స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

25 - జాబాలితీర్థముయొక్క మాహాత్మ్యము

సూతుడు చెప్పెను:- ఓ తపోధనులారా! నైమిషారణ్యమునందు నివసించు మునులారా! అన్ని పాతకములను నశింపజేయునది, గొప్ప పుణ్యమును కలిగించునది అగు వేంకటాద్రి పైన గల జాబాలి తీర్థమును గూర్చి చెప్పెదను. దురాచారుడను పేరుగలవాడు ఆ తీర్థమునందు స్నానముచేయుట వలన ముక్తి పొందెను -1,2.

మునులు పలికిరి :- తత్త్యమును తెలిసిన ఓ సూతుడా! ఎవరీ దురాచారుడు? తన దురాచారముతో ఏమి పాపము చేసెను?-3. ఏ విధముగా ముక్తి పొందెను. ఈ తీర్థముయొక్క వైభవము ఏమి? ఇది వినగోరుమాకు విస్తరముగా తెలియజేయుము-4.

  కావేరీతీరమునందు నివసించు దురాచారుడను విప్రుని కథ

సూతుడు చెప్పెను:- ఓ మునులారా! ఆ దురాచారుని పాతకమును వినుడు. జాబాలి తీర్థమున స్నానము చేయుటవలన ముక్తి ఎట్లు పొందెనో చెప్పెదను -5. కావేరీ తీరమునందు దురాచారుడు అను బ్రాహ్మణుడు క్రూరాత్ముడై పాపకర్మములు చేయుచు ఉండెను -6. బ్రహ్మహత్య చేసినవారితో, సురాపానము చేసినవారితో, గురుతల్పమును చేరిన వారితో, దొంగతనము చేసినవారితో, వారితో కలిసి తిరిగినవారితో, కలిసి నివసించుచుండెను -7. పంచమహాపాతకులతో సంసర్గమును ఏర్పరచుకొనుటవలన అతడి బ్రాహ్మణత్వమంతయు, ఏమియు మిగులకుండ నశించెను -8. మహాపాతకులతో కలిసి ఒక దినము నివసించినచో వారి బ్రాహ్మణత్వమునందు ఒక భాగము నశించును -9. దీనియందు సందేహము లేదు, రెండు దినములు పంచమహాపాతకులతో కలసి ఉన్నను, ముట్టుకొన్నను, చూచినను, శయనించినను, కలసి భుజించినను రెండు భాగముల బ్రాహ్మణత్వము నశించును.

         మూడుదినముల సహవాసము వల్ల మూడు భాగములు, నాల్గు దినముల సహవాసము వల్ల నాల్గు భాగములు నశించును -12. అంతకంటే ఎక్కువ దినములు కలిసి ఉన్నచో మహాపాతకములు చేసిన వానితో సమానుడగును -13. ఆ విధముగా బ్రాహ్మణత్వమును కోల్పోయిన దురాచారుడు భయంకరమైన సర్పముచేత చుట్టబడిన వానివలె మహాపాతకములచే పట్టుకొనబడెను -14. వేతాలునిచేత పట్టుకొనబడిన ఆ దురాచారుడు ఒక దేశమునుండి మరొక దేశమునకు ఒక వనమునుండి మరొక వనమునకు తిరుగుచుండెను -15. పూర్వ పుణ్యమువలన విధివశాత్తు అతడు కొంతకాలమునకు అన్ని పాపములను నశింపజేయు వేంకటాద్రికి చేరెను.

          జాబాలి తీర్థమునందు స్నానము చేయుట వలన దురాచారునికి, వేతాలునికి మహాపాతకములనుండి ముక్తి కలుగుట :పిశాచము ఆదేశింపబడిన దురాచారుడు మహాపాతకములను నాశనముచేయు జాబాలి తీర్థమునందు మునిగెను. వేతాలుడు విడచి పెట్టగా పైకి తేలెను -17.18. పావనమగు ఆ తీర్థమునుండి బయటకు వచ్చి తనను తాను తెలిసికొని, స్వర్ణముఖినదీ తీరమునందున్న తీర్థమునకు కావేరీ తీరము నుండి ఎట్లు వచ్చినా అని చకితుడయ్యెను -19,20. అపుడు జాబాలి తీర్థము వద్ద నున్న జాబాలియోగీంద్రుని సమీపించి నమస్కరించి ఇట్లడిగెను -21. ఓ భగవాన్ ఈ పర్వతమేదియో నాకు తెలియదు. నేను కావేరీ తీరమున నివసించు దురాచారుడనువాడను -22. దయతో నేనిచటకు ఎట్లు వచ్చినది తెలియజేయుడు అని దురాచారుడు ప్రశ్నించెను-23. అపుడు కృపానిధియగు ఆ ముని ఒక్క క్షణము ఆలోచించి ఇట్లు చెప్పెను.

            జాబాలి వర్ణించిన పార్వణము, శ్రాద్ధము చేయకపోవుట వలన కలుగు దోషములు

జాబాలి చెప్పెను:- ఓ దురాచారా! మహాపాత కులతో కలసి పూర్వము నీవు జీవించుట వలన నీ బ్రాహ్మణ్యమంతరించినది. అపుడు వేతాలుడు నిన్ను పట్టుకొనెను -25. అందువలన నీకు ఒడలు తెలియక అటు ఇటు తరిగి ఇచటకు వచ్చితివి. అతిపావనమగు ఈ తీర్థము నందు వేతాలునితో సహా మునిగితివి -26. ఇచట స్నానము చేసినంతనే నీ పాపములు నశించినవి. జాబాలి తీర్థమునందు పుణ్యప్రదమగు స్నానము చేసినవారు పంచమహాపాతకములు చేసినను అవి నశించును. సత్కర్మ సాధనమగు ఈ తీర్థస్నానముచేతనే అవి నశించును -27, 28. నీపాతకములన్నియు నశించినవి. నిన్ను పట్టుకొనిన వేతాలుడు పూర్వమొక బ్రాహ్మణుడు -29. తండ్రి చనిపోయిన దినమున పార్వణ పూర్వకముగ పితృశ్రాద్దము చేయలేదు. అతడి పితృదేవతలు శపించుట వలన వేతాలునిగ మారెను -30. అతడును ఈ తీర్థమునందు స్నానము చేయుట వలన వేతాలత్వమును వదిలి విష్ణులోకమును చేరెను -31. తల్లికాని, తండ్రిని మరణించిన దినమున శ్రాద్ధము పెట్టనివాడు వెంటనే వేతాలత్వమును పొంది, తరువాత నరకమునకు పోవును.

            సూతుడు చెప్పెను:- ఈ విధముగా దురాచారుడు మహాపాపములు చేసినప్పటికి ఈ తీర్థేమునందు స్నానముచేసినందున ముక్తుడై తిరిగి వచ్చుటలేని విష్ణు లోకమును చేరెను -33. ఇట్లు మీకు పుణ్యమగు దురాచారుని ముక్తి చెప్పబడినది. అన్ని పాపములను హరించునది, శుభకరమైనది అగు తీర్థేమును గూర్చి చెప్పబడినది -34, ఎచట దురాచారుడు ముక్తిని పొందెనో ఆ తీర్థేము నివృత్తిలేని పాపములను కూడ తొలగించును -35. శూద్రుడు పూజించిన లింగమునకు గాని, విష్ణు విగ్రహమునకు గాని విప్రుడు నమస్కరించిన ఘోరపాపము. దానికి మహర్షులు స్మృతులయందు ప్రాయశ్చిత్తమును చెప్పలేదు -36. జాబాలి తీర్థేమునందు స్నానము చేయుటవలన అట్టి పాపము సహితము నశించును. బ్రాహ్మణ నిందకు ప్రాయశ్చిత్తము లేదు -37, విశ్వాసఘాతకులకు, కృతఘ్నులకు, సోదరుని భార్యతో రమించిన వారికి పాపనివృత్తి లేదు -38. అట్టి వారికిని జాబాలి తీర్థేమున స్నానము చేసినందున ముక్తి కలుగుచున్నది -39. ఈ విధముగా మీకు జాబాలి తీర్థేము యొక్క వైభవము చెప్పబడినది. ఇది విన్న వారు అన్ని పాపములనుండి ముక్తిని పొందుదురు.

ఎనభై ఒక్క వేల శ్లోకములు గల శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున జాబాలితీర్థేము యొక్క మహిమను వర్ణించుట అను ఇరవై అయిదవ అధ్యాయము.