స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

17వ అధ్యాయము

సూతుడు చెప్పెను:- వేంకటాద్రి యొక్క మహత్తును మరింతగా చెప్పెదను. సావధానులై వినుడు. భూమిపై మరియు ఈ బ్రహ్మాండములో ఎన్ని తీర్థములు కలవో అన్నియు వేంకటాద్రి పైననే కలవు. ఈపుణ్యమయమగు పర్వతముపై శ్రీనివాసుడు నివసించుచున్నాడు. అతడు శంఖమును, చక్రమును ధరించిన వాడు, శుభకరమైన పచ్చని పట్టువస్త్రములు ధరించువాడు. వక్షస్థలము పై కౌస్తుభమణిని అలంకరించుకున్నవాడు, భక్తులకు అభయము నొసగువాడు. దేవదేవుడు, విశాలమైన కన్నులు కలవాడు, వేదముల ద్వారా తెలిసికొనదగినవాడు, ఎల్లప్పుడు ఉండువాడు. అంగ, కోసల, కర్ణాటము, కాశీ, గూర్జర, చోర, కేరల, పాండ్యమున్నగు దేశముల యందు పుట్టినవారు. తమ కుటుంబములతో కలసి ప్రతి సంవత్సరము స్వామిని సేవించుటకు వేంకటాద్రికి వత్తురు. వారితోపాటు దేవతలు, ఋషులు, సిద్దులు, సనకుడు మొదలైన యోగులు వత్తురు.

 భాద్రపదమాసమునందు వేంకటేశుని మహోత్సవమందు ఎవరైతే సేవ చేయుదురో వారందరు పాపములు నశించినవారై ఉత్తములలో ఉత్తములగుదురు. కన్యామాసమునందు బ్రహ్మ శ్రీ వేంకటేశునికి ధ్వజారోహ మహోత్సవము లోకములకు పితామహుడగు బ్రహ్మ కావించేను. కనుక ప్రతి సంవత్సరము అందరు మానవులు, దేవతలు, గంధర్వులు, సిద్దులు, సాధ్యులు. స్వామియొక్క బ్రహ్మోత్సవము నందు పొల్గొన వత్తురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారము వలె, నచ్చిన వస్తువులలో ప్రాణముల వలె ఆవులలో కామధేనువు వలె క్షేత్రములలో వేంకటాద్రి శ్రేష్టమైనది.

 అన్ని సర్పములలో శేషునివలె, పక్షులలో గరుడిని వలె, దేవులలో విష్ణువు వలె, వర్ణములలో బ్రాహ్మణుని వలె క్షేత్రములలో వేంకటాద్రి ఉత్తమోత్తమమైనది. వృక్షములలో కల్పవృక్షమువలె, మిత్రులలో భార్యవలె, తీర్థములలో గంగవలె, తేజస్సులలో సూర్యునివలె క్షేత్రములలో వేంకటాద్రి ఉత్తమోత్తమమైనది. ఆయుధములలో వజ్రాయుధమువలె, లోహములలో బంగారమువలె, విష్ణుభక్తులలో శివుని వలె, రత్నములలో కౌస్తుభమువలె క్షేత్రములలో వేంకటాద్రి ఉత్తమోత్తమమైనది. విష్ణువునకు సంతోషమును కలిగించు వాటిలో దీనిని మించినది లేదు.

  వైశాఖమాసముతో సమమైన మాసము, కృతయుగముతో సమానమైన యుగము, వేదముతో సమానమైన శాస్త్రము, గంగతో సమానమైన తీర్థము. జలదానముతో సమానమైన దానము, భార్య వలన కలుగు సుఖముతో సమానమైన సుఖము, కృషితో సమానమైన ధర్మము, కంటితో సమానమైన వెలుగు. ఆహారముతో సమానమైన తృప్తి, వ్యవసాయముతో సమానమైన వాణిజ్యము, ధర్మముతో సమానమైన మిత్రుడు, సత్యముతో సమానమైన యశస్సు ఏ విధముగ ఉండవో అదే విధముగ వేంకటాద్రితో సమానమగు స్థానము లేదు.

ఓ మునీంద్రులారా! దేనిని కీర్తించుట వలన సకల పాపములు సమసిపోవునో, దేనికి నమస్కారము చేయుట వలన సకల సౌఖ్యములు కలుగునో, దేవతలు కూడ ఎచటకు భక్తితో యాత్ర చేయుదురో అటువంటి వేంకటాద్రి బహుగొప్పది. దానియొక్క గొప్పదనమును మరల మరల చెప్పెదను. అన్ని తీర్థములు దీనియందున్నవి కనుక తీర్థములన్నిటిలోకి ఇది ముఖ్యమైనది. ఏ పుష్కరిణి యొక్క పశ్చిమ భాగమునందు సకల ప్రపంచమునకు ఉపకారము చేయువాడు, భార్యను ఆలింగనము చేసుకున్న సౌమ్యమూర్తి అయిన వరాహమూర్తి కలడో అటువంటి పుష్కరిణి యొక్క మాహాత్మ్యమును ఏ విధముగ వివరింపగలను. ఏ పుష్కరిణికి దక్షిణ భాగమున లక్ష్మీదేవిచే కౌగలింపబడిన వేంకటేశ్వరుడు, నారదుడు చిరకాలము నుండి నివసించుచుండెనో అట్టి స్వామి పుష్కరిణి యొక్క మహత్తును ఎట్లు కీర్తింపగలను?. ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ విధముగ మీకు క్షేత్ర మాహాత్మ్యమును చెప్పితిని. దీనిని భక్తితో విన్నవారు ఎల్లప్పుడు విష్ణులోకము నందు నివసింపగలరు.

ఎనభై ఒక్క వేల శ్లోకములుగల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున క్షేత్రముయొక్క మహిమను వర్ణించుట అను పదిహేడవ అధ్యాయము.