స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
23వ అధ్యాయము
అథ చక్రతీర్థ మాహాత్మ్యమ్ :
శ్రీ సూత ఉవాచ :
సూతుడు చెప్పేము :- సత్యవాదులగు ఓ బ్రాహ్మణులారా! మీ కిపుడు అన్ని పాపములను నాశనము చేయు చక్రతీర్థము యొక్క మహత్తును చెప్పెదను, మహాపుణ్యప్రదమగు చక్రతీర్థముయొక్క వైభవమును విన్నవారు తిరిగి వచ్చుటలేని వైకుంఠమును చేరుదురు. అన్నదానము చేయుటయందు విముఖత కలవారు, జలదానము చేయుటయందు, గోదానము చేయుటయందు విముఖత కలవారు ఈ తీర్థమునందు స్నానము చేసినచో శుద్దులగుదురు, కనుక ఈ చక్రతీర్థము అత్యుత్తమమైనది.
అథ పద్మనాభాఖ్య ద్విజకృత తపః ప్రకారః
శ్రీ సూత ఉవాచ :
సూతుడు చెప్పెను :- పూర్వము శ్రీ వత్స గోత్రమునకు చెందినవాడు, ఇంద్రియములను జయించినవాడు అగు పద్మనాభుడు చక్రతీర్థమునందు గొప్ప తపస్సుచేసెను. దయకలిగినవాడై, ఆహారము భుజింపక, సత్యమునే పలుకుచు, ఇంద్రియములను జయించి, సమస్త జీవులను తనవలె చూచుచు, విషయములయందు ఆసక్తి లేనివాడై యుండెను. అన్ని జీవుల హితమును కోరుచు, ఓర్పుకలిగి, వేడి, చలి వంటి ద్వంద్వములను విడచి కొన్ని సంవత్సరములు, పండిన ఆకులు మాత్రమే భుజించి కొన్ని సంవత్సరములు తపస్సు చేసెను. కొంతకాలము నీటిని, మరికొంతకాలము వాయువును భుజించి పన్నెండు సంవత్సరములు ఆ పద్మనాభుడు తపస్సు చేసెను.
చక్రతీర్థమువద్ద పద్మనాభుడు చేసిన తపసు తపుడై భగవంతుడు ఆవిర్భవించుట:- దేవతలకు కూడ దుష్కరమైన తపస్సును పద్మనాభుడట్లుచేయగా భగవంతుడగు రమాపతి ప్రత్యక్షమయ్యెను. శంఖము, చక్రము, గద ధరించినవాడు, వికసించిన తామరలవంటి కన్నులు కలవాడు, కోటి సూర్యులవంటి కాంతి కలవాడు అగు స్వామి ప్రత్యక్షమయ్యెను. అపుడాపద్మనాభుడు కన్నులుతెరచి శంఖము చక్రము గదను ధరించినవాడు, శాంతముగా నున్నవాడు, శ్రీనివాసుడు, కృపానిధి అగు స్వామిని చూచి స్తుతించుట మొదలు పెట్టెను .
అథ పద్మనా భాఖ్య ద్విజకృత శ్రీనివాస స్తుతి:
పద్మనాభుడు విప్రుడు చేసిన శ్రీనివాసుని స్తుతి :- దేవాధిదేవా, వేంకటేశా,శార్ణమును ధరించువాడా, నారాయణాద్రిపై నివసించువాడా, శ్రీనివాసా నీకునమస్కారము. కల్మషమును నశింపజేయువాడా, వాసుదేవా, విష్ణుమూర్తీ, శేషాచలముపై నివసించువాడా, శ్రీనివాసా నీకు నమస్కారము. త్రిలోకములకు నాథుడైనవాడా, విశ్వరూపుడా, అన్ని కర్మలకు సాక్షి అయినవాడా, శివుడు, బ్రహ్మ మొదలగు వారిచే నమస్కరింపబడువాడా నీకు నమస్కారము. కమలములవంటి నేత్రములు కలవాడా, పాలసముద్రముపై నిదురించువాడా, దుష్టరాక్షసులను సంహరించువాడా, శ్రీనివాసా నీకు నమస్కారము. భక్తులకు ఇష్టుడైనవాడా, దేవదేవుడా నీకు నమస్సులు. నమస్కరించినవారి దుఃఖమును పోగొట్టువాడా, శ్రీనివాసా నీకు నమస్కారము. యోగులకు గతి అయినవాడా, నిత్యము వేదముల ద్వారా తెలియువాడా, విష్ణుమూర్తీ, భక్తుల పాపములను సంహరించువాడా శ్రీనివాసా నీకు నమస్కారము . ఈ విధముగా స్తుతింపబడిన స్వామి చక్ర తీర్థమున నివసించు పద్మనాభునితో ఇట్లనెను.
ఆథ పద్మనాభాస్య చక్రతీర్థ నిరంతరవాసాయ భగవన్నియమవమ్:
చక్రతీర్థమునందు ఎల్లప్పుడు నివసించుమని స్వామి పద్మనాభుని ఆదేశించుట :- దయానిధి అయిన వేంకటేశుడు పరమసంతోషమును పొంది. శాంతుడు, ధర్మపరాయణుడు, బ్రాహ్మణోత్తముడు అగు పద్మనాభునితో తేనె ధారలవంటి వాక్యములతో ఇట్లనెను.
శ్రీనివాసుడు చెప్పెను :- ద్విజులలో ఉత్తముడా, మహానుభావ, నా పాదములను అర్చించువాడా ఈ కల్పాంతము వరకు చక్రతీర్థమువద్ద ఉండి నన్ను అర్చింపుము. అని పలికి స్వామి అచటనే అంతర్ధానము చెందెను . స్వామి అంతర్ధానమైన పిదప ఆ పద్మనాభుడు చక్రతీర్థము వద్దనే నివాసమేర్పరచుకొనెను. తరువాత కొంతకాలమునకు భయంకరమైన ఆకారముగల ఒక రాక్షసుడు మిక్కిలి ఆకలితో, క్రూరుడై విష్ణుభక్తుడైన పద్మనాభుని తినుటకు వచ్చెను.
ఆ రాక్షసుడు పద్మనాభుని వెంటనే పట్టుకొనెను. అట్లా రాక్షసుడు పట్టుకొనగా వేద వేదాంగ పారగుడైన పద్మనాభుడు దయాసముద్రుడు, ఆపదలో ఉన్నవారికి శరణు కల్పించువాడు అగు నారాయణుని రక్షింపుమని ఇట్లు ప్రార్థించెను. నారాయణా, చక్రపాణీ, వేంకటేశా, దయాసముద్రా, శరణు కోరినవారిని పాలించువాడా, పురుష వ్యాఘా, శరణుకోరిన నన్ను రక్షింపుము . లక్ష్మీకాంతా, గరుడధ్వజా, హరీ, విష్ణుమూర్తి రాక్షసునిచే పట్టుకొనబడిన నన్ను మొసలిచే పట్టుబడిన ఏనుగును రక్షించినట్లు రక్షింపుము. దామోదర, జగన్నాథా, హిరణ్యాక్షుని సంహరించినవాడా ప్రహ్లాదుని రక్షించినట్లు రాక్షసుని చేత పీడింపబడుచున్న నన్ను రక్షింపుము .
అని పద్మనాభుడు భగవంతుని ప్రార్థింపగా దయానిధి అగు స్వామి తన భక్తుని భయమును తెలిసికొని భక్తుని రక్షించుటకు తన చక్రమును పం పెను. స్వామిచే పంపబడిన ఆ చక్రము వేగముగా బయలుదేరెను. వేగముగా చక్రతీర్థము వద్దకు అనేక సూర్యులకాంతితో, అనేకాగ్నుల ప్రకాశముతో, గొప్ప జ్వాలలతో, గొప్పశబ్దముతో రాక్షసులను చంపునదై వచ్చుచున్న విష్ణుచక్రమును చూచి ఆ రాక్షసుడు పారిపోసాగెను .
స్వామి పంపిన చక్రము రాక్షసుని వధించుట :- పారిపోవుచున్న ఆ రాక్షసుని సుదర్శన చక్రము వెంటనే జ్వాలా మాలికవలె దుర్భరమై సంహరించెను. క్రిందపడిన ఆ రాక్షసుని చూచి పద్మనాభుడు మిక్కిలి సంతసించి సుదర్శన చక్రమును ఇట్లు స్తుతించెను .
పద్మనాభుడు అనేను :- ఓ విష్ణు చక్ర నీకు నమస్సులు, విశ్వమును రక్షించుటకు దీక్షవహించినవాడా, నారాయణుని హస్తమునందు అలంకారమై ఉండువాడా నీకు నమస్కారము. యుద్ధములయందు రాక్షసులను సంహరించువాడా, గొప్ప శబ్దముచేయువాడా, భక్తుల దుఃఖమును హరించువాడా సుదర్శనా నమస్కారము. భయమునందు మునిగిన నన్ను అన్ని కల్మషములనుండి రక్షింపుము. ముక్తిని కోరు ఈ జగత్తు యొక్క హితమును కోరి ఇచట ఉండుము అని ఆ బ్రాహ్మణుడు పలికెను. పద్మనాభుని సహృదయమునకు మెచ్చి చక్రమిట్లనెను.
అథ ద్విజప్రార్థవయా చక్రకృతవరదానాది:
సుదర్శన ఉవాచ :
సుదర్శనుడు చెప్పెను :- ఓ పద్మనాభా, ఈ చక్రతీర్థము మహాపుణ్యప్రదమైనది, అత్యుత్తమమైనది, లోకములకు హితము కలిగించుటకై నేనిచట నివసింతును. నీకు కలిగిన రాక్షస పీడను నివారించుటకై మహావిష్ణువుచే ఆజ్ఞాపింపబడి ఇచటకు వచ్చితిని. నిన్ను పీడించుచున్న ఆ రాక్షసాధముడు కూడ సంహరింపబడెను .నీ భయము పోగొట్టబడినది, నీవు హరిభక్తుడవు కనుక అన్ని పాపములు హరించు ఈ చక్రతీర్థమునందు లోకములను రక్షించుట కొరకై నివసింతును . నేనిచట ఉండుటవలన నీకుగాని, ఇతరులకు గాని ఇకపై ఎటువంటి పీడగాని, రాక్షస బాధకాని ఉండవు. ఈ చక్రతీర్థము నందు స్నానము చేసినవారు, వారి పుత్రులు, పౌత్రులు, వంశమువారు అందరును ముక్తిపొందుదురు.
వారందరు పాపములు నశించి వైకుంఠమును చేరుదురు. అని పలికి ఆ విష్ణుచక్రము పద్మనాభుడు, ఇతర విప్రులు చూచుచుండగనే పాపములను నశింపజేయు చక్రతీర్థమునందు ప్రవేశించెను.
సూతుడు చెప్పెను :- ఓ శౌనకాది మహామునులారా, పాపములను నాశనము చేయు చక్రతీర్థము యొక్క మాహాత్మ్యమును మీకు చెప్పితిని. చక్రతీర్థమువంటిది లేదు, ఉండబోదు, ఇచట స్నానము చేసిన వారు మోక్షమును పొందుదురు. ఇందు సందేహము లేదు. ఈ అధ్యాయమును శ్రద్ధగా చదివినను, వినినను చక్రతీర్థమునందు అభిషేకము చేసిన ఫలము కలుగును .
ఎనభై ఒక్కవేల శ్లోకములు కల శ్రీ స్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందు చక్రతీర్థముయొక్క మహిమను వర్ణించుట అను ఇరవై మూడవ అధ్యాయము.
