స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

2వ అధ్యాయము

సూతుడు చెప్పెను:- ఓ మునులారా శ్రద్దగా వినుడు. వైవస్వత మన్వంతరంలో పుణ్యమునకు స్థానమైన కృతయుగంలో జరిగిన ప్రాచీనమైన పవిత్రమైన కథ ఇది-1. నారాయణాద్రిపై నివసించుచున్న భూమిని ఉద్ధరించిన, వరాహరూపంలో ఉన్న స్వామిని భూదేవి తన చెలులతో సమీపించెను. స్వామికి నమస్కరించి ఎర్రకలువలవంటి పొడవైన చూపులు గల స్వామిని ఇట్లు ప్రశ్నించెను. ధరణీ పలికేను. ఓ దేవేశా! ఏ మంత్రమునుపాసించుటచేత నీవు ప్రీతి పొందగలవు. అటువంటి మంత్రమును నాకు తెల్సుము. జపించువారికి అన్ని సంపదలను కలిగించునదీ, పుత్రులను. పౌత్రులను కలుగజేయునది, సార్వభౌమత్వమును కలిగించునది, కోరిన వారి కోరికలను తీర్చునది. నియమంతో పఠించిన వారికి చివరకు నీ పాదముల వద్ద స్థానమును కల్పించునది అయిన మంత్రమును నాకు తెల్పుము. సూతుడు పలికెను. ఈ విధంగా భూదేవిచే అడుగబడిన వరాహస్వామి మిక్కిలి సంతోషమును పొంది చిరునవ్వుతో ఇట్లనెను.

 వరాహస్వామి చెప్పెను:- ఓ దేవి, అతి రహస్యము, సకల సంపదలను సద్యః కల్పించునది, భూమిని, పుత్రులను ఇచ్చునది, బయటకు చెప్పకూడనిది అయిన దానిని వినుము.8.కాని నియమము కలిగిన భక్తి కల్గిన వానికి, వినవలెనను కుతూహలము కల్గిన వానికి తప్పక తెలియజెప్పవలెను. ఓం నమః శ్రీ వరాహాయ, ధరణ్యుద్ధరణాయచ (భూమిని ఉద్దరించిన శ్రీ వరాహునికి నమస్కారము)

మోక్షము పొందగోరిన వారు తప్పక దీనిని జపింపవలెను. ఈ మంత్రం అన్ని ఫలములను కలిగించును. ఓ భూదేవీ! ఈ మంత్రమునకు సంకర్షణుడు ఋషి, నేనే దేవతను. పంక్తి ఛందస్సు శ్రీ అనునది బీజము, సద్గురువు నుండి ఈ మంత్రమును ఉపదేశము పొంది నాలుగు లక్షలు జపింపవలెను-12. పాయసాన్నమును తేనె, నేతులతో కలిపి అర్పించవలెను. మనఃశుద్దీని కల్గించు ధ్యానమును చెప్పెదను వినుము. శుభ్రమైన స్పటికమువలె ప్రకాశించు చున్న, ఎర్రని కలువల వలె ఉన్న చూపులు కల, వరాహ వదనము కల, సౌమ్యుడైన, నాలు చేతులు కల, కిరీటము గల, శ్రీవత్సము వక్షస్సునందుగల, చక్రము, శంఖము, అభయము చేతుల యందుగల, సాగరమే వస్త్రముగాగల నిన్ను (భూదేవిని) ఎడమ తొడ పై కూర్చుండ బెట్టుకొన్న, ఎర్రని పచ్చని వస్త్రములను ధరించిన, ఎర్రని ఆభరణములను ధరించిన, శ్రీకూర్మము యొక్క పృష్ఠముపై నిలచి ఉన్న ఆదిశేషుని వహించుచున్న వరాహస్వామికి నమస్కారము. ఈ విధముగా ధ్యానించి మంత్రమును నూట ఎనిమిది మార్లు జపింపవలెను. అట్లు జపించినచో అన్ని కోరికలను తీర్చుకొనగలడు, నిశ్చయముగా మోక్షమును గూడ పొందేను. కనుక నీవు అడిగిన విధంగానే అన్ని విషయములను నీకు తెల్పితిని. ఓ భూదేవి, నీకు ఇక ఏమి కావలెనో తెల్పుము.

సూతుడు చెప్పెను:- అది విని భూదేవి వరాహస్వామిని, ఈ మంత్రములను పూర్వము ఎవరు అనుష్ఠించిరి? ఎటువంటి ఫలమును పొందిరి? అని ప్రశ్నించెను. దానికి స్వామి ఇట్లు సమాధానమిచ్చెను. ఓ దేవీ! పూర్వము కృతయుగమందు ధర్ముడను మనువు ఉండెను-20. అతడు బ్రహ్మ నుండి ఈ మంత్రమును ఉపదేశము పొంది, అనుష్ఠించి, నన్ను చూచి, వరమును పొంది చివరకు నా స్థానమును పొందెను. ఇంద్రుడు దుర్వాసుని వలన శాపము పొంది స్వర్గము నుండె భ్రష్టుడయ్యెను. తరువాత ఈ మంత్రమును జపించి ముక్తిని పొందిరి. ఆదిశేషుడు కూడా ఈ మంత్రాన్ని కశ్యపుని నుండి పొందెను. శ్వేతద్వీపమందు దీనిని పడించి భూమిని మోయు సామర్థ్యమును పొందెను. కనుక భూమిని పొందగోరు మానవులందరు ఈ మంత్రాన్ని తప్పక జపింపవలెను.

సూతుడు చెప్పెను: - అది విని భూదేవి మిక్కిలి సంతోషించినదై ఇట్లనెను. భూదేవి పలికెను. వేంకటాద్రి అను పేరుగల పవిత్రమైన పర్వతము పైకి జగత్పతి అగు శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవులతో ఎప్పుడు వచ్చును? . ఏ విధంగా కల్పాంతరము వరకు ఉండగలడు. ఈ విషయమును గూర్చి నీకు మిక్కిలి కుతూహలము కలదు. కావున వెల్లడింపుము.

ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మాహత్మ్యమున ధరణీ వరాహ సంవాదమున శ్రీ వరాహస్వామిని ఆరాధించు విధిమొదలగునవి వర్ణించు రెండవ అధ్యాయము.