స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

37వ అధ్యాయము

భరద్వాజుడు చెప్పెను :- ఓ పార్థా! వినుము స్వామి అత్యంత ఆశ్చర్యకరముగా ఆ వేంకటాద్రిపై వెలసిన విధము చెప్పెదను, హైహయవంశమునందు శృతుడను రాజు ప్రజలను తనవారిగా భావించుచు చాల కాలము పరిపాలించెను. ఆతడికి శంభుడను కుమారుడు కలడు, సకల గుణ సంపన్నుడైన ఆ శంభుడు అన్ని శాస్త్రములను నేర్చినవాడై చక్కగా పరిపాలించెను. అతడు ఇతర దైవములను వదలి పెట్టి పుండరీకాక్షుడు, ఈ జగత్తుకు నాథుడు అగు విష్ణువుయందే నిశ్చలమగు భక్తిని పెంచుకొనెను. దేవదేవుడు జగన్నాథుడు, అనంతుడు పురుషోత్తముడు, అద్భుతవైభవము కలవాడు

వివిధములైన వ్రతములను, దానములను, పుణ్యములమ వేదవేద్యుడు, మధుసూదనుడు ఆగు స్వామి ప్రీతికొరకు చేసెను. స్వామికొరకే అశ్వమేధాది యజ్ఞములను చేసి యథోక్తముగా దక్షిణలిచ్చి బ్రాహ్మణులను తృప్తిపరచెను. భక్తవత్సలుడగు స్వామి యందు మనస్సు నిలపి అన్ని కర్మలను సోమరితనములేక పూర్తి చేసెను. ఎల్లప్పుడు ఆ గోవిందునే స్మరించుచు, అచ్యుతుడు, అవ్యయుడు అగు స్వామివి జపించుచు, పుండరీకాక్షుని పూజించుచు, శార్దిని సంకీర్తనము చేయుచుండెను. సంసారమను సముద్రమును దాటింప శక్తిగల పవిత్రములగు విష్ణు సంబంధి కథలను పౌరాణికులు చెప్పుచుండగా అతడు ఎల్లప్పుడు వినుచుండెను.

విష్ణువుకు ప్రీతి కలిగించుటకై బ్రాహ్మణులను ఎల్లప్పుడు పూజించుచుండును. ఈ విధముగా అన్ని విధముల సత్కార్యములు చేయుచున్నప్పటికి ఆ రాజు సంతృప్తి లేనివాడయ్యెను. అన్ని యజ్ఞముల స్వరూపమైన ఆ స్వతంత్రుడు, పురుషోత్తముడు శాశ్వతమగు ఐశ్వర్యము అగు విష్ణువును చూడక, అతడి దర్శనము కలుగక. దుఃఖముతో నిండిన మనస్సుతో గొప్ప విచారమును పొందెను.

శంఖుడు చెప్పెను (ఆనుకొనెను):- గడచిన వేయి జన్మలలో నేనేదో పాపమును చేసి ఉండవచ్చును. కనుకనే స్వామి దర్శనమును పొందలేక పోయితిని. పూర్వజన్మలలో చేసిన పాపకార్యములే దీనికి కారణము. మధుసూదనుడగు స్వామిని దర్శించుట అను అఖండమగు ఫలమును ఎట్లు పొందగలను. స్వామి నా కనుల ముందు ఎట్లు ప్రత్యక్షము కాగలడు. స్వామి పలుకులను ఎప్పుడు వినగలను? ఎప్పుడు శుభమును పొందగలను?. పాపముచేసిన, ఫలితమును పొందునట్టి, స్వామి కృపకు దూరమైనట్టి, సంసారమను కష్టమును పొందినట్టి ఈ జన్మము వ్యర్థము.

భరద్వాజుడు చెప్పెను:- అని చింతాక్రాంతుడై జీవితముపై నిస్పృహపొందిన ఆ రాజుతో విష్ణువు అందరూ వినుచుండగా అదృశ్యుడై ఇట్లు చెప్పెను.

స్వామి చెప్పెను :- నీవు దు:ఖమును పొందకుము, నీకు హితమగునది చెప్పెదను వినుము. నీవు నా శరణు పొందినవాడవు. నేను నిన్నెట్లు వదలి పెట్టగలను. వేంకటాద్రి అనునది మూడు లోకముల యందు ఖ్యాతి పొందినది. నాకు వైకుంఠము కంటి ఇష్టమైనది. నీ వచటకు వెళ్ళుము. వేయి సంవత్సరములు తపస్సు చేయుము. అపుడు నేను ప్రత్యక్షమగుదును. నీ వలె అగస్త్యుడు కూడ నీ దర్శనమునకై ఎదురుచూచుచు బ్రహ్మను ప్రశ్నించెను. నిగ్రహము కలిగిన మనస్సు కలవారికి స్వామి వృషభాద్రిపై కనిపించును. నీ వచటికి వెలుము అని బ్రహ్మ అగస్త్యునికి చెప్పెను. ఈ విధముగా బ్రహ్మ ఆదేశముపై అగస్త్యుడు అంజనాద్రిపై గొప్ప తపస్సు చేయుటకు అచటకు రాగలడు. నీవు కూడ పుణ్య ప్రదమగు ఆ పర్వతముపై నివసించుము. తపస్సు ద్వారా నన్ను ఆరాధించుము. నన్ను చూడగలవు.

స్వామి ఆజ్ఞామపారము శంభుడు వేంకటాచలమునకు వెళ్ళుట

భరద్వాజుడు చెప్పెను:- దానవులకు శత్రువగు స్వామి అట్లు చెప్పగా శంఖుడు ధన్యుడనైతిని అని మనస్సునందు మిక్కిలి ఆనందించెను . ప్రజలను పరిపాలించుటకు తన కుమారుడగు శంభుని రాజుగా చేసి స్వామిని దర్శించుటకై నారాయణాద్రికి వెళ్ళేను. ఆ పర్వతము పై ఎత్తైన శిఖరముపై దివ్యమగు అమృతముతో సమానమగు జలములతో నిండిన స్వామిపుష్కరిణిని చూచెను. ఆ తీర్థేమును అనేక మంది సిద్ధులు, గంధర్వులు, దేవతలు, ఋషులు సేవించుచుండిరి. అది అన్ని పాపములను పోగొట్టునది, అన్ని తీర్థేములతో కూడినది, ఆ నీటిలో నీటి కొకులు, కొంగలు, క్రౌంచములు, హంసలు, కారండవములు కలవు. తెల్ల తామరలు, కలువలు ఎన్నో విధములైనవి కలవు. అటువంటి ఆ సరస్సును చూచి దాని తీరమున ఒక కుటీరమును నిర్మించుకొని ఆ సరస్సునందు స్నానము చేయుచు, ఆ నీటిని త్రాగుచు, మనస్సును నిగ్రహించుకొనేను. తాను చేయు అన్ని కర్మలను జగత్తుకు ఈశ్వరుడగు స్వామియందు సమర్పించి కాలము గడపుచుండెను.

భగవంతుని దర్శించుటకై అగస్త్యుడు వేంకటాద్రికి వెళ్ళుట :- జపమునందు, ధ్యానమునందు మగ్నుడై అతికష్టమగు తపస్సు చేసెను. అదే సమయమున బ్రహ్మ ఆజ్ఞానుసారము అగస్త్యుడు కూడా పెక్కు మందీ మునులతో కలసి ఆ వేంకటాద్రికి చేరెను. ముందుగా తూర్పు దిక్కుకు చేరి ఆ పర్వతమునకు ప్రదక్షిణము మొదలు పెట్టెను. అనేక పుణ్యతీర్థేములను దర్శించుచు చాలకాలము ఆ పర్వతముపై సంచరించెను. అచట స్వామిని చూడవలెనను కోరిక కలిగిన బ్రహ్మను, కుమారస్వామిని, ఇంద్రుని. ఈశ్వరుని, విష్వక్సేనుడు మొదలైన వారిని సనకాది మునీంద్రులను, నారదాది ఋషులను చూచెను. సిద్దులను, గంధర్వులను, దైత్యులను, యక్షులను, రాక్షసులను నాగులను చూచి వారిచే సత్కరింపబడి ప్రియముగా సంభాషించుచు ముందుకు సాగెను. ఆశ్చర్యకరములగు ఎన్నో విషయములను చూచుచు సంచరించెను. కుమారధార మున్నగు తీర్థేముల్పెయందో స్నానము చేసెను. ఆయా చోట్ల జగత్పతియగు స్వామిని అర్చించెను. ఈ విధముగా వేయి సంవత్సరములు గడచిపోయెను. అయినప్పటికి స్వామిని దర్శింపలేక మిక్కిలి విచారమును పొందెను.

            బృహస్పతి, వసువు మున్నగువారు అగస్త్యునితో సంభాషించుట:- ఆ సమయమున బృహస్పతి, ఇంద్రుడు, ఉపరిచరుడను వసువు అగస్త్యుని వద్దకు వచ్చిరి. ఓ మునిసత్తమా! మా జీవితములు సఫలములైనవి. ఏలననగా నారాయణునితో సమానుడగు నిన్ను చూడగలిగితిమి. స్వామిని చూడగోరు మీతో బ్రహ్మ ఆదేశానుసారము ఒక విషయము చెప్పవలసి ఉన్నది. ఇచటకు దక్షిణముగా వేంకటాద్రి అను పర్వతము ఉన్నది అది స్వామికి శ్వేత ద్వీపము కంటే మిక్కిలి ఇష్టమైనది. ఆ పర్వతముపై అగస్త్యునికి, శంఖుడను రాజుకు జగత్పతియగు స్వామి తన నిజరూపమును చూపగలడు. అపుడు దేవతలందరికి, ఋషులకు, యక్షులకు, రాక్షసులకు మాకందరికి దేవ దేవుడగు ఆ స్వామి దర్శనము లభింపగలదు. కొద్ది కాలములోనే ఆది బ్రహ్మచే ఆదేశింపబడి మా భాగ్యము కొలది మహానుభావులు, గొప్ప తేజస్సు కలవారు అగు మిమ్ము చూడగలిగితిమి. మీతో కలసి మనమందరము స్వామి పుష్కరిణికి వెళ్ళి శంఖుడను భాగవతోత్తముని కూడ చూచెదము.

భరద్వాజుడు చెప్పెమ:- ఈ విధముగ బృహస్పతి మున్నగువారు చెప్పగా అగస్త్యుడు విచారమును వదలి వెంటనే వారితో బయలుదేరెను. మార్గమధ్యమున అతడు పండ్లు, పూలతో వంగిన పెద్ద చెట్లను, దిక్కులను తమ దట్టమైన నీడలతో కప్పివేసిన వాటిని చూచెను. దారియందు తిరుగుచున్న సింహములను, ఏనుగులను, పెద్దపులులను, అడవి పందులను, దున్నలను మరెన్నో మృగములను చూచెను. మేఘములతో నిండిన, బంగారు, వెండి, రాగి మున్నగు వర్ణములతో కూడిన పర్వత సానువులను చూచెను. తమ వేగంతో శిలలను కదిలించి వేస్తూ ఎగిరిపడుచున్న నీటి తుంపరల ధారలచే దివిలో ఉన్న దేవతలను తడపుచున్న వందలాది కొండవాగులను చూచెను. కొండచరియలలో తామరపువ్వుల సువాసనతో కూడిన మెల్లనిగాలి వారికి ఆహ్లాదము కలిగించెను.

చిలుకల, కోకిలల మధుర వాక్కులను వారు వినిరి. విశాలమైన రాళ్ళపై కూర్చోని కృష్ణుని గూర్చి పాటలు పాడుచున్న సిద్దులను వారు అచట అచట చూచిరి. ఈ విధముగా ముందుకు సాగిన అగస్త్యుడు మున్నగువారు స్వచ్చమగు నీటితో నిండిన స్వామి పుష్కరిణిని చూచిరి. దాని తీరమునందు మనోవాక్కాయ కర్మలను విష్ణువుయందు నిల్పిన శంఖుడను రాజును చూచిరి. అనేక వ్రతములను ఆచరించు ఆ మునీంద్రులను చూచి శంఖుడు వారికి నమస్కరించి, వారిని స్తుతించి తగిన విధమున పూజించెను. ఒకరిపట్ల మరొకరికి ఉత్సుకత కలవారు పరస్పరము గౌరవించుకొని, కూర్చుని విష్ణువును గూర్చి సంభాషించుకొనుచు కృతార్థులైరి.

ఇది శ్రీ స్కాందమహాపురాణమునందు ఎనభైఒక్కవేల శ్లోకములు కల సంహితయందు రెండవదగు వైష్ణవఖండమందలి శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందు సువర్ణముఖరి మాహాత్మ్యమును వర్ణించు సందర్భమున స్వామిని గూర్చి అగస్త్యుడు.