స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

9వ అధ్యాయము

భూదేవి పలికెను:- ఓ భూధర! కలియుగమునందు నీవెవరికి కనిపించెదవు? ఈ కొండ పై నీకు విమానము ఎవరు కట్టించెదరు? ఈ కొండపై నీకు విమానము ఎవరు కట్టించెదరు?. దివ్యాకృతికల శ్రీనివాసుని ఎవరు చూచెదరు? ఈ విషయములను వినుటకు నాకు కూతూహలము కలదు. కనుక చెప్పుము.

వరాహస్వామి చెప్పెను:- ఓ దేవీ! భవిష్యత్తులో జరగబోవు దానిని చెప్పెదను వినుము. ఈ పవిత్రమైన కొండపై వసువను బోయవాడు ఉండును. అతడు పురుషోత్తముని యందు భక్తి కలిసి చామలు పండించుచుండెను. పండిన చామలను వండి తేనెతో కలిపి శ్రీదేవి భూదేవులతో కలిగి ఉన్న స్వామికి నివేదించుచుండెను. ఈ విధమైన భక్తిగల అతడికి చిత్రావతి అను భార్య కలదు. ఆమె వీరుడను పేరుకల కొడుకును కనెను. వసువు పతిభక్తి కలిగిన భార్యతో పుత్రునితో కలసి జీవించుచుండెను. ఒకనాడు కుమారునికి చామలను రక్షింపుమని చెప్పి వసువు భార్యతో కలసి తేనెను వైదుక గోరెను. తేనెపట్లను వెదుకుటకై అతడు మరోక అడవికి త్వరగా వెళ్లాను. బాలుడైన వీరుడు చామలను తీసి నిప్పులలో వేసి వాటిని పిండి చేసి చెట్టు క్రింద ఉన్న శ్రీనివాసునికి నైవేద్యము పెట్టి తరువాత దానిని తిని సుఖముగా ఉండెను. ఇంతలో వసువు తేనే తీసుకుని వచ్చి చామలు లేకపోవుట చూచి కొడుకును బెదరించి విషయము తెలుసుకొనెను. కోపముతో కత్తి తీసి కుమారుని చంపుటకు చేతినెత్తెను.

 కుమారుని చంపుటకు వసువు చేతినెత్తగనే వృక్షమునందున్న విష్ణువు ఆ కత్తిని పట్టుకొనెను. కత్తిని పట్టుకున్నదెవరు? అని వసువు వెనుకకు తిరిగి చూచెను. శంఖము, చక్రము, గదలను ధరించినవాడు, వృక్షమునందు సగము వరకు కనిపించుచున్న విగ్రహము కలవాడు అయిన విష్ణువును చూచి ఆ కత్తిని వదలి పెట్టి వసువు నమస్కరించెను. ఓ దేవదేవా! నీవీ పని ఏల చేసితివి? అని ప్రశ్నించెను. స్వామి చెప్పెను. ఓ వసూ! వినుము. నీ కుమారునికి నాయందు మిక్కిలి భక్తి కలదు. అతడు నీకంటే నాకు మిక్కిలి ఇష్టుడు. కనుక నేనిచట ప్రత్యక్షమైతిని. ఈ స్వామి పుష్కరిణి తీరమందంతట నేను ఉండగలను అని స్వామి చెప్పగా వసువు చాలా సంతోషమును పొందెను. ఆ సమయమందే పాండ్యదేశము నుండి వచ్చిన వాడు. చిన్ననాటి నుండి శూద్రుడైనప్పటికీ విష్ణు భక్తికలవాడు.

          రంగదాసు శ్రీనివాసుని సేవించుటకు శేషాచలమునకు వెళ్లుట:- అగు రంగదాసు నారాయణపురిని చేరి వరాహస్వామికి నమస్కరించి వేంకటాద్రి పై నివాసమున్న శ్రీనివాసుని గూర్చి వినెను. స్వయముగా ఉద్భవించినవాడు. దేవదేవులచే సేవింపబడువాడు అయిన ఆ స్వామిని చూచుటకు బయలుదేరెను. సువర్ణముఖి నదిని చేరి స్నానము చేసి ఆ నదిని దాటెను. ఆ నదీ తీరమునందున్న పద్మసరోవరమున స్నానము చేసి, ఆ సరసీరంలో బలరామునితో కూడి ఉన్న కృష్ణునికి నమస్కరించెను. నమస్కరించి తరువాత ఏనుగుల గుంపులతో కూడిన అడవిని చేరెను. తరువాత మెల్లగా శేషాద్రిని చేరి ఒక సెలయేటిని చూచెను. దాని సమీపమునకు వెళ్లి కపిలునిచే పూజింపబడు శివుని, దానికి ముందు చక్రతీర్థమును, మిక్కిలి లోతు కలిగిన పాపనాశన తీర్థమును చూచెను. దానిలో స్నానము చేసి మెల్లమెల్లగా వేంకటాద్రిని చేరెను. దారిలో వైఖానసుని కలిసెను. పన్నెండు సంవత్సరముల వయస్సు మాత్రమే కలిగినప్పటికి ఆ రంగదాసు కొండ పైకెక్కి స్వామి పుష్కరిణి చేరి భక్తి కలిగినవాడై అచట స్నానము చేసెను. వైఖానసుడైన గోపీనాథునిచే పూజింపబడువాడు, అడవి మధ్యలో చెట్టుక్రింద ఉన్నవాడు, స్వామి పుష్కరిణి తీరమునందున్నవాడు, తామర కన్నులు కలవాడు, శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్నవాడు, ఆకాశము నందున్న వాడు పచ్చని వస్త్రములు ధరించిన నల్లని ఆకృతి. కలవాడు, శుభమును కలిగించువాడు, పక్కన శంఖము, చక్రము, గద, ఖడ్గము కలిగి ఉన్నవాడు. తల పై రెక్కలను విప్పి నిలచి ఉన్న గరుత్మంతుడు కలవాడు. శార్ణ మను ధనుస్సును, బాణమును ధరించినవాడు అయిన స్వామిని చూచెను

          శ్రీ నివాసుని కొరకు రంగదాసు దివ్య ఉద్యానమును మండపములను నిర్మించుట:- ఈ విధముగా ఉన్న శ్రీనివాసుని చూచి ఆ రంగదాసు ఆశ్చర్యపడి ఈ స్వామికి ఆరామమును నిర్మించవలెను అని నిశ్చయించుకొనెను. ఆ విధముగా మనసులో నిశ్చయించుకొని బుద్దిమంతుడైన రంగదాసు వైఖానసునిచే నైవేద్యమును ప్రతిదినము చేయించేను. చుట్టూ ఉన్న అడవిని మెల్లమెల్లగా నరికి, పక్కన ఉన్న చెట్లను పడగొట్టెను. స్వామి ఆజ్ఞాపించగా అచటనున్న చింతచెట్టును, లక్ష్మీదేవికి ఇష్టమైన సంపెంగ చెట్టును మాత్రము కొట్టివేయలేదు. ఆ రెంటిని వదలి పెట్టి స్వామికి చుట్టూరా రాతి గోడను కట్టెను. ఆ గోడ చుట్టూ పూలమొక్కలను నాటెను. మల్లెలు, గన్నేరు, తామరలు, బొండు మల్లెలు, మందారములు, జాజి, తులసి, సంపెంగల వనముల నేర్పరచెను. అచటనే ఒక బావి తవ్వి ఆ బావి నీటితో మొక్కలనన్నిటిని పెంచెను. అచట పూసిన పూలతో తానే మాలలను పలు విధములుగా తయారు చేసి స్వామికి పూజలు చేయువానికి ఇచ్చెను. అతడా మాలలను తీసుకుని శ్రీదేవి భూదేవులతో కలసి ఉన్న శ్రీనివాసుని తలపై భుజములపై అలంకరించెను. విశుద్దమతి కలిగిన ఆ రంగదాసు ఈ విధముగా స్వామికి కైంకర్యము చేయుచుండగా ఏడు సంవత్సరములు గడిచి పోయెను. ఒక నాడు ఆ రంగదాసు పుష్పములు కోయుచుండెను.

 రంగదాసు గంధర్వుల క్రీడను చూచి స్వామికైంకర్యమును మరచుట:- ఆరామమునందున్న సరస్సులో స్నానము చేయుటకు ఒక గంధర్వుడు గంధర్వ రాజు కన్యలతో కలసి అచటకు వచ్చెను. అతడు తన విమానమును భూమిపై దింపి తనతో వచ్చిన వారితో కలిసి ఆ సరస్సులో స్నానము చేయుట ఆరంభించెను. రంగదాసా క్రీడలను చూచి మాలకట్టుట మరచిపోయెను. ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడైనప్పటికి వారి క్రీడలను చూచి రేతఃస్థలనమును పొందెను. అతడా విధముగ చూచుచుండగనే ఆ గంధర్వుడు సుందరమైన ఆ సరస్సు నుండి బయటకు వచ్చి దివ్యవస్త్రములను ధరించి తనతో వచ్చిన స్త్రీలతో నవ్వుతూ దివ్య విమానమునెక్కి అలకాపురికై పయనమయ్యెను. ఆ గంధర్వుడు వెళ్లిపోగా రంగదాసు తిరిగి సృహలో కి వచ్చెను. తన స్థితికి తానే సిగ్గుపడి కట్టిన మాలలను విడిచి పెట్టి సరస్సులో స్నానము చేసి తిరిగి పూవులను కోసి మెల్లగా దేవాలయమునకు వెళ్లేను. పూజవేళ దాటిపోయిన తరువాత వచ్చిన రంగదాసును చూచి వైఖానసుడు. ఓ మిత్రమా ఆలస్యమునకు కారణమేమి అని ప్రశ్నించెను, మాలలు కూడా కట్టలేదు. తోటకు వెళ్లి ఏమిచేసితివి అనెను.

వరాహస్వామి చెప్పెను:- వైఖానసుడు ఈ విధముగా అడగగా రంగదాసు సిగ్గుపడి ఏమి చెప్పలేకపోయెను. ఆ విధముగా లజ్జితుడైన రంగదాసుతో స్వామి ఇట్లనెను.

అథి స్వరూపాను సంధానేన లజ్జితం రంగదాసం ప్రతి శ్రీనివాస వచనమ్. శ్రీభగవానువాచ:

స్వామీ పలికెను:- ఓ రంగదాస! నీవేల సిగ్గుపడుచుంటివి? నిన్ను మోహితునిగా చేసినది నేనే. నీవు నిజముగా జితేంద్రియుడవు కనుక ధైర్యము వహించుము. నీవు కూడ గంధర్వరాజు వలె ఈ భూమి పై ఒక గొప్ప రాజువు కాగలవు. నాయందు ఎల్లప్పుడు భక్తి కలిగి గొప్ప భోగములను అనుభవింపగలవు. నా ఆలయమునకు ప్రాకారమును, విమానమును కట్టింపగలవు. అప్పుడు నేను మిక్కిలి ప్రీతిని పొంది నీకు ముక్తిని ప్రసాదించేదను. ప్రస్తుతము నీవు ఈ శరీరమును వదలి పెట్టువరకు ఇచటనే సేవ చేయుము. నా భక్తులైన వారికి వారి కోరికలను ఈ విధముగనే తీర్చి ముక్తిని ప్రసాదించేదను. అని పలికి స్వామి ఊరకుండెను. అది విని రంగదాసు తోటను ఉత్తమమైనదిగా తీర్చిదిద్దేను.

 తొండ మానుడను రాజు వృత్తాంతము:- నూటి కంటే ఎక్కువ సంవత్సరములు స్వామిని సేవించి బుద్ధిమంతుడగు ఆ రంగదాసు స్వర్గమునకు వెళ్లాను. పిమ్మట చంద్రవంశమునందు తొండమానుడను పేరుతో జన్మించెను. సువీరునికి, నందినికి జన్మించిన ఆ తొండమానుడు అయిదవ ఏటనే ఎవరి ప్రేరణ లేక విష్ణుభక్తుడయ్యెను. మంచినడవడికకు, శౌర్యమునకు, వీరత్వమునకు స్థానమై ఉండెను, అతడు సౌందర్యవతి అయిన పాండ్యరాజ కుమార్తె పద్మను పరిణయమాడెను. తరువాత వందమంది కన్యలు వేరు వేరు దేశములకు చెందినవారు ఆ తొండమానుని స్వయముగా వరించిరి. నారాయణపురము నందు నివసించుచు ఆ తొండమానుడు దేవేంద్రుని వలె భోగములను అనుభవించెను. సింహము వటి పరాక్రమముగల అతడు తండ్రి వద్ద అనుజ్ఞ తీసుకుని ఒకనాడు వేటకు బయలు దేరెను. వేటకై ఆ వీరుడు వేంకటాద్రిని సమీపించెను.

 తొండమానుడు వేటకై వేంకటాచలమునకు వెళ్లుట:- పరివారముతో కలసి తొండమానుడు సంచరించుచు మదధారలను విడుచుచున్న ఒక గజరాజును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. దానిని పట్టుకొనుటకు వెంబడించి సువర్ణముఖి నదిని దాటి బ్రహ్మర్షి, ఉత్తముడు అయిన శుకుని చూచేను. అతడికి నమస్కరించి, అనుజ్ఞ తీసుకుని తరువాత ఒక వనము నుండి మరొక వనమునకు వెళ్లుచు పుట్ట ఆకారములో ఉన్న రేణుకాదేవిని చూచేను. ఇష్టులైన భక్తులకు వారి కోరికలను తీర్చునది, పవిత్రమైన తోటయందు నివసించునది. ఎల్లప్పుడు పరివారముతో కూడియున్నది. దేవతలచే కూడ పూజింపబడునది అయిన ఆ దేవిని చూచి తొండమానుడు నమస్కరించి ఎడమ దిక్కుకు బయలుదేరెను.

శ్రీనివాసుని వద్ద ఉన్న ఐదువన్నెల చిలుక వృత్తాంతము:- తొండమానుడు ఐదువన్నెలుకల ఒక చిలుకను చూచి దానిని పట్టుకొనుటకు వెంబడించెను. ఆ చిలుక 'శ్రీనివాస' అని పలుకుతు కొండవైపుకు ఎగిరిపోయెను. దానిని వెంబడించుచు తొండమానుడు కొండనెక్కెను. వివిధములైన గుహలను, చుట్టూరా ఉన్న శిఖరములను చూచుచు ముందుకు సాగెను. చిలుకను వెతకుచు చామలు ఉన్న పొలము వద్దకు వచ్చెను. ఆ చిలుక కనిపించక అక్కడ ఉన్న కాపలావాడిని చూచెను. ఆ వనేచరుడు వచ్చుచున్న రాజులను చూచి సత్వరమే లేచి నిలబడి వినయముతో నమస్కరించి చేతులు కట్టుకుని నిలబడెను. తొండమానుడు కూడా నమస్కరించి, ఐదు వన్నెల చిలుక ఇటు వచ్చినది, నీవు చూచితివా? అని అడిగేను. ఓ వనేచరా! ఆ చిలుక 'శ్రీనివాస' అని పలుకుచు ఎటు వెళ్లినది?.

 వనేచరుడు పలికెను:- ఓ రాజేంద్రా! ఐదు వన్నెలు కల ఆ చిలుక శ్రీనివాసునికి మిక్కిలి ఇష్టమైనది. శ్రీదేవి భూదేవులచే పెంచబడుతు అది ఎప్పుడు స్వామి పక్కనే ఉండును-69. స్వామి సన్నిధిలో స్వామి పుష్కరిణి సమీపంలో ఎప్పుడూ సంచరించు ఆ చిలుకను పట్టటం ఎవరికీ సాధ్యం కాదు. ఉత్తమమైన ఈ కొండ కొమ్ముపై స్వేచ్చగా తిరుగుచు సాయంకాల సమయమునకు స్వామిని చేరి అచట నివసించును. ఆ స్వామిని సేవించుటకు నేనిపుడు అచటకు వెళ్లుచున్నాను. కనుక నీవీ చెట్టు క్రింద కూర్చుని విశ్రాంతి తీసుకొనుము. నా ఈ పుత్రునితో కలసి నచ్చినట్లు నీవిచట విహరింపుము. రాజు పలికెను: ఆ జనార్ధనుని చూచుటకు నేను కూడా నీతో వచ్చెదను. వేంకటాద్రిపై నివసించు ఆ దేవదేవుని నాకు చూపుము. రాజు పలికిన ఆ మాటలను విని వనే చరుడు తేనెతో కలిపిన చామలను మామిడాకు దొన్నెలో ఉంచుకుని రాజుతో కలసి స్వామిని చూచుటకు వెళ్లాను.

            నచరునితో కలసి తొండమానుడు శ్రీనివాసుని వద్దకు వెళ్లుట:- వారిద్దరు చాల దూరము రాళ్లతో నిండిన దారిపై నడచి శుభకరమైన స్వామి పుష్కరిణికి చేరిరి. అచట స్నానము చేసి ఆ వనచరుడు రాజుతో కలసి స్వామిని సమీపించి మహాత్ముడైన ఆ రాజుకు దేవదేవుని చూపెను. స్వామి పుష్కరిణి తీరమునందు శ్రీవృక్షము కింద ఉండెను. అగిసే చెట్టు వంటి వర్ణముకలిగి, తామరలవంటి విశాలమైన కన్నులు కలిగి ఉండెను. నాలు చేతులు కలిగి, మృదువైన శరీరావయవములు కలిగి, కొద్దిగా నవ్వుతున్న మ.ఖము కలిగి, దివ్యములైన పట్టు వస్త్రములను ధరించి, కిరీటము, కంకణము మొదలైన ఆభరణములతో ప్రకాశించుచున్న స్వామిని చూచెను. రెండు పక్కల రూపవతులైన శ్రీదేవి భూదేవులను కలిగి, చుట్టూరా శంఖము, చక్రము, ఖడ్గము, ధనస్సు కలిగి ఉండెను. మరెన్నో దీవ్యాయుధములు, దివ్యములైన మాలలు కలిగి మూడు సంధ్యల యందు కుమారస్వామిచే ఆరాధించబడుతున్న పురుషోత్తముడైన స్వామిని చూచెను. పుట్టలో దాగి ఉన్న పాదాబ్జములు కలిగిన, జానువుల వరకు ఉన్న చేతులు కలిగిన స్వామిని చూచి మిక్కిలి సంతోషించి వారిద్దరు నమస్కరించిరి. రాజు అంజలి ఘటించి ఆశ్చర్యంతో విప్పారిన కన్నులతో, ఆనంద తరంగములలో తేలియాడుచు, ఏమి తెలియని స్థితిలో ఉండెను. వనచరుడు తాను తెచ్చిన తేనె కలిపిన చామలను స్వామికి నివేదించి, రాజుకు సగభాగమిచ్చి మిగిలిన సగమును తాను భుజించెను. స్వామి పుష్కరిణిలో నీటిని తాగి, రాజుతో కలసి తిరిగి చామల తోటకు వచ్చి తన పర్ణశాలకు వెళ్లాను, రాజు ఆ పర్ణశాలలో ఒక రాత్రి గడిపి, తెల్లవారిన తరువాత లేచి తన సైన్యములను కలుసుకుని తన నగరమునకు తిరిగి వెళ్లాను.

 తొండమానునితో రేణుకాదేవి పలుకుట:- తిరిగి వచ్చు దారిలో రేణుకా దేవి ఉన్న వనమునకు వెళ్లి అశ్వము పై నుండి దిగి చైత్ర శుద్ధ నవమి నాడు రేణుకాదేవిని పూజించెను. హవిస్సులకు తగినదానిని, పరమాన్నమును ఎన్నో బహుమతులతో, పశువుల మాంసంతో, ధూపము, దీపములతో సమర్పించెను. సారాయితో నిండిన వంద కుండలను సమర్పించెను. ఆ సారాయి జాజిపూల వాసన కలిగి ఉండెను. ఈ విధముగా అర్చింపబడిన దేవి మిక్కిలి సంతోషించి రాజుకు వరమిచ్చెను. ఒక పురుషుని పై దేవి ఆవేశించి రాజోత్తమునితో పలికెను. ఓ రాజా! విను నీ రాజ్యమికపై ఎటువంటి ఆటంకములు లేనిదగును. ఓ రాజా! నీ పేర ఇక్కడ రాజధాని నిర్మింపబడగలదు. నా దగ్గరనే నీవు ఎంతోకాలం రాజ్యము చేయగలవు. ఓ అనఘా! నీకు దేవదేవుని అనుగ్రహము కలుగగలదు. అని వరమునిచ్చి ఆ పురుషుని వదిలివేయగా, అతడు తిరిగి స్వస్థుడయ్యెను. రేణుకాదేవి నుండి ఆ వరమును పొంది శుకముని ఆశ్రమమునకు వెళ్లాను.

 శుకుడు వర్ణించిన పద్మసరోవర మాహాత్మ్యము:- మునికి నమస్కరించి, అతడిచే పూజింపబడి మిక్కిలి సంతోషించెను. తరువాత, ఓ మునీ! నాకు సరస్సు యొక్క మాహాత్మ్యమును తెల్పుము అని అడిగెను. శుకుడు చేప్పెను: పూర్వము దుర్వాసుని శాపము వలన పద్మాక్షునికి మిక్కిలి ఇష్టురాలైన లక్ష్మి విష్ణువుతో కలసి భూమికి దేవలోకము నుండి అవతరించెను. మహేశ్వరి అయిన ఆ లక్ష్మి కాంచన పద్మము అను పేరుగల ఈ సరస్సును చేరి పదివేల దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. అపుడు దేవతలు విష్ణువుతో కలిసి ఉన్న లక్ష్మికై వెదకుచు ఇంద్రునితో కలసి ఈ సరస్సు వద్దకు వచ్చిరి. బంగారు కమలమునందు విష్ణువుతో కలసి ఉన్న సంతోషించి నమస్కరించి, చేతులు జోడించి కమలమును చేత ధరించి ఉన్న అన్ని లోకములకు తల్లి అయిన లక్ష్మీదేవిని ఇంద్రునితో కలసి స్తుతించిరి.

దేవతలు అనిరి:- ఓ లోకమాతా, బ్రహ్మమాతా, పద్మనేత్రా, పద్మముఖీ నీకు నమస్కారము. ప్రసన్నమైన ముఖపద్మముకలదానా, పద్మకాంతి కలిగిన దానా, బిల్వనములో నివసించుదానా, ఓ విష్ణుపత్నీ నీకు నమస్కారము. విచిత్రమైన పట్టువస్త్రములు ధరించుదానా! విశాలమైన జఘనస్థలము కలదానా! పండిన మారేడు పండు వంటి దృఢమైన, ఉన్నతమైన స్తనములు కలదానా! నీకు నమస్కారము. ఎర్రతామరలవంటి పాదములుకలదానా! ఓ శుభా!: చక్కని అంగదములు, కేయూరములు, కాంచి, నూపురములచే ప్రకాశించుదానా! యక్షకర్దమము శరీరమంతటా అలదుకొన్నదానా! కటకములచే ఉజ్జ్వలముగా ఉన్నదానా. మాంగల్యము మొదలైన వివిధములైన ఆభరణములచే, ముత్యాలహారములచే అలంకరింపబడినదానా! చెవి కమ్మలచే, శిరోభూషణములచే ప్రకాశించుచున్న ముఖాంబుజము కలదానా!. పద్మమును హస్తమునందు ధరించినదానా నీకు నమస్కారము! హరికి మిక్కిలి ఇష్టురాలా అనుగ్రహింపుము.ఋక్, యజుస్, సామవిద్యల రూపమా నీకు నమస్కారము. మమ్ము కాపాడుము, సాగరమునందు పుట్టినదానా! నీ కృపాకటాక్షములచే వీక్షింపుము. నీ చూపును పొందిన వారు బ్రహ్మత్వమును, ఇంద్రత్వమును, రుద్రత్వమును పొందుచున్నారు.

శుకుడు చెప్పెను:- అని స్తుతింపబడినదై విష్ణువక్షఃస్థలమునందుండు ఆ లక్ష్మీదేవి విష్ణువుతో కలసి దేవతలకు కనిపించి ఇట్లనెను.

లక్ష్మిదేవి అనెను:- దేవతలకు శత్రువులైన వారిని సంహరించి మీమీ స్థానములను పొందుదురు గాక! ఎవరైతే తమ స్థానమును కోల్పోయెదరో అటువంటి వారు మానవులైనప్పటికీ మీరు చేసిన ఈ స్తోత్రము చేత నన్ను స్తుతించి వారి వారి స్థానములను పొందగలరు. అఖండములైన మారేడు దళములచే నన్ను అర్చించి ధర్మార్థ కామమోక్ష రూపములను పొందుదురు. ఈ పద్మ సరస్సును చేరి ఓ దేవతలారా! ఎవరైన విష్ణువల్లభ అయిన నన్ను స్తుతించి, ఇందు స్నానము చేసినచో వారు సంపదలను, దీర్ఘాయుష్సును విద్యను, మంచి వర్చస్సుకల కుమారులను పొంది, అన్ని విధములైన భోగములను అనుభవించి చివరకు మోక్షమును పొందుదురు. అని వరమిచ్చి దేవి విష్ణువుతో కలసి గరుడునిపై వైకుంఠమునకు వెళ్లిపోయేను.

ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహత్మ్యమందలి ధరణీ వరాహ సంవాదమున వసువను ననేచరుని వృత్తాంతము పద్మ సరస్సు మాహాత్మ్యము వర్ణించిన తొమ్మిదవ అధ్యాయము.