స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

3వ అధ్యాయము

వరాహస్వామి చెప్పెను:- ఓ వరాననా! పూర్వము జరిగినదంతయు నీకు చెప్పెదను, వినుము. ఓ మహాదేవి అది వినుట వలన పుణ్యము కలుగును. అట్టి దానిని సంపూర్ణముగ తెల్పెదను-1, వైవస్వత మన్వంతరమందు పూర్వము కృతయుగంలో వాయువు గొప్ప తపస్సు చేసెను. దానివలన సంతుష్టుడై శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవులతో కలిసి స్వామి పుష్కరిణి తటమున దక్షిణ భాగమున ఆనందమను పేరుగల విమానమందు నివసింపసాగెను. అప్పటి నుండి కుమారస్వామి కూడ శ్రీనివాసుని అర్చింపసాగెను. కల్పాంతము వరకు ఆ విమానమంటే అదృశ్యుడై నివసించుటకు స్వామి నిర్ణయించుకొనెను.

భూదేవి పలికెను:- భగవంతుడు అదృశ్యుడై ఉన్నచో సామాన్య మానవులు ఏ విధంగా దేవుని సందర్శించు కొనగలరు? నీ ఆలయమునకు దక్షిణ భాగాన ఉన్న శ్రీనివాసులని జనులు సేవించుట ఎట్లు? విశదీకరింపుము.

వరాహస్వామి చెప్పెను:- అగస్త్యుడొకసారి అచటకు వచ్చి భగవంతుని చూచి పన్నెండు సంవత్సరములు ఆరాధించి సంతోషింపజేసెను. ఆ విమానమందే అందరకు కనబడునట్లు నివసింపుమని మరల మరల ప్రార్థింపగా శ్రీ, భూ సహితుడైన హరి ఇట్లనెను.

 భగవంతుడు చెప్పెను:- నీ కోరిక ననుసరించి నేను ఇకపై సర్వప్రాణులకు కనిపించేదను. కాని ఈ విమానము మాత్రము ఎప్పుడూ, ఎవరికీ కనిపించదు. కల్పాంతము వరకు నేనిచటనే ఉందును అని స్వామి పలకగా అగస్త్యుడు మిక్కిలి సంతసించి తన ఆశ్రమమునకు తిరిగి వెళ్లాను. అప్పటి నుండి చతుర్భుజుడైన స్వామి. ఈ విమానమునందుండి ఎల్లరకు కనిపించుచుండెను. కుమారస్వామి, వాయువు స్వామిని సదా కొలుచు చుండిరి. ఈ విధంగా నాలుయుగముల కాలము గడచిపోయెను. మిత్రవర్మ కథ: ఆకాశరాజును పుత్రులు కల్గుట: ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగము ముగియుచుండగా, భారత యుద్ధము అయిన పిమ్మట కలియుగము ప్రారంభ సమయమాసన్నమయ్యెను, విక్రమార్కాది మహారాజులు, శకులు, శూద్రులు నా గురించి తెలుసుకొనక స్వర్గమునకు పోవుదురు. తరువాత చంద్ర వంశమునందు తుండీర మండలమున నారాయణపురమందు మిత్రవర్మ అను రాజు ఉండగలడు. మహానుభావుడైన ఆ రాజు భూమిని పరిపాలించుచుండగా ధర్మము ఎల్లెడల కాపాడబడును. భూమి పై కరువన్నది ఉండదు, అన్ని విధములైన పంటలు సమృద్ధిగ పండును. జనులందరు ఎటువంటి పీడలేక ధర్మము కలిగి ప్రవర్తింతురు. పాండ్య రాజకుమారి అగు మనోరమ అతడి భార్య కలదు. కులదీపకుడగు ఆకాశరాజు వారి పుత్రుడిగ జన్మించును. ఆ ఆకాశరాజు శకవంశములో పుట్టిన ధరణిని వివాహమాడును. మిత్రవర్మ తన రాజ్యమును కుమారుడగు ఆకాశరాజుకు అప్పగించి వేంకటాద్రికి సమీపమున ఉన్న తపోవనమునకు వెళ్లును.

 భూమినుండి పద్మావతి బయటకు వచ్చుట:- ఆ ఆకాశరాజు గొప్ప రాజై సార్వభౌముడయ్యెను. ఏకపత్నీ వ్రతము కలిగి ధరణియందే ఆసక్తుడై ఉండును. ఒకసారి యజ్ఞము చేయుట కొరకు ఆరణి తీరంలో బంగారు నాగలితో భూమిని దున్నుట మొదలు పెట్టెను. విత్తనములు జల్లుట ప్రారంభింపగ సకల లక్షణములు కలిగి, అందమైన పద్మపత్రముల శయ్య పై పరున్న ఒక కన్య కనిపించెను. కాలిన బంగారము రంగులో ఉన్న పుత్రికవలే ప్రకాశించుచున్న ఆమెను రాజు విప్పారిన నేత్రములలో చూచేను ఆమెను ఎత్తుకుని ఈమె నా కుమార్తెయే అని మరల మరల మంత్రులకు సంతోషంతో చెప్పసాగెను-25.అప్పుడు అశరీరవాణి ఈమె నీ పుత్రికయే అని చెప్పెను. అది విని రాజు సంతోషంతో పుత్రికతో తన నగరంలోకి ప్రవేశించెను. తన భార్య అయిన ధరణిని పిలిచి దేవునిచే ప్రసాదింపబడిన, భూమి నుండి బయట పడిన పుత్రికను చూడుమని చెప్పెను. సంతానము లేని మనకు ఈమె నిశ్చయముగా కుమార్తె వంటిది అని పలికి ఆకాశరాజు పుత్రికను తన భార్య చేతిలో ఉంచెను.

 ధరణీ ఆకాశరాజులకు వసుదానుడను పుత్రుడు కలుగుట:- ఆ పద్మావతి ఆకాశరాజు ఇంట అడుగు పెట్టగానే ధరణీ గర్భవతి అయ్యెను. అది చూచి ఆకాశరాజు చాల సంతోషించి నా ఇంట సంతాన లత ఇప్పటికీ ఫలించనదని మురిసిపోయెను. తరువాత కొంతకాలమునకు కలువకన్నులు కల ఆ ధరణీ దేవి ప్రశస్తమైన ముహూర్తమున అయిదు ప్రవాహములు స్వస్థానములయందు, ఉచ్చ స్థానములయందు ఉండగా రవి మేషరాశి యందు ఉండగా పుత్రుని ప్రసవించెను. ఆ కుమారుడు పుట్టినపుడు దేవదుందుభులు మ్రోగేను. పుష్పవృష్టి కురిసెను. సుఖస్పర్శను కలిగించు వాయువు వీచెను. పుత్రుడు జన్మించెనని తనకు వార్త చెప్పిన వారికి ఆకాశరాజు ఛత్రచామరములను తప్ప మిగిలిన రాజ్యసంపద. అంతటినీ దానమిచ్చెను. కోటి కపిల గోవులను, శతాధికములైన ఎడ్లను దానమిచ్చెను. పన్నెండవ నాడు జాతకర్మాది వైదిక క్రియలను పూర్తి చేసి తానే వసుదాసుడను పేరు పెట్టెను.

శ్రీ వరాహ స్వామి చెప్పెను:- ఓ దేవి! ఆ ఆకాశరాజు కుమారుడు వసుదానుడు అందరికీ ఆహ్లాదము కలిగించుచు. శుక్ల పక్ష చంద్రుని వలె వృద్ధి పొందెను-35. ఉపనయనమైన పిమ్మట వినయము కలవాడై గురువుల నుండి సకల విద్యలను నేర్చెను. తండ్రి వద్ద నుండి మంత్ర పూర్వకముగ అన్ని అస్త్ర శాస్త్రములను అభ్యసించెను-36. సమగ్రముగా ధనుర్విద్యను నేర్చుకొనెను. అతి బలవంతుడైన ఈ కుమారుని వలన ఆకాశరాజు శత్రువులను చూచుటకు కూడా శక్యము కాని వాడయ్యెను. గ్రీష్మ ఋతువున చండభానునితో ప్రకాశించు నిర్మలమైన ఆకాశము వలె, వైశాఖ మాసమున మధ్యాహ్న సమయపు ఆకాశమువలె ఆ ఆకాశరాజు శత్రువులకు భరింపరానివాడు, చూడరాని వాడు అయ్యెను.

ఎనభై ఒక్క వేల శ్లోకములు కల శ్రీ స్కాంద మహాపురాణమందు రెండవదగు వైష్ణఖండమున శ్రీ వేంకటాచల మాహాత్మ్యమందలి ధరణీ వరాహ సంవాదమున. అగస్త్యుని ప్రార్థన చేత భగవంతుడు సర్వప్రాణులకు కనిపించుట మొదలగునవి వర్ణించిన మూడవ అధ్యాయము.