స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము
35వ అధ్యాయము
భరద్వాజుడు చెప్పెమ: సువర్ణముఖరీ నదిని అచట కల్యా అను మహానది గంగానది యమునా నదిని వలె సంగమించెను. ఆ కల్యా నదీ వృషభాద్రియందు పుట్టినది. అనేక తీర్థేములచే విరాజిల్లునది, నదులలో ఉత్తమమైనది. పాపసమూహములను నాశనము చేయునది . పలురకములైన చెట్లవరుసల చేత కూడిన ఇరు ఒడ్డులు కలది మునిగణములు సుఖముగా నివసించునది, పుణ్యాశ్రమములచే నిండి ఉన్నది. బ్రాహ్మణులు ఆర్ఘ్యమిచ్చిన అక్షతలచే ప్రకాశించుచున్నది. అప్పరో స్త్రీల స్తనములకు రాసుకొనిన కస్తూరి కలసిన నీరు కలది. ఏనుగుల చెక్కిళ్ల నుండి జాలువారిన మదధారల చేత సువాసన కలిగినది. బ్రాహ్మణులు, రాజులు చేసిన వందలాది యాగములకు పానమైనది. స్వచ్ఛమైన నీటి చేత సంగమముయొక్క మాహాత్మ్యమును ఎవరు స్తుతింపగలరు? అటువంటి ఆ సంగమమునందు నీటి మధ్యలో బ్రహ్మశిల అనునది కలదు. అగస్త్యుడచట తపస్సు చేసెను. అచట స్నానము చేసినవారు. గయయందు స్నానము చేసిన ఫలము పొందుదురు. పౌండరీక యాగములను నూరిటినీ చేసిన ఫలమును పొందుదురు బ్రహ్మహత్య మున్నగు పాపములు కూడా క్షయమును పొందును. అచట స్నానము చేసినవారికి భవనాశినితో కృష్ణవేణి సంగమమునందు స్నానము చేసిన వారికి కలిగిన ఫలము కలుగును.
సువర్ణముఖరి తీరమునందున్న వేంకటాచల వర్ణవము:- ఈ విధముగా సువర్ణముఖరి కల్యానది కలసి యున్నది. ఆ మహానదికి ఉత్తర భాగమున అర్థయోజనపు దూరమున యోజనపు ఎత్తుగల వేంకటాచలమని పేరు కెక్కిన పర్వతము కలదు. అన్ని తీర్థేములకు ఆ పర్వతోత్తమము స్థానము. అంజనాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నీలాద్రి, సింహాద్రి, వరాహాద్రి, తమ పుణ్యతీర్థేములు అచట కలవు. ఈ పర్వతమునకు నారాయణవనము వేంకటవనము అనునవి ఉపవనములు. పూర్వము విష్ణువు వరాహరూపమును ధరించెను. ఇచట చరించుట వలన వరాహ క్షేత్రమని దీనికి పేరు వచ్చినది. సువర్ణముఖరి తీరమునందు వేంకటాచలము పై అచ్యుతుడగు విష్ణువు సముద్ర రాజతనయ ఆగు లక్ష్మీతో కలసి నివసించుచుండును.
ఆ వేంకటాధీశుని సిద్దులు, గంధర్వులు, మునులు, మానవులు, దానవులు సేవించుచుందురు. ఆ పురుషోత్తముని యందు మనసు నిలపినచో . భక్తుల కోరికలు వెంటనే తీరిపోవును. ఆపదలు నశించును. ఓ అర్జునా, ఎవరైతే వేంకటేశుని స్మరింతురో . వారు అన్ని పాపములు నశింపగా శాశ్వతమగునది, నాశనము లేనిది అగు పరమ పదమును పొందుదురు.
ఆర్జునుడు ఆడిగెను:- సురాసురులు నమస్కరించు వేంకటాద్రిపై లక్ష్మీనాథుడగు శ్రీనివాసుడు ఏల ఆవిర్భవించెను. ఏ పుణ్యాతునికి స్వామీ అచట ప్రత్యక్షమై ధన్యునిగ చేసెను?. ఓ మహామునీ! దేవాది దేవుడగు విషువు యొక్క
భరద్వాజుడు చెప్పెను:- శ్రద్ద కలిగినవాడవై వేంకటేశుని మహిమను వినుము. దానిని వివరించి చెప్పుట బ్రహ్మకుకూడా సాధ్యము కాదు. మధుసూదనుడగు స్వామి మాహాత్మ్యమును వినవలెనను బుద్ధి కలిగిన వాడవగుటచే నీవు కృతార్థుడవైతివి. అట్లే సమస్త జీవులకు ఆశ్రయమును కలిగించు స్వామి యొక్క పవిత్రమగు కథలను నీకు చెప్పుటచే నేను కూడా పుణ్యము చేసినవాడ నైతిని. పూర్వము గంగానదీతీరమునందు పరిశుద్దమగు జ్ఞానము కలిగినవాడు, క్రతుదీక్షయందున్నవాడు అగు జనకునికి. వామదేవుడు అన్ని పాపములను పోగొట్టునది, విష్ణువు యొక్క పవిత్ర చరిత్రను వర్ణించునది అగు కథను చెప్పెను. నేను ఆ కథను నీకు చెప్పెదను.
అన్ని జీవులలో ఆద్యుడు నారాయణుడు అతడే ప్రభువు. ప్రపంచమంతా నిండినవాడు, ప్రపంచమును సృష్టించినవాడు, చిత్స్వరూపము కలవాడు. దుఃఖమంటనివాడు. వేయి శిరస్సులు కలవాడు, భగవంతుడు, వేయి కన్నులు కలవాడు, వేయి పాదములు కలవాడు. చరాచరములగు జగత్తంతయు స్వామి తేజస్సు చేతనే ప్రకాశించుచున్నది. అతడికంటే పరమైన తేజస్సుకాని, అతడి కంటిపరమైన జ్ఞానము కాని, అతడికంటే పరమైన యోగముకాని లేవు. అతడికంటి పరమైన విద్య లేదు. అన్ని జీవులయందు స్వామి సన్నిహితుడై యుండును. అన్ని భూతములు స్వామియందే సుఖముగా ఉన్నవి. అతడే యజ్ఞము, యజ, అతడే సుక్, అతడే సువము. అతడే ఫలము, అతడే ఫలమునిచ్చువాడు, అతడే పొందదగిన గతి. అల్పులగు మానవులు తమ దోషములను అగ్నియందు వహింపజేసినట్లయితే స్వామిని చేరుకుని, పిదప స్వామి నిర్ణయానుసారము ఉన్నతమగు గతిని పొందుదురు.
కర్మబంధమునే పశువుగా చేసి జ్ఞానము అను అగ్నియందు హోమము చేసినవారు స్వామి సాయుజ్యమును పొందుదురు . హరి అని, శివుడని, బ్రహ్మ అని, ఇంద్రుడని, పరమేశ్వరుడని పిలచునవన్నియు ఆ స్వామికి పర్యాయములు మాత్రమే . స్వామినిగూర్చి ఈ విషయమును తెలిసికొని అనుసంధానము చేసికొని స్వామి మాహాత్మ్యమును గ్రహించినవారికి పునర్జన్మ అనునది కలుగదు నిత్యుడు, ఆనందమయుడు సర్వకర్మలకు సాక్షి, నిర్గుణుడు, ఉపాధి లేనివాడు, ఎల్లప్పుడు ఉండువాడు అయినప్పటికి తన కోరికను అనుసరించి ఆయా అవస్థను, రూపమును పొందును. పవిత్రులలో పవిత్రుడు, గతిలేనివానికి గతి అయినవాడు, దేవతలకు కూడా దైవము, శ్రేయస్సులలో ఉత్తమమగు శ్రేయస్సు స్వామియే. బోధింపగలిగినవాడిలో ఉత్తముడు, ధ్యానము చేయదగినవారిలో ఉత్తముడు, వినయము కలిగినవారిలో ఉత్తముడు, న్యాయమును పాటించువారిలో వినయము కలవాడు ఆ స్వామియే.
వెలుగులన్నిటిని సృష్టించు గొప్ప వెలుగు, తపస్సులలో ఉత్తమమగు తపస్సు, అన్ని జీవులకు ఆధారము, ఆది, అంతము జనార్దనుడే. అతడిని గూర్చి సంపూర్ణముగ తెలిసికొనుటయందు బ్రహ్మ మున్నగు వారుకూడ తెలియని వారగుచున్నారు. బ్రహ్మకూడ స్వామీనుండి జన్మము పొందెను. శత్రువులందరిని సర్వాత్ముడగు స్వామి అణచివేయును తాను సర్వ స్వతంత్రుడైనప్పటికి భక్తులకు అధీనుడగ ఉండును. అన్ని కర్మలకు గరుడధ్వజుడగు ఆ స్వామియే సాక్షి . స్వామి స్వరూపమును అర్థము చేసికొనుటకు మునులు ఎల్లప్పుడు ప్రయత్నింతురు. సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు అను నాలుగు రూపములను కలిగి ఉండును. ప్రణవ స్వరూపము ఆ స్వామియే. హృదయము భాస్వరము. భగవంతుడు వాసుదేవుడు మంత్రము అతడిని తెలియజేయునది. మంత్రములలో ఉత్తమగు ఈ మంత్రమును నిశ్చలచిత్తముతో ఎవరు జపింతురో అతడు స్వామి దయవలన సకల సిద్ధులను పొందగలడు.
భగవంతుడు చేసిన జీవసృష్టి- ఆపదలను నివారించువాడు, సంపదలను ప్రసాదించువాడు, భుక్తిని, ముక్తిని ఇచ్చువాడు అగు స్వామి కల్పము ఆరంభమైన సమయమున ఈ సృష్టిని సృజియించెను. అది ఎట్లో చెప్పెదను శ్రద్దగా వినుము. స్వామి సృష్టిని సృజియింపవలెననీ అనుకొనెను. రాజస గుణమును ఆశ్రయించిన విరించి జన్మించెను. ఆ స్వామి ముఖమునుండి అగ్నితో కలసి ఇంద్రుడు పుట్టెను. పాపకర్మలకు ప్రభువగు, మూడు లోకములకు నాథుడగు బజ్జీయుడు జన్మించెను. కరుణచే చల్లనైన స్వామి మనస్సు నుండి చంద్రుడు జన్మించెను. అతడు నీటికి, అన్ని ఓషధులకు, బ్రాహ్మణులకు రక్షకుడు. విశ్వమును ప్రకాశింపజేయు సూర్యుడు స్వామి కన్నుల నుండి ప్రభవించెను. శీతోష్ణములకు, వర్షములకు, కాలమునకు, వెలుగులకు అతడే మూలము. స్వామి ప్రాణముల మండి జగత్తునకు ప్రాణమొసగు వాయువు పుట్టెను. గ్రహములను, నక్షత్రములను, ఆకాశగంగను, విమానములను అతడే భరించుమన్న స్వామి నాభి ప్రదేశము నుండి ఆంతరిక్షము పుట్టెను. స్వామి శిరస్సు నుండి భూతజాలము ప్రభవించుటకు కారణమగు వ్యోమము పుట్టెను.
జీవరాశులన్నిటికి ఆశ్రయము నిచ్చు భూమి స్వామి పాదములనుండి ఉద్భవించెను. భూ, భువః మున్నగు ఊర్థ్వలోకములన్నియు స్వామీ స్మరణము నుండి పుట్టినవి. రసాతలము మున్నగు ఆధోలోకములు యక్షులు, రాక్షసులు అందరును స్వామినుండి జన్మించిరి. స్వామి ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు పుట్టిరి. వేదములు, యజ్ఞములు, అశ్వములు, ఆవులు, మేకలు, గొర్రెలు అన్నియు పుట్టుక లేని స్వామి నుండి పుట్టినవి. దేవదేవుడగు స్వామీ తలచుకున్నంతనే చరాచరమగు ఈ జగత్తంతయు భూతకాలమున, భవిష్యత్కాలమున వర్తమాన కాలమున ప్రభవించును. స్వామి బడబానల రూపముతో సముద్రములోని నీటిని త్రాగును. కల్పాంతకాలమునందు అనగా ప్రళయకాలమున ఆ నీటిని విడచిపెట్టును.
సూర్యుడు, చంద్రుడు అను రూపములు ధరించి చీకటిని పోగొట్టుచు, కాలధర్మమును ప్రవర్తింపజేయుచు, సమస్త జీవులకు జీవనమును ప్రసాదించును. కల్పాంతమునందు ఈ ప్రపంచమంతటిని తన కడుపులో ఉంచుకొని లీల కొరకు బాలుని రూపములో మహాసముద్రమునందు మర్రి ఆకుపై పరుండి ఉండును. తరువాత భయంకరమగు ఆదిశేషునిపై సుఖముగా శయనించి లక్ష్మితో కూడి, యోగనిద్రను పొందును. నాభి అను సరస్సు నుండి ఒక తామరపువ్వును సృష్టించి అందు బ్రహ్మను కల్పించును. సమస్త జీవులను అతడు సృష్టించును. ఇదంతయు తన అభీష్టము మేరకు చేయు స్వామి విలాసము, ఎవరును స్వామి నిజరూపమును తెలుసుకొనలేరు. ఎప్పుడు ధర్మము
ఎప్పుడు రాక్షసులు అదుపు చేయలేని బలమైన శక్తిగా మారుదురో, భూమికి, భూమిపై నివసించువారికి ఎప్పుడు భయము కలుగునో, ఎప్పుడు తన భక్తులకు, మంచివారికి ఆపలేని గొప్ప కష్టములు సంభవించునో. అప్పుడు స్వామి అలవోకగా దానికి తగిన రూపమును ధరించి అధర్మమును దునుమాడి ప్రపంచమునకు హితమును కల్పించును. రజోగుణాత్మకమైన బ్రహ్మ అను పేరుతో ఈ సృష్టిని పుట్టించును. విష్ణువను పేరుతో సత్యగుణాత్మకుడై లోకములను రక్షించును. లమోగుణాత్మకుడై శివుడను పేరుతో ప్రపంచమును హరించును. ఇట్లు ప్రవర్తించు స్వామి మహిమను ఎవరును తెలిసికొనలేరు. యజ్ఞము యొక్క వివిధ భాగములతో కట్టబడిన సమస్త అవయవములు కల స్వామి వరాహ రూపమును ధరించి లోకములను పాలించును. ఈ పర్వతము పై స్థానము నేర్పరచికొన్న స్వామిని గూర్చి నీకు చెప్పెదను వినుము.
ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ, స్కాంద మహాపురాణమందలి రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున విష్ణువు యొక్క మాహాత్మ్యమును వర్ణించు సందర్భమున విష్ణువుయొక్క మహాత్మ్యమును వర్ణించు సందర్భమున, సృష్టి మొదలగువానిని వర్ణించు ముప్పై ఐదవ అధ్యాయము.
