స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
24వ అధ్యాయము
సుందరుడను గంధర్వునికి రాక్షసత్వము కలుగట, తొలగుట:-
ఋషులు పలికిరి:- పౌరాణికులలో ఉత్తముడవగు ఓ సూతా! విష్ణు భక్తుడగు ఆ మహాభక్తుని బాధించిన రాక్షసుడెవరు -1.
ఋషులు పలికిరి:- ఆ రాక్షసుని గూర్చి చెప్పెదను. ఆ రాక్షసుడు మునుల యొక్క శాపమువలన అట్లు మారెను -2. పూర్వము వైకుంఠమువంటి విష్ణుస్థానమగు శ్రీరంగమునందు వసిష్ఠుడు, అత్రిమున్నగు విష్ణుభక్తులందరు భక్తులకు అభయమునిచ్చు శ్రీరంగనాథుని పూజించుచుండిరి -3,4. ఒకనాడచటికి వీరబాహుని కుమారుడు, బలముగలవాడు అయిన సుందరుడను గంధర్వుడు. విటుల గోష్ఠియందు మునిగి వందలాది స్త్రీలతో వివస్రుడై సరస్సునందు ప్రవేశించి వారితో కలసి క్రీడించుట మొదలు పెట్టెను -5,6.
కావేరీ తీర్థమునందు వసిష్ఠుడు మునులతో కలిసి మాధ్యాహ్నిక సంధ్యను ఉపాసించుటకై శ్రీరంగేశుని మందిరమునుండి వచ్చెను -7. వచ్చుచున్న ఆ ఋషులను చూచి స్త్రీలు భయపడి వస్త్రములను కప్పుకొనిరి. కాని సాహసి అగు ఆ సుందరుడు కప్పుకొనలేదు -8. సిగ్గును వదలిన అతడిని చూచి వసిష్ఠుడు కోపించి శపించెను -9.
వసిష్ఠుడు పలికెను :- ఓ సుందరా! నీవు సిగ్గును వదలి మేము వచ్చుచున్నప్పటికి వస్త్రమును కప్పుకొనలేదు. కనుక నీవు రాక్షసుడవు కమ్ము-10. అని వసిష్ఠుడు శపింపగ స్త్రీలు చేతులు జోడించి భక్తితో కూడిన మనస్సుతో నమస్కరించి మునిగణ మధ్యమున ఉన్న వసిష్ఠునితో ఇట్లనిరి -11,12.
స్త్రీలు పలికిరి:- అన్ని ధర్మములు తెలిసినవాడా, బ్రహ్మకుమారుడా, దయాసింధూ, మాపై దయచూపుము. కోపము తెచ్చుకొనకుము -13. భర్తయే స్త్రీలకు భూషణము. వందమంది కుమారులు ఉన్నను భర్తలేనిచో ఆ స్త్రీ విధవ అనియే పిలువబడును. కనుక మాపై భర్తపై కృప చూపుము -14,15. నిజము తెలిసిన మునులు ఈ ఒక్క తప్పును క్షమించవలయును. నీ శిష్యుడగు ఈ సుందరుని పై దయచూపుము -16.
సూతుడు పలికెను:- సుందరుని స్త్రీలచే ఈ విధముగ ప్రార్థింపబడి వసిష్ఠుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను -17.
సుందరుని రాక్షసత్వము పోవుటకు వసిష్ఠుడు ఉపాయమును చెప్పుట
వసిష్ఠుడు చెప్పెను:- స్త్రీలారా! నా వచనమెప్పటికిని మిధ్యకాదు. కాని శాపావసాన ఉపాయమును చెప్పెదను శ్రద్దగా వినుడు -18. నేనిచ్చిన ఈ శాపము మీ భర్త పదహారు సంవత్సరములు అనుభవించును. తరువాత రాక్షసుని రూపముతో ఉన్న ఈ సుందరుడు యాదృచ్ఛికంగా అన్ని పాపములను హరించు వేంకటాద్రికి వెళ్ళి అచట ఉన్న చక్ర తీర్థమునకు వెళ్ళును -19, 20. అచట మహాయోగి మునీశ్వరుడు అను పద్మనాభుడు ఉండును. ఆ మునికి రాక్షసరూపంలో ఉన్న సుందరుడు భక్షింపబోవును -21. మునిని రక్షించుటకై విష్ణువు పంపిన సుదర్శన చక్రము రాక్షసుని శిరస్సును మొండెమునుండి వేరు చేయును-22. అపుడు సుందరుడు నా శాపము నుండి ముక్తిని పొందును. స్వర్గమునకు వెళ్ళును. దీనియందు సందేహము లేదు -23. కనుక మీరును స్వర్గమునకు పోయి వేచి యుండుడు. మీ భర్త తిరిగి సుందరమగు రూపమును పొంది మిమ్ము చేరును -24.
సూతుడు చెప్పెను:- అని సుందరుని భార్యలతో చెప్పి శ్రీరంగేశుని సేవించుటకై వసిష్ఠుడు తన ఆశ్రమమునకు వెళ్లును - 25.
అపుడా స్త్రీలు తమ భర్తను కౌగలించుకొని మిక్కిలి దుఃఖించిరి. దుఃఖసాగరమునందు మునిగినవారు చూచుచుండగనే సుందరుడు రాక్షసునిగ మారెను. పెద్దకోరలతో, భయంకరమైన శరీరము కలిగి ఎర్రని మీసములు, వెండ్రుకలు కలిగి ఉండెను -25, 27. అతడిని చూచి భయపడిన అతడి భార్యలు స్వర్గమునకేగిరి. తరువాత రాక్షస రూపమును పొంది కనిపించిన ప్రాణులను తినుచు, ఒక ప్రదేశమునుండి ఇంకొక ప్రదేశమునకు వెళ్ళుచు వేగముగా అడవులు దాటుచు వేంకటాద్రికి చేరెను -28, 29. అచట చక్రతీర్థమునకు చేరెను. ఈ విధముగ పదహారు సంవత్సరములు గడచెను -30. తరువాత చక్రతీర్థమునందు నివసించుచున్న పద్మనాభుని భక్షింపబోయెను -31. ఆ పద్మనాభుడు తనను రక్షింపుమని విష్ణువును ప్రార్థింపగ స్వామి చక్రమును పంపెను -32. రాక్షసునిచే పీడింపబడుచున్న పద్మనాభుని రక్షించుటకు వచ్చిన సుదర్శనచక్రము ఆ రాక్షసుని శిరస్సును ఖండించెను -33.
సుందరునికి రాక్షసత్వము పోయి తన స్వరూపము సిద్ధించుట:- అపుడా సుందరుడు రాక్షస దేహమును విడచి దివ్యస్వరూపమును పొందెను. పుష్పవర్షము కురియుచుండగ దివ్యవిమానము నెక్కెను -34. చేతులు జోడించి సుదర్శన చక్రమునకు నమస్కరించి వినుటకింపైన మాటలతో సాదరముగా ఇట్లు స్తుతించెను.
సుందరుడు అనెను:- ఓ సుదర్శన నీకు నమస్కారము, విష్ణుమూర్తి హస్తమునందు నీవు అలంకారమవు, రాక్షసులను చంపువాడవు, వేయి సూర్యుల కాంతికలవాడవు -36. నీ దయవలన నేను రాక్షస శరీరమునుండి ముక్తిని పొందితిని. విష్ణువు చేతిలో ఉండు చక్రమా, నీకు నమస్కారమ -37. స్వర్గమునకు వెళ్ళుటకు నాకు అనుమతినిమ్ము. విష్ణువునకు ఇష్టుడైన వాడా, నా భార్యలు నా కొరకు దుఃఖించుచుందురు -38. నీ మేలు ఎల్లప్పుడును నా మనస్సునందు ఉంచుకొందును. ఆ విధముగా ఉండుటన్లు నన్ను అనుగ్రహింపుము -39. ఈ విధముగా సుందరునిచేత భక్తిగా స్తుతింపబడిన సుదర్శనచక్రము మిక్కిలి సంతసించి సుందరునికి అనుమతిని అనుగ్రహించెను -40. చక్రాయుధముచే అనుజ్ఞపొందిన సుందరుడు పద్మనాభునికి నమస్కరించి, అనుజ్ఞాతుడై స్వర్గమునకేగెను.
సుందరుడు స్వర్గమునకు వెళ్ళగా మునీశ్వరుడగు పద్మనాభుడు సుదర్శన చక్రమునిట్లు ప్రార్థించెను. విష్ణువు యొక్క ఆయుధమా నీకు నమస్కారము -42. ఓ చక్రాయుధ, రాక్షస సంహారము చేయువాడా, శుభకరమగు ఈ చక్ర తీర్థమునందు నీవు ఎల్లప్పుడు వసింపుము -43. నీవు వసించుటవలన ఇచట స్నానము చేసిన పాపుల యొక్క పాపములను నశింపజేసి వారికి శాశ్వత ముక్తిని ప్రసాదించుము -44. నీ విచట వసించుట వలన ఈ తీర్థము చక్రతీర్థమని పేరు పొందుగాక, నీ వచట వసించుట వలన ఇచట ఉండు మునులకు ఎటువంటి భయము కలుగ కుండుగాక, ఓ చక్రాయుధమా, నీకు నమస్కారము. భూతములనుండి, ప్రేతములనుండి భయము లేకుండుగాక - 45,46. అని పద్మనాభయోగిచే సంస్తుతింపబడిన చక్రాయుధము ‘తథాస్తు’ అని పలికి ఆ తీర్థమున ప్రవేశించేను.
సూతుడు చెప్పెను:- ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా మీకు రాక్షసుడు ఏ విధముగా ఆవిర్భవించినది కల్మషములను పోగొట్టు చక్రతీర్థము యొక్క వైభవమును చెప్పితిని -48. ఈ కథను విన్నవారు అన్ని పాపములనుండి ముక్తి పొందుదురు - 49.
ఎనభై ఒక్క వేల శ్లోకములు గల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీవేంకటాచల మాహాత్మ్యమున చక్రతీర్థముయొక్క మహిమను వర్ణించుట అను ఇరవై నాల్గవ అధ్యాయము.
