స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

8వ అధ్యాయము

వరాహస్వామి చెప్పెను: - తరువాత దేవాధిదేవుడైన స్వామి తన కిష్టురాలైన లక్ష్మిని పిలచి ఓ కల్యాణీ! వివాహము కొరకు ఇపుడేమి చేయవలెనో చెప్పుము. ఓ రమా! నీ సఖులను ఆజ్ఞాపించుము, నాకిష్టమైన దానిని చేయుము అని పలుకగా లక్ష్మీ తన చెలికత్తెలను పిలచి వారిని స్వామి అలంకారమునకై ప్రేరేపించెన. లక్ష్మి ఆజ్ఞను పొంది ప్రీతి సుగంధ భరితమైన తైలమును కొనివచ్చెను. శ్రుతి పట్టు వస్త్రములతో స్వామి సన్నిధియందు నిలచెను. స్మృతి సంతోషముతో ఆభరణములను తీసుకొని వచ్చెను. ధృతి అద్దమును పట్టుకొనెను. శాంతి కస్తూరిని ధరించెను. ప్రీ కర్పూరము, అగరు మొదలైన వాటితో చేసిన యక్షకర్దమమును తీసుకువచ్చేను. కీర్తి బంగారు పట్టమును, రత్నములతో కూడిన కిరీటమును పట్టుకొనెను. శచీదేవి ఛత్రము పట్టగా, ఒక చామరమును సరస్వతి, మరొక దానిని పార్వతి పట్టిరి. విజయ అజయ విసనకర్రలు పట్టుకొనిరి.

 అన్ని వస్తువులను తీసుకొని వచ్చిన వారిని చూచి లక్ష్మి వెంటనే లేచి సుగంధయుక్తమైన నూనెతో స్వామి తల అంటెను. గంధ చూర్ణముతో నలుగు పెట్టి, ఏనుగులచే తేబడిన బంగారు కుండలలోని నీటితో స్నానము చేయించెను. ఆకాశగంగాది సర్వతీర్థముల నుండి తీసుకొని వచ్చిన, కర్పూరము మొదలైన వాటితో సుగంధముగా నున్న ఆ బంగారు కుండలలోని నీటిని ఒకదాని తరువాత ఒకటిగా తీసుకొని లక్ష్మీ స్వామికి స్నానము చేయించెను. తరువాత నల్లని వెంట్రుకలకు పొగపట్టి ముడివేసెను. బంగారము వర్ణములో ఉన్న సుగంధమయ అనులేపములతో స్వామి దేహమును అలదెను. పచ్చని పట్టువస్త్రాన్ని కట్టి మొలకు మొలతాటిని కట్టి, కిరీటము మొదలైన ఆభరణము లన్నింటిని అలంకరించెను. రత్నాంగుళీయకములను అన్ని వేళ్లకు తొడిగెను. ధృతి స్వామికి అద్దమును చూపెను. ఆ అద్దమున చూచుకొని స్వామి స్వయముగా ఊర్థ్వ పుండ్రములను దిద్దుకొనెను. తరువాత లక్ష్మితో కలసి గురుడిని పై ఎక్కెను.

 బ్రహ్మాదులతో కలసి శ్రీనివాసుడు ఆకాశరాజపురమునకు వచ్చుట:- బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు మొదలైన వారు సేవించుచుండగా, వసిష్ఠాది మునులతో, సనకాది యోగులతో, భక్తులతో, భాగవతులతో కలిసి స్వామి నారాయణ పురికి వెళ్లాను. గంధర్వులు పాటలు పాడిరి, అప్సరసలు నాట్యము చేసిరి. స్వామి సన్నిధియందు దేవదుందుభులు మ్రోగినవి. మునులు స్వస్తి వాచకములు పలుకుచు స్వామిని అనుసరించిరి. స్వామి దేవగణములతో, విష్వక్సేనుడు మొదలైన పార్షదులతో, వకులాది సభ్యులు రథములపై వెంట రాగా చక్కగా అలంకరింపబడిన ఆకాశరాజపురమును చేరుకొనేను.

పద్మాపతి పరిణయ ఘట్టము:- స్వామి నగరమునకు చేరిన తరువాత, వధువు పద్మావతి ఐరావతము పై ఎక్కి నగరమునకు ప్రదక్షిణ చేసి గోపురము వద్దకు వచ్చి నిలచెను. వధూవరులను ఆకాశరాజు తీసుకొని వచ్చి బంధువులతో కలసి వేచియుండెను. అపుడు స్వామి తన మెడలోనున్న మాలను తీసి చిరునవ్వుతో పద్మావతి మెడలో వేసెను. పద్మావతి కూడా మల్లికలతో కూర్చిన మాలను స్వామి మెడలో వేసెను. ఈ విధముగా వారిరువురు మూడు సార్లు చేసి తరువాత తమ తమ వాహనములపై నుండి దిగిరి. పిమ్మట పీఠముపై ఒక్క క్షణము కూర్చుని శుభకరమైన గృహము నందు ప్రవేశించిరి. వారితోపాటు బ్రహ్మాది దేవగణములు కూడా ప్రవేశించినవి. బ్రహ్మ వారిచేత మంగళసూత్రమును కట్టుట, అంకురార్పణము చేయుట మొదలైనవి చేయించెను, లాజహోమము ముగిసిన తరువాత వ్రతాదేశమును పొంది వధూవరులిద్దరు శయనించిరి. నాల్గవ దినమున అంతయుపూర్తి చేసి బ్రహ్మ ఆకాశరాజు వద్ద వీడ్కోలు తీసుకుని గరుడుని పై విష్ణువును ఇద్దరు దేవేరులతో కూర్చుండబెట్టి బయలుదేరెను . దివ్య దుందుభులు మ్రోగుచుండగా వృషభాద్రికి చేరి బ్రహ్మాదులు దేవతా గణములు దేవదేవుని స్తుతించిరి. శుకుడు మొదలైన మునిగణములు కూడ స్వామిని స్తుతింపగా సంతోషించి స్వామి మణి మండపమునందు ప్రవేశించెన. లక్ష్మీ పద్మావతులతో కలిసి సింహాసనము వద్దకు వెళ్లాను.

          వధూవరులకు ఆకాశరాజు కానుకల నిచ్చుట:- అపుడా ఆకాశరాజు ఇంద్రాదులతో కలసి తన కుమార్తెకు, విష్ణువుకు. కానుకలనిచ్చుట మొదలు పెట్టెను. బంగారు గుండిగలలో వరి ధాన్యమును, అనేక పాత్రలతో పెసలను, వందల కొలది నేతి కుండలను ఇచ్చెను. వేలకొలది పాలకుంపలను, మరెన్నో పెరుగు కుండలను, దివ్యములైన మామిడి, అరటి, 'కొబ్బరి కాయలను ఇచ్చెను. ఉసిరికాయలను, గుమ్మడి పండ్లను, బొంత అరటి పండ్లను, పనస పండ్లను, మాదీఫలములను, చక్కెరతో నిండిన కుండలను ఇచ్చెను. బంగారము, మణులు, ముత్యములు, పట్టుపుట్టములను, కోట్ల కొలది దాసీలను, దాసులను ఆవులను ఇచ్చెను. హంసలవలె, చంద్రుని వలె తెల్లగా ఉన్న పదివేల గుర్రముల నిచ్చెను. ఎత్తుగా ఉన్నవి, ఎల్లప్పుడు మత్తు కలిగి ఉన్నవి అయిన ఏనుగులను నూటికి పైగా ఇచ్చెను. అంతఃపురంలో సంచరించువారు, నాట్యమునందు, గానమునందు నైపుణ్యము కలవారు అయిన నాలుగు వేల మంది స్త్రీలను శ్రీనివాసుడైన విష్ణువుకు సమర్పించెను. వీటన్నిటిని ఇచ్చి స్వామి ఎదుట నిలచెను.

అథ శ్రీనివాస కృపయా వియర్రాజస్య భక్తిరూపవరప్రాప్తి:

 శ్రీనివాసుని కృపవలన ఆకాశరాజు భక్తిరూపమైన వరమును పొందుట:- ఇద్దరు దేవేరులతో కూడిన ఆ శ్రీనివాసుడు ఇది అంతయు చూచి మిక్కిలి సంతోషించెను. అట్లు మిక్కిలి సంతసించిన వేంకటేశ్వరుడు తన మామగారిని చూచి ఓ రాజా! నేకేదైన వరము కావలనన్న కోరుకొనుము అని అడిగెను. అది విని ఆకాశరాజు ఓ దేవా నీ పాదపద్మముల యందే నా మనస్సు ఎల్లప్పుడు ఎటువంటి చాంచల్యము లేక లగ్నమై ఉండునట్లు వరమిమ్ము. నాకు నీ యందు నిశ్చలమైన భక్తి కలుగుగాక అని కోరెను.

స్వామి పలికెను:- ఓ రాజేంద్రా! నీవేదైతే అడిగితివో అది అంతయు కాగలదు అని వరమిచ్చియథోచితముగా సమ్మానించెను.

వివాహమునకు వచ్చిన బ్రహ్మాదులు తమ తమ ఇళ్లకు వెళ్లుట:- తరువాత విష్ణువు బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలనందరిని తగినట్లు సత్కరించి వారి వారి ఇళ్లకు వెళ్లుటకు అనుమతిని ఇచ్చెను. వారందరు వెళ్లిన తరువాత లక్ష్మీ పద్మావతులతో కలసి స్వామి పుష్కరిణి తీరమందు పూర్వమువలె సంచరించుచు కుమారస్వామిచే దివ్యాలయమందు అర్చింపబడుచు ఉండెను.

ఎనభైఒక్క వేల శ్లోకములుకల శ్రీస్కాంద మహాపురాణమందలి రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందలి ధరణీ వరాహసంవాదమున బ్రహ్మాదులతో కలసి శ్రీనివాసుడు ఆకాశరాజు పురమునకు వెళ్లుట. పద్మావతితో వివాహము మొదలైనవి వర్ణించుట అను ఎనిమిదవ అధ్యాయము.