స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
4వ అధ్యాయము
భూదేవి పలికెను:- స్వామీ! ఆకాశరాజు పుత్రుని గురించి సవివరంగా తెల్పిరి. అయోనిజగ భూమి నుండి ఉద్భవించిన ఆ కుమార్తెకు పేరేమి పెట్టిరి తరువాత ఏమి జరిగెను?
సూతుడు పలికెను: -జగత్పతి అయిన వరాహ స్వామి అది విని ఇట్లనెను.
వరాహస్వామి చెప్పెను:- మతిమంతుడైన ఆకాశరాజు పద్మంలో పరుండి ఉన్న ఆ పసిపాపను చూచి పద్మిని అని పేరు పెట్టెను. యౌవనవతి అయిన ఆమె ఒకనాడు సఖులతో కలసి ఉద్యానమున విహరించుచుండెను. అచట చిలుకలు, కోకిలలు కూయుచుండెను. అపుడచటకి అకస్మాత్తుగా నారదుడు వచ్చెను-4,5. వనలక్ష్మివలె ఉన్న ఆమెను చూచి ఆశ్చర్యపడి ఇట్లనెను.
నారదుడు పలికెను:- ఓ భీరు! నీవెవరు? ఎవరి కుమార్తెవు? నీ చేతిని చూపుము అని పలుకగా, చక్కని అందమైన శరీరావయవములు కల ఆ పద్మావతి మునితో ఇట్లనెను, ఓ బ్రహ్మన్, నేను ఆకాశరాజు కుమార్తెను నాయొక్క లక్షణములను తెల్పుము అని చెప్పగా నారదుడు ఇట్లు పలికెను.
నారదుడు పలికెను:- చక్కని ముఖముగలదానా! వినుము. నీ లక్షణములను చేప్పెదను. ఓ సుభ్రు! నీ పాదములు ఎర్ర కలువ రేకుల వలె ఉండి భూమి పై స్థిరముగా నిలచి ఉన్నవి. పాదముల వ్రేళ్లు సమముగా ఉన్నవి. ఎర్రగా ఉన్నవి. ఎర్రని ఎత్తైన గోళ్లు కలిగి ఉన్నవి. చీలమండలు పైకి కనిపించక ఉన్నవి. పిక్కలు వెంట్రుకలు లేక చక్కగా ఉన్నవి. మోకాలి చిప్పలు సమముగా ఉన్నవి. తొడలు రెండు సమముగా క్రమముగా ఉన్నవి. పిరుదులు విశాలముగ బలసినవిగా ఉన్నవి. కటి ప్రదేశము ఉన్నదా లేదా అన్నట్లున్నది కదా. బొడ్డు గుండ్రముగ, లోతుగా ఉన్నది. పక్కలు నున్నగా ఉన్నవి. మధ్యభాగమున మూడు వళులు స్పష్టముగా ఉన్నవి. వెంట్రుకల వరుస దట్టముగా ఉన్నది. స్తనములు బలముగ, దగ్గరగా, మృదువుగ, ఎత్తున ఉన్నవి. చూచుకములు లోకలకు ఉన్నవి. నీ చేతులు ఎర్ర కలువల వలె ఉన్నవి. పద్మరేఖలను కలిసి, సూక్ష్మములైన రక్త రేఖలను కలిగిన కణుపులతో వ్రేళ్లతో ప్రకాశించుచున్నవి. కొనదేరిన తెల్లని ముక్కువలె పొడవుగ ఉన్న వేళ్ల వరసలచే, పొడవుగ మృదువుగ ఉన్న నీ భుజములు పుష్పదండముల వలె ఉన్నవి. నీ వెనక భాగము వేదికవలె విశాలమై తిన్నని మధ్యభాగమును కలిగి ఉన్నది. కంఠము ఎర్రనై, పొడవై ఉన్నది. మూపు కొద్దిగా వంగి ఉన్నది. ముఖము ప్రసన్నముగా ఉండి ఎల్లప్పుడు చంద్రుని ప్రభను కలిగి ఉన్నది. చెక్కిళ్లు బంగరుటద్దములవలె ఉండి కుండముల చేత భాసించుచున్నవి. ఓ చక్కని ముఖము కలదానా! నీ ముక్కు నువ్వు పువ్వువలె పొడవుగ ఉన్నది. మచ్చలేని అష్టమినాటి చంద్రునివలె అతి మనోహరముగ ఉన్న. నీ నుదుటి భాగము ముంగురులచే మిక్కిలి అందముగ ఉన్నది. నీ తల గుండ్రముగ ఉండి మెత్తని పొడవైన వెంట్రుకలు కలిగి ఉన్నది. పలువరుస చిరునవ్వు కలిగి, దొండపండు వంటి క్రింది పెదవి కలిగి ఉన్నది. ఈ నీ ముఖము విష్ణువునకు అనువైనదని నేను గట్టిగా చెప్పగలను. నీ నాభ దక్షిణావర్తమై గంగానది యందలి సుడిగుండమువలె ఉన్నది. కనుక నీవు పాల సముద్రమునుండి పుట్టిన లక్ష్మీదేవివలె ఉన్నావు.
వరాహ స్వామి పలికెను: - అని పలికి నారదుడు అంతర్థానమయ్యెను. తరువాత పద్మిని సఖులు ఇట్లనిరి. తన సఖులతో కలసి పద్మావతి పుష్పాటవికి వెళ్లుట. వసంతకాలము వచ్చినది కనుక మనము వనమునకు వెళ్లుదుము. కర్ణికారములు, చూతములు, చంపకములు, పారిజాతములు, మోదుగలు, కలిగొట్టు చెట్లు, తెల్లమల్లెలు, ఎర్ర అశోకములు పుష్పించి ఉన్నవి. తామరలు, సింధు వారములు, మాలతి, మొల్ల తీగలు ఉన్నవి. కల్హారముల, కరవీరములు పోటీ పడినట్లుగా పుష్పించినవి మనము వనమునకు వెళ్లి పూవులు కోయుదుము. ఆ వనము మిక్కిలి మనోహరమైనది. అని పలికి వారందరు పద్మనితో కలసి వనమునకు వెళ్లిరి. పూవులను కోయుచు అటు ఇటు తిరగసాగిరి-25. ఆ విధంగా తిరుగుచు ఒక గజేంద్రమును చూచిరి. తెల్లని దంతములతో, చెక్కిళ్లు నుండి కారుచున్న రెండు మదధారలతో, ఎత్తుగా ఉన్నది. ఆడు ఏనుగులతో తీరుగుచు ఉన్నది. సరస్సులోని నీటిని తొండముచే తీసి నీటిని జల్లు కొనుచున్నది. ఆ ఏనుగును చూచి ఆందోళన చెంది చెట్ల క్రిందకు చేరిరి. ఇంతలో ఒక గొప్ప ఉత్తమాశ్వమును చూచిరి.
వేట కొరకు పుష్పాటవివైపు శ్రీనివాసులుడు వచ్చుట:- ఆ అశ్వము మచ్చలేని చంద్రునివలె తెల్లగా, బంగారుతో అలంకరింపబడి మెరుపులతో నిండియున్న శరత్కాలపు తెలిమబ్బువలె ఉన్నది. దానిపై ఒక పురుషుడు ఉండెను. అతడు నల్లని వర్ణము కలిగి, మన్మథుని వంటి వర్చస్సు కలిగి, తామరరేకుల వంటి పొడవైన కన్నులు కలిగి ఉండెను. సన్నటి పట్టుదారములతో నేయబడిన నల్లని చూలికచే ప్రకాశించుచు, పద్మరాగ మణివలె ప్రకాశించుచున్న కుండలములు కలిగి, ఒక చేతి యందు బంగారము, రత్నములు పొదిగిన శాస్త్రమను దివ్యధనుస్సు మరొక చేతిలో బంగారు బాణము కక్షకు దిగువ ఉపవీతము కలిగి, చక్కని సడుము రత్నములతో చేసిన కంకణములు, కేయూరములు, కటి సూత్రముగల, విశాలమైన వక్షఃస్థలము పై వెలుగుచున్న కుడివైపు సుడి, బంగారు యజ్ఞోపవీతము చేత కదలుచున్న మూపు మనోహరమైన రూపు కలిగిన పురుషుని చూచెను. తోడేలు వెనుక పరుగెత్తుచున్న అతడిని చూచి ఆ స్త్రీలందరు ఆశ్చర్యచకితులై నిలిచిరి. అశ్వారూఢుడై వచ్చుచున్న ఆ పురుషుని చూచి ఆ గజేంద్రము తలవంచి, తొండమెత్తి ఘీంకరించి వెనుకకు తిరిగి వనములోనికి వెళ్లిపోయెను. ఆ గజేంద్రము ఆచటి నుండి వెళ్లిపోగా అశ్వము పై ఉన్న పురుషుడు తోడేలును వెదకుచు స్త్రీలు దాగిఉన్న పొదరింటి వద్దకు వచ్చెను.
శ్రీనివాసుడు, కన్యకలు మాట్లాడుకొనుట:- వారిని చూచి శ్రీనివాసుడు అశ్వముపై ఉండి, ఇటువైపు వచ్చిన ఈ మహామృగమును చూచిరా? అని ప్రశ్నించెను.
వరాహస్వామి చెప్పెను:- దానికి వారు తాము ఏ మృగమును చూడలేదని బదులిచ్చిరి. చక్కని ధనుస్సును ధరించినవాడా! నీవు ఈ వనములోనికి ఏ నిమిత్తము వచ్చితివి? ఇచట ఉన్న ఏ జంతువును చంపరాదు సుమా. ఇది ఆకాశరాజుకు చెందిన వనము, కనుక తక్షణమే ఇచ్చటి నుండి వెడలిపొమ్ము అని చెప్పగా ఆ పురుషుడు అశ్వము పైనుండి దిగెను. మీరు ఎవరు? తామరపూవువలె ఉన్న ఈ కన్యక ఎవరు? ఈమె మిక్కిలి సౌందర్యవతి, సుందరమైన అవయవములు కలిగి, పీనములు, ఉన్నతములు అయిన స్తనములు కలది, ఈమె ఎవరో నాకు తెల్సినచో వెంటనే నేనిచటి నుండి వెళ్లిపోయెదను అనెను. ఆ మాటలు విని పద్మావతి సఖి ఇట్లనెను. ఈమె ఆకాశరాజు కుమార్తె, భూమి నుండి ఉద్భవించినది. మా అందరికి నాయిక. ఈమె పేరు పద్మిని. చక్కని ఆకారముగల అందగాడా! నీ పేరేమి, నీవెవరి పుత్రుడవు? నీది ఏ జాతి, నీ నివాసమెక్కడ? ఈ ప్రదేశమునకు ఏల వచ్చితివి? అని అడుగగా నవ్వుచేత వికసించిన పద్మము వంటి ముఖముగల ఆ పురుషుడు ఇట్లనెను.
ఎవరినైతే బుద్ధిమంతులు అనంతములైన పేర్లతో వ్యవహరించెదరో అటువంటి సూర్యుని వంశము మాది. వర్ణము చేతను, నామము చేతను నన్ను కృష్ణుడందురు. బ్రహ్మను ద్వేషించువారికి, దేవతల శత్రువులకు ఏ చక్రము భయము కలిగించునో, ఏ శంఖము యొక్క ధ్వనిని విని శత్రువులు మూర్చిల్లుదురో, ఏ ధనువుకు సాటి అయినది దేవతల వద్ద లేదో అటువంటి చక్రము, శంఖము, ధనస్సు కల నన్ను వీరపతి అని అందురు. నేను వేంకటాద్రి పై నివసింతును. కనుకనే ఈ నిషాదులందరు నన్ను అనుసరించుచున్నారు. వేట కొరకై నేను అశ్వము పై ఎక్కి ఈ వనమున ప్రవేశించితిని. వాయువు వలె, వేగముగ పరుగెత్తగల తోడేలును నేను వెంబడించుచుంటిని. ఆ మృగము కనబడక వెదుకుచుండగా ఈమెను చూచితిని. ఈమె నాకు లభించునా. అని అతడు పలుకగా వారు కోపించి ఆకాశరాజు నిన్ను చూచి సంకెళ్లతో బంధింపక మును పే ఈ వనమును విడచి నీ గృహమునకు వెళ్లుము అని పలికిరీ. ఈ విధంగా వారిచేత బెదిరింపబడినవాడై ఆ పురుషుడు త్వరగా పరుగెత్తగల ఆ అశ్వమును అధిరోహించి, తన సహచరులందరు వెంటరాగా పర్వతము వైపుకు త్వరగా బయలుదేరి వెళ్లాను.
ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీస్కాంద మహాపురాణమందలి రెండవదైన వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందలి ధరణీ వరాహ సంవాదమున ఉద్యానవనములో ఉన్న పద్మావతి వద్దకు నారదుడు వచ్చుట, శ్రీనివాసుడు వేటకు వచ్చుట మొదలగునవి వర్ణింపబడిన నాల్గవ అధ్యాయము.
