స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
19వ అధ్యాయము
బ్రహ్మాది దేవతలు ఎల్లప్పుడు వేంకటాద్రిపై నివసించుట:
సూతుడు చెప్పెను:- ఇప్పుడు వేంకటాద్రియొక్క వైభవమును చెప్పెదను. శ్రద్ధగా వినుడు. కోటి కోట్ల సరస్సులు, నదులు సముద్రములు, మహాపుణ్యప్రదములగు తోటలు, ఆశ్రమములు, వసిష్ఠాది మునులు, సిద్దులు, చారణులు, కింనరులు పుణ్యప్రదములగు అనేక క్షేత్రములు, వేదములు, అడవులు. శ్రీదేవి భూదేవులతో కలసి సాక్షాద్విష్ణుమూర్తి, సావిత్రి సరస్వతులతో కలసి చతుర్ముఖ బ్రహ్మ. పార్వతితో కలసి దేవదేవుడు, మూడు కన్నులు కలవాడు, మూడు పురములను నాశనము చేసినవాడు అయిన శివుడు, వినాయకుడు, కుమారస్వామి, ఇంద్రాది దేవతలు. సూర్యుడు మొదలుగాగల గ్రహములు, అష్టవసువులు, పితరులు, దిక్పాలకులు, ఇతరదేవతా గణములు ఆరు. అందరును రాత్రింబవళ్లు సర్వపాపములను నాశనము చేయునది, లోకములను పవిత్రము చేయునది అగు వేంకటాద్రియొక్క శిఖరమునందు నివసింతురు.
అట్టి శిఖరమును చూచుటచేతనే మానవులకు బుద్ధియందు సుఖము కలుగును. ఆ శిఖరము నందు నివసించు సిద్ద స్త్రీలు, చారణస్త్రీలు దయానిధియగు స్వామిని ఎల్లప్పుడు పూజింతురు. కోటి బ్రహ్మహత్య పాపములు, కోటి పొందరాని వారిని పొందిన పాపములు వేంకటాద్రిపై నుండి వీచుగాలి తగిలినంతనే నశించుచున్నవి.
వేంకటాద్రిపైకి ఎక్కు సమయమున పాటించవలసిన క్రమము:- వేంకటాద్రిపై కాలిడుటకు ముందు పుణ్యమును పెంచునట్టి ఆ పర్వతమునిట్లు ప్రార్థింపవలెను. నీవు బంగారు పర్వతమవు. గొప్ప పుణ్యమును కలిగించుదానవు. సమస్త దేవతలచే సేవింబడుదానవు. బ్రహ్మ మొదలగు దేవతలందరు శ్రద్దతో నిన్ను కొలచుదురు. అట్టి నీపై నేను కాలిడబోవుచున్నాను. ఆ పాపమును క్షమింపుము. పాపాత్ముడగు నాకు నీ శిఖరము పై నివసించు స్వామిని చూపుము.
ఈ విధముగా పర్వతములలో ఉత్తమమైన వేంకటాద్రిని ప్రార్థించి మెత్తని అడుగులతో వేంకటాద్రిని చేరవలెను. మహాపుణ్యమగు వేంకటాద్రిపై అన్ని పాపములను నాశనము చేయు స్వామి పుష్కరిణియందు నియమ పూర్వకముగా స్నానము చేయవలయును. తరువాత పితరుల కొరకు ఆవగింజ మునుగునంత లేక జమ్మిలకు అంత నీటిని పిండదానము చేసి తర్పణము విడువ వలెను. దాని వలన నరకమునందున్న పితరులు స్వర్గమును చేరుదురు. స్వర్గమునందున్న వారు మోక్షమును పొందుదురు.
పాపవినాశమను తీర్థముయొక్క మాహత్మ్యము:- ఆ వేంకటాద్రిపై గొప్పది, అన్ని లోకములయందు ప్రసిద్ధి పొందినది. అన్ని తీర్థములలోకి ఉత్తమమైనది పుణ్యప్రదమైనది అగు పాపవినాశ తీర్థమున్నది. పుణ్య తమము, పవిత్రము అగు వేంకటాద్రిపై ఉన్న ఈ తీర్థమును స్మరించినంతనే మరు జన్మ ఉండదు. స్వామి పుష్కరిణికి ఉత్తర దిక్కునందున్న ఈ తీర్థమునందు స్నానము చేసిన తప్పక వైకుంఠమును చేరగలరు. దీనియందు సందేహము లేదు. ఋషులు పలికిరి: ఓ సూతుడా! పాపవినాశనతీర్థముయొక్క వైభవమును వర్ణింపుము. వ్యాసునిచే సకలము బోధింపబడిన నీకు సర్వము తెలియును.
సూతుడు చెప్పెను:- హిమవత్పర్వతము ప్రక్కనున్న బ్రహ్మాశ్రమ పదమునందు జరిగిన శుభకరమైన కథను చెప్పెదను వినుడు. హిమాలయము ప్రక్కన బ్రహ్మాశ్రమపదమను ఆశ్రమము వివిధములైన చెట్లతో నిండియుండెను. పలు రకములైన పొదలు తీగలతో సింహములు, ఏనుగులతో, సిద్దులు చారణులతో నిండి, చక్కగా పూసిన పూలతోటలతో నిండి ఉండెను. పెక్కుమంది తాపసులతో, యతులతో, మహాత్ములైన, సూర్యుని కాంతి వంటి తేజస్సు కలిగిన బ్రాహ్మణులతో నిండియుండెను. నియమముతో వ్రతములు ఆచరించుచున్న వారిచే, తాపసులచే, దీక్షలు స్వీకరించినవారిచే, త్యాగశీలురచే, నియతాహారముకలవారిచే, నిశ్చలమైన మనస్సు గలవారిచే నిండియుండెను. వేదములను అధ్యయనము చేయా వైదికులతో నిండియుండెను. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అచట తమ తమ ఆశ్రమములకు తగినట్లుగా, తమ తమ వర్ణములకు తగినట్లుగా అచట జీవించుచుండిరి. ఆ ఆశ్రమమందు అంతటను వాలఖిల్యమహర్పులు కనిపించుచుండిరి.
దృఢమతి అను శూద్రుని వృత్తాంతము:- ఆ ఆశ్రమమునకు ఒకనాడు దృఢమతి అను పేరుగల శూద్రుడు తొందరపాటుగలవాడు, సంతోషముతో కూడినవాడై బ్రాహ్మణుల వద్దకు వచ్చెను. తాపసులచేత పూజింపబడినవాడై ఆ దృఢమతి సాష్టాంగ నమస్కారము చేసెను. అచట అతడు మిక్కిలి తేజస్సు కలిగి, దేవతలతో సమానులై వివిధములైన యజ్ఞములు చేయుచున్న మునిగణములను చూచి మిక్కిలి ఆనందించెను. అపుడతడికి తాను కూడ తపస్సు చేయవలెనను బుద్ది కలెను. కులపతి అగు తాపసి వద్దకు వెళ్లి అతడిట్లనెను.
దృఢమతి పలికెను: ఓ తపోధన, కరుణానిధీ! నీకు నమస్కారము, నన్ను రక్షింపుము. నీ దయ వలన యాగము చేయగోరుచుంటిని. దయ చూపుము.
కులపతి చెప్పెను: - హీనజన్మపొందిన శూద్రునిచే యాగము చేయింపరాదు. నీ బుద్ధి వినునల్యఇతే సేవాతత్పరుడవు కమ్ము. జాతిహీనునికి ఉపదేశము చేయకూడదు. ఆట్లు చేసిన ఉపాధ్యాయునికి దోషము కలుగును. శూద్రునికి విద్య నేర్పకూడదు. యాగములు చేయింపకూడదు. వ్యాకరణము మొదలైన శాస్త్రములు నేర్పకూడదు. కావ్యము, నాటకము, అలంకారము, పురాణము, ఇతిహాసము శూద్రునికి నేర్పకూడదు. ఎవరైనా బ్రాహ్మణుడు ఎపుడైనా శూద్రునికి విద్య నేర్పినట్లయితే ఇతరులు అతడిని గ్రామమునుండి వెలి వేయవలయును, శూద్రునికి విద్య చెప్పువానిని చండాలుని వలె వదలి పెట్టవలయును. విద్యనేర్చిన శూద్రుని దూరముగా ఉంచవలయును. కనుక నీవు బ్రాహ్మణులను సేవింపుము. మనువు మున్న వారు శూద్రునికి సేవయే ధర్మమని చెప్పిరి. నీకు విధించిన కర్మను విడచుట ధర్మము కాదు. అని ముని చెప్పగా ఆ శూద్రుడు మిక్కిలి విచారించెను.
ఇపుడు నేనేమి చేయవలెను, నాకు తపస్సుపై మిక్కిలి శ్రద్ధయున్నది. నాకు తోచిన విధముగ నేను చక్కని జ్ఞానమును పొందుటకు ప్రయత్నించేదను. అని మనస్సున నిశ్చయించుకుని దృఢమతి ఆ ఆశ్రమము నుండి కొంత దూరము వెళ్లి అచట ఒక కుటీరము నిర్మించుకొనెను. అచట ఒక దేవాలయమును, ఇతరుమలైన పవిత్రమంటపములు, పూలతోటలు ఏర్పాటు చేసి ఒక చెరువును కూడా త్రవ్వను. తరువాత శ్రద్ధతో తపస్సు సిద్ధించుటకై అభిషేకములను, నియమపూర్వక ఉపవాసములను చేసెను. బలులు ఇచ్చి, దేవతలను హవిస్సులతో అర్చించెను. సంకల్పముతో నియమము కలిగి, పండ్లను మాత్రమే ఆహారముగ స్వీకరించుచు, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండెన. వచ్చినటువంటి అతిథులను కందమూలములచే, పుష్పఫలములచే నియమపూర్వకముగా సేవించెను. ఈ విధముగ అతడు చాలాకాలము గడి పెను.
ఒకనాడు గర్గకులమునందు పుట్టినవాడు, సత్యము పలుకువాడు, ఇంద్రియనిగ్రహము కలవాడు అగు సుమతి అను బ్రాహ్మణుడు ఆ ఆశ్రమమునకు వచ్చెను. మునికి స్వాగతము చెప్పి, పండ్లు మున్నగువానిచే సంతోషింపజేసి, పుణ్యకథలను చెప్పుడు శూద్రుడు అతడిని కుశలమడిగెను. ఈ విధముగా పాద్యాదుల చేత సేవింపబడి ఆ విప్రుడు ఆశీర్వదించి అతడి సత్కారమును స్వీకరించెను. సంతోషముతో తిరిగి వచ్చిన ఆ విప్రుడు ప్రతిదినము శూద్రుని వద్దకు వెళ్లి క్రమముగ అతడి యందు పక్షపాతము కలవాడయ్యేను. ఆ విధముగ చాలా కాలము గడచునప్పటికి ఆ శూద్రునితో సంబంధము ఏర్పడెను. అతడు చెప్పినట్లు వినసాగెను. ఒకనాడు శూద్రుడు బ్రాహ్మణుని ఇట్లడిగెను. హవ్యములను, కవ్యములను ఉపయోగించు విధానమును నాకు తెల్పుము. నీవు నాకు గురువు అని నేను తలచుచుంటిని అని ఆ శూద్రుడు అడుగగా బ్రాహ్మణుడు ఆ విధానమంతయు అతడికి తెల్పెను. శూద్రుని పితృకార్యమును కూడ చేసెను. తరువాత శూద్రుడు ఆ బ్రాహ్మణుని విడచి పెట్టెను.
అథ శూద్రస్య వైదిక కర్మోపదేశేన సుమత్యను భూతదుర్గతి:
శూద్రునికి వైదిక కర్మలను ఉపదేశించుట వలన సుమతి దుర్గతి అనుభవించుట:- ఈ విధముగా చాలా కాలము శూద్రునిచే పోషింపబడిన సుమతి ఇతర బ్రాహ్మణులచే విడవబడి కొంత కాలమునకు మరణించెను. పిమ్మట యమభటులు అతడిని నరకమునందు పడవేసిరి కోట్లాది కల్పములు నరకమునందు ఉండి చివరకు అతడు స్థావరముగ జన్మించెను. తరువాతి జన్మలయందు గాడిదగ, ఊరపందిగ, కుక్కగ, కాకిగ జన్మించెను. పిమ్మట చండాలునిగి, తరువాతి జన్మమున వైశ్యునిగా, పిమ్మట క్షత్రియునిగ పుట్టి చివరకు బ్రాహ్మణునిగా జన్మించెను.
అతడి ఎనిమిదవ ఏట తండ్రి ఉపనయనము చేసెను. తండ్రి ఇంటి యందే ఉండి తనకు తగిన ఆచారములను పాటించుచు వేదాభ్యాసము చేయుచుండెను. ఒకనాడు దట్టమైన అడవియందు వెళ్లుచుండగా ఆ బాలుని ఒక బ్రహ్మరాక్షసి ఆవేశించెను. అప్పటి నుండి అతడు ఏడ్చుచు, తిరుగుచు, పడిలేస్తూ, అరచుచు, నవ్వుచు ఉండెను. మాటిమాటికి హాహా అనీ అరచుచు వైదిక కర్మలన్నిటిని వదలి పెట్టెను. పుత్రుడు ఆ విధముగా ప్రవర్తించుట చూచి తండ్రి మిక్కిలి దుఃఖించెను. పుత్రుని పై అనురాగముతో అతడు సువర్ణముఖి నదివద్ద శివుని ఎదుట తపస్సు చేయుచున్న అగస్త్యుని శరణు వేడెను. భక్తితో తండ్రీ కొడుకులు మునికి నమస్కరించిరి. పిమ్మట తండ్రి పుత్రుని చేష్టలను గూర్చి వివరించెను.
అగస్త్యుడు చెప్పిన విధముగ దుర్గతి తొలగుటకై సుమతి వేంకటాద్రికి వెళ్లుట:- అపుడా విప్రుడు అగస్త్యునితో ఇట్లనెను. నా ఈ తనయుని బ్రహ్మరాక్షసి పట్టుకొన్నది. దాని వలన అతడు సుఖమును పొందుట లేదు. ఈ కుమారునికంటే వేరెవరు లేరు. పితృణము నుండి బయటపడుటకు ఉపాయమును చెప్పుము. నీ వంటి తపఃశీలి ముల్లోకముల యందును లేడు. నీవు తప్ప మరి ఎవ్వరును ఇతడిని రక్షింపజాలరు. కనుక ఓ దయాశీలి! ఇతడిపై దయ చూపుము.
ఈ విధముగ ఆ బ్రాహ్మణుడు ప్రార్థింపగ అగస్త్యుడు చాల సేపు ధ్యానమునందుండి అప్పుడు బ్రాహ్మణునితో ఇట్లనెను.
అగస్త్యుడు చెప్పెను: - ఓ బ్రాహ్మణుడా, నీ ఈ కుమారుడు పూర్వమొక జన్మయందు బ్రాహ్మణునిగ జన్మించెను. సమతి అను పేరు గల ఇతడు ఒక శూద్రునికి విద్యనేర్పెను వైదిక కర్మలను అతడికి నేర్పుటచే సుమతి కోట్లకొలది సంవత్సరములు నరకమునందుండెను. క్రమముగా స్థావరము మొదలైన యోనులయందు జన్మించుచు కర్మశేషము వలన ఇప్పటికి బ్రాహ్మణునిగ జన్మించెన్వు. యమ లోకమునకు పోయిన వచ్చిన ఈతడిని బ్రహ్మరాక్షసి సులభముగ పట్టుకొనెను. ఘోరమైన పూర్వజన్మయందలి పాతకమునుండి బయటపడు ఉపాయమును చెప్పెదను. ఈ బ్రహ్మరాక్షసిని నాశనము చేయు ఉపాయమును శ్రద్ధతో సావధాన చిత్తుడవై వినుము. సువర్ణముఖి తీరమునందు మునులు, దేవతలు సేవించు వేంకటాద్రి కలదు. దాని పై మహాతీర్థము, అన్ని పాపములను పోగొట్టునది, పుణ్యమైనది, ప్రసిద్ధమైనది అగు పాపవినాశనమను పేరుగల తీర్థమున్నది.
భూతములు, ప్రేతములు, పిశాచములు, వేతాలము, బ్రహ్మరాక్షసులు, ఘోరమైన రోగములు అన్నియు అచట స్నానము చేయుట వలన నశించును. కనుక నీవు నీ కుమారునితో కొండమధ్య ఉన్న పాపవినాశ తీర్థమునకు వెళ్లి ప్రయత్న పూర్వకముగ స్నానము చేయింపుము. అచట మూడు దినములు స్నానము చేయుట వలన బ్రహ్మరాక్షసి నశించును. ఇంతకంటే వేరొక ఉపాయము లేదు. కనుక నీవు శీఘ్రముగ వేంకటాద్రికి వెళ్లి పాపవినాశ తీర్థమునందు స్నానము చేయింపుము. ఆలస్యము చేయక త్వరగా వెళ్లవలసినది అని చెప్పగ. విప్రుడు అగస్త్యునికి సాష్టాంగ ప్రణామము చేసెను. అతడి వద్ద అనుమతి తీసుకుని వేంకటాద్రికి కుమారునితో వెళ్లాను.
పాపవినాశమునందు స్నానము చేయుట వలన సుమతి యొక్క దుర్గతి తొలగుట:- అచట మూడు దినములు సంకల్పముతో కుమారునికి స్నానము చేయించి ఆ విప్రుడు తాను కూడా స్నానము చేసెను. ఆ తీర్థమునందలి నీటిని త్రాగి ఆహ్నికమును కూడ నెరవేర్చెను. దాని వలన అతడి కుమారుడు బ్రహ్మరాక్షసి నుండి విముక్తిని పొందెను. ఏ రోగములు లేనివాడై స్వస్థుడై, సుందరరూపమును పొంది, అన్ని సంపదలను కలిగినవాడై భోగములను అనుభవించెను. పాపవినాశమునందు స్నానము వలన మరణానంతరము ముక్తిని పొందెను. అతడి తండ్రి కూడా అట్లే ముక్తిని పొందెను.
వైదిక కర్మను అమష్టించిన ధృఢమతి దుర్గతి నుండి ముక్తిని పొందుట:- సుమతిచే వైదికొనుష్టానము ఉపదేశింపబడిన ఆ శూద్రుడు నరకమునందు చాలా కాలము గడపి, అనేకములైన నీచయోనుల యందు జన్మించెను ఒకనాడు నీరు త్రాగుటకు పాపవినాశ తీర్థమునకు వెళ్లాన. అచట నీరు త్రాగి ఆ నీటితో తన శరీరమును తడపుకొనెను. వెనువెంటనే దివ్యదేహమును పొంది సమస్తాభరణములచే అలంకరింపబడెను. దివ్యవిమానమునెక్కి స్వర్గమునకు వెళ్లాను.
సూతుడు చెప్పెను:- ఈ పాపవినాశన తీర్థము ఇటువంటి మహత్తుకలది. పాపములను నాశనము చేయునది కనుక పాప వినాశనును పేరు పొందినది. ఈ విధముగ రహస్యమగు పాపవినాశన వైభవము చెప్పితిని. అచట స్నానము చేయుట వలన బ్రాహ్మణుడు, శూద్రుడు ముక్తిని పొందిరి.
ఎనభై ఒక్క వేల శ్లోకములుకల శ్రీ స్కాంద మహాపురాణ మందలి రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మహాత్మ్యమున పాపవినాశన తీర్థము యొక్క మహిమను వర్ణించుట అను పందొమ్మిదవ అధ్యాయము.
