స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
13వ అధ్యాయము
సూతుడు చెప్పెన:- నైమిశారణ్యమునందు నివసించు ఓ మునులారా! మీ ఆదరణను చూచిన నేను స్వామి తీర్థముయొక్క వైభవమును గూర్చి మరల చెప్పగోరుచున్నాను. చంద్రవంశమునందు నందుడను రాజు పుట్టి భూమినంతటిని పరిపాలించెను. అతనికి ధర్మగుప్తుడను కుమారుడు కలడు. రాజ్యమును రక్షించు భారమును నందుడు కుమారునికి అప్పగించి ఇంద్రియములను జయించినవాడై, నియతాహారము కలిగి తపోవనమున ప్రవేశించెను. తండ్రి తపోవనమునకు వెళ్లిన తరువాత ధర్మగుప్తుడను ఆ రాజు ధర్మమును తెలిసికొని, నీతి తత్పరుడై భూమిని పరిపాలించెను. ఇంద్రుడు మొదలైన దేవతలను పలు విధములైన యజ్ఞములతో తృప్తిపరచెను. బ్రాహ్మణులకు ధనమును, క్షేత్రములను దానమిచ్చెను. అతడు రాజ్యమును పరిపాలించు చుండగా ప్రజలందరు తమ తమ ధర్మములను క్రమము తప్పక అనుసరించుచుండిరి.
అతడి రాజ్యములో ఎప్పుడును దొంగలు మొదలైన వారి భయముకాని, ఏ విధమైన పీడకాని కలుగలేదు. ఒకనాడు ధర్మగుప్తుడు ఉత్తమాశ్వము నెక్కి బయలుదేరెన. వేటాడగోరి అతడు అడవిలోకి ప్రవేశించెను. అచట కానుగ, తాటి, హింతాలము, అడవి గోరింట మొదలైన చెట్లతో నిండిన అడవి యందు సంచరించుచుండెను. సింహములు, పులులతో భయంకరమైన అడవియందు, మత్తెక్కిన తుమ్మెదల ఝుంకారముతో దిక్కులు పిక్కటిల్లుతున్నవి. తామరలు, కలువలు, బొండు మల్లెలు, నల్ల కలువలు మున్నగు వాటితో నిండిన తటాకములు కలవు. పెక్కు మంది తాపసులు కల ఆ అడవి యందు ధర్మగుప్తుడు తిరుగుచుండగా రాత్రి అయినది. దిక్కులన్నిటా చీకటి అలము కొన్నది. రాజు వినయము కలవాడై సాయంసంధ్యను ఉపాసించి, అచటనే వేదమాత అయిన గాత్రిని జపించెను. సింహములు, పులులు ఉన్న ఆ అడవి యందు రక్షణ కొరకై రాజు ఒక చెట్టును ఎక్కి కూర్చోనెను. ఒక సింహము వెంబడించగా ఎలుగుబంటి ఒకటి ఆ చెట్టువరకు వచ్చెను. సింహమా చెట్టు వద్దకు రాగా భయపడి ఆ ఎలుగు చెట్టు పైకి ఎక్కేను.
ఆ చెట్టు పైకి ఎక్కిన ఎలుగు రాజును చూచెను. రాజును చూసి ఆ ఎలుగు ఇట్లనెను. ఓ రాజేంద్ర! నన్ను చూసి భయపడకుము. మనము ఇద్దరము ఈ రాత్రికి ఈ చెట్టు పైనే గడుపుదుము. గొప్ప బలము, పెద్ద శరీరము కలిగిన భయంకరమైన కోరలు కలిగిన, గొప్ప భయమును కలిగించుచు ఈ చెట్టు క్రింద వేచియున్నది. కనుక రాత్రి సగము గడచు వరకు నేను నిన్ను రక్షించుదును. కనుక నీవు ఏ చింత లేక నిద్రించవచ్చును. మిగిలిన సగము రాత్రి నేను నిద్రించెదను. నీవు నన్ను రక్షింపుము. దానిని అంగీకరించి రాజు నిద్రింపగా చెట్టుకింద ఉన్న సింహము ఎలుగుబంటితో నిద్రించుచున్న రాజును క్రింద పడ వేయమని కోరెను. ధర్మము తెలిసిన ఆ ఎలుగుబంటి సింహముతో ఇట్లనెను. వనములో నివసించు ఓ మృగరాజా! నీకు ధర్మము తెలియదా! విశ్వాస ఘాతకులకు ఈ లోకములో అన్ని కష్టములు కలుగును. పదివేల యజ్ఞములు చేసినను విశ్వాసఘాతకుని పాపము నశించదు. బ్రహ్మహత్య మొదలైన పాపములకైనను నిష్కృతి ఏదో ఒక విధముగా ఉండును. కాని కోటి జన్మలెత్తినను విశ్వాసఘాతము యొక్క పాపము నశించదు. ఈ లోకములో మేరు పర్వతమును కూడ నేను బరువైన దానిగ భావించను. కాని విశ్వాస ఘాతము యొక్క భారమునే ఎక్కువగా తలచుదును.
ఆ ఎలుగు ఈ విధముగా పలుకగా సింహము మారుమాటాడక ఊరకుండెను. ధర్మగుప్తుడు లేచిన తరువాత ఎలుగుబంటి చెట్టుపై నిద్రించెను. అప్పుడు సింహము రాజుతో ఎలుగును క్రిందికి తోసివేయమని కోరగా రాజు ఏమియు ఆలోచింపక తన ఒడిలో నిద్రించుచున్న ఎలుగును చెట్టు పై నుండి క్రిందకు త్రోసివేసెను. పడబోవుచున్న ఆ ఎలుగు అదృష్టము కొద్ది క్రిందకు జారిపడక ఒక కొమ్మను పట్టుకొనెను. అపుడది రాజు వద్దకు వచ్చి కోపముతో ఇట్లనెను. భృగువంశమునందు జన్మించిన ధ్యానకాష్ఠుడను పేరుగల నేను కోరిన రూపమును ధరించగలవాడను. ఇపుడీ ఎలుగుబంటి రూపమును పొందియుంటిని. ఏ పాపము చేయని, నిద్రించున్న నన్ను నిష్కారణముగ క్రిందకు తోసి వేసితివి. కనుక నా శాపము వలన వెంటనే పిచ్చివాడవై తిరుగుదువు. అని శపించి సింహముతో ఇట్లనెను. నీవు సింహము కాదు. పూర్వము కుబేరునికి సచివునిగ ఉంటివి. ఒకసారి నీవు నీ ప్రియురాలితో కలసి హిమవత్పర్వతమునకు వెళ్లి తెలియక గౌతముని ఆశ్రమ సమీపమున రాసక్రీడలు మొదలు పెట్టితివి. విధివశాత్తు ఆ సమయముననే గౌతముడు తన ఆశ్రమము నుండి సమిధలను సేకరించుటకై బయటకు వచ్చి, వివస్త్రునిగ ఉన్న నిన్ను చూచి కోపముతో శాపమిచ్చేను. నా ఆశ్రమమునందు వివస్తుడవై ఉంటీవి కనుక ఇకపై సింహముగా మారుదువు. దీని యందు ఏ మాత్రము సందేహము లేదు.
అన్ (తముడు శపించగా నీవు సింహత్వమును పొందితివి నీవు పూర్వము కుబేరునికి సచివుడవు. నీ పేరు భద్రుడు. కుబేరుడు ధర్మమును పరిపాలించువాడు. అతడి భృత్యులును అట్టివారే. కనుక నీవు ఏల ప్రాణులను హింసించు చున్నావు?. ఇది అంతయు నా ధ్యాన మహిమ వలన తెలిసికొంటిని. అని చెప్పగా అతడు తన సింహత్వమును వదలి పెట్టెను. కుబేరుని సచివుడైన దివ్యమైన యక్షుని రూపమును పొంది, ధ్యాకాష్ఠునికి ప్రణమిల్లి ఇట్లనెను. పూర్వము జరిగినదంతయు నాకిప్పుడు తెలిసినది. గౌతముడు శాపమిచ్చినపుడే శాపాంతమును కూడ వచించేను. ఎలుగుబంటి రూపములో ఉన్న ధ్యానకాష్టమునితో సంవాదము జరిగినప్పుడు నేను నా సింహత్వమును వదలి పెట్టుదును. అని మునిపుంగవుడైన గౌతముడు చెప్పియుండెను. ఇప్పుడు సింహత్వమును వదలి పెట్టిన తరువాత నాకీ విషయమంతయు తెలిసినది
నీవు కోరిన రూపము ధరింపగల, శుద్ధుడవైన, ధ్యాన కాష్ఠుడవని తెలసికొంటిని, అని ధ్యానకాష్ఠునికి నమస్కరించెను. తరువాత శ్రేష్ఠమైన విమానము నెక్కి అలకాపురికి వెళ్లిపోయెను. రాజు పిచ్చివాడుగా ఉండుట చూచి మంత్రులాతడిని అతడి తండ్రి నివసించుచున్న రేవానదీ తీరమునకు తీసుకు వెళ్లిరి. అతడి కుమారునకు ఉన్మాదము కలుగుట మొదలగునవి అన్నియు చెప్పిరి. తన కుమారుని వృత్తాంతమును తెలుసుకున్న ఆ నంద మహారాజు.
జైమిని చెప్పిన విధముగ స్వామి తీర్థమునందు స్నానము చేయుట వలన ధర్మగుప్తునికి ఉన్మాదము తొలగిపోవుట: వెనువెంటనే తన కుమారుని జైమిని ముని వద్దకు తీసుకొని పోయి జరిగిన దంతయు చెప్పెను. ఓ మహామునీ, నీవు సాక్షాత్తు భగవంతుడవు, నా పుత్రుని ఉన్మాదమును పోగొట్టు ఉపాయమును వెంటనే చెప్పగలవు అని జైమిని మునీని ప్రార్థించెను.
అని నందుడు అడుగగా మునిపుంగవుడైన జైమిని చాలా సేపు ధ్యానించి తరువాత రాజుతో ఇట్లనెను. ధ్యానకాష్ఠుని శాపము చేత నీ కుమారుడు ఉన్మాది అయ్యెను. ఆ శాపము నుండి బయటపడు ఉపాయమును నేను చేప్పెదను. సువర్ణముఖి నదీ తీరమునందు వేంకటాచలమను పర్వతము కలదు. అచట అన్ని పాపములను హరించునది, వివిధములైన ధాతువుల చేత నిర్మితమైనది. అయిన మహత్తరమైన స్వామి పుష్కరిణి కలదు. పవిత్రమైన తీర్థములన్నిటిలో అతి పవిత్రమైనది, మంగళకరమైన వాటిలో మంగళకరమైనది. వేదములయందు ప్రసిద్ధి నొందినది. గొప్ప పుణ్యమును కలిగించునది, బ్రహ్మహత్యాది పాపముల నుండి విముక్తి కలిగించునది. నీవు నీ కుమారుని అచటకు తీసుకువెళ్లి స్నానము చేయింపుము. వెంటనే ఉన్మాదము నశించును ఇందు సందేహము లేదు. అని చెప్పగా నందుడు జైమినికి నమస్కరించేను. నందుడుతనపుత్రుని తీసుకుని స్వామి పుష్కరిణికి వెళ్లి నియమపూర్వకముగా స్నానము చేయించెను.
స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినంతనే ధర్మగుప్తుని ఉన్మాదము నశించెను. అపుడు నందుడు కూడ పుష్కరిణి యందు స్నానము చేసెను. తన కుమారునితో కలసి అచట ఒక దినము గడపి కృపానిధి అయిన వేంకటేశుని అర్చించెను. కుమారుని కుశలమడిగి నందుడు తపోవనమునకు వెళ్లిపోయెను. తండ్రి వెళ్లిన తరువాత ధర్మగుప్తుడు ఎంతో భక్తితో వేంకటేశునికి బహువిధములైన ధనమును సమర్పించెను. బ్రాహ్మణులకు ధనమును, ధాన్యమును, పొలములను దానమిచ్చెను. తరువాత తన మంత్రులతో కలసి తన నగరమునకు వెళ్లాను. ఏ అడ్డంకులు లేక రాజ్యమును పరిపాలించెను. తండ్రి తాతల నుంచి సక్రమించిన రాజ్యమును ధర్మానుసారముగా పరిపాలించెను. మానవులు ఉన్మాదము చేతగాని, అపస్మారము (మూర్చ) చేతగాని, దుష్టగ్రహములచేగాని పీడింపబడినచో వారు పుష్కరిణియందు స్నానము చేసిన యెడల వెంటనే విముక్తి పొందుదురు.
స్వామి పుష్కరిణి వదలి మరి ఒక తీర్థమునకు వెళ్లినవాడు మృదువైన ఆవు పాలను వదలి జెముడు మొక్క పాలను కోరినట్లే. స్వామి తీర్థము అని ముమ్మారు పలికి ఏ నీటి యందు స్నానము చేసినను అట్టివారు నిశ్చయముగా బ్రహ్మపదమును పొందుదురు. ఈ విధముగా మీకు శుభకరమైన ధర్మగుప్తుని కథను వినిపించితిని. దీనిని గూర్చి విన్నను బ్రహ్మహత్యాది దోషముల నుండి మిముక్తి కలుగును.
ఎనభై ఒక్క వేల శ్లోకములు గల శ్రీ స్కాందమహాపురాణ మందలి రెండవదగు వైష్ణవఖండమున స్వామి పుష్కరిణి యొక్క మహిమను వర్ణించు పదమూడవ అధ్యాయము.
