స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

38వ అధ్యాయము

భరద్వాజుడు చెప్పెను :- విష్ణువుయందే మనస్సు నిలిపి పూజలు, స్తోత్రములు చేయుచు అగస్త్యాదులు అచట మూడు దినములు గడపిరి. మూడవ దినము గడచిన తరువాత రాత్రి యందు వారు నిద్రించిరి. నాల్గవ యామముయొక్క చివర ఉత్తమమగు ఒక కలకనిరి. శంఖము, చక్రము, గదను ధరించినవాడు, ప్రసన్నుడు, వరమునిచ్చుటకు వచ్చినవాడు, నవ్వుచున్న కన్నులు కలవాడు ఆగు స్వామిని కలలో చూచిరి. తరువాత నిద్ర లేచి మిక్కిలి ఆనందించి ఇంటినుండి బయటకు వచ్చి పవిత్రమగు స్వామి పుష్కరిణియందు యథావిధిగా స్నానము చేసిరి. ఉదయకాలమందు చేయవలసిన పనులన్నిటిని విధివిధానముగ పూర్తిచేసి స్వామిని అర్చించుటకు ఇళ్ళకు తిరిగి వచ్చిరి. మార్గమధ్యమున పక్షులచే శుభశకునములు సూచింపబడగా స్వామి అనుగ్రహము చేత చిక్కినదని తలచిరి. పిమ్మట ముల్లోకములను సృష్టించిన స్వామిని వేదములలో వర్ణితములైన పెక్కు స్తోత్రములచే స్తుతించిరి. ఓ అర్జునా స్తోత్రములు ముగిసిన తరువాత ఆగస్త్యుడు, శంఖునితో కలసి విష్ణువునకు సంబంధించిన అష్టాక్షరిని (ఎనిమిది అక్షరములు కల మంత్రమును) జపించెను.

ఈ విధముగా ప్రపంచమునకు ప్రభువగు స్వామియందు మనస్సునిలిపిన వారి ఎదుట ఒక మహాద్భుతమైన తేజము ఆవిర్భవించెను. అనేక చోట్ల సంఖ్య కలిగిన సూర్యులు, చంద్రులు, అగ్నులు కలసి ఒకటై ఆకాశములో ముద్దకట్టినట్లు కనిపించేను. ఆ తేజమును చూచి వారు అంతులేని ఆశ్చర్యము పొంది పరమానందమునకు రూపుకట్టిన దివ్యతేజమయుడగు స్వామిని చూచిరి. వాక్కుకు, మనస్సుకు అందనివాడైన, ప్రసిద్ధిపొందిన ఐశ్వర్య ప్రకాశము కలిగిన, వేయినేత్రములు, వేయి బాహువులు, వేయి పాదములు కలిగిన. కాల్చిన బంగారమువంటి కాంతితో మనోహరముగా ఉన్న, భయంకరమైన కోరలుకలిగిన, అగ్ని స్ఫులింగములు విరజిమ్ముచున్న, కౌస్తుభమణిచే ప్రకాశించుచున్న, వక్షః స్థలము పై లక్ష్మీదేవిని ధరించిన, ఆలోచనకు చిక్కనివాడైన ఆది అంతము లేనివాడైన మిక్కిలి భయమును కలిగించుచున్న, తన యందే సమస్తమైన బ్రహ్మాండమును ప్రవర్తింపజేయుచున్న అంతట గల ఆ స్వామికి అగస్త్యాదులందరు సంతోషముతో నిండిన మనస్సులతో చూచిరి. వారు జగన్నాథుడగు స్వామికి మరల మరల నమస్కరించిరి. అపుడు స్వామి యొక్క ఆయుధములు లోకములను రక్షించుటకై తిరుగుచుండెను.

తమ తేజోబలముచే కూడినపై స్వామిని సేవించుటకు వచ్చినవి. సూర్యకాంతి కలిగిన చక్రము, దివ్యమగు గద. నందకమను ఖడ్గము. పుండరీకము భీకరమగు శబ్దము చేయునది, చంద్రుని కాంతి కలిగిన పాంచజన్యము సమస్తమగు బ్రహ్మాండమును తన శబ్దముచే నింపివేసెను. పాంచజన్యము యొక్క ధ్వని రాక్షసులందరకు భయము కలిగించునది. మిక్కిలి ఆశ్చర్యమును కలిగించునది. భయంకరమైనది అగు ఆ పాంచజన్యము యొక్క ధ్వనిని విని, దేవతలందరు తమ తమ వాహనములనెక్కి వచ్చిరి. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, సనకుడు మున్నగు యోగులు. వసిష్ఠుడు మున్నగు మునులు, గంధర్వులు, నాగులు, కిన్నరులు, విష్వక్సేనుడు, గరుత్మంతుడు, విష్ణువునకు సేవకులగు జయుడు మున్నగు వారందరు వచ్చిరి.

            శ్వేత ద్వీపమునందు స్వామితో సరూపులై ఎల్లప్పుడు నివసించువారు వచ్చిరి. కల్పవృక్షమునుండి అద్భుతమగు పుష్పవృష్టి అందరి మనస్సులకు సంతోషము కలిగించు గొప్ప సువాసన కలిగి కురిపెను. అప్సర స్త్రీలు నాట్యము చేసిరి. కింనరశ్రేష్ఠులు పాడిరి. దేవతలు, గంధర్వులు, చారణులు ఆనందముచే తృప్తినొందిరి. పుండరీకాక్షుడు భక్తులపట్ల వాత్సల్యము చూపువాడు, ప్రసన్నముగా ఉన్నవాడు అగు స్వామికి నమస్కరించి వివిధములగు స్తోత్రములచే, సాష్టాంగ నమస్కారముచే సంతోషింపజేసిరి.

బ్రహ్మమొదలగు వారు పలికిరి:- ఓ విషూ! జయ దయా సముద్రా జయ, తామరలవంటి కన్నులు కలవాడా జయ, లోకములకు శరణమిచ్చువాడా, భక్తుల తాపములను నాశనము చేయువాడా జయ. అనంతుడవు అక్షరుడవు, శాంతుడవు, వాక్కుచే మనస్సుచే తెలియనివాడవు, చిదానందమయుడవు అగు నిన్ను ఎవరు తెలిసికొనగలరు. అణువుకంటే సూక్ష్మమైనవాడా! స్థూలమైనదానికంటే స్థూలమైనవాడా, అన్నిట ఉన్నవాడా ప్రకృతికి నీవే పురుషడవని తలచుదురు నీవే అచ్యుతుడవు. వేదాంతములయొక్క సారరూపమైనవాడో, అన్నిటా, బయటా వ్యాపించి ఉండువాడా, మాయచే కప్పబడిన దేహములుకల జీవులయందు నిన్నెవరు వర్ణింపగలరు?. మిక్కిలి భయము గొల్పుచున్న ఈ నీ రూపమును చూచి మేమెల్లరము భయముచే ఉద్విగ్నులము అగుచున్నాము. కావున శాంతమగు రూపమును పొందుము.

భరద్వాజుడు చెప్పెను :- అని బ్రహ్మాదులు పొగడగా స్వామి మేఘగర్జనమువలెనున్న కంఠస్వరముతో ఇట్లు పలికెను

స్వామి పలికెను:- భయానకమగు ఈ రూపమును వదలి ప్రియమును కలిగించు శాంత రూపమును పొందెదను. ఎటువంటి ఆందోళన లేక నన్ను చూడుడు. అని అంతర్థానము పొంది ఒక్క క్షణములో అచటనే విమానమునందు. సుఖముగా దర్శించుటకు ప్రత్యక్షమయ్యెను. చంద్రబింబమువంటి ముఖము, శాంతము, నల్లకలువకాంతి, బంగారు వస్త్రములు, రత్నములతో చేసిన భూషణము కలిగి ఉండును. శంఖము, చక్రము, గద, పద్మము చేతులయందు ప్రకాశించుచుండెను. అటువంటి రమాకాంతుడగు స్వామిని చూచి వారందరు మగల మరల వనప గించిరి.

స్వామి పలికెను :- ఓ మునీంద్రా! అతికష్టములైన, ఘోరములైన అనేక వ్రతములు చేసి మిక్కిలి శ్రమనొందితిని. నీవు కోరిన వరములను ఇచ్చెదను.

భరద్వాజుడు చెప్పెను :- అని శ్రీపతియగు స్వామి పలుకగా మరల మరల నమస్కరించి శరీరము గగుర్పొడవగా అగస్త్యుడు ఇట్లు పలికెను.

అగస్త్యుడు పలికెను:- నీవు నాపై అనుగ్రహము చూపితివనగా నేను చేసిన యజ్ఞములు, తపస్సు, నేర్చిన విజ్ఞానము అన్నియు సఫలమైనవి. ఈ మూడు లోకములయందు నేనే ధర్మాత్ముడను. ఏలననగా నేను నీ కొరకు వెదుకుచుండగా నీవే నన్ను వెదుకుచు ఇచటకు వచ్చితివి. నీ అనుగ్రహమువలన ఇప్పటికే నా కోరికలన్నియు తీరినవి. ఎంత ఆలోచించినను కోరదగినది ఏమియు కనబడుటలేదు. అయినప్పటికి చపలత్వముకొద్ది వాకు ఎల్లప్పుడు నీ చరణకమలములపై భక్తి ఉండునట్లు అనుగ్రహించమని వేడుచున్నాను. దేవతలు, నేను ప్రార్థించునది ఏమనగా ఈ సువర్ణముఖరీ నది స్నానముచేసిన జనసమూహముల పాపములను నాశనము చేయు శక్తి కలది. ఆ నది నీవు నివసించు ఈ పర్వతము సమీపమునుండి పారుచున్నది. నీవు ఆ నదిని అనుగ్రహించి దానిని కృతార్థురాలను చేయుము. సువర్ణముఖరియందు స్నానము చేసి వేంకటాద్రిపై ఉన్న నన్ను చూచువారికి భక్తి, ముక్తి కలుగుగాక. అల్పమగు ఆయుష్సు కలవారు, మూఢులు, జ్ఞానయోగమునుండి భ్రష్టులైనవారు అగు మానవులు వ్రతములచేత ఆధ్యయనముచేత నిన్ను చూచుటకు శక్తికలవారు కారు. కనుక ఓ దేవా! నీవు ఎల్లప్పుడు ఈ పర్వతముపై వసించుచు, వారిని అనుగ్రహించుచు, వారి కోరికలను తీర్చుచుండుము.

స్వామి చెప్పెను :- ఓ అగస్త్యా నీవు కోరిన విధముననే జరుగును. నిశ్చయముగా నీవు నా యందు సాటిలేని భక్తికలవాడవు, ఈ సువర్ణముఖీనది గంగా నదివలె దేవతలకు కూడ కోరికలు తీర్చునది అగును, ఈ స్వామి పుష్కరిణి పెక్కునదులచే కూడినదై తీర్థేములు కల సువర్ణముఖరిని చేరగలదు. వైకుంఠమను పేరుగల ఈ పర్వతముపై నేటి నుండి ఎల్లప్పుడు నీ కోరికమేర నేను నివసింతును. సువర్ణముఖరియందు స్నానముచేయుట వలన కడుగబడిన పాపసమూహము అను బురద గల మానవులు వైకుంఠ పర్వతమునకు వచ్చి నన్ను చూచినచో, ఇహలోకమున సంతానము మొదలగు అన్ని ఐశ్వర్యములు పొందుటయే గాక, చనిపోయిన తరువాత కల్పాంతము వరకు స్వర్గమున భోగములను అభనువింపగలరు.

తరువాత తిరిగివచ్చుట అనునదిలేనిది, కేవలము ఆనందమునకు స్థానమైనది అగు నా స్థానమును చేరెదరు. దీనియందు సంశయముండరాదు. నన్ను చూచుటకు వచ్చిన వారందరికి నీవు కోరినందువలన వారు కోరినవన్నియు తీర్చెదను. పుత్రులను కోరినవారికి చాలమంది పుత్రులను, ధనము కోరినవారికి ధనమును, ఆరోగ్యమును కోరినవారికి మిక్కిలి రోగోపశమనమును ఇచ్చెదను. తీవ్రమగు కష్టములనుండి, ఆపదలనుండి కాపాడుదును. వారు కోరిన కోరికలు దుర్లభమైనప్పటికి తీర్చెదను. ఎవరు ఏ కోరికలతో నన్ను చూచుటకు వచ్చెదరో వారందరు ఆయా కోరికలను తప్పక పొందగలరు. మానవులు ఎచట ఉన్నను నన్ను స్మరించినచో వారి కోరికలన్నియు నా అనుగ్రహము వలన సిద్దించును.

భరద్వాజుడు చెప్పెను:- అని అగస్త్యమునితో పలికి స్వామి శంఖుని చూచి, బ్రహ్మాది దేవతలు వినుచుండగా ఇట్లు పలికెను .

స్వామి పలికెను:- ఓ శంఖుడా! నీ భక్తికి మెచ్చితిని. మిక్కిలి ఇష్టమైన దానిని కోరుకొనుము. తపస్సు చాల కృశించిన నీకు ఆ వరమును తప్పక ఇచ్చెదను.

 శంఖుడు పలికెను :-స్వామీ! నీ చరణ కమలములను సేవించుట కంటే వేరైనది ఏదియు కోరను. నీ భక్తులు పొందునట్టి ఉత్తమమైన గతిని నాకు ప్రసాదింపుము.

స్వామి పలికేను :- ఓ శంఖుడా! నీవు కోరినది అట్లే జరుగును. నా సేవ చేసిన వారికి లభించనిది ఏమున్నది. ఆప్సరసలచేత కొలువబడుచు ఈ కల్పము ముగియువరకు ఇంద్రలోకమున అన్ని విధములగు భోగములను అనుభవించి పిమ్మట నా లోకమునకు రాగలవు. కోరిన వారికి కల్పవృక్షమువలె అన్ని కోరికలను తీర్చు స్వామి శంఖభూపతి కోరిన వరములనిచ్చి. బ్రహ్మాదులందరును వదలి వారందరు భక్తితో స్తుతించుచుండగా అచటనే అంతర్ధానమయ్యెను.

భరద్వాజుడు చెప్పెను :- ఓ అర్జునా! వేంకటాద్రీయొక్క మాహాత్మ్యమును నీకు చెప్పెదను. ఈ పవిత్రమైన కథను విన్న మానవులు పాపములనుండి ముక్తిని పొందుదురు. బ్రహ్మచే ప్రార్థింపబడిన స్వామి వరాహరూపమును పొంది తనమాయచే జగత్తును మోహింపజేయుచు సంతోషించెను. పిమ్మట అగస్త్యుడు, శంఖుడు ప్రార్థించుటచేత మిక్కిలి సౌభాగ్యకరము, శాంతము అగు భోగములననుభవించు రూపమును పొంది అందరకును సుఖముగ దర్శన మిచ్చుచుండెను. స్వామిని, వేంకటాద్రిని, స్వామి పుష్కరిణిని, ఈ కథను తలచినవారు పాపములనుండి ముక్తిని పొందుదురు. బ్రహ్మాండమునందు వేంకటాద్రికి సమానమైన స్థానము, వేంకటేశుని సమానమైన దైవము లేదు, ఉండబోదు. వేంకటాద్రితో సమానమైన ప్రదేశములేదు. ఉండబోదు. స్వామి

ప్రాతఃకాలమున లేచి ఎవరు శ్రీ వేంకటేశుని స్మరింతురో వారికి మోక్షము చేతిలోనిది. దీనియందు సందేహముండరాదు. స్వామి పుష్కరిణియందు స్నానముచేసి సర్వాత్మకుడగు శ్రీహరి నియమముతో వరాహచలముపై ఉండు స్వామిని చూచువారు. వేయి అశ్వమేధములు, నూరు వాజపేయములు చేసిన ఫలము పొందుదురు. దీనియందు సందేహముండరాదు. వేంకటాచల మాహాత్మ్యమును ఎవరు విందురో వారికి భక్తి, ముక్తి ఇచట పరలోకమునందు తప్పక లభించును. వేంకటాచల మాహాత్మ్యము గూర్చి సంక్షిప్తముగా చెప్పితిని. ఇప్పుడు సువర్ణముఖరి యొక్క ప్రభావమును గూర్చి చెప్పెదను.

స్కాందమహాపురాణమునందు, ఎనభై ఒక్కవేల శ్లోకములు కలదానియందు, రెండవదియగు వైష్ణవఖండమందు శ్రీ వేంకటాచలమాహాత్మ్యమం సువర్ణముఖరీ మాహాత్మ్యప్రశంసయందు, అగస్త్యుడు శంఖుడు మొదలగువారి తపస్సువలన తుష్టుడైన స్వామి ఆవిర్భవించుట అను ముప్పై ఎనిమిదవ అధ్యాయము.