స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

10వ అధ్యాయము

శుకుడు చెప్పెను:- ఓ రాజా, ఈ పద్మ సరోవరము పాపమును నాశనము చేయును. దీని గురించి తలచినను, కొనియాడినను, స్నానము చేసినను మానవులకు సంపదలు కలుగును. కనుక నీవు కూడ ఈ సరస్సులో స్నానము చేసి నీ తండ్రి వద్దకు వెళ్లుము. వరాహస్వామి చెప్పెను. అని చెప్పిన శుకుని మాటలను విని పద్మసరస్సులో స్నానం చేసెను. శుకునికి నమస్కరించి తొండమానుడు తన నగరమునకు వెళ్లాను. అతడి తండ్రి తొండమానుని యువరాజుగా చేసి మూడు సంవత్సరములపాటు ప్రజలకు అతడి పట్ల గల రంజకత్వమును, సామర్థ్యమును, శౌర్యమును, వీరత్వమును, సౌశీల్యమును, బ్రాహ్మణులయందు అతడికి గల భక్తిని చూచి మంత్రులతో కలసి ఆలోచించి తన స్థానములో విధిపూర్వకముగ అభిషేకించెను. తరువాత కుమారునికి నచ్చచెప్పి భార్యతో కలసి అడవికి వెళ్లాను.

 వసువు పుట్టయందు వరాహస్వామిని చూచుట:- తొండమానుడు ఆ విధముగా తండ్రి నుండి రాజ్యమును పొంది పరిపాలించుచుండెను. బోయవాని పొలములో స్వామి వరాహరూపమును పొందెను. పండిన చామలను రాత్రివేళలో తిని పొలములో సంచరించు చుండెను. బోయవాడు పగటి సమయమందు ఆ వరాహపు అడుగుల గుర్తులను వెదికి, అది కనబకపోవుటచే రాత్రివేళ ధనస్సు ధరించి వేచి యుండెను. అపుడు కోటిచంద్రుల కాంతితో పొలములో తిరుగాడుచున్న వరాహమును చూచెను. చక్కని రూపముతో ప్రకాశించుచున్న ఆ వరాహమును చామల పొలములో చూచి ధనస్సు చేతిలోకి తీసుకుని సింహనాథము చేసెను. వరాహము ఆ ధ్వనిని విని పొలమునుండి బయటకు రాగా బోయవాడు వెంబడించెను. చంద్రునితో సమాన కాంతి కలిగిన ఆ వరాహమును మిగిలిన రాత్రి అంత వెంబడించి పుట్టలోకి ప్రవేశించుచుండగా చూచెను. పౌర్ణమినాటి చంద్రుడు అస్తమించుట చూచి ఆశ్చర్యపడి ఆ బోయవాడు కోపముతో పుట్టను త్రవ్వేను. ఆ పుట్టయందు వరాహమును చూచి బోయవాడు మూర్చపోయెను. అది చూచి బోయవాని పుత్రుడు వరాహస్వామిని స్తుతించెను. స్వామి సంతోషించి బోయవాని పై ఆవహించి ఇట్లు పలికెను.

 స్వామి పలికెను:- నేను వరాహస్వామిని, ఎల్లప్పుడు ఈ పుట్టయందే నివసించుదును. కనుక ఓ రాజా, నన్నిచట ప్రతిష్ఠించి పూజింపుము. పుట్టను సల్లఆవు పాలతో శుద్ధి చేసి దాని నుండి పైకి వచ్చిన రాతిపై భూమి పై ఉన్న వరాహమును ప్రతిష్ఠించి, బ్రాహ్మణుల చేత, వైఖానసుల చేత పలు భోగముల చేత తొండమాను మహారాజు నన్ను పూజింపవలెను. అని పలికి స్వామి బోయవానిని విడచి పెట్టగ అతడు తిరగి స్వస్థుడయ్యెను. బోయవాడు సుఖముగా కూర్చున్న తరువాత బోయవాని కుమారుడు తండ్రితో జరిగినదంతయు చెప్పెను. అది విని అతడు ఆశ్చర్యపడి కుమారుడు చెప్పినదంతయు శుభము కలిగించునని భావించెను.

అథ తొండమన్నపాయ వసునివేదిత వారాహూదంత:

 వరాహస్వామిని గూర్చి వసువు చెప్పిన దానిని బోయవాడు తొండమానునికి చెప్పుట:- ఆ విషయమును రాజుకు చెప్పుటకు బోయవాడు తన అనుచరులతో కలసి తొండమానుని వద్దకు బయలుదేరి రాజద్వారమును చేరుకొనెను. రాజు అతడిని తీసుకురమ్మని ద్వారపాలురకు చెప్పి మంత్రులతో కూడి ఉన్న సభలోనికి ఆ బోయవానిని ఆహ్వానించెను. వచ్చిన ఆ వస్తువును అతడి కుమారుని, పరివారమును సత్కరించి ప్రీతితో ఆ వనేచరుడిని రాకకు కారణమడిగెను. వసువు చెప్పెను: ఓ రాజా! వినుము, అడవి యందు ఆశ్చర్యకరమైన సంఘటన చూచితిని. ఒక తెల్లని వరాహము మా చామల చేనిలో సంచరించుచుండెను. దానిని పట్టుకొనుటకై నేను విల్లు తీసుకుని వెంబడించితిని. నేను వెంటాడగా అది వాయువేగంతో పరుగు పెట్టి స్వామి పుష్కరిణి తీరంలో ఉన్న ఒక పుట్టలోకి ప్రవేశించెను. కోపముతో ఆ పుట్టను తవ్వగా మూర్చపోయి నేలపై పడగా ఈ నా కుమారుడు అక్కడకు వచ్చి పడి నన్ను చూచెను. శుచియై దేవదేవుడైన మధుసూదనుని స్తుతించెను. అపుడు స్వామి నాపై పూని ఈ విధముగా పలికెను.

 ఓ నిషాదపా, నా విషయమును రాజుకు నివేదించుము. రాజు ఇచటకు వచ్చి నల్లఆవు పాలతో ఈ పుట్టను శుభ్రము చేయవలయును. అపుడచట చక్కని ఆకారముగల ఒక రాయి కనిపించును. దానితో పుట్టలో ఉన్నట్లుగా వరాహముఖముతో నా రూపమును శిల్పులచేత చెక్కించవలెను. దానిని మునీశ్వరులచేత, వైఖానసమునుల చేత ప్రతిష్ఠ చేయించి తొండమానుడు కొలువ వలెను. తరువాత పాదముల వరకు పుట్టను కలిగిన శ్రీనివాసుని వద్దకు వెళ్లి కపిల వర్ణము కృష్ణ వర్ణము కలిగిన ఆవుల పాలతో అభిషేకింపవలెను. పాద పీఠము వరకు ప్రతిదినము కడుగవలెను. అట్లే ఉత్తర దక్షిణముల యందు ప్రాకారములను నిర్మింపవలేను. అని పలికి స్వామి నన్ను వదిలి పెట్టెను. నేను స్వస్థుడనయితిని. ఓ రాజా! దేవదేవుడైన ఆ స్వామి కోరిన దానిని నీకు చెప్పుటకై నేనిచటకు వచ్చితిని.

అథ నృపస్య నిషాదవాక్య స్వప్నాభ్యాం బిలమార్గేణ శేషాచలగమనమ్:

వరాహస్వామి చెప్పెను:- అది విని తొండమానుడు మిక్కిలి విస్మయము చెంది ఆనందించెను. తరువాత పుష్కరుడు మొదలైన మంత్రులతో కలసి చేయవలసిన దానిని గూర్చి చర్చించెను. వేంకటాద్రికి రాగోరిన పశువుల కాపరులను అన్ని దిక్కుల నుండి రావించి నల్లావులను, పుల్లావులను వాటి దూడలతో సహా వేంకటాద్రి వద్దకు తీసుకురావలసిందిగా ఆజ్ఞాపించెను. రేపే యాత్ర ప్రారంభమగునని గోపాలకులకు చెప్పి మంత్రులను పంపివేసి ప్రజలందరినీ వదలి పెట్టి అంతఃపురమున ప్రవేశించెను. అచట తన భార్యలకు జరిగినదంతయు చెప్పి ఆ రాత్రికి నిదురించెను. కలలో శ్రీనివాసుడు కనిపించి బిలమార్గమును చూపించెను. తొండమానుడి పురము నుండి బిలద్వారము వరకు చిగురుటాకులను పరచి దారి చూపెను. ఆ కలను చూచి రాజు ఉదయమే లేచి మంత్రులను, ప్రజలను, బ్రాహ్మణులను పిలిపించెను. వారికి తన కలను వివరించి ద్వారము వద్ద చూడగా చిగురాకులు కనిపించెను. తరువాత ఒక శుభముహూర్తమున తొండమానుడు అశ్వమునధిరోహించి బయలు దేరెను. దారి అంతట చిగురాకులను చూచుచు నెమ్మదిగా బిలద్వారమును చేరి ఆశ్చర్యపడి అచట ఒక పత్తనమును నిర్మించెను.

 స్వామి చెప్పిన విధముగా తొండమానుడు పాలతో అభిషేకించి కోటను కట్టుట:- అంతఃపురమునందు బిలము చేసి ప్రాకారమును కూడ కట్టించెను. త్రికోట యందే నివసించుచు భూమి నంతటిని జయించెను. దేవదేవుడు చెప్పిన విధముగానే పాలతో ప్రక్షాలనము మొదలైనవి రాజును చింత చెట్టు, సంపెంగ చెట్టును కాపాడుటకు ఆజ్ఞాపించెను. ఈ చింత చెట్టు నాకు స్థానమైనది, సంపెంగ చెట్టు లక్ష్మీదేవికి స్థానమైనది. కనుక వీటికి రాజులు ఋషులు, దేవతలు, మానవులు అందరు నమస్కరించవలెను. వీటిని సంరక్షించుచు మిగిలిన చెట్లను కొట్టివేసి ద్వారము గోపురముతో కూడుకున్న ప్రాకారమును నిర్మింపుము. విమానము మాత్రము మీ వంశమునకు చెందిన నారాయణుడు అను రాజు నా భక్తుడై నిర్మించి బంగారముతో అలంకరింపగలడు. వరాహస్వామి చెప్పెను. అని శ్రీనివాసుడు తొండమానునికి చెప్పెను. ఆ విధముగా స్వామి చెప్పిన మాటలను విని ప్రాకారమును నిర్మించి వైఖానస వంశములో జన్మించిన మునిపుంగవులతో కలసి స్వామిని అర్చించెను. ప్రతి దినము బిలమార్గము ద్వారా స్వామి వద్దకు వచ్చి అర్చించి రాజ్యమును ధర్మముతో పరిపాలించి సకల భోగములను అనుభవించెను.

 గంగా స్నానమునకు వెళ్లుచున్న వీరశర్మ అను బ్రాహ్మణుని చరిత్రము:- ఆ కాలమునందు దక్షిణ దేశమునందున్న ఒక బ్రాహ్మణుడు తన భార్యతో కలసి గంగానదిలో స్నానము చేయుటకు వెళ్లుచుండెను. మార్గమధ్యమున బ్రాహ్మణుని భార్య గర్భవతి అయ్యెను. అపుడామె ప్రయాణము చేయుటయందు అశక్తురాలై ఉండుట గమనించి రాజును చూడగోరి రాజద్వారము వద్దకు వచ్చెను. ఆ బ్రాహ్మణుని లోనికి తీసుకు వచ్చుటకు ద్వారపాలకుని ఆజ్ఞాపించి ఆ బ్రాహ్మణుని విధిపూర్వకముగా అర్చించి కుశల మడిగెను. రాజు పలికెను. నీ రాకకు కారణమేమిటి? నేనేమి చేయగలను అని బ్రాహ్మణుడు పలికెను. ఓ రాజోత్తమా, నేను సామవేదనమును చదివిన వాడను, వసిష్ఠుని వంశమునకు చెందిన వీరశర్మ అనువాడను. ఓ రాజా! గంగానదియందు స్నానము చేయుటకై భార్యతో కలసి బయలు దేరితిని. కౌశిక గోత్రమునకు చెందిన పుణ్యవతి అయిన నా భార్య గర్భవతి అయ్యెను. పతివ్రత, సుశీల అయిన ఈమె పేరు లక్ష్మి. ఈమెను మీ ఇంటి యందుంచి నేను పోయివచ్చెదను. కనుక ఓ రాజా ఈమెకు కావలసినంత భోజనమును, జీవనాధారమును సమకూర్చుము. నేను తిరిగి వచ్చు వరకు ఈమెను రక్షింపుము.

 వరాహస్వామి చెప్పెను:- రాజు అతని మాటలను విని ధాన్యము, ధనము ఇచ్చి ఆరు మాసముల పాటు అంతఃపురము నందు నివాసము కల్పించెను. బ్రాహ్మణుడు రాజుకు నమస్కరించి, సంతోషంతో గంగాస్నానము కొరకు బయలుదేరి వెళ్లాను. ముందు భాగీరథికి వెళ్లి ప్రయాగ క్షేత్రమందు స్నానము చేసెను. తరువాత కాశీకి వెళ్లి అచట మూడు దినములుండి గయకు వెళ్లి అచటి పితృశ్రాద్దమును పూర్తి చేసెను. తరువాత అయోధ్యకు వెళ్లి అచటి నుండి బదరీ వనమునకు వెళ్లాను. సాలగ్రామమును చూచి తన దేశమునకు వెళ్లుటకు తిరుగు ప్రయాణము ప్రారంభించేను. రెండు సంవత్సరములు గడచిన తరువాత చైత్రమాసము నందు ఒక శుభ దినమున ఆ ద్విజశ్రేషుడు తిరిగి వచ్చెను, వసంత ఋతువునందు శుక్లపక్ష ఏకాదశినాడు తిరిగి రాజు వద్దకు వచ్చెను. కాశీరాజు అతడిని మరచిపోయి బ్రాహ్మణుని భార్యను గుర్తు తెచ్చుకొనలేకపోయెను. బ్రాహ్మణుని భార్య అప్పటికి మరణించి శుష్కించెను. వీరశర్మ తాను గంగానది నుండి తీసుకు వచ్చిన కమండలును నుండి ముడి విప్పి గంగనీటితో నిండిన ఒక చిన్న కాయను రాజుకిచ్చి నా భార్య కుశలముగా ఉన్నదా? అని అడిగెను. అప్పుడు రాజు గుర్తుకు తెచ్చుకుని బ్రాహ్మణుని వేచియుండుమని చెప్పి తాను అంతఃపురమునకు వెళ్లి మరణించిన బ్రాహ్మణిని చూచెను. బ్రాహ్మణునికి ఆ విషయమును చెప్పక బిలమునందు ప్రవేశించి శ్రీనృసింహస్వామికి నమస్కరించి, తిరిగి బిలమునందు మరికొంత దూరము వెళ్లి శ్రీదేవి భూదేవులతో కలసిఉన్న శ్రీనివాసుని దర్శించెను. త్వరత్వరగా వచ్చుచున్న వానిని చూచి అతడు నమస్కరించిన తరువాత స్వామి ఓ రాజా, అకాలమునందు ఇట్లు వచ్చితివేల అని ప్రశ్నించెను. రాజు మిక్కిలి భీతి చెందినవాడై బ్రాహ్మణి మరణించుటను వివరించెను.

 అస్థిసరోవర మాహాత్మ్యము:-అది విని స్వామి రాజుతో ఇట్లనెను. ఓ రాజా భయపడకుము. నీ స్త్రీలతో కలపి ఆ బ్రాహ్మణుని భార్యను పల్లకిలో ఎక్కించుము. నా ఆలయమునకు పూర్మమునందున్న అస్థి సరోవరము నందు ద్వాదశినాడు స్నానము చేయింపుము. ఆ సరోవరము అపమృత్యువును నివారించును. ఆమె తిరిగి బ్రతుకగలదు, స్త్రీలతో కలిసి ఆమెను బ్రాహ్మణుని వద్దకు చేర్చుము. నీవు త్వరగా వెళ్లి నేను చెప్పినట్లు చేయుము. అని స్వామి చెప్పగా రాజు వెంటనే ఇంటికి వెళ్లాను. అందమైన పల్లకీల యందు తన స్త్రీలతో పాటు బ్రాహ్మణ స్త్రీని కూడ కూర్చుండ చేసెను. బ్రాహ్మణునితో కలసి స్వామిని దర్శించుటకు బయలుదేరెను. స్త్రీలందరు అస్థి సరోవరమును చేరి బ్రాహ్మణ

స్త్రీ శరీరమునకు స్నానము చేయించిరి. చర్మము, ఎముకలు మాత్రమే మిగిలినప్పటికీ ఆ శరీరము సరోవరమునందుంచబడినదై తిరిగి ప్రాణములు పొంది పూర్వము వలె వన్నె గల శరీరమును పొందెను. సరస్సు నుండి రాణులతో కలసి బయటకు వచ్చి తిరిగి వచ్చిన భర్తను చేరుకొనెను.

 రాజు స్వామిని పూజించి బ్రాహ్మణునికి వేయి నిష్కముల ధనమును, వివిధములైన వస్త్రములను ఇచ్చేను. తరువాత ఆ బ్రాహ్మణుని అతని దేశమునకు వెళ్లుటకు ఏర్పాటు చేసెను. ఆ బ్రాహ్మణుడు స్త్రీ వృత్తాంతమును విని, స్వామి ప్రభావమును తెలిసికొనెను. రాజును ఆశీర్వదించి తన దేశమునకు వెళ్లిపోయేను. బ్రాహ్మణుడు వెళ్లిన తరువాత స్వామి రాజుతో ఇట్లనెను. ప్రతిదినము మధ్యాహ్న నైవేద్యము అయిన పిదప నా వద్దకు వచ్చి బంగారు కమలములతో ఇచ్చానుసారముగా నన్ను అర్చింపుము. నీ నగరమునకు వెళ్లి నీ ధర్మము ననుసరించి రాజ్యమును పరిపాలింపుము. నీవు కోరినవన్నీ ఏ సంశయము లేక లభించును. కాని సమయము కాని సమయమున నీవు ఎప్పుడును ఇచటకు రారాదు. కాలానుగుణముగా పూజ చేయుచు నీ నగరమునందే నివసింపుము.

రాజు పలికెను: ఓ దేవేశ! నీవు చెప్పినట్లే మధ్యాహ్న సమయమునందే నిన్నర్చింతును అని పలికి స్వామి చెప్పినట్లే బంగారు కమలములతో స్వామిని అర్చించుచుండెను. ఒకనాడు ఆ బంగారు కమలములపై మట్టి అంటిన ఒక తులసీ పుష్పమును రాజు చూచెను.

 కుర్వ గ్రామమునందు నివసించు కుండలు చేయు భీముడను వాని వృత్తాంతము:- రాజు చాలా విస్మయము చెంది దేవదేవుని అడిగెను. రాజు అడిగెను: ఓ దేవా మట్టి అంటిన ఈ కమలములచేత, తులసీ పుష్పములచేత ఎవరు నిన్ను అర్చించుచున్నారు. రాజు ఆ విధముగా అడుగగా స్వామి ఇట్లనెను. కుర్వ గ్రామమునందు ఒక కుమ్మరి నివసించుచున్నాడు. అతడు తన ఇంటి యందే ఉండి నన్నర్చించును. ఆ పూజను నేను అంగీకరింతును అని చెప్పగా రాజు ఆ కుమ్మరిని చూచుటకు వెళ్లాను. కుర్వ గ్రామమునకు వెళ్లి ఆ కుమ్మరి ఇంటికి వెళ్లాను. రాజు వచ్చుట చూచి నమస్కరించి ఎదుట నిలబడేను. ఎదురుగా నిలచిన ఆ భీముని రాజు అడిగెను. తొండమానుడు అడిగేను: ఓ భీమా! స్వామిని నీవు ఎట్లు పూజించుచున్నావు?.

వరాహస్వామి చెప్పెను: ఓ రాజా నాకు అర్చించుట అనగా ఏమో తెలియదు. నేను అర్చించుచున్నానని ఎవరు చెప్పిరి. తొండమానుడు చెప్పెను: సాక్షాత్తు స్వామి అయిన శ్రీనివాసుడే చేప్పెను. అది విని ఆ కుమ్మరి పూర్వము స్వామి తనకిచ్చిన వరమును తలచుకొనెను.

భీముడు చెప్పెను: నా పూజ గూర్చి ఎప్పుడు తెలియునో, ఎప్పుడు రాజు తొండమానుడు వచ్చి సంభాషించునో అప్పుడు మోక్షమును పొందుదువు. అని స్వామీ వరమిచ్చెను.

కుర్వగ్రామమునందు నివసించు భీముడను భక్తుడు భార్యతో కలసి వైకుంఠమును పొందుట:- ఆని ఆ కుమ్మరి చేప్పుచుండగనే ఒక దివ్య విమానము స్వామితో కలసి వచ్చెను. అతడు స్వామికి నమస్కరించి ఆ భక్తుడు భార్యతో కలసి ప్రాణములను విడచి పెట్టి, తొండమానుడు చూచుచుండగనే విమానము నెక్కెను. తన భార్యతో కలసి దివ్యరూపమును ధరించి వైకుంఠమును చేరెను. రాజు ఈ అద్బుతమును చూచి మిక్కిలి సంతోషించి తన పురమునకు తిరిగి వచ్చెను. తన కుమారుడైన శ్రీనివాసుడను వానిని యథావిధిగ అభిషేకించి, భూమిని మానవులను ధర్మము తప్పకుండ పరిపాలింపుమని ఆజ్ఞాపించి వనములకు వెళ్లి గొప్ప తపస్సు చేసేను. అపుడు స్వామి అతడికి ప్రత్యక్షమయ్యెను.

         శ్రీనివాసుని కృపచేత తొండమానుడు సారూప్యమును పొందుట:- స్వామి శ్రీదేవి భూదేవులతో కలసి గరుడుని పై అచటకు వచ్చేను.

స్వామి పలికెను:- ఓ నృపశ్రేష్ఠ! నీ తపస్సుచే సంతోషించితిని.ఏమి చేయమందువు. అని స్వామి అడుగగా రాజిట్లనెను. మిక్కిలి ఆనందము పొంది, అంజలి ఘటించి గద్గదమైన స్వరముతో ఓ దేవా! జరామరణములు లేని నీ లోకమునందు నివసింపకోరుచుంటిని. ఇది నా కోరిక. కనుక దీనిని తీర్చుము. వరాహస్వామి చెప్పెను: అని పలికి ఆ తొండమానుడు భూమి పై వాలి స్వామికి సాష్టాంగ నమస్కారము చేసి, శరీరమును విడచి దివ్యవిమానము నెక్కెను. గంధర్వులు స్తుతించుచుండగా స్వామి రూపము వంటి రూపమును పొంది, శోకము, మోహము లేనిది, ముసలితనము, మరణము విడచి పెట్టినది, వేనుకకు తిరిగి వచ్చుట లేనిది అయిన వైకుంఠమును చేరెను.

ఈ కథ వినుట వలన చదువుట వలనకలుగు ఫలము:- ఓ దేవీ! చక్కని రూపము కలదానా! ఈ కథ అంతయు జరగబోవునది. దీనిని వినిపించినవారు, విన్నవారు కూడా విష్ణులోకమును పొందుదురు.

సూతుడు చెప్పెను: అని వరాహస్వామి చేత జరగబోవు కథ అంతయు చెప్పబడినది. ఈ కథను భక్తితో విన్న వారు చదివిన వారు అన్ని భోగములను అనుభవించి చివరకు విష్ణులోకమును పొందుదురు.

ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమందు శ్రీవేంకటాచల మాహాత్మ్యమున ధరణీ వరాహసంవాదమున భవిష్యద్వర్ణనమందు తొండమానుడను చక్రవర్తి కథా వర్ణనమను పదవ అధ్యాయము.