స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

36వ అధ్యాయము

భరద్వాజుడు చెప్పెను:- పూర్వము బ్రహ్మకు ఒక రాత్రి గడచిన తరువాత విష్ణువు నిద్ర లేచి తిరిగి జీవులను సృష్టింప తలపెట్టిను. కాని భూమి మాత్రమే జీవులందరిని మోయగలిగినది అని నిశ్చయించుకొని ఆమె కొరకు చూచెను. తన యోగ దృష్టితో భూమి పాలాల లోకమున నీట మునిగి ఉండుట చూచెను. ఆమె మిక్కిలి భయపడుచున్నదై, చుట్టూర నీటితో నిండి ఉండెను. అపుడామెను ఉద్దరించుటకు తగివ రూపమును ధరించేను. ఉపాకరణమను యజ్ఞ విధానమే పేదవిగా కలది. అగ్నియే నాలుకగా కలది, ఓంకారమే ఘోషగా కలది. నాలు వేదములు పాదములుగా కలది. ప్రాయశ్చిత్తమే గిట్టలుగా కలది. ప్రాగ్వంశమను యజ్ఞమే శరీరముగా కలది. దర్భలే రోమములుగా కలది. ప్రవర్యమే సుడిగా కలది, దక్షిణాగ్నియే ఉదరముగా కలది. సుక్కులే ముఖముగా కలది. సకల వేదాంగములే సంధిగా కలది. దివ్యసూక్తములే జడలుగా కలది, పరబ్రహ్మమే శిరస్సుగా కలది, హవ్యము, కవ్యమే వేగముగా కలది. పవిత్రమగు యజ్ఞపశువే మోకాటిగా కలది. ఉక్త, అత్యుక్త మున్నగు ఛందస్సులే బలముగా కలది. అన్ని యజ్ఞముల సారరూపమైనది. దివ్యమైనది అగు వరాహరూపమును పొందెను.

 అట్టి వరాహ రూపమును ధరించి సముద్రపు నీటిలోనికి తెల్లని కోరలు చంద్రరేఖల వలె మెరయుచుండగా ప్రవేశించెను. కల్పాంత సమయమునందు దట్టముగా అలముకొన్న చీకటిని పారద్రోలుచు, సముద్రమును మించిన చప్పుడుచే బ్రహ్మాండమను గుహను రంకెలతో నింపివేయుచు. ఆదిశేషుని ఇటు అటు కదపి వేయుచు, సముద్రము యొక్క లోపలి భాగమును తీవ్రమగు నిట్టూర్పులచే కదిలించుచు. పాతాలపు అడుగు భాగమును చేరి పొడవైన ముట్టెతో నీట మునిగి సముద్రములోని నీటినంతటిని అల్లకల్లోలము చేయుచు ఏడు అధోలోకములకు అడుగున భయపడుచు ఉన్నది. వణకుచున్నది అగు భూమిని చూసి మిక్కిలి ఆనందించి తన కోరలపై ఎత్తికొని సముద్రమునుండి బయటకు వచ్చేను. మునులందరు స్తుతించుచుండగా, జనలోకమున నివసించువారు ప్రశంసించుచుండగా, భూదేవిని ప్రేమతో ఎత్తి తీసుకొని వచ్చెను.

 ఆ విధముగా వచ్చుచున్న భూమి సముద్ర జలముల నుండి బయటకు వచ్చినంతనే ఆ సముద్రమునకు ఆభరణమువలె తోచెను. సముద్రము చేయుచున్న గంభీరమగు తరంగ శబ్దములే మంగళ వాద్యములు కాగా, పైకి లేచి విరిగి పడుతున్న కేరటముల నుండి బయటకు వచ్చుచున్న సన్నని నీటి తుంపరయే ముత్యములతో చేసిన మంగళాక్షతలు కాగా, నీటి స్నానము చేసిన ఆ భూదేవిని వరాహస్వామి సముద్రము నుండి పైకి తీసుకువచ్చెను. భూదేవి శరీరముపై ఉన్న నీటి చుక్కలు ఆమెకు స్వామిపై గల అనురాగమువల్ల జనించిన స్వేద బిందువులవలె ప్రకాశించుచుండగా స్వామి ఆమెను పాతాళము నుండి ఉద్దరించెను. పిమ్మట ఆమెను సముద్రజలములపై స్థిరముగ నిల్పెను. భూమి అంతట జలముతో నిండెను.

పిమ్మట స్వామి ఆ నీటిని నియమించి భూమిని స్థిరముగ నీలిపి, ఆధారము కొరకు దిగ్గజములను, ఆదిశేషుని, ఆది కూర్మమును నిలపెను. వారందరికి ఆధారముగా దయతో అవ్యక్తమగు తన శక్తిని సహాయముగా ఉంచేను. జనలోకమునందు నివసించు సనకాది మునులందరు వరాహ రూపమున ఉన్న పురుషోత్తముడగు స్వామిని స్తుతించిరి. స్వామి ఆజ్ఞపై బ్రహ్మ ఈ లోకమును పూర్వమునందున్నట్లే తిరిగి సృష్టించెను.

            అర్జునుడు అడిగేను:- కల్పాంతకాలమునందు నీట మునిగిన భూమి ఎట్లు నిలచేను. ఏడవదైన పాతాలమను అధోలోకమునందు భూమికి ఆధారమేది? కల్పకాల మనునది ఎంత? అది ఎట్లుండును?.

భరద్వాజుడు చెప్పెను:- అరవై వినాడికల కాలము ఒక నాడిక అగును. అట్టి ఆరవై నాడికలు ఒక దీనమగును. అట్టి దినములు ముప్పై ఒక మాసమగును. దాని యందు రెండు పక్షములు ఉండును. రెండు మాసములు ఒక ఋతువు అట్టి ఆరు ఋతువులు ఒక సంవత్సరము, దానీ యందు రెండు అయనములు. శీత, వర, ఉష్ణ కాలములు ఉండును. పగలు దేవతలకు రాత్రి రాక్షసులకు నెలవు. సూర్యుడు పంచరించు ఉత్తరాయణము, దక్షిణాయనము క్రమముగా వారికి

ఇట్టి సంవత్సరములు 432000 కృత, త్రేతా, ద్వాపర, కలియుగములు కలసిన ఒక మహాయుగమగును. అటువంటి డెబై మహాయుగములు ఒక మన్వంతరమగును. ఈ శ్వేత వరాహకల్పమునందు పుట్టిన మనువులను గూర్చి వినుము. ముందుగా స్వాయంభువ మనువు, పిమ్మట స్వారోచిషుడు తరువాత ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు. అను ఆరుగురు మనువులు ఇంద్రుడు, దేవతలు, తాపసులు మున్నగువారితో కూడ గతించిరి. ఇప్పుడు ఏడవ మనవగు వైవస్వతుడు కలడు. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు మున్నగువారు ఈ మనుకాలమునందు దేవతాగణములు తేజస్వి వంద ఆశ్వమేథయాగములు చేసి ఇంద్రత్వమును పొందేను.

విశ్వామిత్రుడు, నేను (భరద్వాజుడు), ఆత్రి, జమదగ్ని, కశ్యపుడు, వసిష్టుడు, గౌతముడు సప్తర్షులు. ఇక్ష్వాకు మొదలైన మనువు సంతానము ధర్మపరాయణులై ఈ భూమిని పరిపాలించిరి. సూర్యుడు, దక్షుడు, బ్రహ్మ, యముడు, రుద్రుడు అను వారి అయిదుగురు కుమారులు, సావర్ణ, రొచ్యుడు, భౌమ్యుడు మొదలైన వారు ఏడుగురు మనువులు భవిష్యత్తులో రాగలరు. పధ్నాలుగు మంది మనువుల కాలము బ్రహ్మకు ఒక పగటి కాలము దానికి కల్పమని పేరు. అది ముగిసిన తరువాత అంతే కాలము రాత్రి అగును. బ్రహ్మకు పగటి సమయము ముగిసిన తరువాత భయంకరమగు ప్రళయము భూమికి నూరు సంవత్సరముల పాటు కలుగును.

ఆ ప్రళయమందు నీరంతయు ఇంకిపోవును. నాలుగు విధములైన భూతములు క్షయమును పొందును. అపుడు ఎండవేడిమి కాలుతున్న అగ్నిజ్వాలలవలె అగ్ని కిరణములను ప్రసరింపజేయుచు నిప్పులు కక్కును. గ్రామములు, నగరములు, కొండలు, చెట్లు, అడవులు అన్నియు నశించి భూమి కాల్చిన ఇనుపగుండువలె ఎర్రగా మారిపోవును. అపుడు బ్రహ్మ శరీరమునుండి పుట్టిన గొప్ప మేఘములు ఆకాశమును కప్పి వేయుచు ఉరుముచుండును. తెల్లని, పచ్చని, ఎర్రని నల్లని, పలు విధములైన రంగులు కలిసి భయంకరమైన కొండలు, ఏనుగులు, భవంతులు, చెట్లు మున్నగు పలురూపములను ధరించును. అవి నూరేండ్లు గొప్పవర్షమును కురిపించును. దానిచే సూర్యునినుండి పుట్టిన మహాన్ని

మరల నూరేండ్లు ఆ మేఘములు వర్షము కురిపించుమ. ఆ నీటిచే సముద్రములు నిండి పొంగి పొరలును. కల్పాంతకాలమునందు మేఘముల నుండి వచ్చిన నీటిచే లోకములన్నియు నిండిపోవును. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము చీకటిచే కప్పబడును. అపుడు భూమి పాతాళమునందు నీట మునిగి ఉండును, బ్రహ్మయొక్క అజ్ఞాతశక్తిచే భూమి నశింపక నిలచును. ఆపుడు బ్రహ్మయొక్క నిశ్వాసమునుండి వాయువు పుట్టును. ఆ వాయువు కల్పాంత కాలమునందు పుట్టిన మేఘములను చెదరగొట్టును. ఈ విధముగా ఆ వాయువు నూరేండ్లు వీచును. విష్ణువు నాభి నుండి పుట్టిన బ్రహ్మ ఆ వాయువును అణచును.

ఆ నీటి యందు బ్రహ్మ యోగనిద్రను పొందును. అట్లు నిద్రించిన బ్రహ్మకు పగటి సమయమంత రాత్రికాలము గడచును. రాత్రి గడచిపోగా బ్రహ్మమేల్కాంచి తిరిగి వేగముగా సమస్త జీవజాలమును సృష్టించును. విష్ణువు లోకములను రక్షించుటకై ఒక్కొక్క కల్పమునందు ఒక్కొక్క రూపమును పొందును. ఈ కల్పమునందు తెల్లని రంగు కలిగిన వరాహరూపమును పొందెను. ఆ రూపముతో భూమి పై సంచరించుచుండును. అట్లు సంచరించుచు పూర్వము తన నివాసమైన వేంకటాద్రికి చేరి స్వామి పుష్కరిణీ తీరమునందు చరించుచుండును.

పరమ భక్తితో బ్రహ్మ స్వామికి నమస్కరించి జీవులందరికి కారణభూతుడగు ఆతడికి నమస్కరించి ఇట్లు ప్రార్థించెను. ఓ స్వామీ! పూర్వమున్న నీ నిజరూపమును ప్రదర్శింపుము అని ప్రార్థింపగా శాంతించి వరాహరూపమును వదిలి పెట్టెను. సమస్త జనులచే పూజింపబడునట్టిది. ఆ జగత్తుకు ఆత్మ అయినటువంటిది ఆయిన రూపమును పొందెను. ఆ విధముగా అచట నిలచిన రూపమును ఉత్సాహముతో ఎంత కాలము చూసిననూ పూర్తిగా చూచుటకు శక్యము కాదు.

అర్జునుడు అడిగెను:- స్వామిని చూచుటకు గాని, తలచుటకుగాని శక్యముకాదు కదా! అటువంటి స్వామి మానవులకు కనిపించు రూపమును పొందుట ఎట్లు సాధ్యపడినది. ప్రపంచమునకు ఇట్టి భాగ్యమును కలిగించిన ఆ పుణ్యాత్ముడెవరు, అతడెట్లు స్వామిని ఇచట ప్రత్యక్షము చేసికొనెను. చెప్పవలసినది. విష్ణు సంబంధీ కథలను వినుట వలన అన్ని పాపములు నశించును, నీవు అన్ని ఆగమములు తెలిసినవాడవు. పుణ్యాత్ములలో అగ్రగణ్యుడగు అగు అవకాశము నాకిట్లు లభించినది.

ఇది ఎనభై ఒక్క వేల శ్లోకములు కలిగిన శ్రీ స్కాంద మహాపురాణము నందు రెండవదగు వైష్ణవ ఖండమందు శ్రీవేంకటాచలమాహాత్మ్యమునందు సువర్ణముఖిరి ప్రశంసయందు వరాహావతార వర్ణనము అను ముప్పై ఆరవ అధ్యాయము.