స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
27 - అథ శ్రీ వేంకటాచలస్య సర్వపుణ్యతీర్థా ధారత్వ వర్ణనమ్
అన్ని తీర్థేములకు వేంకటాద్రియే ఆధారమని వర్ణించుట
ఋషులు పతికిరి:- అన్ని పాపములను నాశనము చేయు, మహాపుణ్య ప్రదమగు వేంకటాద్రియందు ఎన్ని తీర్థేములు కలవో ఓ పౌరాణి కోత్తమా చెప్పుము -1. వాటి సంఖ్యను మాకు తెల్పుము. వాటిలో ముఖ్యమైన వాటిని ఓ మునిసత్తమా! మాకు తెల్పుము -2. ఈ తీర్థేములలో చక్కని ధర్మమునందు ఆసక్తిని పెంచునవి ఏవి? ఏవి ముఖ్యములు?, ఏవి జ్ఞాన ప్రదములు? ఏవి భక్తిని వైరాగ్యమును కలిగించును -3. ఏవి ముక్తి ప్రదములో మాకు చెప్పుము.
సూతుడు చెప్పెను:- అరవై ఆరుకోట్ల పుణ్య ప్రదములగు తీర్థేములు వేంకటాద్రిపై కలవు. వాటిలో వేయి ఎనిమిది ముఖ్యమైనవి -5. సద్ధర్మమునందు ఆసక్తిని కలిగించునవి వీటిలో నూట ఎనిమిది కలవు. వేలకొలది ముఖ్యమైనవి వాటిలో ఇవి వేరుగా ఉన్నవి-6. వాటియందు భక్తిని, వైరాగ్యమును కలిగించునవి కలవు.
స్వామి పుష్కరిణి మొదలైన ఆరు తీర్థేములలో స్నానము చేయుకాలము యొక్క నిర్ణయము:- కాని ముక్తిని కలిగించునవి ఆరు మాత్రమే కలవు. వేంకటాద్రిపై ఉన్న స్వామి పుష్కరిణి, ఆకాశగంగ -8. పాపవినాశము, పాండు తీర్థేము కుమారధారికా తీర్థేము, తుంబురతీర్థేము -9. కుంభమాసమునందు పౌర్ణమినాడు మఖానక్షత్రమున్నపుడు అన్ని తీర్థేములు కుమారధారిక తీర్థేమును చేరుచున్నవి -10. అచట స్నానము చేయువారికి రాజసూయయౌగఫలము లభించును. ముక్తి కలుననుటకు ఎట్టి సందేహము లేదు -11. బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన అన్నదానమును ఇచట చేయవలయును. పౌర్ణమినాడు ఉత్తరావలుణీ నక్షత్రమున్నపుడు అనగా ఫాల్గుణమాసమందు పౌర్ణమినాడు, సూర్యుడు మీనరాశిలో ఉండగా మధ్యాహ్నసమయమున అన్ని తీర్థేములు తుంబతీర్థేమునకు వచ్చును. అచట స్నానముచేసిన పునర్జన్మలేదు -12, 13. మౌంజీ బంధము, వివాహము ఈ రెండును దక్షిణతో కలసి ఈ తీర్థేమునందు చేయవలయును. సూర్యుడు మేషరాశియందున్నపుడు, చిత్రా నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు అనగా చైత్రపౌర్ణమినాడు తీర్థేములన్నియు ఆకాశగంగకు వచ్చును. అచట స్నానము చేసిన వారికి నూరు యాగములు చేసిన ఫలము కలుగును.
ఇచట బంగారము దానముచేసుట, కన్యాదానముచేయుట శ్రేష్ఠము; వృషభమునందు సూర్యుడు ఉండగా ద్వాదశి ఆదివారమునాడు గంగాది తీర్థేములన్నియు పాండుతీర్థేమునకు వచ్చును -16, 17. అచట స్నానము చేసి ఆవును దానమిచ్చినచో ముక్తి కలుగును. ఆశ్వయుజ శుక్లసప్తమి బుధవారమునాడు ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడుకొనియున్న పాపవినాశమునకు అన్ని తీర్థేములు వచ్చును. ఉత్తరాభాద్రతో కూడుకొనియున్న ఆశ్వయుజ ద్వాదశియందును వచ్చును. సాడు శాలగ్రామశిలను దానమిచ్చి విధి పూర్వకముగా స్నానము చేసినచో శతకోటి జన్మల నుండి చేసిన అన్ని పాపములు నశించును -18, 19, 20. ధనుర్మాసమునందు శుక్లపక్ష ద్వాదశినాడు సూర్యోదయకాలమందు అన్ని తీర్థేములు స్వామి పుష్కరిణియందు ఉండును -21. అచట స్నానముచేసిన వారికి వెంటనే ముక్తి కలుగును. వేయి జన్మలలో పుణ్యము చేసిన వారికి మాత్రమే అట్టి స్నానము లభించును కాని అన్యులకు కాదు. యథాశక్తి అచట దానము చేయవలయును -22,23. శాలిగ్రామమును గోవును దానమిచ్చుట విశేషము.
పురాణ శ్రవణము వలన విశేషఫలము కలుగుననుట:- లోకములను పావనము చేయు విష్ణుకథా పురాణములను ఎవరు విందురో వారు విష్ణు భక్తులనబడుదురు -25. ఎల్లప్పుడు విష్ణు కథలను వినుటకు వీలుకానిచో ఒక్క ముహూర్తము కాని, దానిలో సగముకాని, ఒక్కక్షణముకాని ఎవరు విష్ణుకథను భక్తితో విందురో వారికి దుర్గతి అనునది లేదు -26. అన్ని యజ్ఞములు చేసిన ఏ ఫలము కలుగునో, అన్ని దానములు చేసిన ఏ ఫలము కలుగునో ఒక్క మారు పురాణమును విన్నను అట్టి ఫలము కలుగును -27. కలియుగమునందు పురాణశ్రవణముకంటే వేరయిన పరమధర్మము, పరమముక్తి ప్రదము లేదు -28. పురాణ శ్రవణము, విష్ణువుయొక్క నామ సంకీర్తనము అను ఈ రెండు మాత్రమే పుణ్యము అనెడి చెట్టుకు కాచు గొప్ప ఫలములు -29. అమృతము త్రాగినచో ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ముసలితనము, మరణములేని వాడగును. కాని విష్ణునామ సంకీర్తనము చేసినచో ఆ వ్యక్తి కుటుంబమంతయు అజరామరమగును.
పురాణము చెప్పువానిని అందరు పూజింపవలెనని చెప్పుట:- పురాణము చెప్పువాడు బాలుడైనప్పటికీ యువకుడైనప్పటికీ, వృద్దుడైనప్పటికీ, దరిద్రుడు, దురదృష్టవంతుడు అయినప్పటికీ ఎల్లప్పుడు పూజింపదగినవాడు -31. పురాణము తెలిసిన వానియందు ఎప్పుడును నీచమగు బుద్దిని చూపరాదు. ఏలననగా పురాణజ్ఞుని ముఖమునుండి వెలువడు వాక్కు మానవులకు కామధేనువు వంటిది -32. వేయికోట్ల జన్మలయందు పుట్టి గిట్టుచు ఉండు ఈ జీవునకు తిరిగి వచ్చుటలేని ముక్తిని ప్రసాదించు పురాణము కంటే పరమ గురువు ఎవరు? -33. పౌరాణికుడు వ్యాసాసనమున కూర్చుండి ప్రసంగము చేస్తూ ఉన్నంతవరకు ఎవరును నమస్కరింపకూడదు -34. పురాణమును ఎప్పుడును దుర్జనులు కూడి ఉన్నచోట, శూద్రుల, కుక్కల సంఖ్య అధికముగా ఉన్నచోట, జూదమాడుచోట చెప్పకూడదు -35. మంచి గ్రామములయందు, మంచివారు ఉన్నచోట, మంచి ప్రదేశమునందు, దేవాలయమందు, నదీతీరము నందు పురాణమును చెప్పవలెను -36. శ్రద్ధతో, భక్తితో కూడియున్నవారు, ఇతరకార్యములయందు లాలసలేనివారు, చక్కగా మాట్లాడువారు, శుచిగా ఉండువారు, ఇతర విషయములపై మనసు పోనీక ఏకాగ్రత కలిగిన శ్రోతలు పుణ్యము పొందువారు.
భక్తి లేక పురాణ కథను వినువారు మానవులలో అధములు, వారికి పుణ్యఫలములేదు, జన్మజన్మలయందు దుఃఖమే కలుగును -38. పురాణమును చక్కగా తాంబూలము మొదలైన వాటితో పూజించి భక్తితో వినువారు దారిద్ర్యమును, పాపమును పొందరు-39. పురాణ కథను విను సమయంలో మధ్యలో వదలివెళ్ళువారు భార్యను, సంపదలను కోల్పోవుదురు -40. ఉష్ణీషము ధరించి, కథయందు ఆసక్తిలేక పావనమగు కథను వినువారు మరుజన్మలో కొంగలుగా పుట్టుదురు -41. పావనమగు పురాణ కథను తాంబూలము తినుచు వినువారు కుక్క మలమును తినువాడు, నరకమునందు తప్పక పడును -42. తుంగాసనము పై కూర్చుండి పురాణ కథను విను దాంభికులు అనేకములైన నరకములను అనుభవించి, కాకులుగా పుట్టుదురు -43. ఎవరైతే వీరాసనముపై కూర్చుండి, సింహాసనముపై కూర్చుండి పురాణకథను విందురో వారు మద్ది చెట్లుగా పుట్టుదురు -44. పౌరాణి కునికి నమస్కరించక పురాణము వినువారు విషవృక్షములుగా జన్మింతురు. పడుకుని వినువారు కొండ చిలువలుగా పుట్టుదురు -45. పౌరాణి కునితో సమానమైన ఆసనము పై కూర్చుండి పురాణమును వినువారు గురుతల్పమును చేరిన పాపమును పొంది నరకమునకు పోవుదురు -46, పౌరాణికుని నిందించువారు పాపములను హరించు పురాణకథను దూషించువారు నూరు జన్మముల వరకు కుక్కలుగా జన్మింతురు.
పురాణ కథ చెప్పుచుండగా దురుత్తరము ఇచ్చువారు ముందు జన్మలో గాడిదలుగా తరువాతి జన్మలో ఊసరవెల్లులుగా జన్మితురు-48. ఎప్పుడును పురాణమును విననివారు పలునరకములను అనుభవించి అడవి పందులుగా పుట్టుదురు-49. పురాణ కథకు విఘ్నము కల్పించువారు కోటి సంవత్సరములు నరకములను అనుభవించి ఊరపందులుగా పుట్టుదురు -50. పురాణ కథను వినునప్పటికి ఎవరైతే తమ అనుమోదమును తెలియజేయుదురో వారు శాశ్వతమగు ముక్తిని పొందుదురు -51. పురాణమును చెప్పువారు. నూరుకోట్ల కల్పములు బ్రహ్మ ఎదుట నివసింతురు-52. పురాణము చెప్పువానికి ఆసనము కొరకు కంబళినిగాని, అజినమునుగాని, వస్త్రములనుగాని, మంచనుగాని ఏర్పాటు చేయువారు-53. స్వర్గము చేరి అనేక భోగములను అనుభవించి, బ్రహ్మాదిలోకములయందు నివసించి ముక్తిని పొందుదురు-54. పౌరాణికునికి శ్రేష్ఠమగు కొత్త సూత్రమును ఇచ్చువారు. ప్రతి జన్మము నందును ధనవంతులుగా, జ్ఞానవంతులుగ జన్మింతురు-55. మహాపాతకములను ఒనర్చినవారు, ఉపపాతకములకు గడగినవారు పురాణము వినుట వల్లనే పరమ పదమును పొందుదురు-56. ఈ విధముగా సూతుడు వేంకటాద్రియొక్క వైభవమును చెప్పగా విని ఋషులు వ్యాసుని యొక్క ప్రసాదమును పొందినవాడు, పౌరాణికులలో ఉత్తముడగు సూతుని యథావిధిగా పూజించి ఆనందపరవశులైరి.
ఎనభై ఒక్క వేల శ్లోకములు గల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచలమాహాత్మ్యమున అన్ని తీర్థేముల మహిమావర్ణనమునకు ఉపసంహారముతో కూడిన పురాణ శ్రవణ ప్రక్రియను వర్ణించిన ఇరవైవ అధ్యాయము.
