స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
21వ అధ్యాయము
సూతుడు చెప్పెను:- నైమిషారణ్యమునందు నివసించు ఓ తపోధనులారా! ఇప్పుడు ఆకాశగంగ అను తీర్థముయొక్క వైభవమును వర్ణించెదను. ఆకాశగంగ వద్ద అన్ని శాస్త్రములు చదివినవాడు, విష్ణుభక్తుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు ఆగు రామానుజుడు అను బ్రాహ్మణుడు ఉండెను. వైఖానస మతమును పాటించు ఆ ధర్మాత్ముడు విష్ణువును ధ్యానించుచు గ్రీష్మకాలమునందు పంచాగ్నుల మధ్య నిల్చుండి తపస్సు చేసెను. అష్టాక్షర మంత్రమును జపించుచు మనస్సున విష్ణుమూర్తిని ధ్యానించుచు వర్షాకాలమునందు ఆకాశము క్రింద నిలబడి, హేమంత కాలమందు సరస్సుల యందు నిలబడి తపస్సు చేసెను4. అన్ని జీవులపై కరుణ చూపుచు, వేడి చలి వంటి ద్వంద్వములను వదలి పెట్టెను. కొన్ని సంవత్సరముల పాటు పండిన ఆకులను మాత్రమే భుజించి జీవించేను-5. కొంతకాలము నీటిని త్రాగి, మరికొంత కాలము గాలిని భుజించి తపస్సు చేసెను.
అథాకాశగంగాతీరే రామానుజతపసుష్ట భగవదావిర్భావః
ఆకాశగంగా తీరమునందు రామానుజుడు చేసిన తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమగుట:- అపుడాతని తపస్సుకు సంతోషించి భగవంతుడు, భక్తుల యందు వాత్సల్యము కలవాడు, శంఖము, చక్రము, గదధరించిన వాడు అగు స్వామి అతడి ఎదుట ప్రత్యక్షమయ్యెను. వికసించిన తామరల వంటి కన్నులు కలవాడు, కోటి సూర్యులతో సమానమైన కాంతికలవాడు, గరుడుని పై ఎక్కినవాడు, ఛత్రము, చామరము చేత ప్రకాశించువాడు. హారము, కేయూరము, కిరీటము, కటకము మొదలైన వాటిచే అలంకరింపబడినవాడు, విష్వక్సేనుడు, సునందుడు మొదలైన సేవకులచే అనుసరింపబడుచున్నవాడు9. వీణ, వేణువు మృదంగము మొదలైన వాద్యముల వాయించుచున్న నారదాదులచే పాడబడుచున్న కీర్తిగలవాడు, పచ్చని పట్టువస్త్రములు ధరించినవాడు. వక్షఃస్థలమునందు లక్ష్మిని ధరించినవాడు, నీలమేఘమువంటి కాంతి గలిగినవాడు, సనకాది మహాయోగులచేత సేవింపబడువాడు. మందస్మితము చేత ముల్లోకములను సమ్మోహింపజేయువాడు, పది దిక్కులను తన కాంతి చేత ప్రకాశింపజేయువాడు. మంచి భక్తులకు సులభుడు, దేవదేవుడు, వేంకటేశుడు, దయానిధి ఆగు స్వామి ఆ రామానుజుని ఎదుట ఆవిర్భవించేను. అట్లు ప్రత్యక్షమైన కృపానిధి, పీతాంబరుడు అగు శ్రీనివాసుని చూచి రామానుజుడు సంతుష్టి చెందెను. పరమభక్తితో జగదీశ్వరుడైన స్వామిని ఇట్లు స్తుతించెను.
అథ రామానుజోజ్య విప్రకృత భగవతే స్తుతి:
రామానుజ ఉవాచ:
రామానుజుడను బ్రాహ్మణుడు చేసిన భగవంతుని స్తుతి:
రామానుజుడు అనేను:- ఓ దేవాధిదేవా! శంఖము, చక్రము, గద ధరించువాడా, నిత్యమైనవాడా, శుద్దుడా, ఓ వేంకటేశా నీకు నమస్కారము. భక్తుల దుఃఖమును హరించువాడా! కవ్యము, హవ్యము అస్వరూపమైఔనవాడా, త్రిమూర్తుల స్వరూపమా, సృష్టికి, స్థితికి, అంతమునకు కారణమైనవాడా!. పరమేశా, భూమిని అతిక్రమించినవాడా, లక్ష్మీపతీ, విధాతా, సూర్యుడు, చంద్రుడు కన్నులుగా కలవాడా, బ్రహ్మాదులచేత స్తుతింపబడువాడా నీకు నమస్కారము. జాతి, వర్ణము మున్నగునవి లేనివాడా, ఏ దోషములు అంటనివాడా, సమస్త సంపారము యొక్క భయములను నాశనము చేయువాడా, రాక్షసులను నాశనము చేయువాడా నీకు నమస్కారము. ఉపనిషత్తుల చేత తెలియబడువాడా! రమాపతీ, వృషాద్రిపై నివసించువాడా, బ్రహ్మకు తండ్రీ, సమస్త జనుల శోకమును హరించు వాడా, నారాయణా, అమితమైన విక్రమము కలవాడా నీకు నమస్కారము. భగవంతుడగు వాసుదేవా, శార్గమును ధరించువాడా, వేంకటాద్రిపై నివసించువాడా, నీకు మరల మరల నమస్కారము.
అని జగద్గురువగు శ్రీనివాసుని స్తుతించి బ్రాహ్మణోత్తముడగు రామానుజుడు ఊరకుండెను. చెవికింపగు ఆ స్తుతిని విని వేంకటాచలమునకు నాయకుడగు స్వామి మిక్కిలి సంతోషము పొందెను. అపుడు స్వామి తన నాలుగు చేతులతో రామానుజుని కౌగిలించుకుని ప్రీతి చెందిన వాడై వరము కోరుకొమ్మని పలికెను. నీ తపస్సు చేత, స్తోత్రము చేత సంతుష్టుడనైతిని కనుక నీకు వరమిచ్చుటకు వచ్చితినీ.
అథ రామానుజాఖ్య విప్రకృత భగవత్రార్థనా
రామానుజ ఉవాచ:
రామానుజుడు అనెను:- నారాయణా రమానాథా, శ్రీనివాసా, జగన్మయా జనార్ధనా, జగత్తుధామము కలవాడా, గోవిందా, నరకుని సంహరించినవాడా. నీ దర్శనము వలన ధన్యుడ నయితిని, వేంకటాద్రికి శిరోమణి వంటి వాడా, నీవు ధర్మమునకు పాలకుడవగుట చేత ధర్మమును పాటించువారు. నీకు నమస్కరింతురు. శివుడు, బ్రహ్మ ఎవరిని తెలియరో, వేదములు ఎవరిని వర్ణింపజాలనో అటువంటి నిన్ను నేను తెలిసికొంటిని ఇంతకంటే ఎక్కువ కావలసినదీ ఏమున్నది-28. యోగులు ఎవరిని చూడలేరో, కర్మను మాత్రమే చేయువారు. ఎవరిని చూడలేరో అటువంటి పరమాత్మవైన నిన్ను నేను చూచుచుంటిని. ఇంతకంటే ఎక్కువ కావలసినది ఏమున్నది?. జగత్పతివగు వేంకటేశా దీనివలన నేను కృతార్థుడనైతిని. ఎవరి నామము ఉచ్చరించి నంతనే మహాపాతకములు ఒనర్చిన వారును ముక్తిని పొందుదురో అటువంటి జనార్దనుని నేను చూడగల్గితిని పద్మములవంటి నీ పాదములయందు నాకు నిశ్చలమైన భక్తి ఎప్పుడును ఉండునట్లు అనుగ్రహింపుము.
ఆథ భగవద్విర్జితాకాశగంగాతీర్థస్నానకాల:
శ్రీ భగవానువాచ:
భగవంతుడు చెప్పెను:- మహామతి కలిగిన ఓ రామానుజా, నీకు నాయందు దృఢమైన భక్తి కలుగునుగాక, మరియు నేను చెప్పునది వినుము. సూర్యుడు మేషరాశియందు ప్రవేశించినపుడు, పౌర్ణమినాడు చంద్రుడు చిత్తా నక్షత్రముతో కూడియున్నపుడు ఈ ఆకాశగంగ యందు స్నానము చేయు మానవులు తిరిగి వచ్చుటలేని వైకుంఠమును చేరుదురు. నీవు ఇచటనే ఆకాశగంగా సమీపమున నివసింపుము. ఈ జన్మము ముగిసిన తరువాత నీవు నీ రూపమును పొందగలవు. ఇంత ఎందుకు, ఇచట ఈ ఆకాశగంగాతీర్థమునందు స్నానము చేసిన వారందరు భాగవతోత్తములు అగుచున్నారు. ఓ మహామునీ, దీనియందు సందేహించవలసిన పనిలేదు.
రామానుజ ఉవాచ:
స్వామి చెప్పెను:- ఏ మునిసత్తమా! భాగవతుల లక్షణములు వినుము. వారి ప్రభావమును కోటి సంవత్సరములలో నైనను వర్ణింపజాలము. సమస్త ప్రాణుల యొక్క హితమును కోరువారు. ఈర్ష్యాసూయలు లేనివారు, జ్ఞానులు, దేనియందును కోరిక లేనివారు, శాంతులు వారు భాగవతోత్తములు. మనోవాక్కాయములచే ఇతరులకు బాధ కలిగింపనివారు, ఇతరుల నుండి దేనిని ఆశింపని వారు భాగవతోత్తములు. మంచికథలను విను కోరిక కలవారు, నాయందే భక్తికలవారు భాగవతోత్తములు. తల్లిదండ్రులకు సేవ చేయువారు, దేవుని పూజయందు ఆసక్తి కలిగిన వారు, దానికి కావలసిన ఏర్పాట్లను చేయువారు, పూజలను చూసి ఆనందించువారు భాగవతోత్తములు.
బ్రహ్మచారులకు, సన్యాసులకు సేవ చేయువారు, ఇతరులను నిందింపనివారు భాగవతోత్తములు. అందరికి హితమగు మాటలు చెప్పువారు, ఇతరుల యందలి గుణములను గ్రహించువారు భాగవతోత్తములు. సమస్త జీవులను తనవలె చూచువారు. శత్రువుల యందు, మిత్రులయందు సమానముగ ఉండువారు భాగవతోత్తములు. ధర్మశాస్త్రమును చెప్పువారు ఎల్లప్పుడు సత్యమునే పలుకుతారు, వారికి సేవచేయు వారు భాగవతోత్తములు. పురాణములను వ్యాఖ్యా నించువారు, వాటిని వినువారు, పురాణములను చెప్పువానీ యందు భక్తి కల్గిన వారు భాగవతోత్తములు. ఆవులకు, బ్రాహ్మణులకు సేవ చేయువారు, తీర్థయాత్రలు చేయువారు భాగవతోత్తములు.
ఇతరుల అభ్యుదయమును చూచి అభినందించువారు, హరినామమును స్మరించువారు భాగవతోత్తములు . తోటలను వేయువారు, తటాకములను రక్షించువారు, సరస్సులు, భావులు తవ్వించువారు భాగవతోత్తములు. చెరువులను తవ్వించువారు, దేవాలయములు నిర్మించువారు, గాయత్రీ మంత్రమును జపించువారు భాగవతోత్తములు . హరినామములను స్తుతించువారు, వివి ఆనందించువారు, పులకరించువారు భాగవతోత్తములు. తులసివనమును చూచి నమస్కరించువారు. దానిచే ముద్రలను వేయించుకొనువారు భాగవతోత్తములు. తమ ఆశ్రమ ధర్మములను పాటించువారు అతిధులను పూజించువారు, వేదము యొక్క అర్థమును వివరించువారు భాగవతోత్తములు. తులసీ గంధమును ఆఘ్రాణించి ఆనందమును పొందువారు, దాని మూలను ఉద్దరించువారు భాగవతోత్తములు తెలిసికొన్నటు వంటి శాస్త్రముల అర్థమును ఇతరులకు చెప్పువారు. ఎల్లప్పుడు గుణములు కలిగి ఉండువారు భాగవతోత్తములు జలదానము చేయువారు, అన్నదానము చేయువారు, ఏకాదశ వ్రతమును పాటించువారు భాగవతోత్తములు.
గోదానమిచ్చువారు, కన్యాదానమిచ్చువారు, నా కొరకు కర్మచేయువారు భాగవతోత్తములు. నా యందు మనస్సు నిలపువారు, నా భక్తులగువారు, నా నామమును స్మరించుటయందు ఆసక్తికలవారు భాగవతోత్తములు. ఇన్ని చెప్పుట ఏల. సంక్షేపముగా చెప్పెదను వినుము. సద్గుణములు కలవారందరును భాగవతోత్తములు. ఇపుడు చెప్పిన వారు భాగవతోత్తములలో కొందరు మాత్రమే. వారందరిని గూర్చి చెప్పుట కోటి సంవత్సరములలో నా కైనను శక్యము కాదు . మహానుభావుడగు ఓ రామానుజ! నా భక్తుల లక్షణములను నా యందు భక్తిగల నీకు ప్రీతితో చెప్పితిని.
సూతుడు చెప్పెను :- ఈ విధముగ మీకు వేంకటాద్రిపై గల ఆకాశగంగా తీర్థము యొక్క మాహాత్మ్యమును చెప్పితిని.
ఎనభైఒక్కవేల శ్లోకములు గల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచలమాహాత్మ్యమున ఆకాశగంగా మాహాత్మ్యము, రామానుజుని వ్రతచర్య మొదలగునవి వర్ణించిన ఇరవై ఒకటవ అధ్యాయము.
