స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

33వ అధ్యాయము

భరద్వాజుడు చెప్పిన:- అపుడు దివ్యవిమానములలో ఇంద్రుడు మొదలైన దేవతలు అగస్త్యుని అనుసరించుచున్న ఆ నది వెంట నడిచిరి, కొత్తగా భూమిపైకి దిగినది. మంగళకరమైనది అగు ఆ నదిని మునిపుంగవులందరు చేతులు జోడించి స్తుతించుచు సేవించిరి. సిద్దులు, చారణులు, గంధర్వులు వేల సంఖ్యలో అచటకు వచ్చి ఆ నదిని అగస్త్యుని శుభకరములైన స్తవములతో స్తుతించిరి. అమృతము వలె స్వచ్చమగు ఈ నదీజలము మన అదృష్టము కొద్ది సంప్రాప్తించినది అని భూమి పై ఎల్ల జనులు ఆనందించిరి. అపుడు బ్రహ్మ ఆదేశముపై వాయుదేవుడు దేవతలందరు వినుచుండగా ఇట్లు చెప్పెను.

  వాయువు చెప్పెను:- లోకముల అదృష్టము వలన కొంగుబంగారమువలె అగస్త్యుని చేత తీసుకొనిరాబడిన ఈ నది దిక్కులను ముఖరితము చేస్తూ వచ్చినది. కనుక సర్వలోక పూజ్యమైన ఈ నది మోక్షదాయినియై, సువర్ణముఖి అను పేరు పొందెను. బ్రహ్మవచనాను సారము ఈ నది ఇతర నదులన్నిటిలోకి విశేషముగా సేవింపదగినది.

భరద్వాజుడు చెప్పెను:- వాయువు ఈ విధముగా చెప్పగా విని అగస్త్యుడు విస్మయమంది, పులకించిన శరీరము కలవాడై సంతోషించెను. ఈ విధముగా ఈ నది స్నానమునకు, పానమునకు ఉపయోగపడుచు ప్రఖ్యాతిని పొందెను-.

   బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఆకాశమునందు ప్రవహించు ఈ నది భూమికి దిగి 'సువర్ణముఖరి' అను పేరుతో తనను 'నమ్మిన వారిని పావనము చేయుచున్నది. పెక్కు పర్వతములను, అరణ్యములను, అనేక దేశములను క్రమముగా దాటుతూ కొండలలో పుట్టిన పెక్కు మహానదులచే సేవింపబడుచు ముందుకు సాగెను. రోగముల చేత బాధపడుచున్నవారికి, కష్టములు పడుతున్నవారికి ఆరోగ్యమును చేకూర్చునవి, శరీరము పైన, లోన కలిగిన సంతాపమును చల్లార్చునవి, ఆనందమును కలిగించునవి అగు జలములతో ముందుకు సాగెను. విహారము చేయుట మగ్నమైన ఏనుగులు పెద్ద తొండములతో కొట్టుటచే పైకి లేచిన నీటి తుంపరలు పూలహారముల వలె ఉండి ఆ నది సూర్యునికి అర్ఘ్యమిచ్చుచున్నదా అన్నట్లున్నది. సుగంధము కలిగిన తామరలు, కలువల వాసన చేత దీక్కులు సంవాసితములు కాగా తుమ్మెదలన్నిటికి స్థానమైనదా అన్నట్లున్న నీటితో ఆ నది విరాజిల్లుచుండెను.

  ఆటల కొరకు ఆ నదిలోకి దిగిన సురలోక స్త్రీలు నుదుటన పెట్టుకున్న సిందూరము చేత నదిలోని నీరు ఎర్రబారినది. వారి కేశముల నుండి జారి పడిన పారిజాత పుష్పములచే నదిలోని నీరు సుగంధయుతమైనది. ఆ నదీ మంగళకరములైన, తియ్యనైన బురదలేని, స్వచ్చమైన, అమృతముతో సమానమైన, మేఘముల నుండి వచ్చిన నీటితో, పాపములను నశింపజేయు శక్తి కలిగి ఉండెను. అగస్త్యశైలము వద్ద జన్మము పొందినది. అగస్త్యునిచే భూమికి కొనిరాబడినది. ప్రఖ్యాతి పొందిన తీర్థే సమూహము కలది ఆగు ఆ నది దక్షిణ సముద్రమును చేరెను. సముద్రుని చేరిన ఆ నదికి సముద్ర తరంగములు నీటి జల్లులు అను అక్షింతలతో రత్నముల కాంతులు అను దీప కాంతులతో ఆహ్వానము పలికినవి. వచ్చిన ఆ నదిని సముద్రుడు కెరటములను చేతులతో కౌగిలించుకుని అభినందించి కెరటముల చప్పుడు అను సంభాషణముతో తనకు ఇష్టురాలిగా చేసుకొనెను. అనుకూలవతియగు భార్యను చేసుకొనెను. అనుకూలవతియగు భార్యను పొందిన వానివలె ఆ సముద్రుడు ఎగసిపడు తరంగములచే తన ఆనందమును వెల్లడించి జీవనమును (నీటిని) పెంచుకొనెను. ఈ విధముగా నదిని సముద్రుడితో కలపి వారికి స్తుతించి తన పనిని పూర్తి చేసిన అగస్త్యుడు వారి వద్ద అనుమతి తీసుకుని తనకు తోచిన చోటికి వెళ్లిపోయెను.

అర్జుమడు అనెను:- ఓ మహానుభావా! ఈ నది పుట్టుకను గూర్చి తెల్పితిరి. ఇపుడు దీని ప్రభావమును గూర్చి వినగోరుచున్నాను.

భరద్వాజుడు చెప్పెను- అన్ని శుభములకు మూలమైనది అగు ఈ నదీ మాహాత్మ్యమును చెప్పేదను వినుము. పశ్చిమ దిక్కున పుట్టి జ్ఞానులకు కూడ కర్మక్షయమును కలిగించు సువర్ణముఖరీ స్నానము బ్రహ్మత్వమును కలిగించును. ఈ నదికి వేల యోజనముల దూరములో ఉన్నప్పటికి ఎవరైతే ఈ నదిని తలచుకొందురో వారీ పాపములన్నియు నశించును. ఇగి నిశ్చయము . ఈ నది యందు అస్థికలు కలపినచో వారు బ్రహ్మలోకమును అధిరోహించుట యందు అది నిచ్చెనవలె పనిచేయును . సువర్ణముఖరిని తలచుకొని ఏ నీటి యందు స్నానము చేసినను వారు ఉత్తమమైన ఫలమును పొందుదురు.

ఎప్పుడైతే జనులు సువర్ణముఖరిలో స్నానము చేయదురో అప్పుడు వారి పాతకములన్నియు నశించును. అంతరిక్షమునందుండు దివ్యతీర్థేములు తమను తాము పునీతము చేసుకొనుటకు సువర్ణ ముఖరీ నదిని ప్రతిదినము ప్రాతఃకాలము నందు తలచుకొనును. అగస్త్యపర్వతము పై పుట్టి దక్షిణ సముద్రమును చేరిన ఈ నది తనను తలచినవారి పాపములను నాశనము చేయును. ఈ నది యందు పానము చేయవలెనను కోరికలో ఇంద్రాది దేవతలు మానవులుగా పుట్టుటకు ఇష్టపడుదురు. ఈ నదీజలమువల్ల పండిన పంటలను భుజించిన మానవులు దుర్చోనముల వలన గలిగిన మహాపాపములను సైతము పోగొట్టుకొందురు. ఒక్కసారి ఈ నది నీటిని పుక్కిట బట్టి వదలివేసినను ఆ పుణ్యము పర్వతములతో నమానమగు పాపములను నాశనము చేయును. మానవజన్మ ఎత్తినప్పటికి ఎవరైతే ఈ నదియందు స్నానము చేయరో వారి జన్మ నిరర్ధకము. సువర్ణముఖియందు విధిపూర్వకముగా ఒక్కసారి స్నానము చేసినను అది పర్వదినములలో గంగానది యందు కోటి స్నానములు చేసిన ఫలితము కలుగును, దేవతల యందు విష్ణువువలె, నక్షత్రములయందు చంద్రునివలె, మానవులలో రాజువలె, వృక్షములలో కల్పవృక్షమువలె. పంచమహాభూతములలో ఆకాశమువలె, శక్తులలో మాయవలె, మంత్రములలో

  తత్యములయందు ఆత్మవలె, యుజుషులయందు రుద్రాధ్యాయమువలె, సర్పములలో ఆదిశేషునివలె. క్షేత్రములయందు పుష్కర క్షేత్రమువలె, ఇంద్రియములలో మనస్సువలె నదులన్నిటిలో సువర్ణముఖి అటువంటిది. కనుక ఈ నదిని ఎల్లప్పుడు స్మరించవలెను, నమస్కరింపవలెను, కీర్తింపవలెను, మనస్సులో అర్చింపవలెను. పవిత్రతను, క్షేమమును శుభమును కోరువారు. ఈ నదిని తప్పక సేవింపవలెను. అగస్త్యపర్వతములపై పుట్టి, దక్షిణ సముద్రమును చేరిన ఈ నది అన్ని పాపములను హరించునది కనుక దీనికి ఆశ్రయింపవలెను. మహాపాతకములను నాశనము చేయునట్టి నీ నీటిచేత నన్ను నేను శుద్ధి పరచుకొనుచున్నాను. నాకు సర్వ శ్రేయస్సులు కలుగజేయుము. అను ఈ రెండు సూక్తములను చక్కగా పలికి నియమపూర్వకముగా సువర్ణముఖి యందు స్నానము చేసిన మానవుడు శుద్దిని పొందుచున్నాడు. బ్రహ్మచే సృష్టింపబడినది, అగస్త్యునిచే కొనిరాబడినది. సాక్షాత్తు గంగానదికి ప్రతిరూపమైనది అగు ఈ నది శ్రేష్టమైనది. కనుక శుభమును కోరువారు దివ్యమగు ఈ నదిని కీర్తింపవలెను. శుభములను ఆశించువారు భక్తిపూర్వకముగా ఈ నది యందు స్నానము చేయవలయును.

   సూర్యచంద్రులగ్రహణసమయమందు స్నానము చేసి దానము చేయువారికి అనంతమగు ఫలము కలుగును. పుణ్యప్రదమగు సంక్రమణ కాలమందు వ్యతీపాతములయందు సువర్ణ ముఖరియందు స్నానము చేసిన వంశమంతయు పావనమగును. జన్మ నక్షత్రమందు, జన్మదినమందు విధిపూర్వకముగా ఈ నది యందు స్నానము చేసినవారు క్షేమమును, ఆరోగ్య, సుఖమును, సంపదలను పొందుదురు. దుఃస్వప్నముల చేత కలిగిన విఘ్నములు, భూతముల వలన గ్రహముల దుఃస్థానము వలన కలిగిన పాపము ఈ నదీ స్నానము వలన పోగొట్టుకొనవచ్చును. ఈ నదీతీరమందు గోవు పాదమును పోలినంత భూమిని దానమిచ్చినవారు భూమినంతటినీ దానమిచ్చిన ఫలమును పొందుదురు. వస్త్రములతో అలంకరించిన ఆవును ఈ నదీ తీరమునందు వీధిపూర్వకముగ బ్రాహ్మణునికి దానమిచ్చినవారు శాశ్వతమగు బ్రహ్మ పదమును పొందుదురు .

  సువర్ణముఖి తీరమునందు ఇచట, పరలోకమునందు ఫలమును పొందుటకై పుణ్యకాలములయందు వివిధములైన దానములను నియమపూర్వకముగ ఇవ్వవలెను. సువర్ణముఖీ తీరమునందు జపము చేసినను హోమము, తపస్సు, దానము, పితృకర్మ, దేవతార్చనము ఏది చేసినను అదీ వందరెట్లగును. సుఖమును పొందగోరువారు ఇచట చేయదగిన మరియొక వ్రతమును చెప్పెదను. వర్షఋతువుయందు సూర్యకిరణములచే కనిపించని అగస్త్య నక్షత్రము ఏనాడు తిరిగి ఉదయించునో ఆనాడు నియమపూర్వకముగా సువర్ణముఖియందు స్నానము చేసినవారికి కల్పాంతము వరకు స్వర్ణవాసము లభించును. ఆ సమయము నందు అగస్త్యుని రూపమును బంగారముతో చేయించి విధి పూర్వకముగా దానమిచ్చువారు బ్రహ్మలోకమందు శాశ్వతమగు స్థానమును పొందుదురు.

ఆర్జునుడు అడిగెను:- ఈ అగస్త్య వ్రతమును నియమముతో ఎట్లు చేయవలయునో తెలిసికొనవలెనని కోరికగలనాకు సమగ్రముగా చెప్పవలసినది.

భరద్వాజుడు చెప్పెను:- అగస్త్య నక్షత్రముదయించు వేళ మనస్సును నిగ్రహించుకొని శక్తికొలది బంగారముతో మహాముని రూపును తయారు చేయవలయును. బంగారుచ్ఛాయలో మెరయుచు, జడలు కలిగి, చేతులయందు అక్షమాలను, కమండలమును కలిగినవాడు. మృదువగు నారచీరలను ధరించి, మృగచర్మమును ఉత్తరీయముగా ధరించి, సౌమ్యమగు రూపమును కలిగి, భస్మమును శరీరమంతా అలదుకొని, రుద్రాక్షమాలను ధరించినవాడు. అగు అగస్త్యుని రూపమును తయారు చేసి, నియమపూర్వకముగా స్నానము చేసి ఆచార్యుని గంధము, పుష్పములు మొదలైన వాటిచే అలంకరించి యధావిధిగా అర్చింపవలెను. ధాన్యము పై పప్పుధాన్యములను పోసి వాటిపై ఉంచిన విగ్రహమును వస్త్రయుగ్మముచే అర్చింపవలెను. వింధ్యను నిలిపినవాడు, సముద్రమును పుడికిట పట్టినవాడు, బ్రహ్మ మొదలగు నమస్కరింపబడువాడు అగు అగస్త్యుడు నేనిచ్చు ఈ దానము చేత ప్రీతి పొందునుగాక. అను ఈ మంత్రమును ఉచ్చరించి, దక్షిణతో కలసి జలధారను విడువలేను. అట్టి మానవుడు పాపముల నుండి ముక్తిని పొంది నిత్యమగు బ్రహ్మను పొందును.

ముందు జన్మలలో చేసిన, ఈ జన్మములో చేసిన మహాపాపముల నుండి, పాప సమూహముల నుండి తప్పక ముక్తి పొందును. ఇచట సందేహము లేదు-68. బ్రహ్మాది సమస్త దేవతలు, సనకాది మహర్షులు చరాచరములగు సమస్త జీవులు సంతోషమును పొందుదురు. ఈ విధముగా అగస్త్యుని వ్రతమును పూర్తి చేసి, దక్షిణతో కూడిన భోజనమును బ్రాహ్మణులకు పెట్టవలెను. ఈ వ్రతమును చేయుటయందు అశక్తులగువారు, బ్రాహ్మణులకు యథాశక్తి బంగారమును, ధాన్యమును దానమిచ్చి సంతోషింపజేయవలయును. కనుక ఆ తిథిని వ్యర్థము చేయక ప్రయత్నపూర్వకముగా చేయవలయును. మహామునియగు అగస్త్యుని యొక్క తపఃఫలము పరిపక్వమై భూమికి అవతరించిన సువర్ణముఖరీనది దేవతలచే, అసురులచే, కూడా కీర్తింపబడుచున్నది. ఈ విధముగ ఆ మహానది యొక్క పుట్టుకను గూర్చి, ప్రభావమును గూర్చి నీకు వివరముగ తెల్పితిని. ఇకపై ఏది వినవలెనను కోరిక కలదో చెప్పుము. దానిని చెప్పెదను.

ఎనభై ఒక్క వేల శ్లోకములు కలిగిన శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందు సువర్ణముఖరీ ప్రభావమును ప్రశంసించుట అను ముప్పై మూడవ అధ్యాయము.