స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
20వ అధ్యాయము
సూతుడు చెప్పెను:- పాపవినాశనము యొక్క వైభవమును మరల చెప్పెదను. భగవంతునియందు భక్తితో సావధానచిత్తులై వినుడు , అన్ని పాపముల నుండి విముక్తిని కలిగించు కథను చెప్పెదను. దీనియందు ఎటువంటిసందేహము లేదు.
భద్రమతి అను దరిద్ర బ్రాహ్మణుని వృత్తాంతము:- పూర్వము వేదవేదాంగములను అభ్యసించినవాడు, దరిద్రుడు, పని లేనివాడు అగు భద్రమతి అను బ్రాహ్మణుడుండెను. అతడు అన్ని శాస్త్రములను, పురాణములను, ధర్మశాస్త్రములను వినియుండెను. అతడికి కృత, సింధు, యశోవతి, కామిని, మాలిని, శోభ అను ఆరుగురు భార్యలు కలరు, వారియందు అతడికి రెండు వందల మంది పుత్రులు కల్గిరి. వారందరు ఆకలిచే బాధపడుచుండిరి. దరిద్రుడగు ఆ భద్రమతి ఆకలిగొన్న తన సంతానమును చూచి మిక్కిలి దుఃఖించెను.
భాగ్యములేనివాని జన్మ వ్యర్థము, ధనము లేని వాని జన్మ వ్యర్థము, కీర్తిలేని వాని జన్మ వ్యర్థము, ఆతిథ్యమివ్వలేని వాని జన్మ వ్యర్థము. ఆచారములేని వాని జన్మ వ్యర్థము, జ్ఞానము లేనివాని జన్మ వ్యర్థము, యత్నములేనివాని జన్మవ్యర్థము, సుఖము లేని వాని జన్మ వ్యర్థము. బంధువులు లేని వాని జన్మవ్యర్థము. ఖ్యాతిలేనివాని జన్మవ్యర్థము, పెక్కుమంది సంతానము కలవానికి ఐశ్వర్యము లేనిచో వాని జన్మవ్యర్థము. అన్ని గుణములు, సౌమ్యత, పాండిత్యము, మంచి కులమునందు జన్మించుట ఇవి అన్నియు దారిద్ర్యము అను సముద్రమున మునిగనిచో ప్రకాశించుట లేదు. ఐశ్వర్యము లేని వానికి బ్రాహ్మణులు, పుత్రులు, మనుమలు, బంధువులు, సోదరులు, శిష్యులు అందరూ విడచి పెట్టుదురు.
అని నిశ్చయించుకుని బుద్దిమంతుడు, ధీరుడు అగు ఆభద్రమతి చండాలుడు కాని బ్రాహ్మణుడు కాని ధనవంతుడు అయినప్పుడే పూజింపబడుచున్నాడు. దరిద్రుడైన మానవుడు శవము వలే నిందింప బడుచున్నాడు. సంపదలు కలిగిన వాడు కఠినముగా ప్రవర్తించినను ఎవ్వరును అతడు నిష్టురుడని అనరు. గుణములు లేనివాడైనప్పటికి అతడు గుణవంతునిగనే పరిగణింపబడుచున్నాడు. అతడు నిష్టురుడైనప్పటికి, గుణములు లేనివాడైనప్పటికి, ధర్మము లేనివాడై నప్పటికి సంపదలు ఉన్నచో అతడు పూజింపబడుచున్నాడు. దారిద్ర్యము గొప్ప దుఃఖమును కలిగించును. అచట ఆశ కూడా ఉన్నచో అది మరింత దుఃఖకారణమగుచున్నది. ఆశచేత ఆవేశింపబడిన మానవులు క్షణములో దుఃఖము పాలగుచున్నారు. ఆశకు ఎవరు దాసులో వారు లోకమున కంతటికీ దాసులు. ఆశ ఎవరికి దాసియో వారికీ లోకము దాస్యము చేయుచున్నది.
అథ భద్రమతేః కామినీ కృత వేంకటాద్రి గమన ప్రోత్సాహనమ్:
అన్ని శాస్త్రములు తెలిసినవాడైనప్పటికి దరిద్రుడు మూర్ఖునిగా భావింపబడుచున్నాడు. దారిద్ర్యము అను మొసలి పట్టుకున్న వారిని రక్షించువారు లేరు. దారిద్ర్యము మిక్కిలి దుఃఖకరము. పుత్రులు, భార్యలు ఎక్కువ మంది ఉన్నచో ఆ దుఃఖము మరింత ఎక్కువ అగును. అని తలచి అన్ని శాస్త్రములు చదివిన ఆ భద్రమతి తనకు ధనము లేనందుకు మిక్కిలి చింతించి, ఏమిచేయుటకు తోచక మిన్నకుండెను.
వేంకటాద్రికి వెళ్లుమని కామిని భర్తను ప్రోత్సహించుట:- అపుడు అతడి భార్యలలో భర్తనే దైవముగా భావించు కామిని మంచి గుణములు కలిగినదై భర్తతో ఇట్లనెను.
కామిన్యువాచ:
కామిని చెప్పెను: - సర్వధర్మములు తెలిసినవాడ, సర్వ శాస్త్రముల అర్థమును తెలిసినవాడ! ఓ మహానుభావ! నేను చెప్పునది వినుము. సువర్ణముఖి నదీ తీరమునందు ఋషి సంఘముల చేత కొలువబడునది. దేవతలచే సేవింపబడునది, పావనమగు వేంకటాద్రి యున్నది. సురాసురులు నమస్కరించు ఆ వేంకటాద్రిపై శుభకరమైనది, పాపములను దహింపచేయునది, పవిత్రమగు పాపవినాశ తీర్థమున్నది. అచటకు వెళ్లి పాపనాశనమందు భార్యా పుత్రులతో ప్రయత్నపూర్వకముగా స్నానము చేయవలయును. ఆ తీర్థము యొక్క మహాత్మ్యమును పూర్వము నా చిన్నతనమందు తండ్రి ఒడిలో కూర్చొని నారదుని వద్ద వింటిని. అన్ని పాపములను నాశనము చేయునది. మహాపుణ్యప్రదమగు వేంకటాద్రియందు. అన్ని దుఃఖములను తొలగించునది, సమస్త సంపదలను కలుగజేయునది అగు పాపవినాశ తీర్థమునందు సంకల్పము చెప్పుకొని స్నానము చేసినచో సకల ఐశ్వర్యములు సిద్ధించును.
భూమిని దానమిచ్చుట దానములన్నిటిలోకి ఉత్తమమైనది. పరలోకమునకు చేర్చునది, అన్ని కోరికలను తీర్చునది. దానములన్నిటిలోకి ఉత్తమము భూదానమని కొనియాడబడినది. భూమిని దానమిచ్చి తను కోరినది పొందవచ్చును. అని నారదుడు చెప్పగా విని నా తండ్రి మిక్కిలి సంతోషించి వేంకటాద్రికి చేరెను. అచటకు వెళ్లి అన్నీ సంపదలను కలుగజేయు భూదానమును వేదము చదివిన ఒక బ్రాహ్మణునికిచ్చెను. తరువాత నా తండ్రి సమస్త సంపదలను పొంది ఇహలోకములో అన్ని సుఖములను అనుభవించి మరణానంతరము వైకుంఠమునకు చేరెను. కనుక నీవు కూడ వేంకటాద్రికి వెళ్లి అన్ని కోరికలను తీర్చు భూదానమును ప్రయత్నించి అయినను చేయుము.
కామిని చెప్పినటువంటి భూదానము యొక్క గొప్పదవము:- భూదానము చేయుట వలన కలుగు ఫలితము చెప్పెదను. సావధానముగ వినుడు. దాని మహత్తును పూర్తిగ చెప్పుటకు ఎవరికిని శక్తి చాలదు. భూదానము కంటే గొప్పదానము లేదు. ఉండబోదు. భూమిని దానమిచ్చు వాడు గొప్ప ఆనందమును పొందును. దీనియందు సందేహము లేదు. కొద్దిగా అయినను భూమిని వేదము చదువుకున్న, ఆహితాగ్నిని పోషించుచున్న వానికి దానమిచ్చినచో తిరిగి వచ్చుట లేని బ్రహ్మ లోకమును పొందెను. భూమిని దానమిచ్చినవాడు అన్ని దానములు ఇచ్చినట్లే. అతడు మోక్షము పొందుటకు అర్హుడగును. వేంకటాద్రిపై భూదానమిచ్చిన అన్ని పాపములను నశింపజేయును మహాపాతకములు చేసిన వాడును, అన్ని పాతకములు ఒనర్చినవాడును అయినప్పటికి పది అడుగుల భూమిని దానమిచ్చి అన్ని పాపముల నుండి ముక్తుడగుచున్నాడు. సత్పాత్రునికి భూమిని దానమిచ్చిన వాడు అన్ని దానముల ఫలమును పొందును. భూదానము చేసినవానికి సరిపోలువాడు ముల్లోకముల యందును లేడు. వృత్తి హీనుడగు బ్రాహ్మణునికి భూమిని దానమిచ్చు వానికి కలుగు పుణ్యఫలమును వర్ణించుట ఆదిశేషునికి కూడా శక్యము కాదు. వృత్తిహీనుడు, సదాచార సంపన్నుడు అగు బ్రాహ్మణునికి కొద్ది భూమినయినను ఇచ్చువాడు. విష్ణువుతో సమానుడు. చెరకు, గోధుమ, వరి, పోక మున్నగువాటితో నిండిన భూమిని దానమిచ్చువాడు. విష్ణువుతో సమానుడు. దరిద్రుడు, కుటుంబము కలవాడు, వృత్తి లేని వాడు అగు బ్రాహ్మణునికి కొంచెమైనను భూమిని దానమిచ్చువాడు విష్ణువుతో సాయుజ్యమొందును .
దేవుని పూజయందు ఆసక్తి కలిగిన బ్రాహ్మణునికి అటవిక అంత భూమిని దానమిచ్చిన వానికి గంగానది యందు మూడు రాత్రులు స్నానము చేసిన ఫలము కలుగును. వృత్తి లేనివాడు, సదాచారములను పాటించువాడు అగు బ్రాహ్మణునికి దొన్నెడు భూమిని దానమిచ్చువానికి కలు ఫలమును వినుడు. గంగానదీ తీరమునందు వంద అశ్వమేధములు విధిపూర్వకముగ చేసిన ఎటువంటి గొప్ప ఫలము కల్గునో ఆ ఫలము కలుగును. దరిద్రుడగు బ్రాహ్మణునికి భారీక అంత భూమిని దానమిచ్చువానికి కలుగు ఫలమును వినుడు. గంగాతీరమున వేయి అశ్వమేధములు, వంద వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. 51. కనుకనే భూమి దానము మహాదానమని, అతి దానమని కొనియాడబడినది. అది సర్వపాపములను తొలగించును, మోక్ష ఫలమును కలిగించును. దీనిని శ్రద్ధతో విన్నవానికి భూదానము చేసిన ఫలము కల్గును. అని భార్య చెప్పగా, ఆమె చెప్పినది ఇతి హాసముతో కూడియున్నది అగుటచే సంతోషించి వేంకటేశుని మనస్సుయందు ధ్యానము చేసెను.
భద్రమతికి భూదానమిచ్చుటచే సుఘోషుడు సద్గతిని పొందుట:- అపుడు సౌమ్యుడు, అన్ని ధర్మములను పాటించువాడు అగు భద్రమతి వేంకటాద్రికి బయలుదేరెను. భార్యాసమేతుడై సుశాలి అను నగరమునకు వెళ్లి సమస్త సంపదలు కల సుఘోషుడను బ్రాహ్మణుని వద్దకు వెళ్లాను. అయిదు అడుగుల భూమిని యాచించెను. ధర్మమునందు నిష్ఠ కలిగిన ఆ సుఘోషుడు కుటుంబముతో వచ్చిన బ్రాహ్మణుని చూచి మనస్సున మిక్కిలి సంతోషించి, అతడికి పూజ చేసి ఓ భద్రమతీ, నేటికీ నా జన్మ ధన్యమైనది. నీవు నానుండి దానము గ్రహించుట చేత నా కుటుంబమంతయు పాపరహితమైనది. అని పలికి ధర్మతత్పరుడైన సుఘోషుడు అతడి అయిదు అడుగుల భూమిని సంతోషముగా దానమిచ్చెను.
“ఈ భూమి విష్ణువునకు సంబంధించినది, పుణ్యమైనది, విష్ణువుచే పరిపాలింపబడినది. కనుక భూదానముచే విష్ణువు నాయందు సంప్రీతుడగుగాక". అను మంత్రము చేత ఆ సుఘోషుడు భద్రమతిని విష్ణువుగా తలచి అతడడిగిన భూమిని దానమిచ్చెను. ఈ విధముగా సుఘోషుడు విష్ణుభక్తుడు, వేదము చదివినవాడు, కుటుంబము కలవాడు అగు భద్రమతికి అతడడిగిన భూమిని దానమిచ్చెను. అట్లు దానమిచ్చుట వలన తన వంశము వారందరితో కలసి ఏ దుఃఖము అంటని వైకుంఠమును చేరేను.
అథ భద్రమతేః పాపనాశనతీరే భూదానార్థం వేంకటాద్రి గమవమ్
అపుడా భద్రమతీ భార్యాపుత్రులతో కలసి సురాసురులు నమస్కరించు వేంకటాద్రికి వెళ్లాను. గంధర్వులు, యక్షులు, పర్వతములు కొలచునది, మేరువుకు పుత్రుడు, వైకుంఠము నుండి వచ్చినది, దివ్యమైనది వేంకటేశునికి విహారస్థలమైనది అగు వేంకటాద్రిని చేరెను. అచట నిర్మలము, పావనము, శుభకరము అయిన స్వామి పుష్కరిణి యందు సంకల్పము చెప్పుకుని భార్యాపుత్రులతో స్నానము చేసెను. ఆ పుష్కరిణికి పశ్చిమ తీరము నందున్నవాడు, భూమిని ధరించువాడు అగు శ్వేత వరాహస్వామికి నమస్కరించి, శ్రీనివాసుని ఆలయమునకు వెళ్లాను. అచట విష్ణుభక్తుడు, బుద్ధిమంతుడు అగు భద్రమతి భార్యాపుత్రులతో కలసి బ్రహ్మాదిదేవతలు సదా అర్చించు స్వామిని చూచెను. భక్తితో దేవదేవుడు, దయానిధి అగు శ్రీనివాసునికి నమస్కరించి భార్యాపుత్రులతో కలసి పాపనాశనమునకు వెళ్లాను. అచట విధివిధానముగ స్నానము చేసి ధర్మాదులను చేసి వేదము చదువు కున్నవాడు, విష్ణుభక్తుడు అగు బ్రాహ్మణునికి విష్ణువుగా తలచి మోక్షమును, శుభమును కలిగించు భూదానమిచ్చెను.
అథ భూదానప్రభావేణ భద్రమతేర్బగవత్సాక్షాత్కారః
భూదానమిచ్చుట వలన భద్రమతికి భగవంతుడు ప్రత్యక్షమగుట:- అపుడు ఆ భద్రమతి ఎదుట శంఖము, చక్రము, గద ధరించిన వాడు, గరుడుని పై ఎక్కినవాడు, వనమాలను ధరించినవాడు అగు స్వామి పాపనాశనము వద్ద భూదానమిచ్చుటచే ప్రత్యక్షమయ్యెను. అపుడు భద్రనుతి స్వామినిట్లు స్తుతించుట మొదలు పెట్టెను. సమస్తమునకు కారణమైన వాడా నీకు నమస్కారము, అందరను పాలించువాడో, దేవతలందరకు నాయకుడా, రాక్షసులను నాశనము ఒసిన వాడా నీకును నమస్కారము. భక్తజనులకు ఇష్టుడైనవాడా, పాపములను పోగొట్టువాడా, దుర్జనులను నాశనము చేయువాడా, జగత్తుకు ప్రభువైన వాడా నీకు నమస్కారము. కారణము చేత వామన రూపము ధరించినవాడా! నారాయణా, త్రివిక్రమ రూపము ధరించినవాడా, లక్ష్మిని, శార్గమును, చక్రమును, ఖడ్గమును, గదను ధరించినవాడా, పురుషులలో ఉత్తముడా నీకు నమస్కారము.
పాల సముద్రమునందు నివసించు వాడా, లక్ష్మీపతీ, నాశనము లేనివాడా, సూర్యుడు మొదలైన వారికంటే మిక్కిలి కాంతి కల్గినవాడా, పుణ్యము చేసినవారికి గతి అయినవాడా నీకు నమస్కారము. సూర్యుడు, చంద్రుడు కన్నులుగా కలిగినవాడా, సజ్జనులకు ఇష్టుడైనవాడా, యజ్ఞఫలమును ఇచ్చువాడా, యజ్ఞాంగములచే ప్రకాసించువాడా నీకు నమస్కారము . కారణమునకే కారణమైనవాడా, శబ్దము మొదలైన వాటిచే వర్ణించుటకు శక్యముకాని వాడా, కోరిన సుఖములనిచ్చువాడా, భక్తుల మనస్సులకు ఆహ్లాదము కలిగించు వాడా నీకు నమస్కారము. జగత్తుకు అద్భుతమైన కారణమగువాడా, మందర పర్వతమును మోసినవాడా, యజ్ఞవరాహమను పేరుగలవాడా, హిరణ్యాక్షుని చీల్చి చంపినవాడు. వామనరూపమునందు కనిపించినవాడా, క్షత్రియ కులమును నాశనము చేసినవాడా, రావణుని సంహరించినవాడా, బలరాముడు అగ్రజునిగా కల్గినవాడా నీకు నమస్కారము-82. లక్ష్మీపతీ, సుఖమును ఇచ్చువాడా, ఆశ్రయించినవారి దుఃఖమును తొలగించువాడా నీకు మరల మరల నమస్కారము.
ఆ విధముగా బ్రాహ్మణునిచే స్తుతింపబడిన భక్తవత్సలుడు దయానిధి, దేవదేవుడు అగు స్వామి వాత్సల్యముతో ఇట్లనెను. నీ ఈ స్తోత్రము చేత మిక్కిలి సంతోషించితిని. నీవు అన్ని సంపదలు కలిగినవాడై పుత్రులతో, పౌత్రులతో కలసి ఈ లోకమునందు అన్ని సుఖములు అనుభవించి, ఈ దేహము విడచిన తరువాత ముక్తిని పొందగలవు. అని పలికి భగవాన్విష్ణువు అచటనే అంతర్థానము చెందెను. ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగ మీకు పాపనాశనము యొక్క వైభవము, దాని తీరమునందు భూదానమిచ్చుట వలన కలుగు ఫలము యొక్క ప్రభావమును మీకు చెప్పితిని.
ఎనభై ఒక్క వేల శ్లోకములుగల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున పాపవినాశన తీర్థమునందు భూదానమిచ్చుట వలన కలుగుఫలమును వర్ణించుట అను ఇరవైయ్యవ అధ్యాయము.
