివాడైనను బ్రాహ్మణుడగుట చేత ఆమె ఇతడిని చేరదీసెను.
సుమతి అను బ్రాహ్మణుడు బోయ స్త్రీ సంగమము వలన మహాపాతకమును పొందుట:- ఆమెతో కలిసి జీవించుట మొదలు పెట్టిన సుమతి పలు ద్రవ్యములను అచట అచట దొంగిలించి తెచ్చుచుండెను. వాటిని తెచ్చి ఆమె కిచ్చి ఆమెతో సంభోగించుచు, కలసి భుజించుచు. ఒకే పాత్రయందు సురను సేవించుచుండెను. ఈ విధముగా చాలకాలము ఆమెతో కలసి జీవించుచు ఇంద్రియ భోగములకు లోబడి తలిదండ్రులను భార్యను కూడ మరచెను.
ఒకనాడు అతడు కిరాతుల కలసి తాను కూడ కిరాతుని వేషము ధరించి ఒక బ్రాహ్మణుని ఇంటిలో దొంగతనము చేయుటకు బయలుదేరెను. కత్తిని చేతబట్టి తొందరపాటు కలగి ఆ ఇంటిలో ప్రవేశించి తన కత్తితో ఆ ఇంటి యజమానిని చం పెను. అచట చాల ధనమును దొంగిలించి బోయస్త్రీ ఇంటికి వచ్చెను. బ్రహ్మహత్య కూడ భయంకరమైన రూపమును ధరిచి అతని వెంట పడెను. నల్లని వస్త్రములు ధరించి, ఎర్రని తలవెంట్రుకలు కలిగి భీకరముగా నవ్వుచు, ఆకాశమును వణికించుచు అది వచ్చుచుండెను. సుమతి ఎచటకు వెళ్లిన అచటకు అదీ వచ్చుచుండెను. దానినుండి తప్పించుకొనుటకు సుమతి అనేక గ్రామములు తిరుగుచుండెను. దురాత్ముడైన ఆ సుమతి కొంతకాలమునకు తన గ్రామమునకు చేరుకొనెను. అచటకు కూడా అది వెంటరాగా తన ఇంటిలోకి పోయిదాగెను. బ్రహ్మహత్య కూడా అతడితోపాటు ఇంటిలోనికి ప్రవేశించెను. అప్పుడు సుమతి రక్షింపుమని తండ్రిని శరణు వేడెను. భయపడకుమని పలికి అతడి తండ్రి రక్షించుటకు సిద్దపడెను. అపుడు బ్రహ్మహత్య సుమతి తండ్రితో ఇట్లనెను.
బ్రహ్మహత్య పలికెను:- ద్విజులలో ఉత్తముడైన ఓ యజ్ఞదేవా నీవీతడిని విడచి పెట్టుము. ఎందుకనగా ఇతడు మద్యమును సేవించినవాడు, దొంగతనము చేసినవాడు, బ్రాహ్మణుని హత్య చేసినవాడు, గొప్ప పాపములను చేసిన వాడు. తల్లికి తండ్రికి ద్రోహము చేసిన వాడు, భార్యను వదలిపెట్టినవాడు, బోయస్త్రీ సంగమము వలన దోషమును పొందిన వాడు కనుక ఈ దురాత్ముని వదలి పెట్టుము. మహాపాతకములు చేసిన నీ ఈ కుమారుని వదలి పెట్టనిచో ఓ బ్రాహ్మణుడా! నీ భార్యను, ఇతడి భార్యను, నిన్ను, నీ కుమారుని. అందరిని తినివేయుదును. కనుక ఇతడిని వదలి పెట్టుము. ఇతడిని వదిలి పెట్టినచో నిన్ను వదిలి పెట్టెదను. ఒక్కని కొరకు కులము నంతటిని నాశనము చేసుకొనుట తగదు. అని పలుకగా యజ్ఞదేవుడిట్లు పలికెను.
యజ్ఞదేవుడు పలికెను: పుత్రుని పై స్నేహము నన్ను బాధించుచున్నది. అని పలికెను. అది విని బ్రహ్మహత్య ఇట్లనెను. బ్రహ్మహత్య పలికెను: ఇతడు పాపకర్మలు చేసి పతితుడు అయ్యెను. వర్ణాశ్రమముల నుండి బహిష్కరింపబడెను. ఇతడిపై నీవు అనురాగమును పెంచుకో వలదు. ఇతడిని చూచుట కూడ పాపమును కలిగించును. అని పలికి బ్రహ్మహత్య యజ్ఞదేవుడు చూచుచుండగనే సుమతి అను పేరుగల అతడిని అరచేతితో మోదైను. ఆ సుమతి తండ్రి కాపాడుమని అరువసాగెను. (ఏడ్వసాగెను)
సుమతికి దుర్వాసుడు బ్రహ్మహత్య నుండి బయటపడు ఉపాయమును చెప్పుట;- అది చూచి అతడి తండ్రి, తల్లి, భార్య అందరును ఏడ్వసాగిరి. అదే సమయములో శంకరుని అంశకల దుర్వాసుడు అచటకు వచ్చెను. అదృష్టము కొలది అచటకు వచ్చిన ముని సత్తము పైన, ధర్మపరుడైన శంకరుని అవతారమైన దుర్వాసుని చూచి యజ్ఞదేవుడు. అతడిని స్తుతించి, నమస్కరించి పుత్రుని రక్షింపుమని శరణుకోరెను. ఓ దుర్వాసమహర్షీ! నీవు గొప్ప యోగివి, సాక్షాత్తు శివుని అంశకలవాడవు.
పుణ్యము చేయనివారికి నీవెప్పుడును కనబడవు, నా యీ కుమారుడు బ్రహ్మహత్య చేసెను. సురను సేవించెను. ఇతడిని సంహరించుటకు బ్రహ్మహత్య వెంటాడుచుండెను. నా కుమారుడు ఈ పాపము నుండి బయట పడునట్లు. ఘోరమైన ఈ బ్రహ్మహత్య తొలగిపోవునట్లు ఒక ఉపాయమును చెప్పుము. నా కుమారుని పై దయచూపుము. ఇతడు నా ఒక్కగానొక్క కుమారుడు. ఇతడు మరణించినచో నా వంశము సమూలముగా నాశనమగును. తరువాత పితృదేవతలకు పిండములు పెట్టు వారెవ్వరును ఉండరు కనుక మా పై కరుణ చూపుము. అని పలుకగా దుర్వాసుడు చాలా సేపు ధ్యానించి యజ్ఞదేవునితో ఇట్లు పలికెను. దుర్వాసుడు పలికేను: ఓ యజ్ఞదేవా! నీ కుమారుడు చేసిన పాపము అతి క్రూరమైనది. దీనికి పదివేల ప్రాయశ్చిత్తములు ఆచరించినను శాంతి కలుగదు. అయినప్పటికి నీ కుమారుని పాపమును శాంతింప చేయుటకు ప్రాయశ్చిత్తమును చెప్పెదను. శ్రద్ధగా వినుము. మహాపుణ్యప్రదమగు వేంకటాద్రి యందు అని పాతకములను నాశనము చేయునది. మంగలప్రదమైనది. అగు స్వామి పుష్కరిణి కలదు.
స్వామి పుష్కరిణి యందు స్నానము చేయుట వలన సుమతి బ్రహ్మహత్యా పాతకము నుండి ముక్తిని పొందుట: నీ కుమారుడు ఆ స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినచో వెంటనే ఆ పాపము నుండి ముక్తిని పొందగలడు అని చెప్పగా ఆ యజ్ఞదేవుడు కుమారుని తోడ్కొని స్వామి పుష్కరిణికి వెళ్లి, బ్రహ్మహత్యచే బాధింపబడుచున్న కుమారునికి అచట స్నానము చేయించెను. అపుడు ఆకాశవాణి మధుర స్వరముతో యజ్ఞదేవునితో ఇట్లనెను. ఓ మహానుభావా, నీ కుమారుడు తనని పాపము నుండి విముక్తిని పొందినాడు. దీనియందు సందేహము లేదు. ఇటువంటి ప్రభావము కలిగినది. ఆ స్వామి పుష్కరిణి, పాపములు అనే వృక్షములకు గొడ్డలి వంటిది. ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగ మీకు పురాతనమైన ఈ ఇతిహాసమును చెప్పితిని, ఇది విన్న వారికి చదివిన వారికి కూడ వాజపేయ యాగము చేసిన ఫలితము కలుగును,
ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున స్వామి పుష్కరిణి మహిమను వర్ణించుట అను పదునాల్గవ అధ్యాయము.
