స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
7వ అధ్యాయము
ధరణీ పలికెను:- శ్రేష్టురాలైన ఈ కన్య మీకు ఎక్కడ కలసినది? ఇక్కడకు ఎందుకు వచ్చినది? ఈమె పూజింపదగిన దానివలె కనిపించుచున్నది.
కన్యకలు పలికిరి: - ఓ దేవీ! ఈ దివ్యాంగన నిన్ను చూడవలెనని వచ్చినది. శివుని సన్నిధియందు దేవాలయమున మాతో కలసినది . మేమడుగగా మిమ్ము చూడవలెనని, అంతఃపురము నందు మిమ్ము సులభముగా కలుసుకొనుటకు వీలగునా అని ప్రశ్నించగా మేము ధరణీదేవి సేవకురాళ్లమని, మాతో వచ్చినచో ఆమెను సులభముగా దర్శింపవచ్చునని. పలుకగా ఈమె మాతో వచ్చినది కనుక ఆమె రాకకు కారణమును అడిగి తెలుసుకొనవచ్చును.
వరాహస్వామి చెప్పెను: - వారి మాటలను విని వసుంధర ఇట్లడిగెను-6.
ధరణి పలికెను:- ఓ దేవి! నీ వెచటి నుండి వచ్చితివి, నాతో పని ఏమి? నిజముగా నీవు వచ్చిన పని చెప్పుము. నేను చూసెదను.
వకులమాలిక పలికేను:- నేను వేంకటాద్రి నుండి వచ్చితిని. నా పేరు వకులమాలిక-. నారాయణుడు మాకు స్వామి. అతడు శ్రీ వేంకటాచలము పై నివసించును. ఒకసారి హంసవలె తెల్లగా ఉన్నది, మనస్సు వలే వేగముగా పోవునది అయిన అశ్వమునెక్కి వేటకై బయలుదేరి వనములలో తిరుగుచు, అచటచట, సుందరములైన సరస్సులను చూచెను. ఆ వనములయందు ఏనుగులను, సింహములను, గవయములను, శరభములను, నల్లచార దుప్పులను, చిలుకలును, పావురములను, హంసలను, మరెన్నో పక్షులను చూచెను. తరువాత ఒక చోట ఏనుగుల గుంపుకు నాయకత్వము వహించుచున్నది, మదము వర్షించుచున్నది. ఆడు ఏనుగులతో కూడి ఉన్నది. ఎత్తైనది. అయి ఉన్న ఒక గజరాజును చూచెను.
శ్రీనివాసుడు చెప్పగా శంఖుడనే రాజు స్వామి తీర్థము వద్ద తపస్సు చేయుట:- ఒక అడవి నుండి మరొక అడవిలోకి వెళ్లుచు గొప్ప పర్వతముపై జనార్దనుని ప్రతిష్ఠించి తపస్సు చేయుచున్న శంఖుని చేరెను. ఆ శంఖుడు నిత్యము శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న జనార్దనుని భక్తితో అర్చించుచుండెను. శంఖనాగబిలము అనే ఒక ఉత్తమమైన సరస్సు కూడ అక్కడ కలదు. ఆ సరస్సు యొక్క తీరమునందు శ్రీనివాసుడు అశ్వము పైనుండి దిగి ఒక రాజు వలె వేషమును . ధరించి ఆ శంఖుని వద్దకు వెళ్లి ఇట్లడిగెను. ఓ నృపశ్రేష్ఠ! ఈ శేషాద్రి పాదమువద్ద నీవు ఏమి చేయుచున్నావు, శంఖుడు చెప్పెను. నేను హైహయదేశమునకు చెందిన వాడను. శ్వేతుడనే రాజు కుమారుడను. మహావిష్ణువును సంప్రీతుని చేయుటకై ఇచట అన్ని విధములైన క్రతువులను చేసితిని. అయినప్పటికి ఆ మహావిష్ణువును చూడలేక పోయితిని. అపుడు అన్ని బాధలను పోగొట్టు దివ్యవాణి ఇట్లు పలికెను.
ఓ గాజా! నామాట వినుము నేనిచట ప్రత్యక్షము కాను. నీవు నారాయణాద్రికి వెళ్లి తపస్సు చేయుము అని స్పష్టముగ పలికేను .ఆ మాటను అనుసరించి నేనాప్రదేశమును విడచి ఇచటకు వచ్చి జనార్ధనుని ప్రతిష్టించి అర్చించుచుంటిని. అగస్త్యుని యొక్క అనుగ్రహము వలన నిత్యము స్వామిని విధిపూర్వకముగ అర్చించుచుంటిని, అని శంఖుడు చెప్పగా శ్రీనివాసుడు నవ్వి ఇట్లనెను. నీవచట ఏమి చేయుచుంటివి? నారాయణాద్రికి వెళ్లుము. ఈ మార్గముననుసరించి కొండ పైకి వెళ్లుము. పశ్చిమముగా ఉన్న శిఖరము నందున్న మర్రి చెట్టు క్రింద బాలుని రూపంలో ఉన్న విష్వక్సేనునికి నమస్కరింపుము. తరువాత స్వామి పుష్కరిణికి వెళ్లి స్నానము చేయుము. దాని పశ్చిమతీరంలో ఒక రావిచెట్టును. ప్రక్కన ఒక పుట్టను చూడగలవు. ఆ రెంటికి మధ్యన నీవు తపస్సు చేయుము అని అతడిని ప్రేరేపించెను. ఆ పుట్టయుందు ఒక తెల్లని వరాహము తిరుగాడు చుండును. అది పుణ్యము చేసిన వారికి మాత్రమే కనిపించును.
వరాహస్వామి చెప్పెను:- అని ఆదేశించి స్వామి హయారూఢుడై వేటకు ఏగెను. ఒక వనము నుండి మరొక వనమునకు వెళ్లుచు ఆరణీ నదీ తీరమును చేరెను. ఆ నదీ తీరమునందు అశ్వము పై నుండి దిగి సంచరింపసాగెను. అపుడు సమీప వనము నుండి పద్మములు, కలువల సుగంధముతో నిండిన చల్లనిగాలి శ్రమను పోగొట్టునట్లు మెల్లగా వీచి పురుషోత్తముడైన స్వామిని సేవించెను. చెట్లు పూవులను స్వామి పై కురిపించుచు సేవించెను. పూవుల బరువుతో క్రిందకు వంగిన చెట్ల నుండి పూవులు కోయుచు స్వామి ముందుకు సాగి ఆ గజరాజును, పూవులను, కోయుచున్న, చక్కని వేషములు ధరించిన, మబ్బులలో మెరుపులవలెనున్న కన్యలను చూచెను. వారి మధ్యలో మిక్కిలి మనోహరముగా ఉన్న సుందరిలక్ష్మితో సమానమై, బంగారు వర్ణముతో వెలుగుచుండగా ఆమె యందు మనస్సు కలవాడయ్యెను. ఆ కన్యను పొందగోరి చెలికత్తెలను ఈమె ఎవరని ప్రశ్నించగా, వారు ఆమె ఆకాశరాజు కుమార్తె అని తెల్పిరి. అది విని అశ్వము నెక్కి స్వామి తన నివాసమైన పర్వతమునకు త్వర త్వరగా తిరిగి వచ్చెను.
స్వామి పుష్కరిణి తటమునందున్న తన నివాసమునకు తిరిగి వచ్చి స్వామి నన్ను పిలచి, చెలీ, వకులమాలికా, ఆకాశరాజు నగరమునకు వెళ్లి అంతఃపురమున ప్రవేశించి, ఆ రాజు భార్య అయిన ధరణీ దేవిని చూచి కుశల మడుగుము. సౌందర్యవతి అయిన ఆమె కుమార్తె పద్మావతిని అడుగుము. రాజు అభిమతమును తెలుసుకుని త్వరగా తిరిగి రమ్ము. అని స్వామి ఆదేశింపగా ఓ దేవీ! నేనిచటకు వచ్చితిని. కనుక మంత్రులతో కూడిన రాజుతో కలసి తగిన విధముగా చేయుము.
నకులమాలిక మాట ననుసరించి ధరణ్యాదులు వివాహము నిశ్చయించుట:- కన్యతో విచారించి పిమ్మట సమాధానము ఈయవలసినది. వరాహస్వామి చెప్పెను: అని వకుల మాలిక చెప్పగా రాణి మిక్కిలి సంతోషించి, ఆకాశరాజును, పద్మావతిని రావించెను. మంత్రుల మధ్య రాణి వకులమాలిక చెప్పిన మాటలను రాజుకు చెప్పెను. అది విన్న రాజు పురోహితులతో కూడిన మంత్రులతో ఈ విధముగా పలికెను. ఆకాశరాజు చెప్పెను: ఈ కన్య అయోనిజ, దివ్య, సుభగ, కమాలాలయ, అటువంటి ఈమెను దేవదేవుడైన, వేంకటాద్రి నివాసుడు అడిగెను. నా మనోరథము ఇప్పటికి సంపూర్ణమయినది. మీ అభిప్రాయము తెలియజేయండి. అని పలుకగా మంత్రి గణము మిక్కిలి సంతోషించి ఓ రాజా మేము కృతార్థులమయితిమి. మీ వంశము అన్ని వంశములలోకి ఉత్తమమైనది కాగలదు. ఈ మీ కన్య సాటిలేనిదై. లక్ష్మీదేవితో సమానురాలు కాగలదు. కనుక పరమాత్ముడు, శార్జ్ పాణి అయిన దేవదేవునికి ఈయగలరు. ఇది వసంతకాలము శుభకరమైనది కనుక ఈ శుభ కార్యమును వెంటనే చేయవలసినది.
బృహస్పతి చెప్పిన విధముగా వివాహ లగ్నమును స్థిరపరచుట:- వివాహము కొరకు లగ్నమును నిర్ణయించుటకై బృహస్పతిని రావింపుడు. అని చెప్పగా దేవలోకమునుండి బృహస్పతిని పిలిపించి కన్యకు వరునకు వివాహమునకు తగిన ముహూర్తమును చూడమని కోరెను. రాజు పలికెను: కన్య జన్మ నక్షత్రము మృగశీర్షము కాగా స్వామిది శ్రవణానక్షత్రము. కనుక వారికి తగిన ముహూర్తము నిర్ణయింపుడు. అది విని బృహస్పతి వారిద్దరికి తగినది ఉత్తరఫల్గుని. వారిద్దరికి సుఖమును వృద్ధి చేయునది. కనుక వారికి వైశాఖ మాసమునందు ఉత్తర ఫల్గుని నక్షత్రమునందు వివాహము విధిపూర్వకముగా చేయదగినది.
వరాహస్వామి చెప్పెన:- ఆకాశరాజు బృహస్పతిని సత్కరించి పంపివేసెను. తరువాత స్వామి దూతికమైన వకులమాలికను పిలచి, నీవు స్వామి వద్దకు వెళ్లుము. వైశాఖ మాసమందు స్వామికి కల్యాణమని చెప్పుము. ఓ సువ్రతా! వివాహమునకు ఏర్పాట్లు చేసి రమ్ము అని చెప్పెను. తరువాత దేవికి ఇష్టుడైన శుకుని ఆ వకులమాలికతో పంపించెను. వాయుదేవుని, తన పుత్రుని ఇంద్రాదులను ఆహ్వానించుటకు పం పెను.
విశ్వకర్మాదులు వియద్రాజపురమునుఅలంకరించుట:- పురమును అలంకరించుటకై విశ్వకర్మను పిలచి నియోగింపగా అతడు ఒక్క నిమిషములో ఆ పురమంతటిని అలంకరించెను ఇంద్రుడు పుష్ప వృష్టి కురిపించెను. అప్పరోగణములు నాట్యము చేసెను. కుబేరుడు ధనధాన్యముల చేత రాజభవనమును నింపి వేసెను. యముడు భూమిపై నివసించు మానవులందరిని రోగము లేని వారిగ చేసెను. వరుణుడు రత్నములు, ముత్యములలో నింపివేసెను. ఈ విధముగ అన్నిటిని సమకూర్చి దేవతలందరు వృషాద్రికి వెళ్లిరి.
వరాహస్వామి చెప్పెను:- తరువాత ఆమె శుకునితో కలిసి వేంకటాద్రిపైనున్న స్వామి ఆలయమునకు చేరెను. అశ్వముపై నుండి దిగి శుకునితో కలసి లోనికి వెళ్లి రత్నపీఠముపై లక్ష్మితో కలసి ఉన్న సులోచనుడైన స్వామిని చూచెను. స్వామికి నమస్కరించి జరిగినదంతయు చెప్పెను. ఓ ప్రభో! ఈ శుకుడు మంగళకరమైన వార్తను చెప్పుటకు వచ్చెను అని విన్నవించెను.
శ్రీనివాసునికి శుకుడు పద్మావతీ పరిణయ వృత్తాంతమును వివరించుట:- విషయమును చెప్పుమని స్వామి అడుగగా శుకుడు ఇట్లు పలికెను. స్వామి భూమి సుత అయిన పద్మావతి, ఓ మాధవా! నన్ను అంగీకరింపుము. నీ నామములను ఎల్లప్పుడు పలుకుదును, నీ ఆకారమునే సదా స్మరింతును. ఓ రమాపతే! నీ చిహ్నములను భుజములపై ధరింతును. పంచసంస్కారములు పొందిన భక్తులను అర్చింతును. ఓ మధుసూదనా! నీ ప్రీతి కొరకు అన్ని పనులను చేయుదురు. ఈ విధముగ ఎల్లప్పుడు చేయు. దానను కనుక నా తండ్రి అనుమతిని అనుసరించి నా పై దయచూపుము. ఓ మాధవా! నన్నంగీకరింపుము. అని విన్నవించినది అని శుకుడు చెప్పగా స్వామి మిక్కిలి ఆనందించెను.
స్వామి చెప్పెను:- పద్మావతితో కల్యాణము కొరకై దేవతలతో కలసి వచ్చెదను. ఓ శుకా! నేనిట్లు చెప్పితినని ఆమెకుని చెప్పుమూ.శుకుడామాటలు విని స్వామి ఇచ్చిన వనమాలికను తీసుకుని ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి వద్దకు వెళ్లాను.కస్తూరి వాసనతో కూడిన ఆ తులసి మాలను పద్మావతికిచ్చి స్వామి చెప్పిన శుభకరమైన సందేశమును శుకుడు ఆమెకు అందజేసెను. పద్మావతి ఆ మాటలు విని మాలను తీసుకుని తలపై ధరించి ఉచితములైన అలంకారములను ధరించి స్వామి కొరకు ఎదురు చూచుచుండెను. ఆకాశరాజు చంద్రుని సాదరముగ పిలిపించి ఓ రాజున్! వివిధములైన రసములతో కూడుకున్న అన్నమును చేయుము. విష్ణువుకు నివేదన కావింపదగినది, దేవతలకు, ఋషులకు, మానవులకు నచ్చునది. సుగంధముతో కూడుకున్నది అయిన నాలుగు విధములైన పరమాన్నములను నీ అమృత కిరణములతో చేయుము. అని తగిన ఏర్పాట్లు చేసి ఆ ఆకాశరాజు స్వామి రాకకై ఎదురు చూడసాగెను. సంతోషముతో నిండిన మనస్సుతో, ధరణీదేవితో కలిసి, కుమార్తె పద్మావతిని అలంకరింపజేసి, సభలో మంత్రులతో నిలిచియుండెను.
ఎనభై ఒక్క వేల శ్లోకములుకల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమునందు ధరణీవరాహ సంవాదమున ధరణీదేవికి వకులమాలిక శ్రీనివాసుని వృత్తాంతమును చేప్పుట, పద్మావతి కల్యాణమునకు తగిన ఏర్పాట్లు చేయుట మున్నగునవి వర్ణితమైన ఏడవ అధ్యాయము.
