స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
12వ అధ్యాయము
ఋషయ ఊచు:
ఋషులు పలికిరి:- సర్వార్థములను తెలిసినవాడా, వేదవేదాంగములను పఠించినవాడా, ఓ సూతుడా! స్వామి. పుష్కరిణియొక్క వైభవమును మాకు తెలియజేయుము, దీనిని స్మరించుట చేతనే మానవులు ముక్తిని పొందుదురో అట్టి దానిని తెలియజేయము. సూతుడు పలికెను. స్వామి పుష్కరిణిని ప్రశంసించినవారు. దానిలో స్నానము చేసినవారు, దాని గురించి చెప్పినవారు ఇరవై ఎనిమిది విధములైన నరకముల నుండి బయటపడుదురు. ఆ నరకములు ఏవనగా తామిస్రము, అంధతామిస్రము, మహారౌరవము, రౌరవము, కుంభీపాకము, కాలసూత్రము, అసిపత్రవనము, కృమిభక్షము, అంధకూపము, సందంశము, శాల్మలి, లాలాభక్షము, అవీచి, సారమేయాదమున. వజ్రకణకము, క్షారకర్దమ పాతనము, రక్షోగణాశనము, శూలప్రోత నిరోధనము. తిరోదానము, సూచీముఖము, పూయశోణిత భక్షము, విషాగ్ని పరిపీడనము. ఈ ఇరవై ఎనిమిది నరకములు (ఇరవై ఎనిమిది నరకములకుగాని ఇరవై రెండు మాత్రమే కలవు.) స్వామి పుష్కరిణియందు స్నానము చేసినందువల్ల మానవుడు ఈ నరకములను చేరడు.
ఇతరులకు చెందిన ధనమును, పుత్రులను, భార్యను అపహరించినవానిని యమదూతలు కాలపాశముతో బంధించుదురు. అనేక సంవత్సరములు ఘోరమైన తామిస్రమను నరకమునందు పడవేయుదురు. స్వామి తీర్థమునందు స్నానము చేసినచో పడవేయరు. తల్లిని, తండ్రిని బ్రాహ్మణులను బాధించు పురుషాధముని పదివేల యోజనముల విస్తృతి కలిగి క్రింద అగ్ని పైన సూర్యుని వేడి కల్గిన రాగిపాత్రయందు తిండి పెట్టక పడవేయుదురు. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసినచో పడవేయరు. వేదమార్గమును లక్ష్యపెట్టక చెడు మార్గములయందు తిరుగు మానవుని యమకింకరులు అసీ పత్రవనమునందు పడవేయుదురు. కాని స్వామితీర్థమున స్నానము చేసినవారిని విడచి పెట్టుదురు. పంక్తిభేదము లేకుండా వండిన పప్పు మొదలైన వానిని తిన్న మానవుని యమభటులు కృమి భక్షమను నరకమునందు పడవేయుదురు. అచటతడు వందలకొద్ది పురుగులచే తినబడుచు, తాను కూడ వందలాది పురుగులను తినుచుండును.
అతడు కూడ పురుగువలె మారి పాపము తీరునంతవరకు ఉండును. స్వామి తీర్థమునందు స్నానము చేసిన ఆ నరకము నందు పడవేయరు. బ్రాహ్మణుల వద్ద నుండి ధనమును స్నేహముచేగాని, బలముచేగాని, ఇతరుల విత్తమును రాజుగాని, అతడికి చెందినవారు కాని అపహరించినచో ఇనుముతో చేసిన అగ్ని కుండములయందు పడవేసి పట్టుకారులతో పట్టి ఉంచుదురు. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసిన వారికి ఈ ప్రమాదము లేదు. పొందరాని స్త్రీని పొందిన పురుషాధముని, పొందరాని పురుషుని పొందిన నీచస్త్రీని వారు పొంది స్త్రీ పురుషుల విగ్రహములను ఇనుముతో తయారు చేసి సూర్యచంద్రులున్నంత వరకు కాలుచున్న ఆ విగ్రహములను కౌగిలించుకుని ఉండునట్లు సూచీ అను నరకమునందు యమభటులు శిక్ష విధింతురు. స్వామి తీర్థమున స్నానము చేసిన వారికి ఈ శిక్ష విధింపరు. వివిధములైన ఉపాయములచేత, ఉపద్రవముల చేత అన్ని జంతువులను బాధించువారిని శాల్మలి అను ఘోర నరకము నందు పడవేయుదురు. స్వామి తీర్థమున స్నానము చేసిన వారిని పడవేయరు.
రాజుగాని, రాజుయొక్క భృత్యులుకాని పాషండుని అనుసరించినపుడు, ధర్మసేతువులను కూలగొట్టి నపుడు వైతరణియందు పడవేయబడుదురు. స్వామి తీర్థమున స్నానము చేసిన ఆ శిక్ష విధింపబడదు. గొడ్రాలితో సంగమించినవాడు, శౌచము మొదలైన ఆచారములను విడచినవాడు, సిగ్గును వదలిన వాడు, వేదమును వదలి పెట్టినవాడు, పశువువలె ప్రవర్తించువాడు అయిన పురుషుని చీము, మలము, మూత్రము, రక్తము, శ్లేష్మము, పిత్తము మొదలైనవాటితో నిండిన భీభత్సకరమైన నరకమునందు పడవేయుదురు. స్వామి పుష్కరిణి యందు స్నానము చేసిన పడవేయరు. ఎవరైతే వేట యందు కుక్కలచేత, బాణముల చేత జంతువులను బాధించునో అట్టివానిని యమ కింకరలు బాణములతో కొట్టి బాధింతురు. వారిని ప్రాణ రోదమను నరకము నందు పడవేయుదురు. కాని స్వామి పుష్కరిణి యందు స్నానము చేసిన పడవేయరు. విధిపూర్వకముగా కాక కపటముతో యజ్ఞముల యందు పశువులను వధించినవాడిని వైశసము అను నరకము నందు పడవేయుదురు.
ఆ నరకము నందు యమభటులు అతడిని ముక్కలుగా చేయుదురు. స్వామి పుష్కరిణిలో స్నానము చేసినవారికీ బాధలేదు. తన వర్ణమునకే చెందిన తన భార్య రేతస్సు త్రాగించినవాడు నరకమునందు రేతఃకుండము నందు. పడి రేతస్సును త్రాగవలసి యుండును. కాని స్వామి పుష్కరిణియందు స్నానము చేసినవారికీ గతి పట్టదు. రాక్షసుల మార్గము నాశ్రయించి విషము పెట్టినవానికి, గ్రామమును దహించినవానికి, వ్యాపారస్తుల ధనమును అపహరించినవారికి వజ్రదంష్ట్ర అను నరకము తప్పదు. స్వామి తీర్థమున స్నానము చేసిన ఈ నరకము తప్పును. ఇతరములైన ఏ నరకములు ఉన్నవో వాటన్నిటిలో పడకుండ స్వామి తీర్థమున స్నానము చేయుట వలన రక్షింపబడుదురు. స్వామి పుష్కరిణి యందు ఒక్కసారి స్నానము చేసినంతనే అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును. ఆత్మజ్ఞానము కలుగును. నాలుగు విధములైన ముక్తి లభించును. పాపము చేయు బుద్ధి కలుగదు. దుఃఖము కూడ కలుగదు.
తులాభారము చేసినందువల్ల ఎంత ఫలము కల్గునో స్వామి తీర్థమునందు స్నానము చేసినందువల్ల అంత ఫలితము కలుగును. వేయి ఆవులను దానము చేసినందువల్ల ఎంత పుణ్యము కలుగునో అంత పుణ్యము కలుగును ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ నాల్గిటిలో ఏది కోరిన వారికి అది లభించును. మహాపాతకములనుండి, సమస్త పాతకముల నుండి వెంటనే ముక్తి లభించును. ప్రజ్ఞ, యశస్సు, లక్ష్మి, సంపద, జ్ఞానము, ధర్మము, విరక్తి, మనో విశుద్ధి అన్నియు స్వామి తీర్థమునందు స్నానము వలన కలుగును. పదివేలసార్లు బ్రహ్మహత్యలు చేసినను, సురాపానము చేసినను, బంగారము దొంగిలించినను, గురుగ్రీ సమాగమము జరిపినను, సంసర్గదోషము నాచరించినను అన్నియు స్వామి పుష్కరిణి స్నానము వలన నశించును. బ్రహ్మహత్యతోగాని, సురాపానముతోగానీ, గురుస్తీ గమనముతోగాని, సువర్ణ సేయముతోగాని, సంసర్గ దోషముతోగాని సమానములైన ఏ దోషములైన స్వామి పుష్కరిణియందు స్నానము చేయుట వలన నశించును.
స్వామి తీర్థమాహాత్మ్యమును శ్రద్దగా విననివారు మహానరకము పొందుట:- ఈ పైన చెప్పిన ఏ విషయమునందు ఎప్పుడూ సందేహింపరాదు. అట్లు చేసిన వారిడు నాలుక పై కాల్చిన గొడ్డలిని ఉంచుదురు యమభటులు. ఇది అంతయు అర్థవాదమని అనుచు నరకమునకు పోయినవారు అన్ని సత్కర్మలను వదలి పెట్టినవారు, వారు పందితో సమానమైనవారు. ఇది ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము, ఎంత మూర్ఖము, సర్వపాతకములను నాశనము చేయునది, అద్వైతజ్ఞానమును కలిగించునది, మానవులకు భక్తిని ముక్తిని కలుగచేయునది, కోరిన కోరికలను తీర్చునది, ఆజ్ఞానమును పోగొట్టునది అయిన స్వామి పుష్కరిణి కలదు. అటువంటి స్వామి పుష్కరిణి ఉండగా ప్రజలు మరి ఒకదానిని గూర్చి ఆలోచించుచున్నారనగా మోహము యొక్క మాహాత్మ్యమును గూర్చి ఏమి చెప్పవలయును. పుష్కరిణి యందు స్నానము చేసిన వారికి యముని భయము లేదు. అచట స్నానము చేసినవారికి, చూచినవారికి, సోత్రము చేసిన వారికి, ప్రశంసించిన వారికి అంటిన వారికి, నమస్కరించిన వారికి యమభయము లేదు. కానివారు అటు పై తల్లిపాలు తాగరు. ఈ విధముగ స్వామి పుష్కరిణి మాహాత్మ్యమును మీకు వినిపించితిని. ఇది భక్తిని ముక్తిని కలుగజేయునది. అన్ని పాపములను పోగొట్టునది.
ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున స్వామి పుష్కరిణి మహిమను వర్ణించుట అను పన్నెండవ అధ్యాయము.
