స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
5వ అధ్యాయము
వరాహస్వామి చెప్పెను:- శ్రీనివాసుడు తన ఇంటికి చేరి ఉత్తమాశ్వము పై నుండి దిగి కిరాతరూపంలో ఉన్న తన అనుచరులైన దేవతల నందరిని విడచెను. విశ్రాంతి పొందుదమని పలికి మణిమండపమున ప్రవేశించెను. మణులతో చేసిన మెట్లనెక్కి అయిదు కక్షలను దాటెను. ముత్యములతో చేసిన గృహమును చేరుకుని, దానియందు అటు ఇటు మెల్లగ ఊగుచున్న నవరత్నమయమైన ఊయల మంచమునందు శ్రీనివాసుడు కూర్చుండెను. పద్మగర్భమువంటి శోభకల్గిన, విశాలమైన కన్నులుకల, సన్నని నడుముగల, పీనకుచములుకల, మందస్మితముచే అలంకరింపబడిన ముఖాంబుజముగల ఆ పద్మావతినే తలచుకొనెను. ఆమె సాక్షాత్తు పాలకడలి కూతురైన లక్ష్మియే అని తలచి, ఆమె యండు లగ్నమైన మనస్సు కలవాడై అతడు మోహమును పొందెను.
అథ ముహ్యమానం శ్రీనివాసం ప్రతి వకులమాలికోక్తి:
విరహముచే బాధపడుచున్న శ్రీనివాసునితో వకులమాలిక పలుకులు:- తరువాత మధ్యాహ్న సమయమందు దివ్యము, ఉత్తమము అయిన అన్నమును చేసి, సుగంధయుక్తమైన, దేవతలకు తగిన, చక్కని సూపమును, శుద్దాన్నమును, పాయసాన్నమును, బెల్లముతో చేసిన అన్నమును, పెసలు కలిపిన అన్నమును (పొంగిలి)చే అయిదు విధములైన అపూపములను, పూరీలను తయారు చేసి, శ్రీనివాసునికి చెలికత్తె అయిన వకులమాలిక ఇతర చెలికత్తె లయిన పద్మావతి, పద్మ పత్ర, చిత్రరేఖలతో కలసి స్వామిని దర్శించుటకు ఏగెను. మిగిలిన చెలికత్తెలను ద్వారమువద్దనే నిలపి వకులమాలిక ఒక్కతియే స్వామిని సమీపించెను. స్వామిని సమీపించి భక్తిభావముతో నమస్కరించెను. రత్నభూషితమైన ఊయల మంచమందు వివశుడైపరుండి ఉన్న స్వామిని చూచెను. కళ్లు మూసుకుని ఉన్న స్వామి పాదములు ఒత్తి, ఏదియో ఆలోచించుచున్న స్వామీతో ఇట్లనెను. ఓ దేవదేవేశా! లెమ్ము, ఏమి ఆలోచించుచున్నావు? పరమాన్నమును తయారు చేసితిని, భుజించుటకు రమ్ము. అన్ని లోకముల ఆర్తిని నాశనము చేయగలవాడా! నీవే సుడిగుండములో చిక్కినట్లు ఆలోచించుచున్నావు. వేటకు వెళ్లినపుడు వనమున ఏమి చూచితివి?. నీ స్థితి చూచినట్లయితే కామముచే బాధపడుచున్నట్లున్నది. నీవెవరిని చూచితివి? ఆమె దేవకన్యయా, మానవ కన్యయా లేక నాగకన్యయా?. నీవేమీ సంకోచింపక నీ మనస్సును హరించిన ఆ కన్యను గూర్చి తెల్పుము.
స్వామి పలికెను:- పూర్వము త్రేతాయుగమందు నేను రావణుని వధించితిని. అపుడు వేదవతి లక్ష్మీదేవికి మిక్కిలి సాహాయ్యము చేసినది. లక్ష్మి జనకుని కుమార్తెగా భూమినుండి పుట్టి సీత అయినది. పంచవటి యందు మారీచుని చంపుటకు నేను వెంబడించితిని. సీత ప్రేరణచేత లక్ష్మణుడు కూడ ఆశ్రమమును విడచి బయలు దేరెను. ఆ సమయంలో సీతను అపహరించుటకు రావణుడు వచ్చెను. అగ్నిహోత్రమునందున్న అగ్నిదేవుడు రావణుని ప్రయత్నమును తెలుసుకుని, సీతను తీసుకొని పోయి పాతాళమునందు స్వాహా దేవి యందు ఉంచెను. ఆ రావణుని సంహరించుటకు, పూర్వము రావణునిచే తాకబడినది, ఆ అవమానము భరింపలేక అగ్నియందు ప్రవేశించి ఆత్మార్పణము కావించినది. అయిన వేదవతిని సీతారూపమునందే కొనివచ్చి ఆశ్రమమునందు ఉంచెను. ఆ వేదవతి రావణునిచే అపహరింపబడి లంకలో ఉంచబడినది. రావణ సంహారానంతరము ఆమె తిరిగి అగ్ని ప్రవేశము చేసినది. అన్ని అంతకాలము స్వాహా దేవి యందు ఉంచిన సీతను కొనివచ్చి నా చేతి యందుంచి ఇట్లు పలికెను. ఈమె వేదవతి సీతకు ప్రియమును చేసినది. సీతకు బదులుగా లంకలో రాక్షసుల వద్ద బందీగా ఉన్నది. కనుక మీరీమెను వరమిచ్చి సంతోషింప జేయవలయును. అని అగ్ని చెప్పగా సీత ఇట్లనెను. ఈ వేదవతి ఎల్లప్పుడు నాకు ప్రియమును కలిగించునది. కనుక మీరీమెను వివాహమాడవలయును.
స్వామి చెప్పెను:- ఓ దేవి! నీవు చెప్పినట్లే కాగలదు. రానున్న ఇరవై ఎనిమిదవ కలియుగములో నేనీమెను పరిణయమాడగలను. అప్పటి వరకు ఈమె దేవతలచే పూజింపబడుచు బ్రహ్మలోకములో నివసించుగాక. తరువాత ఆమె భూమి నుండి ఉద్భవించి ఆకాశరాజు కూతురు కాగలదు అని నా చేత, లక్ష్మి చేత ఆమె వరమును పొందినది. ఆమె ఇపుడు నారాయణపురములో జన్మించినది. ఆమె లక్ష్మితో సమానమైనది, పద్మములవంటి కన్నులు కలది. లక్ష్మి చేత వరములు పొందినది. ఆమె తనకు సమానులైన చెలులతో పుష్పవనంలో పూవులు కోయుచుండగ వేటకై వెళ్లిన నేను అచటకు వెళ్లితిని. ఆమె రూపమును వర్ణించుట వందసంవత్సరములలో కూడా సాధ్యము కాదు. సాక్షాల్లక్ష్మీరూపము కలిగిన ఆమెతో నాకు సమాగమము ఏర్పడినట్లైతే నా ప్రాణములు నిలువగలవు.
ఆకాశరాజు నగరమును గూర్చి వకులమాలిక వెళ్లుట:- ఓ వకుల మాలికా! నీవు అచ్చటికి వెళ్లి ఆ కన్యను చూడుము. రూపలావణ్యములయందు ఆమె ఈడైనదా కాదా చూడుము. ఆమె దేనిలోను తీసిపోనిది, విశాలమైన కలువల, తామరలు వంటి కన్నులు కలది. అని వివశుడైన స్వామితో వకులమాలిక ఇట్లనెను. నీ మనస్సుకు నచ్చిన ఆమె వద్దకు ఇప్పుడే వెళ్లేదను. ఆచటకు వెళ్లుటకు నాకు మార్గమును తెల్పుము. అని పలుకగా స్వామి ఇట్లు చెప్పెను. ఓమహాభాగా! నీవిచటి నుండి నృసింహ గుహవైపుగా వెళ్లి కొండ దిగుము. అపుడు నీవు అగస్త్యాశ్రమమును చేరుకొందువు. అచట అగస్త్యునిచే అర్చింపబడిన లింగము కలదు. ఆ అగస్త్యేశుడు సువర్ణముఖరీ నదీ తీరమునందు కలడు. ఆ నదీ తీరము వెంటనే వెళ్లినచో నీవు శుకబ్రహ్మ ఆశ్రమమునకు చేరగలవు. అచట సువర్ణ ముఖరీనది ఎగిరి పడుచున్న కెరటములతో ఉండును.
అచట పద్మములతో నిండిన పద్మ సరోవరము కలదు. అచట స్నానము చేయుము. ఆ సరస్సు తీరమునందు తపస్సు చేసుకొను మునిసత్తముడైన ఛాయాశుకుని దర్శించి నమస్కరించుము. అచటనే బలరామునితో కూడి ఉన్న కృష్ణుడు కలడు. శుకమహాముని ఎల్లప్పుడు ఆ కృష్ణుని అర్చించుచుండును. కృష్ణుడు ఇంద్రనీల మణివంటి వర్ణనము కలిగి పచ్చని పట్టు వస్త్రములను ధరించియుండును. బలభద్రుడు తెల్లని వర్ణము కలిగి తీర్థయాత్రకు పోవుటకు సిద్దముగా ఉండును. అటువంటి బలభద్రుని ముత్యములతో నిండిన చేతులతో కృష్ణుడు అర్చించుచుండును. అటువంటి బలభద్రునికి నమస్కరింపుము ఆ సరస్సునుండి ఒక బంగారు కమలమును తీసుకొని సువర్ణ ముఖరీ నదిని దాటుము. అరణీతీరమును చేరి అచట నున్న వనమున విశ్రాంతి తీసుకొనుము. పిమ్మట నారాయణపురమును చేరుకొందువు, దానిని చూచి మిక్కిలి ఆశ్చర్యపడగలవు.
ఆ నారాయణపురపు ఉపవనంలో ఎన్నో వృక్షములు ఉన్నవి. వాటికి పూలు, పండ్లు సమృద్ధిగా ఉన్నవి. అచ్చట పనస, మామిడి, దిరిసెన, మొల్ల, తుమ్మికి, కలిగొట్టు చెట్లు ఉన్నవి. ఇంకా పున్నాగ, నాగ, ఉలిమిరి, తియ్యమామిడి, ఊడుగ, సంపెంగ, పొగడ, ఉసిరిక, మద్ది, తాటి, గిరకతాటి, పద్మక వృక్షములు కలవు. మరియు నేరేడు, వేప, కడిమి, ఏలకు, పిప్పలి, ఇప్ప, తెల్లగన్నేరు, ప్రేంకణ, హింగు, ఖర్జూర, మాయూర, అశోక, లోద్దుగ చెట్లు కలవు. రావి, మేడి, జువ్వి, రేగు, బూజపితిరి, వెదురు, చింత, మోదుగ, మందార, బూరుగ, మాదిఫలవృక్షములు కలవు. మరియు పోక, నారింజ, గజనిమ్మ, కొబ్బరి చెట్ల తోటలు కలవు. మల్లిక, మాలతి, మొల్ల, అడవి మొల్ల, గేదంగి, గన్నేరు, తామర మొదలగునవి. పెద్ద అరటి ఉన్నవి. నెమళ్లు, చిలుకలు, గ్రద్దలు, బెగ్గురు పక్షుల గుంపులు కలవు. తుమ్మెదల ఝుంకారములతో నిండిన మనోహరములయిన పొదరిండ్లను చూచుచు, ఆ నదీ తీరమునందే వెళ్లుము. ఈశాన్యముగ వెళ్లినచో కొంత దూరమున దేవేంద్ర నగరముతో సమానమైన నారాయణపురిని చూడగలవు. అరణినది నీరు ఆ నగరపు కందకములలో ప్రవహించుచు గంగానది చుట్టినదా అన్నట్లుండును-54. అటువంటి ఆకాశరాజు యొక్క నగరమునకు వెళ్లి తగిన విధముగా చేయము.
వరాహస్వామి చెప్పెను:- అని చెప్పి స్వామి ఆ వకులాదేవికి వీడ్కోలు చెప్పి శుభ్రమైన శయ్యయందు విశ్రమించెను. ఆ వకులమాలిక దేవదేవునికి మొక్కి, గురివింద గింజవంటి ఎరుపుగల ఎర్రని వర్ణముగల అశ్వమునెక్కెను. స్వామి వర్ణించిన మార్గముననుసరించుచు మార్గమధ్యమున అనేక మృగములను చూచెను. పర్వతాకారులను కలిగి, తెల్లని దంతములతో అలరాచున్న, ఆడు ఏనుగుల గుంపుల చేత అనుసరింప బడుచున్న మదగజములను, తెల్లని దట్టమైన మేఘముల వర్ణము కలిగిన, ఆడు సింహముల గుంపులచే అనుసరింపబడుచున్న సింహములను చూచెను. శార్దూలములను, ఎలుగుబంట్లను, ఖడ్గమృగములను, శరభములను, గవయములను, నల్ల జింకలను, నక్కలను, కుందేళ్లను, మచ్చల జింకలను చూచెను. బెగ్గురు పక్షులను, నెమళ్లను, అడవి పిల్లులను, తోడేళ్లను, చిలుకలను, అడవి పందులను, సువాచ పక్షులను చూచెను. వివిధ ఆకారములలో ఉన్న వాటిని చూచి ఆనందించుచు, చెట్లచే దట్టముగా ఉన్న అరణీనది ఎడమ వైపు తిరమును చేరెను. అగస్త్యేశునికి సమీపమున తన ఎర్రని అశ్వము పై నుండి దిగి, అగస్త్యునిచే పూజింపబడిన లింగమును చూచెను. అచట స్నానము చేసి, నీరు త్రాగి నదీతీరమునందే విశ్రమించెను.
దివ్య ఉద్యానమందు వకులమాలిక పద్మావతి సఖులతో మాట్లాడుట రాచనగరునుండి కొందరు స్త్రీలు శివుని సన్నిధికి వచ్చిరి. వచ్చిన ఆ పద్మావతి చెలులను వకులమాలిక చూచెను, వారి సమీపమునకు వెళ్లి ఆమె ఇట్లడిగెను.
వకులమాలిక అడిగేను:- విచిత్రములైన ఆభరణములను, దండలను ధరించిన మీరెవరు? ఎచటి నుండి ఇచటకు వచ్చిరి. ఏమి పని అని. ఆమె మాటలను విని వారు చిరునవ్వు నవ్వి ఇట్లనిరి. ఓ దేవీ! వివరముగా చెప్పెదము, శ్రద్ధగా వినుము.
ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల .
మాహాత్మ్యమున ధరణీవరాహ సంవాదమున పద్మావతి దర్శనము చేత శ్రీనివాసుడు విరహమును పొందుట మొదలగునవి వర్ణింపబడిన అయిదవ అధ్యాయము.
