స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
18వ అధ్యాయము
సూతుడు చెప్పెను:- ఇపుడు వేంకటేశ్వరుని వైభవము చెప్పెదను వినుడు. దీనిని విన్నవారు అన్ని పాపముల నుండి ఎటువంటి సందేహము లేక ముక్తిని పొందును. శ్రీ వేంకటేశ్వరుని ఒక్కసారి చూచినప్పటికి అట్టి మానవుడు ముక్తిని పొంది విష్ణువుతో సాయుజ్యమొందును. కృతయుగమునందు పది సంవత్సరములలో చేసిన పుణ్యమును మానవుడు త్రేతాయుగమునందు ఒక సంవత్సరము నందే పొందును. దానిని ద్వాపరమునందు ఐదు మాసములలోనే, కలియుగములో ఒక దినము లోనే పొందును. ఆ ఫలమునకు కోటిరెట్లు శ్రీనివాసుని చూచుట చేత ఒక్క నిమిషములోనే పొందును. దీనియందు సందేహము లేదు. శ్రీవేంకటేశ్వరుని యందు అన్ని తీర్థములు కలవు. దేవతలందరు, మునులు, పితృదేవతలు అందరును కలరు. ముక్తిని ప్రసాదించు శ్రీనివాసుని ఒక్కసారిగాని, రెండుసార్లుగాని, మూడుసార్లు కాని, ఎల్లప్పుడుకాని ఎవరు స్తుతింతురో అట్టి వారు పాపముల పంజరము నుండి ముక్తిని పొందుదురు.
నారాయణుడు, పర దేవత అయిన వేంకటేశుని ఎవరు శరణు పొందుదురో, శివుని చేత బ్రహ్మ చేత పూజింపబడువాడు, సత్, చిల్, ఆనందమయమగు విగ్రహము కలవాడు అగు వేంకటేశుని ఎవరు స్మరింతురో వారికి యముని భయము కూడ లేదు. దేవదేవుడగు స్వామిని స్మరింపని వారు ఎన్ని దానములు చేసినాను, వ్రతములు, తపస్సు, యాగములు చేసినాను వ్యర్థము. అటువంటి వాడు కేవలము అజ్ఞాని, పాపి, మూగవాడు, చెవిటివాడు, జడుడు, గ్రుడ్డి వాడు అగుచున్నాడు. అట్టి వానికి ఎప్పుడు నాశనమే కలుగును. ఓ మునీశ్వరులారా! ఒక్కమారు శ్రీనివాసుని చూచినచో కాశీనిగాని, గంగనుకాని, ప్రయాగను కాని చూచినందువల్ల కలుగు అధిక ప్రయోజనము ఏమి కలదు?
దుర్లభమైన మానవ జన్మను పొందిన వారు దేవదేవుడైన శ్రీనివాసుని చూచినపుడు, అర్చించినపుడు మాత్రమే వారి జన్మము కృతార్థమైనట్లు, ఇతరులవి కావు. దేవదేవుడైన స్వామిని చూచినను, పూజించినను ఇక శివునికి, బ్రహ్మకు, ఇంద్రాది ఇతర దేవతలకు పూజలు చేయుట వలన ఫలమేమి?. స్వామి యందు భక్తి కలిగిన వారిని గురించి స్మరించినను, వారికి నమస్కరించినను మానవులు సర్వ దుఃఖముల నుండి బయటపడుదురు. వారు నరకమునకు కూడ పోరు. వేయు బ్రహ్మహత్యలు, పదివేల సురాపానములు చేసినను స్వామిని చూచినచో ఆ పాపమంతయు వెంటనే నశించును, ఎవరు స్వర్గమునందు ఎల్లప్పుడు రాజ్యము, బోగము కావలెనని కోరుకొందురో వారు సంతోషముతో ఒక్కసారి వేంకటాద్రి నివాసుడైన శ్రీనివాసునికి నమస్కరించిన చాలును.
కోటి జన్మలలో చేసిన పాపములన్నియు వేంకటేశ్వరుని దర్శించుట వలన నశించును. స్వామి వద్ద ఉండుటవల్లకాని, కుతూహలము వల్ల కాని, భయము వల్లకాని స్వామిని స్మరించినచో అట్టివారికి ఇహలోకమునందు, పరలోకమునందు దుఃఖము కలుగదు. స్వామిని కీర్తించుచు, అర్చించువారికి విష్ణు సారూప్యము ఎటువంటి సందేహము లేక కలును. అగ్ని సమిధలను కాల్చివేసినట్లు స్వామి దర్శనము పాపములను కాల్చివేయును. స్వామి యెడల భక్తి ఎనిమిది విధములు. స్వామి భక్తుల యందు వాత్సల్యము చూపుట, వారిని పూజించుట వలన సంతోషము పొందుట. స్వయముగ స్వామిని అర్చించుట, స్వామి కొరకే సర్వకర్మలను చేయుట, స్వామి, మహాత్మ్యమును వర్ణించు కథలను వినుట యందు ఆసక్తి చూపుట. వినుచున్నప్పుడు స్వరమునందు, కన్నుల యందు, దేహమునందు వికారము కలుట, ఆదరుట, స్వామిని ఎల్లప్పుడు స్మరించుట, స్వామిని ఆశ్రయించి జీవించుట. ఈ ఎనిమిది విధములైన భక్తి మేచ్చునియందు ఉన్నను అతడు ముక్తిని పొందును. బ్రహ్మజ్ఞానము చేత నిశ్చితమైన అనన్యమైన భక్తి వలన ముక్తి కలుగును.
యతులకు వేదాంత శాస్త్రము విననిదే ముక్తిలేదు. ఏలననగా ముక్తి జ్ఞానము నాశ్రయించి యున్నది. అదే విధముగా విరక్తిని పొంది యత్యాశ్రమమును అనగా సంన్యాసాశ్రమమును పొందని వానికి ముక్తి లేదు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి స్వామిని దర్శించుట చేతనే మరలివచ్చుట అనునది లేని ముక్తి ఆలస్యము లేకుండ లభించును. కృములు, కీటకములు, దేవతలు, మునులు, తాపసులు అందరును వేంకటాద్రియందు శ్రీనివాసుని దయవలన సమానులే. చా పాపము చేసితిని అని భయము అనవసరము, అదే విధముగ పుణ్య చేసితిని అని గర్వము కూడ పనికిరాదు. దేవదేవుడగు వేంకటేశుని చూచినచో తక్కు వారు ఎక్కువవారు అను భేదము లేదు. సర్వపాపములను నాశనము చేయు మహాపుణ్యప్రదమగు వేంకటాద్రియందు అందరును గొప్పవారే.
దేవదేవుడైన శ్రీనివాసుని భక్తితో నమస్కరించువానితో నాలుగు వేదములు చదివినవాడును సరికాడు. స్వామిని భక్తితో పూజించువాడు తనవారందరితో కలసి వైకుంఠమును చేరును. స్వామితో సమానమగు వేరొక దైవము లేదు. స్వామిని సేవించుటకంటే అధికమగు పుణ్యము లేదు. స్వామిని ద్వేషించువాడు మోహము చేత మాత్రమే అట్లు చేయును. నరకమునకు కారణమగు పదివేల బ్రహ్మ హత్యలు అతడు చేసినట్లగును. అతడితో మాట్లాడినంతనే ఇతరులు నరకమునకు పోవుదురు. వేదములన్ని శ్రీనివాసుని చెప్పునవే, అన్ని యాగములు శ్రీనివాసునికి చెందునవే, అందరును స్వామికి లోబడినవారే స్వామికంటే వేరైనది ఏమీ లేదు. కనుక మిగిలినవన్నియు వదలి స్పామెని సేవింపవలెను. అన్ని విధములైన యాగములను, దానములను, తపస్సులను, తీర్థ స్నానములను చేయుట వలన ఏ ఫలము కలుగునో దానికి కోటి రెట్ల ఫలము స్వామిని సేవించుట వలన కలుగును. స్వామిని రెండు ఘడియలు స్మరించినను చాలును.
ఇరవై ఒక్క తరముల వారు విష్ణు లోకమును పొందుదురు. స్వామి పుష్కరిణి యందు స్నానము, స్వామి దర్శనము కలిగినచో గంగను సేవించుట ఏల?. స్వామి కంటె వేరు దైవమును కొలచువాడు. తండ్రి రక్తముతో పుట్టని సంకరజాతి వాడగును. కనుక అన్ని విధముల దయానిధి అయిన స్వామిని చూడవలెను. ఈ విధముగ మీకు స్వామి వైభవమును చెప్పితిని. దీనిని నిత్యము విన్న వారు, భక్తితో చదివినవారు స్వామిని సేవించినఫలము నొందుదురు.
ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున వేంకటేశ్వరుని వైభవమును వర్ణించుట అను పదునెనిమిదవ అధ్యాయము.
