స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
30వ అధ్యాయము
అన్ని తీర్థేములను దర్శించి వచ్చిన అర్జునునికి సువర్ణముఖిని చూచుటచే సంతోషము మిక్కుటమయ్యెను. ఆ నది ఒడ్డున ఉన్న పొదరిళ్లలో స్త్రీలు సుఖమును పొందుచుండిరి. సిద్దులు కెరటముల పై నుండి వచ్చిన చల్లని గాలులచే సుఖమును పొందుచుండిరి. ఆ నది యందలి కెరటములు ఉవ్వెత్తున లేచి మేఘములనంటుచు చేతులు ఎత్తి ఆకాశగంగను కౌగలించుకొనుటకు యత్నించుచున్నవా అన్నట్లున్నవి. ఆ నదీతీరమున ఉన్న ఆశ్రమములు యజ్ఞములలో ఆహుతిచ్చిన పొగలచేత, చెట్ల కొమ్మలకు వ్రేలాడుచున్న నారవస్త్రముల చేత విరాజిల్లుచున్నవి, ఆ నది చుట్టుప్రక్కల అంతటా మునీంద్రులచే, దేవతలచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడి దివ్యలింగములు కలవు. ఆ నది ఇసుక తిన్నెలపై విశ్రాంతి తీసుకున్న ఓ రాజహంసలు మానససరోవరమును మరల గుర్తుకు తెచ్చుకొనవు.
లోకములను రక్షించు పంటలను ఆ నదీజలములు అన్ని రోగములను మాపు శక్తికలవై, పంట కాలువలతో మండి పారి వచ్చినవై రక్షించుచున్నవి. ఆ నది చక్రవాకపక్షలు అమనవి స్తనములుగా, ఉవ్వెత్తున ఎగిరిపడు కెరటములు అలంకారములుగ, సుడి గుండమే లోతైన నాభిగా, విశాలమైన ఇసుక తిన్నలే పిరుదులుగా ఉన్నవి. ఆ విచ్చిన కమలములే ముఖముగా, కదలుచున్న చేపలే కళ్లుగా, తెల్లని నురుగే వస్త్రముగా, హంసలు నడకే మనోహరమైన నడకగా ఉన్నది. నీటి పక్షల అరపులే మాటగా, కనులకింపుగా అపూర్వమైన ఒక స్త్రీ రూపమును ధరించి సముద్రువికిష్టురాలైనదిగా ఉన్నది. ఒడ్డు లొరకొనిపారుచు ఉన్న ఆ నదికి తూర్పువైపున అర్జునుడు ఎత్తుగా ఉన్న కాళహస్తి అను పర్వతమును చూచెను . తన ఎత్తైన శిఖరముచే ఆకాశమును తాకుచూ అధోలోకములలో ఏడవదైన పాతాళమువరకు వ్యాపించి ఉన్న మూలభాగము
ఆర్జునుడు ఆ గొప్పనదియందు స్నానము చేసి పర్వతము పై దేవతలచే ఆరాధింపబడు కాళహస్తీశ్వరుని దర్శించెను. పార్వతీవల్లభుడగు మహాదేవుని భక్తితో కూడిన మనస్సుతో అర్చించి కృతార్థుడయ్యెను. అద్భుతములకు నిలయమగు ఆ పర్వతము పై వింతలను చూడవలెనను కోరికతో సంచరింపసాగెను. కొండచరియలలో నివసించు సిద్దులను చూచేను. తమ స్త్రీలతో కలసి మహేశ్వరుని గాథలను పాడుచున్నవారు, అప్పర స్త్రీలతో కలసి పుష్పములయందలి తేనెను త్రాగి మత్తెక్కి పొదరిళ్లలో ఉన్నవారు అయిన అనేకమంది గంధర్వులను సాదరముగా చూచేను. ఏకాంత ప్రదేశములయందు శివుని ధ్యానించుచు దివ్యమైన ఆనందమును పొందుచున్న యోగులను చూచెను. ప్రశాంతముగా ఉన్న ఆశ్రమ పదములను, బలిగా ఇచ్చిన నివ్వరి ధాన్యములతో నిండిన ముఖద్వారములు కల వాటిని ఆ పర్వతముపై అంతటా చూచెను. ఇంద్రియనిగ్రహము కలిగి నిరాహారులైనవారిని, వాయువును మాత్రమే భుజించువారినీ, ఆకులను మాత్రమే భుజించువారిని, నీటిని మాత్రమే భుజించువారిని, ఎండను మాత్రమే భుజించువారిని, శాంతము కలిగిన వారిని చూచేను. ఆ పర్వతముపై ఉన్న సరస్సులు విచ్చిన తామరపూలవాసనలచే నిండిన దిక్కులు కలిగినవై ఆ అర్జునునికి నేత్రానందము కలిగించినవి. వేటకు బయలుదేరి ఎక్కు పెట్టిన విల్లమ్ములు కలిగిన వేటకాండ్రను చూచెను.
ఆథార్జునస్య సువర్ణముఖరీ తీరస్థభరద్వాజాశ్రమగమవమ్:
తమ స్త్రీలతో కలసి జంతువులను పుణ్యప్రదమగు భరధ్వాజుని ఆశ్రమమును చూచెను. ఆ ఆశ్రమము అరటి, కొబ్బరి, మామిడి, రేగు, సంపెంగ, గంధపు చెట్లతో నిండియుండెను. తక్కోలము, అశోకము, గిరకతాడి, తాడి, గేదంగి, దానిమ్మ, నేరేడు, కడిమి, చిల్లగింజ, తుమ్మ, మద్ది, కలిగొట్టు చెట్లు ఉన్నవి. పొన్న, పున్నాగ, తెల్లతెగడ, దేవదారు, కానుగ, లవంగ, మాదీఫలము, లవలీ, వేంకణము, బొట్టుగు చెట్లు కలవు. తాండ్ర, మారేడు, రావి, ఇప్ప, బూరుగ, పొగడ, పోక, మరువము, నారింజ, వేప, ఉసిరి, గుగ్గిలము చెట్లు ఉన్నవి. మరెన్నో చెట్లు పూలు, పండ్లతో నిండి ఉన్నవి. తియ్య మామిడి, మల్లె, జాజి మొదలైన లతలచే నిండి ఉన్నది. అపూర్వమైన వాసనలచే అంతటా తుమ్మెదలు ఆకర్షింపబడి ఉన్నవి. అచటి సరస్సులలో చక్రవాకపక్షులు, కొంగలు, క్రౌంచపక్షులు, హంసలు, కారండవములు మొదలగు పక్షలు ఉన్నవి. చెంగలువలు, కలువలు, తామరలు, తెల్లకలువలతో నిండిన ఆ సరస్సులు అమృతమువలె తియ్యగా స్వచ్చముగా ఉన్న నీటిచే లక్ష్మీనిలయాలుగా కౌతుకమును రేకెత్తించుచున్నవి. అచట సింహములు, ఏనుగులు, పులులు, సివంగులు, నల్లచారలదుప్పులు, ఇర్రులు కలవు.
మరెన్నో జంతువులు పరస్పరము సహాయము చేసికొనుచు అచట నివసించుచున్నవి ఆ ఆశ్రమము చైత్రరథ ఉద్యానమును, నందనవనమును మించి మాటలలో వర్ణింపరానిదై గొప్ప ఆనందమును కలిగించుచుండెను. ఆ ఆశ్రమమును చూచి ఆశ్చర్యముచే మనస్సు నిండగా అర్జునుడు ఆశ్రమమున ప్రవేశించి అచటి తాపసుల ప్రభావమును పొగిడెను. తనతో వచ్చినవారిని అచటనే నిలపెను.
ఆర్టమడు భరద్వాజునికి సేవ చేయుట:- మిత్రులతో, బ్రాహ్మణులతో కలసి ఆ ఆశ్రమమున ప్రవేశించిన అర్జునుడు తన ఎదుట మండుచున్న అగ్నివలె కాంతి కలిగిన భరద్వాజుని చూచెను. అతడు అనేక మంది మునులతో కలిసియుండెను. విభూతిని ఒడలెల్ల వ్రాసుకొనెను. మృగచర్మమును ఉత్తరీయముగా ధరించెను. నల్లని మేఘము వంటి జెందెము కలిగి, కైలాస పర్వతమువలె ఎర్రని శరీరము కలిగి, వ్రేలాడుచున్న జడలు బంగారు కాంతితో మెరయుచుండగా ప్రకాశించు చెండెను. శరత్కాలమునందలి మేఘము కదలని మెరపులు కలిగియున్నట్లు కాంతివంతముగా ఉండెను. శృతులు, కొంతి, దయ, తుష్టి, శాంతి అతడిని నిత్యము సేవించుచెండెను. అవి అనురక్తలైన ప్రియురాండ్రవలె అతడిని వీడచిపెట్టక ఉండెను. అటువంటి అఖండమగు బ్రహ్మవర్చస్సు కల భరద్వాజుని వద్దకు అర్జునుడు మెల్లగా సమీపించి అతడి పాదముల ఎదుట భూమిపై పడి సాష్టాంగ నమస్కారము చేసెను.
ఆర్జునునికి భరద్వాజుడు ఆతిథ్యమిచ్చుట:- అట్లు వచ్చిన అర్జునుని భరద్వాజుడు లేవనెత్తి ఆశీస్సులతో వర్థిల్లజేసెను. మిక్కిలి ఆనందమును పొందిన మనస్సుతో తగినట్లుగా అర్ఘ్యాదులతో అతిథియగు అర్జునుని సంభావించి ఆసనమును చూపి కుశలమడిగెను. ఈ విధముగ ముని నుండి ఆతిథ్యమును పొందిన అర్జునుడు ప్రియమగు మాటలచే భరద్వాజునికి మనస్సుకు ఆనందమును కలిగించెను. భరద్వాజుడు కామధేనువును తలచుకొనగా ఆ ధేనువు భక్ష్యములు, భోజ్యములు అన్నిటిని సృష్టించేను-. తన అనుచరులతో కలసి వాటిని భుజించి ఆర్జునుడు మిగిలిన పగటి కాలమును కథలు వినుచు గడ పెను. పిమ్మట సాయంకాల సంధ్యను ఉపాసించి, అగ్నిలో హవిస్సులు వేల్చెను. బ్రాహ్మణులతో, అమాత్యులతో కలసి కుటీరములకు వెళ్లాను. అచట ముని ఆశీస్సులచే అభినందింపగా మిక్కిలి ఆనందించి సువర్ణ ముఖి నది పై నుండి వచ్చు చల్లని వాయువులచే సుఖమును పొందెను. ఈ నది భూమిపైకి ఎవరిచే తీసుకురాబడినది, ఏ కొండ వద్ద దీనికి అధిక ప్రభావము అని ఆ నది యొక్క వైభవమును గూర్చి భరద్వాజుని ప్రశ్నించి వినుటకు సంసిద్ధుడై ఉండెను.
ఎనభై ఒక్క వేల శ్లోకములు కలిగిన శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందు సువర్ణముఖి మాహాత్మ్య ప్రశంసయందు భరద్వాజుని ఆశ్రమ వర్ణనము అను ముప్పైవ అధ్యాయము.
