స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
6వ అధ్యాయము
యువతులు చెప్పిరి: - మేము ఆకాశరాజు యొక్క అంతఃపురమునందు ఉండువారము. రాజు కుమార్తె అయిన పద్మావతికి చెలులము.పూర్వమొకసారి రాజకుమార్తెతో ఉద్యానవనమునకు వెళ్లితిమి. ఆమె కొరకు పూవులు కోయుచుంటిమి. ఒక చెట్టుకింద కూర్చుని ఉండగ ఒక దివ్య పురుషుని చూచితిమి. అతడు ఇంద్రనీలమణి వంటి వర్ణము కలిగి, లక్ష్మీదేవికి నిలయమైన వక్షఃస్థలము కలిగి ఉన్నాడు. సన్నని చిరునవ్వు ముఖము కలవాడు, అందమైన, బలమైన, పొడవుగా ఉన్న భుజములు కలవాడు. పరిశుభ్రమైన పట్టువస్త్రము కలవాడు, బంగారముతో చేసిన బాణము, అమ్ములపొది కలవాడు. బంగారు కిరీటము కలవాడు, హారములు, కేయూరములు కలవాడు. అటువంటి పురుషుని చూచి కమలలోచన, కరిగిన బంగారు వంటి వన్నెగల మా చెలి చూడు చూడుమని పలికెను. మేమాతని చూచుచుండగనే అతడు అంతర్ధానమాయెను. వెంటనే మా చెలి మూర్చపోగా మేమామెను అంతఃపురమునకు తీసుకుపోయితిమి.
ఆకాశరాజు పద్మావతిని గురించి దైవజ్ఞుని అడుగుట:- కుమార్తె పద్మావతి అస్వస్థతతో ఉండుట చూచి ఆకాశరాజు దైవజ్ఞుని పిలచి, ఓ విప్రోత్తమా! నా పుత్రిక గ్రహచారము ఎట్లున్నదో తెల్పుము అని అడిగెను. బృహస్పతితో సమానుడైన ఆ దైవజ్ఞుడు గ్రహములను గూర్చి మనస్సు యందు లెక్కించుకొని ఓ రాజా! గ్రహములన్నియు నీ పుత్రికకు అనుకూలముగ " ఉన్నవి. కాని గ్రహఫలమెప్పుడు కొంచెము భ్రాంతిని కల్గించునదిగ ఉండును అని పలికి బుద్ధిమంతుడైన ఆ దైవజ్ఞుడు ప్రశ్నకాలమును కూడా పరీక్షించెను. ఛాయను లెక్కించి, లగ్నమును పరీక్షించి, లగ్నము నందు లగ్నాధిపతి చంద్రుడు కేంద్రమునందు బృహస్పతి కలడు. దీనపక్షి నిద్రించుచుండగా, ప్రశ్న పక్షి రాజ్యమునందు అనగా పదవ స్థానమందు అనగా పదవస్థానమందు ఉన్నది. ఓ రాజా! దీని ఫలమును వినుము. ఆమెకు స్వాస్థ్యమే కలుగగలదు. ఉత్తముడైన ఒక పురుషుడు కన్యవద్దకు వచ్చెను. అతడిని చూసి నీ పుత్రిక మోహమును పొందినది. అతడిని పొందగోరుచున్నద. ఆ పురుషుని చేత పంపబడిన ఒక కన్యక ఇక్కడకు రాగలదు. ఆమె చెప్పబోవు విషయము నీకు హితమును కలిగించును. ఆమె చెప్పు దానిని నీవు చేయుము. నేను చెప్పినదంతయు నిజము. మరియు అన్ని శుభములను కలుగ చేయునది, అన్ని వ్యాధులను నాశనము చేయునది చెప్పెదను వినుము. నేను చెప్పినదానిని ఆచరించినచో నీ పుత్రికకు సుఖము కలుగగలదు. అగస్త్యలింగమునకు బ్రాహ్మణుల చేత అభిషేకమును కావింపుము. అని చెప్పి ఆ దైవజ్ఞుడు తన ఇంటికి వెళ్లాను.
అప్పుడు ఆ ఆకాశరాజు వేదాధ్యయనము చేసిన బ్రాహ్మణులను పిలిపించి, వారిని పూజించి దేవాలయమునకు వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించెను. 'మంత్రపూర్వకముగా శివునికి మహాభిషేకమును నిర్వర్తింపుడు' అని వారితో పలికెను. మహాభిషేకమునకు కావలసిన సంభారములను సమకూర్చుటకు మమ్ము పంపుటచే మేమిచటికి వచ్చితిమి. ఓ ఉత్తమురాలా! నీవిచటకు వచ్చిన కారణమేమి? ఎచటి నుండి వచ్చుచున్నావు? ఏమి పని? నీవెచటకు వెళ్లవలెను?. ఈ దివ్యాశ్వముపై వచ్చిన నీవు దేవలోకమునుంచి వచ్చినట్లున్నావు.
వరాహస్వామి చెప్పెను:- ఈ విధముగా వారిచే ప్రశ్నింపబడినదై మిక్కిలి ఆనందమును పొంది ఆ వకులమాలిక మధురములైన వాక్కులతో ఆ కన్యలను సంతోషపరచునట్లు ఇట్లనెను.
వకులమాలిక చెప్పెను:- నేను శ్రీ వేంకటాద్రి నుండి వచ్చితిని. నా పేరు వకులమాలిక. ధరణీదేవిని చూడగోరి ఈ అశ్వము పై వచ్చితిని? మీ దేవిని చూచుటకు వీలౌతుందా? అని ఆమె చెప్పగా ఆ కన్యకలెట్లనిరి. మాతో వచ్చినచో నీవు మా దేవిని 'చూడగలవు అని చెప్పగా ఆమె వారితో కలసి రాజగృహమునకు వచ్చెను, వారీవిధముగా ధరణి వద్దకు వచ్చుచుండగా ధరణి ఒక సోది చెప్పు స్త్రీని చూచేను. ధరణి ప్రశ్నించగా పులిందిని సమాధానము చెప్పుట: ఆ పులిందస్త్రీ గురివింద గింజలను, శంఖములను ధరించి, పాలు త్రాగే వయస్సుగల పిల్లవానిని వీపున కొంగుతో కట్టుకొని వీథిలో వచ్చుచుండెను. సత్యము చెప్పెదను. వినుడు. భూతముకాని, భవిష్యత్తుకాని, వర్తమానముకాని చేప్పెదను. అని పలుకుచు చిరునవ్వుతో ఆమె వీధిలయందు తిరుగుచెండెను. అపుడా ధరణి బంగారు చేటలో ముత్యములను పోసి మూడు తూముల ఎత్తున మూడు కుప్పలుగా చేసి ఓ సోది చెప్పుదానా! సత్యమును తెల్పుము. జరిగినది జరగబోవునది విశదముగా చెప్పుము అని ఆ ధరణీ దేవి పలుకగా పులిందిని ఇట్లనెను.
ధరణీదేవి తన మనస్సులో మధ్యరాశిని తలచుకున్నదని గుర్తించి ఆమె రాణిని నిజమేనా అని ప్రశ్నించగా రాణి ఔననెను. ధరణి పలికెను. నీవు చెప్పిన రాశి నిజమే దాని ఫలితమును చెప్పుము నీకు గొప్ప ధనరాశిని ఇచ్చేదను. పులిందని పలికెను. నీకు తప్పక సత్యమును చేప్పెదను. నా బిడ్డకు అన్నము ఇమ్ము అని పలుకగా ధరణీదేవి బంగారు పాత్రలో అన్నమును ఇచ్చెను. ఆ అన్నమునిచ్చి సత్యము పలుకమనగా ఆమె పాలతో కూడిన అన్నమును తీసుకొనెను. ఓ సుభ్రూ, నీ పుత్రిక నీరసించుటకు కారణము చెప్పెదను వినుము. ఒక పురుషుని చూచుట చేత నీ కుమార్తె కిట్టి స్థితి ఏర్పడినది. మన్మథుని బాణములచే పీడింపబడినదై విరహమును పొందినది. ఆ పురుషుడు సాక్షాత్తు
వైకుంఠము నుండి వచ్చిన దేవదేవుడు. శ్రీ వేంకటాద్రి శిఖరమున స్వామి పుష్కరిణి తటమునందు మాయావి అయి పరమానందుడు, రమాపతి అయిన ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితో కామరూపి అయి భక్తుల కోరికలు తీర్చుచు విహరించుచుండును. అతడొకసారి అశ్వము పై వనమందు విహరించుచుండెను. అతడు ఉద్యానమునకు వచ్చినపుడు లక్ష్మీదేవితో సమానురాలైన నీ కుమార్తెను చూచి మోహించెను. ఆ ప్రభువే తన సఖిని నీవద్దకు పంపగలడు. నీ కుమార్తె లక్ష్మీదేవి వలె అతడిని చేరి సుఖింపగలదు. నేను చెప్పినదంతయు సత్యము. ఓ రాణి నేడే ఇది నిజము కాగలదు. నా పుత్రునికి అన్నము పెట్టుము అని ఆమె ఊరకుండెను. ధరణీదేవి ఆమెకు తిరిగి చాలా అన్నమునిచ్చి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లిన తరువాత అనిందిత అయిన ఆ ధరణీదేవి కుమార్తె వద్దకు వెళ్లాను.
ఆపుడా ధరణీదేవి ఆ ముంగిలి నుంచి లేచి, శుభకరమైన అంతఃపురమున ప్రవేశించి, పద్మావతి తన సఖులతో కూడి ఉన్న చోటుకు వెళ్లాను. కుమార్తె సమీపమునకు వెళ్లి కన్య, కామముచేత బాధింపబడినది అయిన ఆమెను చూచి ఓ పుత్రీ నేనేమి చేయగలను. నీకు ఇష్టమైనది ఏది? అని తల్లి అడుగగా అభిమానవతి అయిన ఆ పద్మావతి మెల్లగా ఇట్లనెను. పద్మావతి చెప్పిన భక్తుని, భగవంతుని లక్షణములు: నేత్రములకు మిక్కిలి ఆనందము కలిగించు, ఈ లోకమునందు మంచివారికి కూడా మనస్సుకు మిక్కిలి ఇష్టమగు, బ్రహ్మాదులు కూడా చూడగోరు, తనలో అన్నిటిని కలిగి ఉన్న, అన్ని తేజస్సులలోకి మిక్కిలి తేజముకల, దేవతలందరికి దేవత అయిన, మంచివారి చేత, భక్తుల చేత మాత్రమే పొందదగిన భక్తులు కాని వారికి ఎప్పుడు సాధ్యముకాని వస్తువైతే ఉన్నదో దానియందే నాకు మనస్సు కలిగినది. కనుక భక్తులకు అన్నిటిని ఇచ్చేటువంటి ఆ వస్తువును నాకు వెతికి తెమ్ము.
వరాహస్వామి చెప్పెను:- అది విని ధరణీదేవి పుత్రికను తిరిగి ఇట్లడిగెను. ముందుగా నీవు ఎటువంటి భక్తుడు ఆ వస్తువును పొందగలడో నాకు చెప్పుము. అని.
పద్మావతి చెప్పెను:- మిక్కిలి రహస్యమైన భక్తుల లక్షణములను శ్రద్దగా వినుము. ఈ ధరణీదేవీ! ఎల్లప్పుడు వారు రెండు భుజముల పై శంఖము, చక్రముల గుర్తులు కలిగి ఉందురు. క్రిందకు దిగిన ఊర్థ్వపుండ్రమును ధరించుదురు. మరియు శరీరము యొక్క పన్నెండు ముఖ్యభాగముల పై పన్నెండు పుండ్రములను ధరింతురు. ఆ పన్నెండు స్థానములు ఏవనగా లలాటము, ఉదరము, హృదయము, కంఠము, జఠరము, పార్శ్వములు, కూర్పరములు, రెండు భుజములు, పృష్ఠము, గల పృష్ఠము. కేశవాది నామములు పన్నెండు, పన్నెండు అంగములయందు ధరించి, తల పై 'వాసుదేవ నమోఽస్తు' అని ధరింతురు. వారి నియమములను వివరింతును వినుము. వారెప్పుడు వేదపారాయణము చేయుచు, వేదోక్త కర్మములను చేయుచుందురు. సత్యమునే పలుకుచుందురు, పరులను చూచి అసూయ పడరు. ఇతరులను నిందింపరు, ఇతరులకు చెందినది దొంగిలింపరు. ఇతరుల భార్యలు అందమైన వారైనప్పటికీ వారిని తలచుకొనరు, చూడగు, తాకరు. వీరే నిజమైన వైష్ణవులు. సమస్త భూతములయందు దయచూపువారు, సర్వభూతముల హితమునే కోరువారు, ఎల్లప్పుడు దేవదేవుని స్తుతించువారు నిజమైన భక్తులని తెలుసుకొనుము. ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. తమ భార్యలయందు నిష్ఠకలవారు. రాగము, భయము, క్రోధము లేనివారు నిజమైన వైష్ణవులు.
ఈ విధమైన గుణములు కలిగి పంచాయుధములను ధరింతురు. ఆచార్యుని రూపమున ఉన్న తండ్రి చేతకాని, మరి ఎవరి చేత కాని తమ గృహ్య సూత్రములకు అనుగుణముగ అగ్నిని గ్రహించి చక్రాది ఆయుధ మంత్రములచేత పదహారు ఆహుతుల వేల్చవలెను. మూలమంత్రము చేత, పురుష సూక్తము చేత నూట ఎనిమిది సార్లు అగ్నిని అర్చింపవలెను. ఈ విధముగా అర్చించి చక్రాది అయిదు ఆయుధములను అగ్నిలో వేడి చేయవలెను. బాగుగా కాలిన తరువాత గురువు చేత వాటిని మంత్రమువలె గ్రహించి అచ్చు వేయించుకోవలెను. రెండు భుజముల పై శంఖ చక్రములను, తలపై శారమును, నుదుటి పై గదము, హృదయముపై ఖడ్గమును ముద్రింప చేసుకోవలెను. మోక్షము పొందగోరు విష్ణుభక్తులు తప్పక ఈ అయిదు ఆయుధములను ధరింపవలెను. లేనిచో భుజములపై శంఖ చక్రములనైన ధరింపవలెను. ఈ విధమైన లాంఛనములను ధరించిన వారే వైష్ణవులనబడుదురు. సదాచార సమన్వితులైన వారి చేతనే ఆ బ్రహ్మము పొందబడును.
ఆ బ్రహ్మమునందే నాకు ప్రీతి కలదు. అతడినే నేను పొందగోరుచున్నాను. విష్ణువును తప్ప మరొకరిని నేను కోరను. శ్యామల వర్ణంలో ఉన్న విష్ణువునే నేను ఎల్లప్పుడు స్మరించును. అచ్చుతుడైన హరినే పలుకుదును. అతడి వల్లనే జీవింతును. కనుక అతడితో నన్ను కూర్చు విధమును ఆలోచింపుము.
వరాహస్వామి చెప్పెను: - అని ఆ అంబుజానన తల్లితో దీనయై పలికెను. అది విని తల్లి విష్ణువును సంప్రీతుని చేయుట ఎట్లు అని ఆలోచించుచుండెను.
వకులమాలికతో కలసి సఖులు ధరణీదేవి వద్దకు వచ్చుట:- ఇంతలో అగస్త్యేశుని అర్చించి కన్యలు వకులమాలికతో కలసి ధరణీదేవి వద్దకు వచ్చిరి. వారితో వచ్చిన బ్రాహ్మణులను చక్కటి భోజనముతో సంతృప్తి పరచి దక్షిణలిచ్చి వస్త్రములచేత అలంకారముల చేత సమ్మానించెను. వాంఛితార్థము సిద్ధించునని ఆశీస్సులిచ్చి వారు వెళ్లిపోగా ధరణీదేవి కన్యలను అడిగెను.
ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచలమాహాత్మ్యమున ధరణీవరాహ సంవాదమున వకులమాలికకు చెలులు పద్మావతిని గూర్చి చెప్పుట, విష్ణు భక్త లక్షణములు వర్ణించుట. అను అరవ అధ్యాయము.
