స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
22వ అధ్యాయము
అథ దానార్ఘ సత్పాత్రనిర్ణయ:
ఋషయ ఊచుః
ఋషులు అడిగిరి :- భగవంతుడవగు సూతుడా, నీవు సర్వజ్ఞుడవు, వేద వేదాంతములయందు దిట్టవు. దానములు ఎవరికి ఈయవలెను, ఏ సమయమున ఈయవలయును?. ఎవరు దానములు స్వీకరింపవచ్చును? ఇది యంతయు మాకు చెప్పుము.
సూతుడు చెప్పెను:-మహాపుణ్యప్రదమగు వేంకటాద్రి క్షేత్రమునందు అన్ని వర్ణములవారికి బ్రాహ్మణుడు గురువు. కనుక బుద్ధిమంతుడు అతడికి దానమిచ్చి తరించుచున్నాడు. బ్రాహ్మణుడు వర్ణము లేనివారివద్ద తప్ప మిగిలిన వారివద్ద దానము స్వీకరింపవచ్చును. నపుంసకునికి, పుత్రులు లేనివానికి, వంశాచారములను పాటించువానికి, వేదమును ద్వేషించువానికి, బ్రాహ్మణులను ద్వేషించువానికి. తన కర్మను వదిలి పెట్టినవానికి, ఇతరుల స్త్రీలను, ధనమును అనుభవించువానికి ఇచ్చు దానము నిష్ఫలమగును.
గాయకుడగు బ్రాహ్మణునికి ఇచ్చిన దానము, అసూయ చేత నిండిన మనస్సు కలవానికి, కృతఘ్నునికి, మాయచేయువానికి ఇచ్చిన దానము నిష్పలము. జ్ఞానము లేనివానికి, ఎప్పుడును యాచించువానికి హింసచేయువానికి, బలము లేనివానికి ఇచ్చిన దానము నిష్పలము. పేరును, వేదములను, స్మృతులను, ధర్మమును అమ్మువానికి . ఇతరులకు పీడ కలిగించువానికి ఇచ్చిన దానము నిష్ఫలము. ఎప్పుడును పాపకర్మలు చేయువానికి, మంచివారిచే నిందింపబడిన వానికి దానము ఈయరాదు, పుచ్చుకొనరాదు. సత్కర్మలు చేయువానికి, వేదములు చదివినవానికి, ఆహితాగ్నిని పోషించువానికి, వృత్తిలేనివానికి, దరిద్రునికి, కుటుంబము కలవానికి, దేవపూజలు చేయువానికి, పురాణములను చెప్పువానికి దానమునీయవలెను .
దరిద్రుడైన బ్రాహ్మణునికి ప్రయత్నించి దానమీయవలయును. ఇంత ఎందుకు? వినుడు . బ్రాహ్మణులందరకు ఎల్లప్పుడు దానమీయవచ్చును. గొడ్రాలి భర్తకు దానమిచ్చిన మానవుడు మరుజన్మలో గాడిదగా పుట్టును . నాస్తికునికి, మర్యాదను పాటించనివానికి, పుత్రులులేనివానికి, మూఢునికి, చెడ్డవానికి, దొంగతనము చేయువానికి, మోసము చేయువానికి ఎప్పుడును నమస్కరించరాదు . పాషండునికి, పతితునికి, ఉపనయనాదులులేని విప్రునికి, వేదమునమ్మువానికి, చేసినమేలు మరచువానికి పాపము చేయువానికి నమస్కరింపరాదు . స్నానము చేయుచున్నవానికి, సమిధలు, పుష్పములు తెచ్చుచున్నదానికి, నీటి కుండ తెచ్చుచున్నవానికి, కోపిష్టికి, కక్కుచున్నవానికి, జనసమూహములో ఉన్నవానికి, భిక్షాపాత్ర ధరించినవానికి, పడుకుని ఉన్నవానికి నమస్కరింపకూడదు .
గొడ్రాలికి, ఋతుమతికి, జారిణికి, ప్రసవించిన స్త్రీకి, గర్భస్రావమైన స్త్రీకి, వ్రతమును వదిలి పెట్టిన స్త్రీకి, కోపిష్టికి ఎప్పుడును నమస్కారము చేయకూడదు. సభయందు, యజ్ఞశాలయందు, దేవాలయమునందు ప్రత్యేకముగా ఏ వ్యక్తికీ నమస్కారము చేయరాదు. అట్లు చేసిన పూర్వము సంపాదించిన పుణ్యము నశించును. శ్రాద్ధము చేయువాని కొరకు నియుక్తుడైనవానికి, దేవాలయార్చకునికి, యజ్ఞము, తర్పణము చేయుచున్నవానికి నమస్కారము చేయరాదు. నమస్కరించినవానికి ప్రతినమస్కరింపకూడదు. అది అభివాదము కాదు. అట్లు చేసిన వాడు శూద్రునితో సమానుడు. కనుక అన్ని కాలములయందు బుద్ధిమంతుడు, బ్రాహ్మణులలో ఉత్తముడైనవాడు గొడ్రాలి భర్తకు, క్రూరునికి నమస్కారము చేయకూడదు.
అథాకాశగంగామాహాత్మ్యమ్
శ్రీ సూత ఉవాచ :
సూతుడు పలికెను :- పుణ్యశీలుడు అను ధీమంతుని కథను చెప్పెదను వినుడు. ఇది పూర్వము సనత్కుమారునికి నారదుడు చెప్పెను . ఆ కథ చెప్పెదను, సావధానులై వినుడు. పూర్వము గోదావరీ నదీతీరమునందు అన్ని ధర్మములు పాటించువాడు. అగు పుణ్యశీలుడు అను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడు సత్యమును పలు కువాడు. ఇంద్రియములను జయించినవాడు, అన్ని జీవులయందు దయగలవాడు, దేవతలను, అగ్నిని, విప్రులను పూజించువాడు . కర్మచేత పుట్టినప్పటినుండి పవిత్రుడు, తల్లిదండ్రుల హితము కోరువాడు, గురుభక్తి కలవాడు, కరుణ చూపువాడు, వేదము చదివినవాడు, మంచివారు మెచ్చువాడు. ఈ విధమైన సుగుణములు కలిగి ఉండెను ఆ పుణ్యశీలుడు.
పుణ్యశీలుడు గొడ్రాలిభర్తను పితృకార్యమునకు పిలచుటచేత గాడిదవంటి ముఖమునుపొందుట :- ఒకనాడు పిత్స శ్రాద్దము కొరకు ఆ పుణ్యశీలుడు వేద వేదాంగములు చదివిన ఒక బ్రాహ్మణుని తొందరపాటుతో ఆహ్వానించెను. వేదము చదివినవాడు, శాంతము కలవాడు అగు ఆ బ్రాహ్మణునితో పితృశ్రాద్ధమును పూర్తిచేసెను.
తరువాత కొంతకాలమునకు పుణ్యశీలుని ముఖమునందు వికృతి కలిగి అత్యుగ్రమైన గాడిద ముఖమును పొందెను . అపుడతడు మిక్కిలి చింతించి అగస్త్యముని వద్దకు వెళ్ళుటకు బయలుదేరెను. సువర్ణముఖి నదీ తీరమునందు, పెక్కుమంది ఋషులు నివసించుచున్నది. పరమ దివ్యమైనది, అన్ని కోరికలను తీర్చునది అగు అగస్త్యుని ఆశ్రమమును చేరెను. అచట ఆశ్రమమునందు మునివరులచే ఎల్లప్పుడు కొలువబడుచున్నవాడు, అన్ని లోకముల హితమును కోరువాడు, మహాత్ముడు అగు అగస్త్యుని చూచెను . గార్దభమువంటి ముఖమును పొందిన పుణ్యశీలుడు మిక్కిలి
దు:ఖముతో ఆ అగస్త్యునికి నమస్కారము చేసెను.
పుణ్యశీల ఉవాచ:
అగస్త్య ఉవాచ:
పుణ్యశీలుడు పలికెను :- తపోధనుడవు, మునిసేవితుడవు అగు అగస్త్య నీకు నమస్కారము. అసహ్యకరమైన ముఖమును పొందిన నన్ను రక్షింపుము. ఏ దోషము చేత నా ముఖమునందు వికారము కలిగినది?. మునులలో ఉత్తముడవగు మహానుభావ, నా యందు దయ ఉంచి చెప్పుము .
అగస్త్యుడు చెప్పెను :- విప్రవర్యుడగు ఓ పుణ్యశీల! నీ ముఖము వికృతమగుటకు కారణమును శ్రద్దగా వినుము .
గొడ్రాలి భర్తను శ్రాద్ధమునకు పిలువరాదని చెప్పుట :- నీ వొకసారి గుణములకు నిధి, వేదవేదాంగ పారగుడు, శ్రోత్రియుడు, పుత్రులులేనివాడు అగు బ్రాహ్మణుని శ్రాద్దమునకు పిలిచితివి. ఆ కారణముచేత నీ ముఖమునందు వికారము కలిగినది. గొడ్రాలి భర్తను హవ్యకవ్యములయందు నియోగించువారికి గాడిద ముఖము సంప్రాప్తించును. శుభకర్మలయందు, అశుభకర్మలయందు గొడ్రాలి భర్తను పిలువరాదు. గొడ్రాలి భర్తను కాని, బిడ్డలు పుట్టి చనిపోయిన స్త్రీ భర్తను కాని పిలువరాదు .
శ్రేయస్సును కోరువాడు వేదాదిశాస్త్రములను చదివినప్పటికీ, మంచి కులమునందు పుట్టినప్పటికీ, కర్మలను చేయువాడైనప్పటికి గొడ్రాలి భర్తను ఎట్టి పరిస్థితిలోను శ్రాద్దమునందు నియోగింపడు. జ్యోతిప్టోమము మొదలైన యజ్ఞములయందు, వ్రతములందు, తపస్సునందు సమర్థుడైనప్పటికి గొడ్రాలిభర్తను పిలువరాదు. సత్పుత్రుడగు విప్రుడు లభింపనిచో, కేవలం బ్రాహ్మణుని, పుత్రులున్న వానిని, సదాచార సంపన్నుని పిలువ వచ్చును. అతడు లభింపనిచో పుత్రునికాని సోదరునికాని నియోగింపవచ్చును. వారు కూడ లేనిచో తనను తానే నియోగింపకొనవచ్చును, కానీ గొడ్రాలి భర్తను పిలువరాదు. అటువంటి వానిని ఉద్దృత్యభుజుడు అని అందురు. కనుక ఎప్పుడును గొడ్రాలిభర్తను పిలువకూడదు. పిలిచినవాడు నరకమునకు పోవును.
ఆకాశగంగయందు స్నానము చేయుటవలన పుణ్యశీలుని వికృతి పోవుట :- ఇంత చెప్పుట ఏల? ఆ దోషము పోవుటకు ఉపాయమును చెప్పెదను వినుము. స్వర్ణముఖీ నదీతీరమునందు దేవతలచే పూజింపబడు వేంకటాద్రి కలదు. అది మేరువు సంతానము, మహాపుణ్యము, అన్ని కోరికలను తీర్చునది . ఆ వేంకటాద్రిపై మహత్తరమగు ఆకాశగంగ అను తీర్థమున్నది -53. ఆ తీర్థము అన్ని పాపములను నశింపజేయునది, ఆయుష్షును ఆరోగ్యమును పెంపొందించునది. కనుక నీవు వేంకటాద్రికి వెళ్ళి అచట స్వామి పుష్కరిణియందు సంకల్పముతో స్నానముచేసి, ఆకాశగంగ తీర్థమునకు వెళ్ళి విధివిధానముగ అచట స్నానము చేయుము. అచట స్నానము చేసినంతనే నీ ముఖమునందున్న వైరూప్యము తొలగిపోవును. దీనియందు సందేహము లేదు.
ఇతి శ్రీ స్కాందే మహాపురాణఏకాశీతిసాహస్యాం సంహితాయాం ద్వితీయే వైష్ణవఖండే శ్రీ వేంకటాచలమాహాత్మే ఆకాశగంగా మాహాత్మ్యవర్ణనం నామ ద్వావింశతితమోఽధ్యాయః
ఈ విధముగా మహాత్ముడగు అగస్త్యునిచే బోధింపబడిన పుణ్యశీలుడు మునికి నమస్కరించి వేంకటాద్రికి వెళ్ళేను. అచటకు వెళ్ళి స్వామి పుష్కరిణియందు నియమ పూర్వకముగా స్నానము చేసి ఆకాశగంగ వద్దకు వెళ్ళెను -58. అచట స్నానము చేయుట చేత పుణ్యశీలునికి వికృతమగు ముఖము పోయి మన్మథునికి మించిన ముఖము కలిగెను. అహో ఆ తీర్థముయొక్క వైభవమెట్టిదో కదా?.
సూతుడు చెప్పెము :- ఈ విధముగ మీకు నారదుడు సనత్కుమారునకు చెప్పిన కథను చెప్పితిని .
ఎనభై ఒక్కవేల శ్లోకములు గల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున ఆకాశగంగా మాహాత్మ్యముయొక్క వర్ణనము అను ఇరవై రెండవ అధ్యాయము.
