స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

11వ అధ్యాయము

సూతుడు చెప్పెమ:- స్వామి పుష్కరిణి యందు స్నానము చేయుట చేత కాశ్యపుడు మహాపాతకము నుండి విముక్తి పొందుట:

శుభకరమైన స్వామి పుష్కరిణి మాహాత్మ్యాన్ని వర్ణించు ఒక పవిత్రమైన కథను చెప్పెదను. కాశ్యపుడను విప్రుడు పూర్వము ఈ తీర్థమునందు స్నానము చేసి నరకమును పొందించు ఒక గొప్ప పాతకము నుండి బయటపడెను. ఋషులు అడిగిరి: ఓ ముని! ఈ కాశ్యపుడనువాడు ఏమి పాపము చేసెను. ఈ స్వామి పుష్కరిణి యందు స్నానము చేసి వెంటనే విముక్తి పొందెను. శ్రద్ధ కల్గినటువంటి మాకు నీ కృపాబలముచేత ఈ కథను తెలియజేయుము. నీ మాటలకు అమృతము తాగుతున్న మాకు దప్పి కూడా కలుగుట లేదు.

సూతుడు చెప్పెను: స్వామి పుష్కరిణి మాహాత్మ్యమును వర్ణించునది. పఠించిన వారి పాపములను పోగొట్టునది అయిన ఇతిహాసమును నేనిపుడు చెప్పెదను.

 పరీక్షిత్తు వృత్తాంతము:- అభిమన్యువు కుమారుడైన పరీక్షిత్తను రాజు ధర్మముగా భూమిని పరిపాలించుచు హస్తినాపురమునందు నివసించుచుండెను. ఒకనాడు ఆ రాజు వేటయందు ఆసక్తి కలిగి వనమునందు సంచరించుచు అరవై సంవత్సరముల వయస్సు కలిగినవాడగుట వలన మిక్కిలి దప్పిగొనెను. ఒక లేడిని వెన్నాడుచు మిగిలిన వారి నుండి విడిపోయి ఏకాకియై ధ్యానమునందు మునిగి ఉన్న ఒక మునిని చూచి ఇట్లడిగెను. 'ఓ మునీ! ఇప్పుడేనేను ఒక లేడిని బాణముతో కొట్టగా తప్పించుకొనెను. భయముతో పారిపోయిన దానిని నీవు చూచితివా?. ఆ ముని సమాధియందు ఉండుట వలన సమాధానము చెప్పలేదు. దానికి కోపించి రాజు పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆ ముని భుజము పై వేసి తన నగరమునకు తిరిగి వెళ్లాను. ఆ మునికి శృంగి అను ఒక కొడుకు ఉండెను. ఆ శృంగికి బ్రాహ్మణోత్తముడైన కృశాఖ్యుడను మిత్రుడుండెను. ఆ కృశాఖ్యుడు తన మిత్రునితో ఇట్లనెను. నీ తండ్రి పై ఉన్నది కేవలము చచ్చిన పాము మాత్రమే. కనుక నీవు గర్వము ప్రదర్శించకుము. వృథాగా కోపమును పొందకుము.

  కోపించిన శృంగి రాజుకు శాపమివ్వ గోరెను. నా తండ్రి యందు చచ్చిన పామును వేసినటువంటి మూఢుడు ఏడు రాత్రుల లోపల తక్షకునిచే కుట్టబడి మరణించుగాక అని పరీక్షిత్తునకు శాపమిచ్చెను. అతని తండ్రి అయిన శమీకుడీ విషయము తెలుసుకుని కుమారునితో ఇట్లనెను. అన్ని లోకములను రక్షించునటువంటి రాజును ఏల శపించితివి. రాజులేని ఈ లోకంలో మనము సుఖముగా ఎట్లుండగలము? కోపము వలన పాపము కలుగును. దయచేత సుఖము కలుగును. కోపము కలిగినపుడు దానిని ఓర్పు వహించి అదుపులో ఉంచవలేను. దాని వలన ఈ లోకమునందు పరలోకమందు కూడ సుఖమును పొందగలడు. ఓర్పు కలిగిన పురుషుడే ఉత్తమమైన సంపదలను పొందగలడు.

 తరువాత శమీకుడు తన శిష్యుడైన గౌరముఖుడను వానిని పిలచి ఓ గౌరముఖి! నీవు పరీక్షిన్మహారాజు వద్దకు వెళ్లి చెప్పుము. తక్షకుడు కుట్టగలడు అను నాకుమారుని శాపమును రాజుకు చెప్పి తిరిగి త్వరగా నా వద్దకు రమ్ము. అని శమీకునిచే ఆజ్ఞాపింపబడిన గౌరముఖుడు రాజు వద్దకు వెళ్లి ఇట్లు చెప్పెను. నీవు తన తండ్రిపై వేసిన చచ్చిన పామును చూచి శమీకుని కుమారుడైన శృంగి కోపించి నిన్ను శపించెను. ఈనాటి నుండి ఏడు దినములలో సర్పరాజైన తక్షకునిచే కుట్టబడి ఆ విషాగ్నియందు అభిమన్యుని కుమారుడవైన నీవు మరణింతువు. అని ఆ శృంగి నిన్ను శపించెను. అతడి తండ్రి ఈ శాపమును గూర్చి తెల్పుటకు నన్ను నీ వద్దకు పం పెను. అని విషయమంతయు త్వరగా చెప్పి గౌరముఖుడు తిరిగి వెళ్లాను. అతడు వెళ్లిన తరువాత పరీక్షిత్తు శోకమునందు మునిగిపోయెను.

 మబ్బులను తాకుచున్నంత ఎత్తైనది, ఒకటే స్తంభముగలది, మిక్కిలి విశాలమైనది అయిన ఒక మండపమును ఆ రాజు నీటి మధ్యలో నిర్మింపచేసెను. గట్టి ప్రయత్నముచేసి మహాగరుడ మంత్రము తెలిసినవారిని, ఓషధులు తెలిసినవారిని, చికిత్స చేయువారిని రప్పించి తక్షకుని విషమును హరించుటకు ఏర్పాటు చేసెను. విష్ణుభక్తి పరుడై అనేకమంది దేవర్పులతో బ్రహ్మర్షులతో, రాజర్షులతో కూడి ఆ ఒంటి స్తంభపు మేడ పై ఉండెను. ఆ సమయమునందు మాంత్రికోత్తముడైన కాశ్యపుడను బ్రాహ్మణుడు రాజును తక్షకుని విషము నుండి కాపాడుటకు బయలు దేరెను. ఏడవ నాడు దరిద్రుడు, ధనముపై కోరిక కల్గినవాడు అయిన ఆ విప్రుడు బయలుదేరి మార్గమధ్యమున బ్రాహ్మణ వేషమున వచ్చుచున్న తక్షకుని కలుసుకొనెను. కలసి ఓ బ్రాహ్మణోత్తమా నీవెచటకు వెళ్ళుచున్నావు అని కాశ్యపుని ప్రశ్నించెను. నేడు పరీక్షిత్తు మహారాజును తక్షకుడు తన విషాగ్నిచే వహింపచేయబోవుచున్నాడు. ఆ విషాగ్నిని చల్లార్చుటకు నేనాతని సమీపమునకు వెళ్లుచున్నాను అని చెప్పగా తక్షకుడిట్లనెను.

 ఓ బ్రాహ్మణోత్తమా! నేను తక్షకుడను. ఎంత గొప్ప మంత్రములు నేర్చిన వారైనను వంద సంవత్సరములకైనను నా విషమునకు చికిత్స చేయలేరు. నీకు గనుక నా విషమునకు చికిత్స చేయు శక్తి ఉన్నచో అనేక యోజనములు విస్తరించిన ఈ చెట్టును నేను దగ్ధము చేసెదను. దానిని పునరుజ్జీవింపజేయుము. అప్పుడు మాత్రమే నేను నీవు సమర్థుడవని అంగీకరింతును అని పలికి ఆ చెట్టును తక్షకుడు కాటు వేసెను. వెనువెంటనే ఆ చెట్టు కాలి బూడిదయ్యెను. ఆ సమయంలో ఆ చెట్టుపై ఒక మనిషి ఉండెను. తక్షకుని విషాగ్నిచే అతడుకూడ భస్మమయ్యెను. అతడున్నట్లు తక్షక కాశ్యపులు గమనించలేదు. అప్పుడు కాశ్యపుడు తక్షకునికి తన శక్తిని చూపగోరెను. నా శక్తిని చూడుడని పలికెను. మాంత్రికోత్తముడైన ఆ కాశ్యపుడు వెంటనే తన మంత్రశక్తితో ఆ చెట్టును బ్రతికింపచేసెను. చెట్టుతోబాటు భస్మమైన మనిషి కూడ బ్రతికెను. అప్పుడు తక్షకుడు ఆ బ్రాహ్మణునితో ఇట్లనెను.

 మునివాక్కు వ్యర్థము కాకుండునట్లు చేయవలయును. కనుక నీకు రాజు ఇచ్చు ధనమునకు రెట్టింపు ధనమును నీకు ఇచ్చెదను. అని పలికి ఆ తక్షకుడు కాశ్యపునికి అమూల్యమైన రత్నములను ఇచ్చి శీఘ్రముగా తిరిగి పొమ్మనెను. ఆ విధముగా మంత్రకోవిదుడైన ఆ బ్రాహ్మణుని వెనుకకు తిప్పి పం పెను. ఆ కాశ్యపుడు తన జ్ఞానదృష్టి చేత రాజును అల్పాయుష్కునిగా తెలుసుకొని తక్షకుని నుండి రత్నములను స్వీకరించి తన ఆశ్రమమునకు వెళ్లిపోయెను. అపుడు తక్షకుడు పాములన్నిటిని పిలచి మీరందరు మునివేషములు ధరించి పరీక్షిన్మహారాజు వద్దకు వెళ్లి రాజుకు ఉపాహారముగా పండ్లను సమర్పింపుమని చెప్పెను. వారందరు అంగీకరించి రాజు వద్దకు వెళ్లి పండ్లను సమర్పించిరి. తక్షకుడు ఒక కృమి వేషమును ధరించి రేగు పండులో దాగుకొనెను. రాజు బ్రాహ్మణుల రూపములో ఉన్న సర్పములు ఇచ్చిన పండ్లను అక్కడ ఉన్న మంత్రులకు వృద్ధులకు ఇచ్చెను.

 కుతూహలముతో ఒక పెద్ద పండును తాను కూడా తీసుకొనెను. ఇంతలో సూర్యుడు అస్తమించెను. ముని వాక్యము వ్యర్థము కాదని అక్కడ ఉన్న వారందరు పరస్పరము అనుకొనుచుండిరి. అప్పుడు రాజు చేతిలో ఉన్న పండులో ఒక ఎర్రని క్రిమి కనిపించెను. అందరితోపాటు రాజు కూడా దానిని పరీక్షించేను. ఈ పురుగా నన్ను కాటువేయునది అని పలికి రాజు ఆ పురుగుతో సహా ఆ పండును తన నోట వేసుకొనేన, ఆ పండుయందున్న తక్షకుడు వెంటనే బయటకు వచ్చి రాజు శరీరమును ఆక్రమించుకొనెను. అది చూచి పక్కగా ఉన్నవారందరు బెదరి పారిపోయిరి. అప్పుడు తక్షకుడు కాటు వేయగా రాజుతో పాటు ఆ భవనమంతయు కాలి బూడిదయ్యెను

రాజుకు ఉత్తరక్రియలు చేసి మంత్రులు లోకమును శిక్షించుటకై పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుని రాజుగా అభిషేకించిరి.

 రాజును తక్షకుని విషమునుండి రక్షించుటకు వచ్చి వెనుదిరిగి పోయిన కాశ్యపుడను బ్రాహ్మణుడు అందరిచే నిందింపబడెను. ఎచటకు వెళ్లినను మంచివారందరు అతడిని నిందించిరి. ఏ గ్రామమునందు కాని, ఆశ్రమము నందు కాని అతడికి ఆశ్రయము లభింపలేదు. అన్ని దేశముల నుండి బహిష్కరింపబడి అతడు చివరకు శాకల్య మునిని శరణు వేడెను. శాకల్య మునికి నమస్కరించి ఇట్లు పలికెను. కాశ్యపుడు పలికెను. అన్ని ధర్మములు తెలిసిన ఓ భగవాన్! మునులు బ్రాహ్మణులు అందరు నన్ను నిందించుచున్నారు. ఈ మానవులందరు నన్ను ఎందుకు నిందించుచుండిరో నాకు తెలియదు. బ్రహ్మహత్యకాని, మద్యము సేవించుటకాని, గురుస్త్రీతో సంబంధమును పెట్టుకొనుటగాని, దొంగతనముగాని, సంసర్గదోషముకాని, ఇతరములైన ఏ పాపము కాని నేను చేయలేదు. అయినప్పటికీ ప్రజలు, బంధువులు అందరూ నన్ను అకారణముగా నిందించుచున్నారు. కనుక ఓ శాకల్య మహామునీ, నేను చేసిన తప్పు ఏమియో చెప్పుము. కాశ్యపుడీ విధముగా అడగగా శాకల్యుడు ఒక క్షణము ధ్యానము చేసి అప్పుడిట్లనెను.

  శాకల్యుడు చెప్పిన ధర్మములు:

శాకల్యుడు చెప్పెమ:- పరీక్షిత్తు మహారాజును తక్షకుని బారి నుండి రక్షించుటకు బయలు దేరిన నీవు తక్షకునిచే వారింపబడి మధ్యమార్గమునందు తిరిగి వచ్చితివి. విషరోగాదుల చేత పీడింపబడువారిని రక్షింపగలుగు శక్తి ఉన్నప్పటికి రక్షింపని వారిని లోకమునందు బ్రహ్మహత్య చేసిన వారిగ భావింతురు. క్రోధము, కామము, భయము, లోభము, మాత్సర్యము వలన ఆవేశింప బడినప్పటికి విషరోగాదుల చేత బాధపడుచున్న వారిని రక్షింపని వాడు బ్రహ్మహత్య చేసినవాడు, మద్యము సేవించినవాడు, దొంగతనము చేసినవాడు, గురు తల్పమును పొందిన వాడు, సంసర్గ దోషమును పొందిన వాడితో సమానుడు. కన్యను విక్రయించినవాడు, అశ్వమును విక్రయించినవాడు. చేసిన సహాయమును మరచినవాడు వీరందరికి శాస్త్రములయందు ప్రాయశ్చిత్తము కలదు విషముచే బాధపడువానిని సమర్థుడైనప్పటికి ఎవడు రక్షింపడో అతడికి ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినప్పటికి నిష్కృతి లేదు. అతడితో కలసి మంచివారు భోజనము చేయరు. మాట్లాడరు. కనీసం అతడిని చూచుటకు ఇష్టపడరు.

 వానితో మాట్లాడినంతనే గొప్ప పాపము చేసినవాడగును. పరీక్షిన్మహారాజు పెక్కు పుణ్యకార్యములు చేసినవాడు, ధర్మకార్యములు చేసినవాడు. విష్ణుభక్తుడు, గొప్ప యోగి, చాతుర్వర్ణ్యమును కాపాడినవాడు. వ్యాసుని పుత్రుడైన శుకుని వద్ద విష్ణు కథలను భక్తితో విన్నవాడు. అట్టి ఆ రాజును రక్షింపక తక్షకుని మాట విని నీవు తిరిగి వచ్చితివి. కనుకనే బ్రాహ్మణులు, బంధువులు నిన్ను నిందించుచున్నారు. ఆ పరీక్షిత్తుకు ఆయుషు లేకపోవచ్చును. కాని మరణించునంత వరకు తగిన చికిత్సచేయవలయును. కంఠములో ప్రాణములున్నంత వరకు మరణించగోరువాడైనను మానవుని రక్షింప వలయును. కాలము యొక్క వక్రగతి ఎవరికిని తెలియదు. అని వైద్యశాస్త్రమునందు తలపండినవారు చెప్పుదురు. కనుక చికిత్స చేయు శక్తి కల్గినప్పటికి చికిత్స చేయని వైద్యుడవై మధ్యమార్గమున తిరిగివచ్చినందున నిన్ను అందరు నిందించుచున్నారు. శాకల్యుడీ విధముగ చెప్పగా కాశ్యపుడిట్లు పలికెను.

 కాశ్యపుడు పలికేను: - ఓ సువ్రతా! ఈ పాపమును పోగొట్టుకొనుటకు నేనేమి చేయవలయును. ఏమి చేసిన నా బంధువులు ఇతరులు నన్ను వారిలో కలుపుకొందురు. ముని సత్తముడైన ఓ శాకల్యుడా! నీవే ఏదైన చేయవలయును. అని కాశ్యపుడు మరి మరి వేడెను. అప్పుడు శాకల్యుడు ఒక్క క్షణము ధ్యానించి కాశ్యపునితో ఇట్లనెను. అప్పుడు

శాకల్యుడు చెప్పెను: ఈ పాపము నుండి బయట పడుటకు నేనొక ఉపాయమును చెప్పెదను. ఆలస్యము లేకుండ నీ వాపని చేయవలయును. సువర్ణముఖీ నదీతీరమునందు శ్రీనివాసునికి నివాస స్థానము వేంకటాద్రి అని ప్రసిద్ధి కెక్కినది. అన్ని లోకములలో పూజింపబడునది అయిన పర్వతము కలదు. ఆ శేష గిరిపై సురాసురులచే నమస్కరింపబడునది, బ్రహ్మ హత్య, సురాపానము, చౌర్యము మొదలైన పాపములను నశింపచేయునది. అన్ని పాపములను పోగొట్టునది, శ్రీనివాసుని ఆలయమునకు ఉత్తర దిక్కున ఉన్నది. పరమ పవిత్రమైనది అయిన స్వామి పుష్కరిణి కలదు.

ఆ వేంకటాద్రికి వెళ్లి శుభకరమైన స్వామి పుష్కరిణి యందు ముందుగా స్నానము చేసి, దానికి పశ్చిమతీరమునందున్న వరాహస్వామిని సేవించి తరువాత బంగారుకొండ పై నివసించు శ్రీనివాసుని, పరదైవతమును భక్తులకు అభయమిచ్చువానిని, శంఖము చక్రము ధరించివానిని వనమాలచే అలకరింపబడినవానిని స్వామిని చూడుము. ఎట్టి సంశయము లేక నీవు నీ పాపము నుండి ముక్తిని పొందుదువు. శాకల్యుడీ విధముగా చెప్పగా కాశ్యపుడు అంగీకరించెను. వేంకటాద్రికి వెళ్లి, సురాసురులు నమస్కరించు పుష్కరిణి యందు నియమపూర్వకముగా స్నానము చేసెను. అప్పటికి వైద్యవృత్తి యొక్క పారమునంటిన ఆ కాశ్యపుడి పాపము తొలగీ స్వస్థుడయ్యెను. అతడి బంధుజనులందరు అతడిని ఆదరించి పూజించిరి. ఈ విధముగ వేంకటాచల వైభవమును తెలియజేయు కథను నేను మీకు చెప్పితిని. ఈ కథను ఏ భక్తుడైతే భక్తితో వినునో అతడు విష్ణులోకమును పొందును.

ఎనభై ఒక్క వేల శ్లోకములుగల శ్రీస్కాందమహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున వేంకటాచలము పై ఉన్న స్వామి పుష్కరిణి మాహాత్మ్యమునందు కాశ్యపుని దోష నివృత్తి అను పదకొండవ అధ్యాయము.