స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
16వ అధ్యాయము
శ్రీ వేంకటాద్రియందు జలదానము యొక్క ప్రశంస
సూతుడు పలికెను:- మహా పుణ్యప్రదమగు వేంకటాద్రియందు ముఖ్యముగా దప్పిగొన్న వారికి నీటిని ఇవ్వనివారు పశుపక్ష్యాదులుగా జన్మింతురు. కనుక వేంకటాద్రియందు శక్తిని అనుసరించి జలదానము చేయవలెను. ఎల్లరకు నీరు అత్యంత ఆవశ్యకమైనది. దీనికి ఉదాహరణముగా ఒక పురాతనమైన కథను వినిపించెదను. బ్రాహ్మణునికి బల్లికి జరిగిన పరమాద్భుతమైన సంవాదమును వినుడు.
అతడు చేయని దానము లేదు. కాని సులభముగా దొరుకునని ఒక్క జలదానము మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడు, మహాత్ముడు అగు వసిష్ఠుడు దానిని గూర్చి చెప్పెను. అయినప్పటికి వెలలేనిది, అన్ని చోట్ల సులభముగా దొరకనది అగు నీటిని దానమిచ్చినందు వలన పుణ్యము ఏమి కలుగును. అను చెడు ఆలోచన కలవాడై హేతువాదముతో ఆ రాజు నీరు దానముగా ఇవ్వలేదు. దొరకని వస్తువును దానమిచ్చినచో పుణ్యము కలుగును అని యుక్తియుక్తముగ వాదించెను. అతడు వికలాంగులైన బ్రాహ్మణులను, పేదవారికి, పనిలేనివారికి ఆదరించి సంబవించేను. వేదము చదివిన వారిని బ్రహ్మజ్ఞానము పొందిన వారిని, వేదాంతులను అర్చింపలేదు. పేరు పొందిన వారిని అన్ని లోకములయందు అందరు పూజింతురు. అనాథలను, విద్యలేని వారిని, వికలాంగులను, కుటుంబముకల పేదవారిని ఎవరు చూచుదురు అని వాదించి వారి పై నేను కరుణ చూపెదను అని తాను సంపాదించినదంతయు అపాత్రులకు దానమిచ్చెను.
అటువంటి గొప్ప తప్పు చేయడం వలన అతడు మూడు జన్మలయందు చాతక పక్షిగా జన్మించెను. తరువాత మిథిలాధిపతి అయిన శ్రుతకీర్తి ఇంటియందు బల్లిగా జన్మించెను. ఇంటి ద్వారమునకు ఉన్న గవను పై ఉండి పురుగులను పట్టి తింటూ ఎనభై ఎనిమిది సంవత్సరములు గడి పెను.
శ్రుతదేవుని పాదోదకమును సేవించుట వలన హేమాంగునికి జాతి గుర్తుకు వచ్చుట:- ఒకనాడు విదేహాధిపతి అయిన శ్రుతకీర్తి ఇంటికి శ్రుతదేవుడను ఋషి మిక్కిలి అలసిన వాడై మధ్యాహ్న సమయమున ఏతెంచెను. రాజు అతడిని చూచి మిక్కిలి సంతోషించి వెంటనే లేచి నిలబడి మధుపర్కము చేత చక్కగా పూజించి, అతడి పాదముల పై చల్లిన వీటిని తీసుకుని తన తల పై జల్లుకుని, ఇంటి అంతట పడునట్లుగా పైకి ఎగురవేసెను. విధివశాత్తు ఆ నీటి తుంపరలు బల్లి పై కూడా పడెను.
వెంటనే ఆ బల్లికి పూర్వస్మృతి కలిగెను. తాను చేసిన పొందిన కర్మఫలితము గుర్తుకు రాగా శ్రుతదేవునితో రక్షింపుము రక్షింపుము అని వేడెను. ఆ బ్రాహ్మణుడు బల్లి మాట్లాడుతూ చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఓ బల్లీ! నీవే కారణము వలన వేంకటాచల మాహాత్య్మం - పదహారవ అధ్యాయము . ఏడ్చుచున్నావు. ఏ కర్మ చేయుట వలన నీకిట్టి దశ పట్టినది. నీవు ఉపదేవుడవా లేక దేవతలలో ఒకడవా, రాజువా లేక బ్రాహ్మణుడవా, నీ వెవరో చెప్పుము. నేను నిన్ను సముద్ధరింపగలను. అని పలుకగా రాజు, ఓ మహాప్రభూ! నేను ఇక్ష్వాకువంశమునందు పుట్టినవాడను, శస్త్రవిద్యలన్నిటిని నేర్చినవాడను. భూమిపై ఎన్ని రేణువులున్నవో, ఎన్ని నీటి చుక్కలు ఉన్నవో, ఆకాశములో ఎన్ని నక్షత్రములు ఉన్నవో అన్ని ఆవులను దానమిచ్చితిని. అన్ని విధములైన యజ్ఞములను యాగములను చేసితిని, ఎన్నో విధములైన దానములిచ్చితిని, ధర్మమంతయు చక్కగా అనుసరించితిని.
అయినప్పటికి ఇటువంటి దుర్గతి పట్టినది ఊర్థ్వగతి లేకున్నది. మూడుమార్లు చాతక పక్షిగ, ఒకమారు గ్రద్దగ పుట్టితిని. ఏడు జన్మలలో కుక్కగా పుట్టి ఇప్పుడు బల్లిగా జన్మించితిని, ఈ రాజు మీ పాదోదకమును పైకి జల్లగా కొన్ని చుక్కలు నాపై పడి పూర్వజన్మ స్మృతి కలిగినది. ఇటువంటి బల్లి జన్మలు మరి ఇరవై ఎనిమిది విధిచే నిర్ణయింపబడినట్లు తెలియుచున్నది. ఈ జన్మల చేత నాకు మిక్కిలి భయము కలుగుచున్నది. కాని దీనికి కారణము నాకు తెలియదు. అది నాకు విస్తారముగా తెల్పవలసినది. అని అడుగగా ఆ బ్రాహ్మణుడు విజ్ఞానచక్షువుచే కారణమును తెలుసుకొనెను.
శ్రుతదేవుడు ఇచ్చిన పుణ్యము వలన హేమాంగునికి బల్లిరూపమునుండి విముక్తి:- ఓ రాజా వినుము. నీ ఈ దుర్గతికి కారణము చెప్పెదను. నీవు వేంకటాద్రి యందు జలదానము చేయలేదు. ఆ జలము సులభమని, మూల్యము లేనిదని తలచి మండువేసవిలో దప్పిచే బాధపడు బ్రాహ్మణులకు నీటిని ఇవ్వనైతివి. ఆ విధముగా పాత్రులైన వారికి , జలదానము కావింపక అపాత్రులయందు ఎన్నో దానములు చేసితివి. మండుచున్న అగ్నియందు వేల్చవలెను కాని, బూడిదయందుకాదు కదా!. తులసిని వదలి పెట్టి దేవదారు ఆకులచే పూజచేయరు కదా! అనాథలకు, వికలాంగులకు సహాయము చేయుటవలన ప్రయోజనము లేదు. వారి పై దయ చూపవచ్చును. కాని తపోవిష్ణులు, జ్ఞానవిష్ణులు, వేదశాస్త్ర పారంగతులు సాక్షాత్తు విష్ణు స్వరూపులు కనుక వారిని తప్పక పూజింపవలెను. ఇతరులను కాదు. వారియందును బ్రహ్మజ్ఞానము కలవారు. విష్ణువుకు ఎల్లప్పుడు ఇష్టులు. అటువంటి జ్ఞానులకు కూడ విష్ణువే ఇష్టుడు. కనుక జ్ఞానిని ఎప్పుడును పూజింపవలెను. పూజింపదగిన వారిలో కెల్ల పూజ్యుడు జ్ఞాని.
ఈ విధముగా నీవు జలదానమివ్వలేదు, సాధువులను సేవింపలేదు. కనుక ఓ రాజా! నీకిట్టి దుర్గతి పట్టినది. వేంకటాద్రి యందు చేసిన పుణ్యము కొంత నీకు నీ పాపము శాంతించుటకు ఇచ్చెదను. దాని వలన నీవు చేసిన చేయబోవు కర్మల ఫలితమును జయింపగలవు. అని పలికి నీటిని తాకి వేంకటాద్రిపై తాను స్నానము చేసిన ఒక దినము యొక్క పుణ్యమును రాజుకు ధారపోసెను. ఆ పుణ్యముచే అన్ని పాపములు నశింపగా ఆ బల్లి తన రూపమును విడచి పురుషునిగా మారేను. ఆ హేమాంగుడు దివ్య విమానము నెక్కి దివ్యములైన మాలలను వస్త్రములను ధరించి మిథిలాధిపతి అయిన శ్రుతకీర్తి ఇంటియందు సాధువులందరు చూచుచుండగా చేతులు జోడించి బ్రాహ్మణునికి ప్రదక్షిణ చేసి, నమస్కరించి, అనుమతి తీసుకుని దేవతలందరు స్తుతించుచుండగా స్వర్గమునకు వెళ్లాను.
అచట సకల విధములైన మహాభోగములను పదివేల సంవత్సరములు అనుభవించి తిరిగి ఇక్ష్వాకు వంశమునందు కకుత్తుడను పేర జన్మించెను. ఏడు ద్వీపములను పరిపాలించుచు, వేదములు చదవి, మంచివారందరిచే ప్రశంసింపబడి, దేవేంద్రునితో సమానుడై, విష్ణువు అంశ కలగి ఉండేను. వసిష్ఠునిచే ప్రబోధము పొంది, అన్ని ధర్మములను తెలిసికొని, పాటించి, అన్ని విధములైన పాపములను పోగొట్టుకొనేను. చివరకు దివ్యజ్ఞానమును పొంది, విష్ణువుతో సాయుజ్యమందెను. ఈ విధముగా వేంకటాద్రి పుణ్యప్రదము, పాపనాశకము. అచట జలదాన మిచ్చుట వలన విష్ణులోకప్రాప్తి కలుగును. ఈ విధముగా మీకు పరమ పుణ్యప్రదమైన పాపనాశకమైన వేంకటాద్రి యందు జలదానము చేయుట వలన కలుగు ఫలము చెప్పితిని.
ఎనభైఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున జలదానముయొక్క మాహాత్మ్యమును వర్ణించు పదహారవ అధ్యాయము.
