స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

31వ అధ్యాయము

సూతుడు చేప్పెను:- సాయంకాలపు విధిని పూర్తి చేసిన వాడు, అగ్నితో సమానమగు కాంతి కలవాడు, సుఖముగా కూర్చున్నవాడు అయిన మునీంద్రునికి ఆర్జునుడు నమస్కరించెను సువర్ణముఖి నదిపై నుండి వీచుచున్న చల్లని కమ్మని అమృతము వంటి గాలిచే ఆనందించి గంభీరముగా వినయముగా ఇట్లు పలికెను. అర్జునుడు ఆడిగెను: ఓ మునిపుంగవా! ఈ లోకమునందు నేనొకడనే ధన్యుడను. ఎందుకనగా నన్ను నీవు పుత్రునివలే ఆదరించితివి. మీ ఈ ఆదరమువలన నా మనస్సుయందు ఒక కుతూహలము కల్గినది. మీ వాగమతమును గ్రోలవలెనని నన్ను తొందర చేయుచున్నది. ఈ గొప్ప నది ఏ కొండపై పుట్టినది? ఎవరిచే కొనిరాబడినది? ఇచట స్నానము చేయుట వలన, దానము చేయుటవలన ఎటువంటి పుణ్యమును పొందవచ్చును. ఈ నది యొక్క ప్రభావమును, పుట్టుకను గూర్చి వినయోపేతుడనగు నాకు చెప్పవలసినది. నీవు భక్తులను అనుగ్రహించువాడవు కదా!. అని అర్జునుడు అడుగగా బ్రాహ్మణోత్తముడగు ఆ భరద్వాజుడు అర్జునుని ముఖము చూచి ఇట్లు చెప్పసాగెను.

   ఓ అర్జునా, నీవు గొప్ప పరాక్రమవంతుడవు, కౌరవవంశమునే పావనము చేసినవాడవు. ధర్మజునికి తమ్ముడవగుటచే నాకు విశేషించి ఇష్టుడవు. నేననేకమంది రాజులను చూచితినీ కాని నీవంటివాడను చూడలేదు. ఓ ఫల్గునా! విలాసము, ఓర్పు, దయ, ఔదార్యము, ధైర్యము, గాంభీర్యము అన్నియు నీ యందున్నవి. కులము, విద్య, ధనము అనునవి బలవంతులకు మత్తెక్కించును. కాని నీవంటి గొప్పవారికి అవి వినయమునకు కారణమగుచున్నవి. అనంతమైన రాజ్యభోగములు కలిగి ఉన్నప్పటికి ఎట్టి మార్పును పొందని వారు నీవు కాక మరెవరు కలరు? . లోకోత్తరములైన నీ గుణముల చేత నేను మిక్కిలి పరవశుడనైతిని. నీవు కుతూహలముతో అడిగినపుడు చెప్పదగని కథ ఏమున్నది. నేను మునుల వద్ద నుండి విన్న ఈ కథను నీకు చెప్పెదను. దీనిని వినుట వలన సమస్త ప్రాణులు పాపముల నుండి ముక్తిని పొందుచున్నారు.

   భరద్వాజుడు చెప్పిన శివుని వివాహప్రకారము:- పూర్వము దక్షప్రజాపతి కుమార్తె అగు సతీదేవి తన దేహమును వదలి హిమవంతుని కుమార్తెగా జన్మించెను. సప్తర్పులు వచ్చి ఆమెను శివునికి భార్యగా చేయవలసినదిగా హిమవంతుని కోరిరి. సమస్త లోకాధిపతియగు పరమేశ్వరుడు సకలమంగళములు కలిగించు పార్వతిని వివాహమాడుటకై ఓషధీ ప్రస్థము అను పేరుగల హిమవత్పర్వత ప్రాంతమునకు చేరెను. శివుని ఆదేశానుసారము చరాచరములగు ప్రాణులన్నియు భూతనాథుడగు శివుని వివాహమును అభినందించుటకు అచటకు వచ్చెను. వారి బరువు మిక్కుటమగుటచే ఉత్తర దిక్కున ఉన్న భూమి క్రుంగిపోయి పాతాళము వరకు వంగిపోయెను. దక్షిణమున ఉన్న భూమి బరువు లేనిదగుటచే పైకి పోయెను. ఇది చూచి అందరకు భయము కలిగెను . భూమి పొందిన ఆ విపరీతస్థితిని చూచి మహేశ్వరుడు అగస్త్యుని వైపు చూచి ఓ మహాప్రాజ్ఞా! ఇటు రమ్ము అని పిలచి ఇట్లు పలికెను.

సమస్త భూతములు ఇచటకు వచ్చుట చేత భూమి ఇట్లు వికారమును పొందినది. దీనిని సరిచేయుటకు నీవు తగిన వాడవు. నీ కంటే వేరైన వారు ఈ పని ఎట్లు చేయగలరు?. నీవు నీ తేజస్సు వలన ఈ లోకములను రక్షించుటకు జన్మించితివి. కనుక నా మాట పై ఈ భూమిని సరిచేయుము. నా వివాహమును చూచుటకు వచ్చిన సరిచేయలేరు. కనుక నీవు వెళ్లవలసినది. నీవు ఎచటకు వెళ్లి నిలచెదవో అచట నీకు నేను పార్వతిని వివాహమాడు మూర్తిని చూపగలను .

 

 

  భూమిని సరిచేయుటకు అగస్త్యుడు హిమాలయముల నుండి దక్షిణ దిక్కునకేగుట:- అని పలికి అతడిని కౌగిలించుకుని మహేశ్వరుడు అతడిని పంపగా శివునికి నమస్కరించి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు బయలుదేరెను. వింధ్య పర్వతమును దాటి అగస్త్యుడు దక్షిణ దిక్కుకు వెళ్లగా భూమి తిరిగి సమముగా అయ్యెను. భూమిని సరిచేసిన అగస్త్యుని చూచి దేవతలు, గంధర్వులు, కిన్నెరులు ఆనందముచే పులకరించిరి. ఆ విధముగా దక్షిణముగా కొంత దూరము పోయి అగస్త్యుడు భూమిలోనికి చొచ్చుకొని పోయి మోయుచున్న ఒక పర్వతమును చూచెను . ఆ పర్వతముపై గొప్ప ఔషధములు అనంతములైన రత్నములు బ్రహ్మచే నిధివలె ఒక్కచోట చేర్చినట్లు ప్రకాశించుచున్నవి. ఎత్తైన శిఖరములు కల ఆ పర్వతము తన శిఖరములతో కిందకు పడుచున్న ఆకాశమును ఎత్తిపట్టినట్లు నిరంతరము మోయుచున్నట్లు ఉండెను. నెమ్మదిగా ఆ పర్వతము పైకి ఎక్కిన అగస్త్యుడు ఆ పర్వత శిఖరమున నివాసముండుటకు నిశ్చయించుకొనెను. అచట అమృతము వంటి తియ్యనైన నీరు కలిగిన, తామరలు, కలువలు కల అనేక వృక్షములు చుట్టూరా గల ఒక సరస్సును చూచెను. దాని ఉత్తర భాగమునందు మనోహరమగు ప్రదేశమున ఆశ్రమమును నిర్మించుకొని విధివిధానపూర్వకముగా పితరులను, దేవతలను, ఋషులను వాస్తు దేవతను అర్చించెను. అనేక మంది మునులతో కలసి ఆ ఆశ్రమమునందు దేవతలు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు కల పర్వతముపై నివసించెను. తపస్సు చేయుట యందే మనస్సుకల ఆ అగస్త్యుడు అచట నివసించుటచే ఆ పర్వతము మిక్కిలి ప్రాశస్త్యమును పొంది అగస్త్య శైలము అను పేరును పొందెను.

ఎనభై ఒక్క వేల శ్లోకములు గల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున సువర్ణముఖరీ మాహాత్మ్యమునందు అర్జునభరద్వాజ సంభాషణమున శివుని పెండ్లి, అగస్త్యుడు దక్షిణ.