స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
15వ అధ్యాయము
సూతుడు చెప్పెను:- సర్వ పాపములను నాశనము చేయు వేంకటాద్రియందు కృష్ణతీర్థముయొక్క మాహాత్మ్యమును చెప్పెదను ఏకాగ్రచిత్తులై వినుడు. ఈ తీర్థము నందు స్నానము చేసినంతనే కృతఘ్నుడు కూడ విముక్తి పొందును. తల్లిదండ్రులను, గురువులను పెద్దలను మోహము చేత పీడింపబడి అవమానితురో. దురాత్ములై, సిగ్గులేక చేసిన మేలు మరచుదురో వారందరు కృష్ణతీర్థమునందు స్నానము చేసినంతనే ముక్తిని పొందుదురు. వేంకటాద్రియందు పూర్వము కృష్ణుడను ముని నివసించుచుండెను. అతడు ఎల్లప్పుడు శ్రద్ధతో విష్ణువును భజించుచుండెను. అతడు ఉత్తమమైన ఈ తీర్థమును ఏర్పరచెను. దానియందు ఒక్కసారి స్నానము చేసినంతనే మునుష్యుడు కృతఘ్నడైనప్పటికి తన పాపము నుండి విముక్తుడగుచున్నాడు. పాపమును నాశనము చేయునది, పురాతనమైనది అయిన ఇతిహాసమును చెప్పెదను. దీనిని విన్నంతనే మానవుడు ముక్తిని పొందును.
పూర్వము బ్రాహ్మణోత్తముడైన రామకృష్ణుడను మహాముని యుండెను. అతడు సత్యవంతుడు, శీలవంతుడు, చక్కగా మాట్లాడగలవాడు, సకలప్రాణులపై దయచూపువాడు. శత్రువులయందు, మిత్రులయందు సమముగా ఉండువాడు, ఓర్పు కలవాడు, తపస్సు చేయువాడు, ఇంద్రియములను జయించినవాడు, పరబ్రహ్మయందు నిష్ఠకలవాడు, బ్రహ్మ యొక్క తత్త్య మును తెలిసినవాడు. ఈ విధమైన ప్రభావముకల ఆ ముని దారుణమైన తపస్సును ప్రారంభించెను. అవయవములన్నీ కదలకుండ చేసి భూమిపై నిలిచెను. అతడు తన స్థానము నుండి పరమాణువంతయు కదలక అనేక వందల సంవత్సరములు తపస్సు చేసెను. క్రమముగా అతడి శరీరము పై పుట్ట ఏర్పడెను. అయినప్పటికి ఆ రామకృష్ణుడను మహాముని దానిని పట్టించుకొనక తపస్సు కొనసాగించెను. అతడావిధముగా తపస్సు చేయుచుండగా ఇంద్రుడు మేఘముల గుంపులను రప్పించి వేగముగ వర్షము కురిపించెను. ఈ విధముగ ఏడు దినములు వర్షము కురిసెను. ధారాపాతముగా వర్షము కురిపించినప్పటికి ఆ మహాముని మూసిన కన్నులు తెరవలేదు. గొప్ప ఉరుములతో చెవులు చిల్లులు పడునట్లు చేసి అతడు ఉన్న పుట్ట పైన గొప్ప పిడుగును కురిపించెను. ఈ విధముగా చల్లని గాలి వానలో దు:సహమైన వర్షమును కురిపించెను.
ఆథ రామకృష్ణాఖ్య మహర్షి తపః ప్రసన్న భగవదావిర్భావ:
రామకృష్ణ మహర్షి తపస్సుకు ప్రసన్నుడై భగవతుడు ప్రత్యక్షమగుట:- ఆ పిడుగుపాటుకు పుట్టయొక్క పైభాగము కూలిపోయెను. అపుడు శంఖము, చక్రము, గద ధరించిన స్వామి ప్రత్యక్షమయ్యెను. గరుడుని పై ఆసీనుడై, వనమాలను ధరించి వచ్చిన స్వామి రామకృష్ణుని తపస్సుకు మెచ్చి ఇట్లనెను. ఏ తపోనిధీ, వేదశాస్త్రములను సమగ్రముగ అభ్యసించినవాడా! నేనిచట ఆవిర్భవించిన దినమున ఇచ్చట స్నానము చేసిన మానవుని పుణ్య విశేషమును వర్ణించుట ఆదిశేషునికైనను సాధ్యముకాదు. మకరమునందు రవి ఉండగా పౌర్ణమి తిథియందు పుష్యమీ నక్షత్రములో చంద్రుడు కూడియున్నపుడు ఈ కృష్ణ తీర్థము నందు స్నానము చేయవలయును. అట్లు చేసిన అన్ని పాపముల నుండి ముక్తిని పొందును, అన్ని కోరికలను తీర్చుకొనును. నేనిచట ఆవిర్భవించిన దినమున ఇచట స్నాము చేయుటకు, తమ పాపములు పోగొట్టుకొనుటకు దేవతలు, మానవులు, అష్టదిక్పాలురు. కోటి సూర్యులతో సమానమైన కాంతి గలిగిన ఎందరో మహాత్ములు ఈ కృష్ణతీర్థమునందు స్నానము చేసి పవిత్రులగుదురు. నీ పేరుతో ఈ తీర్థము లోకమునందు పేరు పొందగలదు. అని పలికి స్వామి అచటనే అంతర్థానమయ్యెను. ఈ విధమైన ప్రభావము గలదీ తీర్థము. మహాపాపములను సైతమూ పోగొట్టునది, మానవులకు బుద్ధి, శుద్దిని, అన్ని విధములైన ఐశ్వర్యములను కలుగజేయునవి. ఈ విధముగ మీకు కృష్ణతీర్థము యొక్క మహాత్మ్యమును తెలియజేసితిని. దీనిని విన్న వారికి, చదివిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగును.
ఎనభై ఒక్క వేల శ్లోకములుగల శ్రీ స్కాందమహాపురాణమందలి రెండవదైన వైష్ణవ ఖండమందు రామకృష్ణ తీర్థముయొక్క మహిమను వర్ణించు పదునైదవ అధ్యాయము.
