స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

29వ అధ్యాయము

ఋషులు అడిగిరి:- అన్నితీర్థేముల, నదుల, పర్వతముల, క్షేత్రముల, సరస్సుల ప్రభావమును చెప్పితివి. మరియు బ్రహ్మ కోరిన మీదట అగస్త్యుడు సువర్ణముఖీ నదిని ఏ విధముగా భూమికి తీసుకు వచ్చినది తెల్పితివి-2 ఆ నది యొక్క పుట్టుకను దానినాశ్రయించి ఉన్న తీర్థేములను గూర్చి వినకోరిక కల్గినది. కనుక వాటిని గూర్చి చెప్పుము-3.

సూతుడు చెప్పెను:- ఓ మహానుభావులారా! మీరు అడిగినవి చక్కగా ఉన్నది. ఆది మంగళకరము. ఈ కథ వేదములయందును ప్రసిద్దము - 5. దివ్యము, కల్మషములను నాశనము చేయునది, భరద్వాజుడు అర్జునునికి చెప్పినది అగు ఈ కథను శ్రద్ధగా వినుము -6.

          ద్రుపదుని నుండి ద్రౌపదిని భార్యగా పొందిన పిమ్మట పాండవులు ధృతరాష్ట్రుని ఆదేశముపై హస్తినాపురమునకు వెళ్లారు-7. భీష్ముడు, ధృతరాష్ట్రుడు వారిని ఆదరించిరి. దుర్యోధనునితో కలసి వారు ఆ విధముగా అయిదు సంవత్సరములు జీవించిరి-8. పిమ్మట భీష్ముడు మొదలైనవారు ఉపదేశించగా కురువృద్దులు, కృష్ణుడు కూడియుండగా పాండురాజు పుత్రులకు వారి సేవలచే మిక్కిలి సంతోషించిన ధృతరాష్ట్రుడు ఖాండవప్రస్థముతో కూడిన ఆర్ధరాజ్యమును ఇచ్చెను-9,10. పిమ్మట పాండవులు ధృతరాష్ట్రుడు మొదలైన కురువంశీయుల అనుమతిని తీసుకుని కృష్ణునితో కలసి ఖాండవ ప్రస్థమునకు వెళ్లిరి -11. అచట విశ్వకర్మ ఇంద్రప్రస్థమును నిర్మించగా అచట నివసించుచు ధర్మజుడు తమ్ములతో కలసి పరిపాలింపసాగెను -12. కృష్ణుడు ద్వారకకు వెళ్లిపోగా నారదుని ఆదేశానుసారం ద్రౌపదిగూర్చి పాండవులందరు ఒక ప్రతిజ్ఞను చేసిరి-13.

          ద్రౌపది ఒక్కొక్క సంవత్సరము పాటు క్రమముగా ధర్మఙాదుల ఇండ్లలో నివసింపవలేను-14. ఎవరైతే ఆమెను సోదరుని ఇంటిలో ఉండగా చూచెదరో వారు ఒక సంవత్సరము పాటు తీర్థేయాత్రలు చేయవలయును-15. ఈ విధముగా పాండవులు నియమమును ఏర్పరచికొని తమ తమ పనులను చేసికొనుచు. కాలమును గడుపుచుండిరి-16. ఒకనాడు పల్లెనుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడు రాజప్రసాదమునకు వచ్చి తన ఆవును దొంగలెత్తికొనిపోయిరని విలపించుచుండెను -17. ఆ బ్రాహ్మణుని ఓదార్చి ఆర్జునుడు ఆయుధములను తీసుకొని వచ్చుటకు ఆయుధాగారమున ప్రవేశించెను-18. అచట ద్రౌపదీ ధర్మజులు కూర్చుని ఉండుట చూచి నియమ భంగమైననూ ప్రవేశించి వింటిని బాణములను తీసికొనెను -19. అర్జునుడు వెంటనే వద్దకు వచ్చి నియమమును ఉల్లంఘించినందున తాను తీర్థేయాత్ర చేయవలసి ఉన్నదని విన్నవించెను -21. తమ్ముని మాటలను విని అన్ని ధర్మములు తెలిసిన ధర్మజుడు సాదరముగా ఇట్లు పలికెను-22.

          ధర్మజుడు పలికెను:- ఆవు కొరకు బ్రాహ్మణుని కొరకు అబద్దము చెప్పినప్పటికి, అన్యాయముగా ప్రవర్తించినప్పటికి అది సత్యము, సమంజసము అవుతుంది-23 నీవీవిధముగా చేయుట ఆవు కొరకు, బ్రాహ్మణుని కొరకు. కనుక నీవు చేసినది తప్పు ఎట్లగును-24. ప్రజలను పాలించు రాజు దొంగలను ఉపేక్షించినచో బ్రహ్మహత్యా పాతక ఫలమును, వారిని శిక్షించినచో అశ్వమేథ యాగ ఫలమును వెంటనే పొందును-25. జయించుటకు వీలుకాని శత్రువులున్నచో రాజు నిశ్చింతగా ఉండలేడు. దొంగలను శిక్షింపనిచో వారు దేశమునందు కల్లోలమును రేకెత్తింతురు-26. కనుక మన వంటి రాజులు లోకహితము కొరకు ఎట్టి పనినైనను చేయవచ్చును. అందువలన నీవు చేసిన పనియందు తప్పేమియు లేదు-27.

సూతుడు చెప్పెను:- ధర్మజుడు ఈ విధముగా చెప్పగా అర్జునుడు చేతులు జోడించి వినయముతో తిరిగి ఇట్లు పలికెను-28.

          అర్జునుడు చెప్పెను:- ఓ రాజా నీవిట్లు పలుకవద్దు. మనము చేసికొన్న ప్రతిజ్ఞను మనమే ఉల్లంఘించకూడదు. సాక్షాద్దర్మ మూర్తివయిన నీవు అన్ని ధర్మములు తెలిసినవాడవు-29. యుక్తాయుక్తములు తెలిసిన వాడవు. సమర్థుడవు, నీవే పూర్వము చెప్పినది. ఉల్లంఘించుట తగదు. ప్రతిజ్ఞను ఎప్పుడు భంగము చేయరాదు-30. పూర్వము చెప్పిన దానిని బంధువులు, పెద్దవారు చెప్పిరని విడచి పెట్టువారు అశక్తులు-31. మీరు నన్ను తీర్థేయాత్రకు వెళ్లుట నుండి మళ్లించినచో ప్రతిజ్ఞాభంగము ఓ రాజా! నారదునిచే ఆదేశింపబడిన దానిని మనము తప్పక పాటింపవలయును-33. కనుక ఓ మహారాజా! తీర్థేయాత్రలకు వెళ్లుటకు అనుజ్ఞనిమ్ము, తమ్ము ఆశ్రయించి ఉండువారి ప్రతిజ్ఞలను గౌరవించుట ప్రభువుల ధర్మము-34. అని ఆర్జునుడు పలుకగా సోదరులు అతడికి అనుమతినిచ్చిరి. అర్జునుడు నమస్కారము, స్తోత్రము మున్నగువాటిచే ధర్మజుని సంతోషింపజేసెను -35. పిమ్మట భీమాదులవద్ద తగిన విధముగా అనుమతిని తీసికొని, బ్రాహ్మణులచే ఆశీర్వాదమును పొంది తీర్థేయాత్రకు బయలుదేరెను-36. పురాణములు చెప్పువారు, జ్యోతిషము చెప్పువారు, వైద్యులు, బ్రాహ్మణులు, సేవకులు, శిల్పులు, రథము నడుపువారు, వందిమాగధులు అతడిని అనుసరించిరి. ధర్మజుని ఆజ్ఞచే కోశాధికారులు అర్జునుడు భోగములను అనుభవించుటకు దానము చేయుటకు తగినంత ధనమును తీసికొని అతడిని అనుసరించిరి. 38.

           అర్జునుడు గంగమున్నగు తీర్థేముల యందు స్నానము చేసి సువర్ణముఖివది వద్దకు వచ్చుట:- అర్జునుడు మొదటగా గంగానదిని చేరెను. గంగాద్వారమును ప్రయాగను దర్శించి కాశికి చేరెను-39. గంగానది ఒడ్డున ఉన్న తీర్థేములను సేవించుచు పెద్ద కెరటములతో కూడిన తూర్పు సముద్రము చేరెను-40. మహానదిని, ప్రసిద్ధమగు పురుషోత్తమ క్షేత్రమును, సింహాచలమును దర్శించి కృతకృత్యతను పొందెను-41. పిమ్మట పుణ్యప్రదము, అన్ని పాపముల నుండి రక్షించునది అగు గోదావరి నదిని దర్శించెను-42. అచట నియమపూర్వకముగా స్నానము చేసి ఆ అర్జునుడు భూదానమును, సువర్ణదానమును ఇచ్చి సంతోషమును పొందెను-43. పిమ్మట మలాపహము అను నదిని చూచి ఆనందించి నదీశ్రేష్ఠమగు కృష్ణానదిని చేరెను. 44. శివుడు ఎల్లప్పుడు నివసించునది, నాలుగు దిక్కుల ద్వారములు కలది, వివిధములైన తీర్థేములతో కూడియున్నది అగు శ్రీశైలమును దర్శించెను45. పిమ్మట పినాకినీ నదిని దాటి దేవతలు, ఋషులు మున్నగు వారు సేవించునది విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రమైనది అగు వేంకటాద్రికి చేరెను-46. పర్వతములలో ఉత్తమమైన ఆ వేంకటాద్రి శిఖరముపై వేంచేసి ఉన్న జగన్నాయకుని, సర్వశుభములు కల్గించుట యందు ప్రసిద్ధి పొందిన స్వామిని భక్తితో అర్చించెను-47. తరువాత వేంకటాద్రి నుండి దిగి సిద్దులు, ముని సంఘములు సేవించునది, అగస్త్యునిచే మిక్కిలి ఆదరింపబడినది అగు సువర్ణముఖి నదిని చేరెను-48.

ఎనభై ఒక్కవేల శ్లోకములుకలిగిన శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీవేంకటాచలమాహాత్మ్యమందలి సువర్ణముఖి మహాత్మ్యమునందు అర్జునుని తీర్థేయాత్రా గమనమును.