స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

 39వ అధ్యాయము

 ఆథ పుత్రార్థమంజరాకృత తపః ప్రకారః:

సూతుడు చెప్పెను :- పుత్రులు లేని అంజన పూర్వము చాల దుఃఖించి తపస్సు చేయ ఆరంభించెను. విష్ణు భక్తుడగు మతంగమహాముని ఆమెను చూచెను. ఉగ్రమగు తపస్సు చేయుచున్న ఆంజనతో ఇట్లనెను.

మతంగుడు పలికెను:- ఓ అంజనాదేవి లెమ్ము! ఏ నిమిత్తము నీవు తపస్సు చేయుచున్నావు. నీవు కోరుచున్న దేమో తెల్పుము.

అంజన పలికెను:- ఓ మతంగమహాముని, చెప్పెదను వినుము. శివభక్తుడు, రాక్షసుడు అగు కేసరి నా తండ్రి పుత్రునికోరి అతడు మిక్కిలి కష్టమగు తపస్సు శివునికొరకు చేసెను. పార్వతితో కలసి వృషభవాహనముపై ఆతడి ఎదుట ప్రత్యక్షమై శుభకరమగు వరము నిచ్చెను.

ఈశ్వరుడు పలికెను :- ఓ రాజా వినుము. విధి వ్రాత ప్రకారము నీకు ఈ జన్మయందు పుత్ర సంతానము లేదు. కానీ నీకు మరి ఒకటి ఇచ్చెదను. నీ కుమార్తె మూడు లోకములయందు ప్రఖ్యాతి పొందును. ఆమె పుత్రుడు గొప్ప బుద్దిమంతుడై నీకు సంతోషము కలిగింపగలడు. అని అతడికి వరమిచ్చి ఈశ్వరుడు అచటనే అంతర్ధానమయ్యెను. నన్ను కుమార్తెగా పొంది నా తండ్రి కృతార్థుడయ్యెను. తరువాత కొంతకాలమునకు కేసరి అను మహాకపి నా తండ్రి వద్దకు వచ్చి నాతో వివాహమును కోరెను. అతడికి నన్నిచ్చి వివాహము చేసి ఆరణముగా పదికోట్ల ఆవులను, లక్ష ఏనుగులను ఇచ్చేను.

పదివేల గుర్రములను, పదివేల రథములను, వస్త్రములను, రత్నములను, వేలకొలది దాసదాసీజనమును ఇచ్చేను. అంతపురము నందుండు స్త్రీలను, నృత్యమునందు, గానమునందు విశారదులైనవారిని, వేలకొలది వస్త్రములను నాతోబాటు ఇచ్చెను. తరువాత చాలకాలము నేను నా భర్తతో కలసి సకల సుఖములననుభవించితిని. కాని సంతానము లేక వివిధములైన వ్రతములను చేసితిని. కిష్కింధ నగరమునందు మాఘమాసమునందు, వైశాఖమందు, కార్తీకమందు ఉత్తమములగు ప్రదక్షిణములు, శాలగ్రామ దానములు, అన్నదానము, దీపదానము, గోదానము, నువ్వులదానము, వస్త్రదానము చేసితిని.

భూదానము, జలదానము, పుష్పదానము, ముఖ్యములైన విష్ణుసంబంధి వ్రతములు, అన్నియు సత్పుత్రుని పొందవలెనని చేసితిని. మహాత్ములగువారు చెప్పిన విధముగ శ్రవణాది నక్షత్రములలో ఆయా వ్రతములు విష్ణువును సంతృప్తిపరచుటకు . చేసితిని. సత్పుత్రుని పొందవలెనను కోరికతో లభ్యమగు పండ్లను అన్నిటిని దానమిచ్చితిని. అసంఖ్యాకములైన వ్రతములను చేసినప్పటికి పుత్రుని పొందలేక దుఃఖమును పొంది తపస్సు ప్రారంభించితిని. ముల్లోకములయందు ఖ్యాతిపొందిన ఓ మునీంద్రా నాకు పుత్ర సంతానమెట్లు కలుగ గలదు. నీ ముందు మోకరిల్లి వేడుచుంటిని. ఓ మునిశ్రేష్టా! దీనురాలనై తపస్సు చేయుచున్న నాకు మార్గమును చెప్పుము.

సూతుడు చెప్పెను :- ఆమె అట్లు చెప్పగా మతంగుడు ఇట్లు చెప్పెను. ఓ దేవీ! వినుము పుత్రులను పౌత్రులను ప్రసాదించు మార్గమును చెప్పెదను .

ఇచటికి దక్షిణమున పదియోజనముల దూరమున నరసింహస్వామి నివసించునటువంటి ఘనాచలము కలదు. ఆ కొండపై మనోహరమగు బ్రహ్మతీర్థేము కలదు. అచటికి తూర్పుదిక్కున పదియోజనముల దూరమున, సువర్ణముఖరి అను శ్రేష్ఠమగు నది కలదు. దానికి ఉత్తర దిక్కున వృషభాచలము కలదు. దానిపై స్వామిపుష్కరిణి అను సరస్సు కలదు. అచటకు వెళ్ళి చూచినచో మనస్సు శుద్దమగును. అచట నియమపూర్వకముగ స్నానము చేసి వరాహస్వామికి నమస్కరించి తరువాత వేంకటేశునికి నమస్కరింపుము. ఆ స్వామి పుష్కరిణికి ఉత్తరమున సింహములు, పులులు

గంధము, అగురు, వేప, తాడి, గిరికతాడి, గేదంగి, వెలగ, రావి, మారేడు, గారచెట్లు ఉన్నవి. ఈ విధమగు మహాపుణ్యములగు చెట్లచే విరాజిల్లుతు వియద్ధంగ అను పేరుగల ఒక తీర్థేము కలదు. ఆ తీర్థేమునందు సంకల్పము చెప్పుకుని స్నానముచేసి, పవిత్రమగు ఆ తీర్థేజలమును త్రాగి తీర్థేమువైపు తిరిగి. వాయువు నుద్దేశించి తపస్సు చేయుము. అపుడు నీకు దేవతలచే, రాక్షసులచే, బ్రాహ్మణులచే, మానవులచే, మునులచే, తుమ్మెదలచే, పక్షులచే, వివిధములైన అస్త్రములచే, శస్త్రములచే మరణము పొందని ఒక కుమారుని నీవు పొందగలవు. దీనియందు సందేహము లేదు.

సూతుడు చెప్పెను :-అని మతంగుడు చెప్పగా అంజనాదేవి ఆతడికి మరల మరల నమస్కరించి భర్తతో కలిసి వేంకటాచలమునకు వెళ్ళెను. ముందుగా కపిల తీర్థేమును చేరి, అచట స్నానముచేసి వేంకటాద్రినెక్కి స్వామిపుష్కరిణికి వెళ్ళేను. అచట స్నానముచేసి వరాహస్వామిని దర్శించుకొని, వేంకటేశుని మొక్కి మతంగమహాముని చెప్పిన దానిని మాటి మాటికి తలచుకొనెను. ఆకాశగంగకు శీఘ్రముగా వెళ్ళి అంజనాదేవి అచట స్నానముచేసి, శుభకరమగు జలమును త్రాగి ఆ తీర్థాభిముఖి అయ్యెను. పిమ్మట ప్రాణవాయువును గూర్చి నియమముతో కూడిన తపస్సు ప్రారంభించెను. కొన్ని దినములు పండ్లు మాత్రమే భుజించి, మరికొన్నినాళ్ళు జలము మాత్రమే సేవించి, తరువాత నిరాహర అయ్యెను. ముక్కుకొనపై చూపునిలిపి వేయి సంవత్సరములు తపస్సు చేసెను. విపుల అను స్నేహితురాలు ఆమెకు సేవలు చేయుచుండెను. వేయి సంవత్సరముల తరువాత వాయుదేవుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఇట్లనెను.

సూర్యుడు మేషరాశిలోకి సంక్రమించినపుడు చైత్రమాస పౌర్ణమినాడు నీవు కోరిన వరమును నేను తీర్చెదను అని పలుకగా అంజనాదేవి ఇట్లనెను. ఓ వాయుదేవా! నాకు పుత్రుని ప్రసాదింపుము అని పలుకగా వాయువిట్లనెను. ఓ దేవి! నేనే నీ పుత్రునిగా జన్మింతును. నీకు ప్రఖ్యాతి కలిగించును అని ఆమెకు వరమిచ్చి అచటనే ఉండెను . అపుడు బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది లోకపాలకులు, వసిషాది మహాత్ములు, సనకాది యోగులు, వ్యాసుడు మొదలైన బ్రాహ్మణోత్తములు, లక్ష్మితో కలసి జగన్నాథుడగు స్వామి, మునిపత్నులు, దేవపత్నులు, ఋషిపత్నులు. తమ తమ వాహనములనెక్కి భార్య బిడ్డలు సేవకులతో కలసి ఆమె తపస్సు చూచుటకు వచ్చిరి. బ్రహ్మాది దేవగణములన్నియు ఆశ్చర్యము, ఆశ్యర్యము అని పలుకుచుండగా, బ్రహ్మ, ఈశ్వరుడు మొదలగు దేవతలు ఆకాశమునందుండి చూడసాగిరి .

ఎనభై ఒక్క వేల శ్లోకములుకల స్కాందమహాపురాణమునందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందు అంజనాదేవి తపస్సు చేయు విధము అను ముప్పైతొమ్మిదవ అధ్యాయము.