స్కంద మహా పురాణము లోని వైష్ణవ ఖండము లోని వేంకటాచల మహాత్మ్యము

Table of Contents

1 - అథ నారదస్య సుమేరు శిఖరస్థయజ్ఞవరాహదర్శనం 

తరువాత రెండవదైన వైష్ణవ ఖండము మొదలు పెట్టబడుచున్నది. అందు మొదటగా వేంకటాచల మహాత్మ్యం నారదుడు సుమేరు పర్వత శిఖరంపై ఉన్న యజ్ఞవరాహుని దర్శించుట.

వ్యాసుడు పలికెను:- పవిత్రమైన నైమిశారణ్యమున శౌనకాది మహర్షులు లోకములను రక్షించుటకై పన్నెండు సంవత్సరముల పాటు సాగిన యాగమును చేసిరీ. వారి వద్దకు కథలు చెప్పువాడు, వ్యాసుని శిష్యుడు, గొప్ప తెలివి కలవాడు, ముని, రోమహర్షణుని కుమారుడు అయిన ఉగ్రశ్రవుడు వచ్చెను. వారి చేత చక్కగా పూజితుడై, పౌరాణికులలో ఉత్తముడైన ఆ సూతుడు స్కాందమను పేరుగల ఆ దివ్య పురాణాన్ని చెప్పెన. సృష్టి, వినాశము వంశములు, వంశాను చరితము, మన్వంతరముల కథను విపులంగా వినిపించెను. తీర్థముల ప్రభావాన్ని తెలిపే కథలను విని ఆ మునిపుంగవులు మరిన్ని కథలను వినవలెనను కోరికతో ఇంద్రియ నిగ్రహం కల్గిన ఆ సూతునితో ఇట్లనిరి.

ఋషులు పలికిరి:- ఓ రోమహర్షణా, సర్వజ్జా, పురాణార్థములను చక్కగా తెలిసినవాడా! ఈ భూమిపై ఉన్న గొప్ప పర్వతాలను గూర్చి వినగోరుచుంటిమి. కనుక ఈ పర్వతములలో ఏవి ముఖ్యమైనవో మాకు తెలుపుము-6. సూతుడు పలికెను: ఇదే ప్రశ్నను నేనొకసారి గంగాతీరమందు మునివరశ్రేష్ఠుడైన వ్యాసుని అడిగితిని. గురువులలో ఉత్తముడైన అతడు నాకా విషయమును తెల్పెను-7. వ్యాసుడు పలికెను: ఓ సుతుడా! పూర్వం దేవయుగంలో నారదుడు వివిధ రత్నములచే ప్రకాశించుచున్న సుమేరు పర్వత శిఖరానికి వెళ్లాను-8. దాని మధ్యభాగంలో విశాలమైనది. " ప్రకాశించుచున్నది అయిన బ్రహ్మయొక్క నివాసస్థానమును, దానికి ఉత్తరదిశలో ఒక గొప్ప రావిచెట్టును చూచేను9. ఆ చెట్టు వేయి యోజనముల పొడుగు రెండువేల యోజనముల విస్తీర్ణం కలిగి ఉన్నది. ఆ చెట్టు మొదట్లో దివ్యమైన నానారత్న సమన్వితమైన ఒక మండపం ఉన్నది.

ఆ మండపం పద్మరాగమణులతో చేసిన వేలకొలది స్తంభములతో అలంకరింపబడి ఉన్నది. వైడూర్యముల చేత, ముత్యముల చేత స్వస్తిక ఆకారములో నున్న మాలికలచట ఉన్నవి. నవరత్నములతో కూడుకున్న దివ్యమైన తోరణము చేత ప్రకాశించుచున్నది. మంగళకరములైన నవరత్నములచే చేయబడిన మృగముల, పక్షుల బొమ్మలచేత ఆ ప్రదేశం నిండి ఉన్నది. ఆ మండప మహాద్వారం పుష్పగష్య) రాగమణులతో నిర్మితమైంది. దానికి ఏడు అంతస్తులు ఉన్న గోపురం ఉన్నది. మిక్కిలి ప్రకాశిస్తున్న వజ్రములతో చక్కగా నిర్మితమైన రెండు తలుపులతో ఆ ద్వారం ఎంతో అందంగా ఉన్నది. నారదుడు ఆ ద్వారం వండి లోపలికి ప్రవేశించి శ్రేష్టమైన ముత్యములతో చేసిన మండపమును చూచెను. అక్కడ వైడూర్యములతో చేసిన ఎత్తైన వేదికను చూచి నారదుడు దానిపైకి ఎక్కిను. ఆ వేదిక మధ్యలో ఎత్తైనది. సాటిలేనిది. బంగారంతో మిక్కిలి ప్రకాశించునది. ముత్యములతో నిండి ఉన్నది. గొప్పకాంతి కల్గినది. అయిన ఒక సింహాసనమును చూచేను.

 ఆ సింహాసన మధ్యమున మంగళకరమైన, వేయిరేకులతో ప్రకాశించుచున్నది. తెల్లనిది, వేయి చంద్రుల కాంతి గలదీ, కర్ణికా, కేసరముల చేత ప్రకాశించుచున్నది అయిన ఒక తామర పూవును చూచెను. ఆ తామరపువ్వు మధ్యలో కూర్చుని ఉన్న యజ్ఞవరాహమూర్తిని చూచెను. ఆ మూర్తి నిండు చంద్రుని వంటి కాంతిని, కైలాస పర్వతము వంటి ఆకారమును, అందమైన పురుషుని ఆకృతిని కలిగి ఉండెను. నాలు చేతులను, గొప్పనైన అవయవములను, మంగళప్రదమైన వరాహ ముఖమును, శంఖము, చక్రము, అభయము వరములను ధరించిన పురుషోత్తముని చూచెను. పచ్చని పట్టువస్త్రమును ధరించిన, తెల్లతామరవలె పోడవుగా ఉన్న చూపులు కలిగిన, అగరు సువాసనలచే నిండిన ముఖ పద్మములు కలిగిన దేవుని చూచెను. సామవేదధ్వనిగల, యజ్ఞ మూర్తి అయిన, హాస్యపాత్రవంటి తుండములను, ఆజ్యాహుతి చేయు గరిట వలె పొడవుగా వున్న ముక్కును కలిగిన, పాలసముద్రమువలెనున్న, కిరీటముచేత మిక్కిలి ప్రకాశించుచున్న ముఖము కలిగిన మూర్తిని చూచెను. శ్రీవత్సమును వక్షము పై ధరించిన శుభ్రమైన యజ్ఞోపవీతముచే ప్రకాశించుచున్న, కౌస్తుభమణిచే వెలుగుచున్న ఎత్తైన ఉరఃస్థలముకల మూర్తిని చూచెను. మంగళకరమైన బంగారు ఆభరణాలచే ప్రకాశించుచున్న ఆ మూర్తి శరత్కాలపు తెల్లమబ్బు, మెరుపులతో నిండి ఉన్నట్లు వెలుగుచున్నది. ఆ మూర్తి ఎడమ పాదము పాదపీఠమును ఆక్రమించి ఉన్నది. ఆ మూర్తి ఎల్లపుడు కంకణములచేత, భుజకీర్తులచేత, కేయూరముల చేత ఉజ్జ్వలముగా ఉన్నది. బ్రహ్మ, వశిష్టుడు, అత్రి, మార్కండేయుడు, భృగువు మున్నగు మహర్షులచే ఆ మూర్తి ఎల్లప్పుడు సేవింపబడుచుండును. ఇంద్రాది లోకపాలురచేత, గంధర్వ, అప్పరో గణములచేత సేవింపబడుచున్న ఆ దేవదేవునికి నమస్కరించి, సమీపించేను. భూమి మోయు ఆ మూర్తిని నారదులు మంగళకరములైన ఉపనిషద్భాగములచే స్తుతించి మిక్కిలి సంతోషముగా ఆ వరాహమూర్తి ఎదుట నిలచేను.

అదే సమయమున దివ్యదుందుభులు మోగిన శబ్దము వినిపించెను. రత్నములతో కూడుకున్న సముద్రమువలె సమస్తమైన ఆభరణములతో ప్రకాశిస్తున్న భూదేవి సఖులతో కలసి వచ్చెను. సుమేరు పర్వతము, మందర పర్వతమువలెనున్న స్తనములతో వంగినదై ఉన్న ఆ దేవి కొత్త గరికగడ్డివలె పచ్చని శరీరం కలిగి సమస్తాభరణములను ధరించియుండెను. ఇలా, పింగల అను సఖులతో ఆ దేవి వచ్చెను. వారిరువురు తెచ్చిన పుష్పములను ఆ దేవి వరాహమూర్తి పాదముల వద్ద చల్లి, దేవదేవుడైన ఆ మూర్తికి నమస్కరించి చేతులు జోడించి నిలచెను. ఆ వరాహమూర్తి భూదేవిని కౌగిలించుకుని, ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను.

భూదేవి వరాహ సంభాషణము :- పిమ్మట ప్రీతిగొన్న మనస్సుతో భూదేవిని కుశలమడిగెను. వరాహస్వామి ఇట్లనెను. ఓ భూదేవి, సుఖస్థానమగు ఆదిశేషుని తల పై నిన్ను ఉంచి లోకమును నీయందు ఉంచి, నీకు సహాయంగా పర్వతములనిడి నేనిచటికి వచ్చితిని. ఏ కారణం చేత నీవిచటికి వచ్చితివి, పృథివి పలికెను. పాతాలము నుండి నన్ను పైకి తెచ్చి వేయి పడగలతో శోభించు ఆదిశేషుని శిరస్సుపై ఎత్తైన, రత్నపీఠం పై ఉంచినట్లు ఉంచితివి. తోడుగా నన్ను ధరింపగల శక్తిగల, నీ అంశగల పవిత్రమైన పర్వతములను ఏర్పాటు చేసితివి. నాకు ఆధారములైన ఆ పర్వతముల యందు ముఖ్యమైన వాటిని గూర్చి నాకు తెల్పువ .

 సుమేరువు, హిమవంత ము, వింధ్య, మందరము, గంధమాదనము, సాలగ్రామము, చిత్ర కూటము, మాల్యవంతము, పారి యాత్రకము. మహేంద్రము, మలయము, సహ్యము, సింహాద్రి, రైవతము, మేరుపుత్రము, బంగారు పర్వతమైన అంజనము. అను ఈ పర్వతములన్నీ నీకు ఆధారములు. ఓ భూదేవి! ఇవన్నియు, నా చేత, దేవతలచేత ఋషుల చేత సేవింపబడి నవి. వీటిలో శ్రేష్ఠమైన వాటిని తెల్పెదను. వినుము. ఉత్తర దిక్కునున్న పర్వతములలో సాలగ్రామము, సింహాద్రి, గంధమాదనము ముఖ్యమైనవి. దక్షిణ దిక్కునున్న పర్వతములలో అరుణాద్రి గజపర్వతము, గృధ్రాద్రి, ఫటికాచలము అనునవి శ్రేష్ఠమైనవి ఇవన్నియు క్షీరనదికి సమీపమున ఉన్నవి. గజపర్వతమునకు ఉత్తరంగా ఐదు యోజనముల దూరంలో సువర్ణముఖరి అను ఒక గొప్పనది ఉన్నది. దానికి ఉత్తరంగా 'కమల' అను పేరుగల సరోవరమున్నది. దాని తీరంలో శుకునికి వరమిచ్చిన విష్ణు భగవానుడు ఉండును. బలభద్రునితో కలిసి ఉండు ఆ కృష్ణుడు భక్తుల దుఃఖమును పోగొట్టువాడు, వైఖానసులను మునిగణములచే ఎల్లప్పుడు ఆరాధింపబడుచుండును.

 కమల సరస్సుకు ఉత్తరంగా ఉన్న అడవిలో రెండున్నర యోజనముల దూరంలో హరిచందన వృక్షములు దట్టంగా ఉన్న చోట వాసుదేవునికి స్థానమగు శ్రీవేంకటాచలము కలదు. ఏడు యోజనముల విస్తీర్ణము, యోజనము పొడవు ఉన్న ఆ పర్వతము బంగారముతో నిండినదై రత్న సానువువలె ఎత్తై ఉన్నది. ఇంద్రాది దేవతలు, వశిష్టాది మునీశ్వరులు, సిద్దులు, సాధ్యులు, మరుత్తులు, దానవులు, దైత్యులు, రాక్షసులు, రంభాది అప్సరసలు, ఎల్లప్పుడు అచట నివసింతురు. నాగులు, గరుడులు, కిన్నెరులు అక్కడ తపస్సు చేయుదురు. వీరందరుకల ఆ ప్రదేశంలో ఓ భూదేవీ, ఎన్నో దివ్యములైన సరస్సులు కలవు.

 అన్ని తీర్థములలో స్వామి పుష్కరిణి యొక్క గొప్పదనము : -అన్ని తీర్థములలో ముఖ్యమైనవి ఏమనగా చక్రతీర్థం, దైవతీర్థం, వియడ్గంగ, కుమారధారికాతీర్థం, పాపనాశనం, పాండవతీర్థం, స్వామి పుష్కరిణి అను ఏడు. ఈ ఏడు తీర్థాలు నారాయణాద్రిపై ఉన్నవి. వీటన్నిటిలో శ్రేష్ఠమైనది స్వామి పుష్కరిణి. దానికి పశ్చిమతీరంలో ఓ భూదేవీ నీతో నేను నివసించుచున్నాను. దక్షిణతీరంలో జగత్పతి అయిన శ్రీనివాసుడు కలడు. గంగాది సకల తీర్థములతో ఆ పుష్కరిణి సమానమైనది. మూడు లోకాల్లో ఏయే సరస్సులు ఉన్నవో వాటన్నిటిలోకి గొప్పదనాన్ని పొంది ఉన్నది. స్వామి పుష్కరిణిని సేవించుటకు అన్ని తీర్థములు సిద్దంగా ఉండును. వాటి సంఖ్యను చెప్పెదను వినుము. ఓ భూదేవీ అరవై ఆరు కోట్ల తీర్థములు ఉన్నవి. వాటిలో ముఖ్యమైనవి ఆరు మాత్రమే. వాటిలో మిగిలిన అయిదు తీర్థములతో సమానమైనది. గొప్పది. తుంబతీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి పునర్జన్మ భయం ఉండదు.

 శ్రీవరాహస్వామి చెప్పెను:- నారాయణాద్రి యొక్క మాహాత్యమును చెప్పెదను వినుము. ఓ భూదేవీ. దేవతలు, ఋషులు, సనకాది యోగులు కృతయుగంలో అంజనాద్రి, త్రేతాయుగంలో నారాయణాద్రి, ద్వాపరయుగంలో సింహాద్రి, కలియుగంలో శ్రీ వేంకటాద్రి పరమాత్మునికి స్థానమైన పర్వతములని విద్వాంసులు చెప్పుదురు. అటువంటి శ్రీ వేంకటాద్రి నుండి వేయి యోజనాల దూరంలో ఉన్నప్పటికీ, మరొక ద్వీపానికి వెళ్లినప్పటికి శ్రీ వేంకటాద్రి దిక్కుకు తిరిగి భక్తితో నమస్కరించినట్లయితే ఆ మానవుడు అన్ని పాపముల నుండి విముక్తి పొంది విష్ణులోకమును పొందును. అటువంటి శ్రీ వేంకటాద్రిపై ఉన్న ఆరు తీర్థముల మాహాత్మ్యమును సమయానుసారంగా చెప్పెదను.

కుమారధారా మాహాత్మ్యము:- అన్ని పాపములను పోగొట్టు కుమారధార మొక్క మాహాత్య్మమును శ్రద్ధగా వినుము. ఓ భూదేవీ, సూర్యుడు కుంభ లగ్నమందుండు కుంభమాసంలో పుణ్యతిథి యగు మాఘపౌర్ణమి ఈ తీర్థమునకు అత్యంతము పవిత్రమైన తిథి. అందునా పార్వతీ తనయుడు, కార్తికేయుడు, అగ్ని సంభవుడు, దేవసేనతో కలిసి ఉన్నవాడు, శ్రీనివాసుని నిత్యము ఆర్చించువాడు అయిన సుబ్రహ్మణ్యుడు ఈ కుమారధారిక వద్దనే నివసించుచున్నాడు. ఆ కుమారధారికలో మధ్యాహ్న సమయమున స్నానం చేసినందువల్ల కలిగే ఫలితం చెప్పెదను. వినుము. గంగాది సర్వతీర్థములలో నియమపూర్వకంగా పన్నెండు సంవత్సరములు స్నానం చేసిన ఫలితమును పొందును. అవే విధంగా ఆ కుమారధారిక యందు తన శక్తికి తగినంత దక్షిణతో అన్నదానం చేసినవారికి వైఫలితమే (అనగా గంగాది తీర్థములలో పన్నెండు సంవత్సరములు అన్నదానం చేసిన ఫలితం) కలుగును.

తుంబతీర్థ మాహాత్మ్యము: - సూర్యుడు మీన రాశియందు ఉండగా, పౌర్ణమినాడు, చంద్రుడు ఉత్తర ఫల్గునీ నక్షత్రంతో కూడి యుండగా నాల్గవజామునందు మిగిలిన అన్ని తీర్థాలలోకి ఉత్తమమైన తుంబ తీర్థంలో స్నానం చేసినట్లయితే ఓ దేవీ! అట్టి మానవుడు తిరిగి జన్మించడు (అనగా ముక్తిని పొందును). ఆకాశగంగ మాహాత్మ్యము రవి మేషరాశియందు ఉండగా, చంద్రుడు చిత్తా నక్షత్రంతో కూడియుండగా, పౌర్ణమినాటి తెల్లవారుజామున ఆకాశగంగయందు స్నానం చేసిన మానవుడు ముక్తిని పొందును.

పాండవ తీర్థ మహాత్మ్యము:- రవి వృషభరాశియందు ఉండగా, చంద్రుడు విశాఖ నక్షత్రంతో కూడియుండగా, ద్వాదశి ఆదివారం నాడు శుక్ల పక్షంలో కాని కృష్ణపక్షంలోకాని కుజునితో కలిసి ఉన్నపుడు లేదా ద్వాదశి ఆదివారం నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కాని, హస్త నక్షత్రంతోకాని కూడి ఉన్నప్పుడు పాండవ తీర్థంలో స్నానం చేసినవాడు ఇహలోకంలో దుఃఖమును పొందడు. పరలోకంలో సుమును పొందును-పాపనాశన తీర్థ మాహత్మ్యము. శుక్ల పక్షపు లేదా కృష్ణపక్షపు సప్తమీ, ఆదివారంనాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంతో కాని, హస్త నక్షత్రంతోకాని కలసి యున్నపుడు ఆ పాపనాశనమను పేరుగల తీర్థంలో నియమంతో స్నానం చేసినట్లయితే, ఓ మహాభాగా! కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి మానవుడు ముక్తి పొందును.

  దేవతీర్థ మాహాత్మ్యము: - ఓ దేవి! మిక్కిలి రహస్యమైన విషయం చెప్పెదను వినుము. అనంతమను పేరుగల గొప్ప పర్వతం పై నా దివ్యస్థానమునకు వాయువ్య దిక్కున శిఖరం పై ఉన్న కొండగుహలో దేవతీర్థమనే పేరుగల అందమైన సరస్సు కలదు.దానియందు స్నానం చేయుటకు తగిన సమయం చెప్పెదను. గురువు పుష్యమి నక్షత్రమందు చంద్రుడు శ్రవణా నక్షత్రమందు వ్యతీపాతమును పొందగా ఆ పుణ్యతీర్థమందు స్నానము చేసిన వారికి గల ఫలితమును వినుము. అతి పవిత్రమైన ఆ దేవతీర్థంలో స్నానము చేసినచో తెలిసి చేసి, తెలియక చేసిన ఎటువంటి పాపములు అయినను నశించును. ఈ తీర్థ స్నానము వలన పుణ్యములు కూడ వృద్ధి పొందును. దీర్ఘాయుషును పొందును. పుత్రులను, పౌత్రులను పొందును. చివరకు స్వర్గమును పొంది చంద్రలోకమును పొందును. చివరకు స్వర్గమును పొంది చంద్రునిలోకమును పొందును-82. పైన చెప్పిన దినములయందు ఆ తీర్థ ప్రదేశంలో అన్నదానం చేసిన వారికి బ్రతికి ఉన్నంత కాలం అక్కడ అన్నదానం చేసిన ఫలితం కలుగును. అతి రహస్యములైన ఈ విషయములన్నియు నీకు తెల్పితిని.

 వ్యాసుడు చెప్పెను:- ఆ మాటలు విని మనస్సులో మిక్కిలి ఆనందించినదై, తనకు నచ్చిన మాటలతో భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని స్తుతించెను. భూదేవి పలికెను: ఓ దేవదేవేశ, వరాహ వదన, అచ్యుత, పాలసంద్రం వలె తెల్లగానున్నవాడా, వజ్రము వంటి కొమ్ము కలవాడా, మహాభుజా, కల్పాది యందు సాగర జలముల నుండి వేయి చేతులతో నీవు నన్నుద్దరించితివి. కనుకనే ఈ జగత్తును నేను భరింపకల్గితిని-86. అనేక దివ్యాభరణములను, ఉపవీతమును ధరించిన, ఎర్రని వస్త్రములను ధరించిన దివ్యరత్నములను ధరించిన ఉదయించుచున్న సూర్యునితో సమానంగా ప్రకాశించుచున్న పాదపద్మములుకల నీకు నమస్కారము. బాలచంద్రుని వంటి శోభ కల్గిన దంష్టలు కల్గిన, మహాబలపరాక్రమ. దివ్య చందనమును అలదుకున్న తప్తకాంచన కుండలో, చంద్ర నీలమణి వంటి ద్యుతి, బంగారు అంగదము కల. వజ్రము వంటి దంష్టలతో హిరణ్యాక్షుని చీల్చిన మహాబలాతామరలవంటి అందమైన కన్నులు కల సామగానముచే సంతోషించు.వేదమును శిరోభూషణముగాకల అన్ని ప్రాణుల యందు నివసించు, సుందరమైన పరాక్రమము కల బ్రహ్మరుద్రులచే నమస్కరింపబడు విశామైన కన్నులు కల. అన్ని విద్యలకు ఆకారము వంటి, శబ్దమునకు అతీతమైన నీకు నమస్కారము, ఆనందమును కలిగించు విగ్రహము కల కొలకాలా నీకు నమస్కారము. ఈ విధముగా స్తుతించి ఆ భూదేవి వరాహమూర్తి పాదములకు నమస్కరించెను. ఆ విధంగా నమస్కరిస్తున్న భూదేవిని వరాహమూర్తి విప్పారిన నేత్రములతో చూచెను. తరువాత ఆమెను చేతులతో కౌగిలించుకొనెను. ఆమె ముఖమును ఆఘ్రాణించి, ఎడమ తొడ పై కూర్చుండ బెట్టుకొనెను.

వ్యాస ఉవాచ:

వరాహస్వామి భూదేవితో కలసి శేషాచలమునకు వచ్చుట:- నారదాది మునీంద్రులచేత స్తుతింపబడుచు ఆ వరాహస్వామి గరుడిని పై ఆరోహించి వృషభాచలమునకు వెళ్లాను. లోకముల చేత పూజింపబడు స్వామి పుష్కరిణి పశ్చిమ భాగమున వరాహవదనము కలిగిన స్వామి మునీంద్రుల చేత, మహానుభావులైన బ్రహ్మతో సమానులైన వైఖానసుల చేత పూజింపబడుచుండును.

వ్యాసుడు పలికెను:- ఓ సూతుడా, నారదుడు ఆ విధంగా భూదేవి వరాహుల సంభాషణమును విని మునుల సదస్సులో చెప్పగా విన్నది ఇది. నారదుని వద్ద నుండి విన్నదానిని నీవు అడుగుట వలన యథాతథంగా చెప్పితిని.

ఆధ్యాయ ఫలశ్రుతి:- ఓ సూతుడా మన ఈ ధర్మసంవాదాన్ని ఎవరైతే బ్రాహ్మణుల ఎదుట లేదా దేవతల ఎదుట పఠిస్తారో, లేదా అన్ని వర్ణముల వారికి వినిపిస్తారో వారు పుత్రులను, పాత్రులను కలిగి గొప్ప కీర్తిని పొందుదురు. 99,100. విన్నవారికి కూడా వారి కోరికలు తీరును.

సూతుడు పలికెను:- ఈ విధంగా కృష్ణద్వైపాయనుడు నాకు ఏమీ తెల్పెనో అది అంతయు మీకు చెప్పితిని. సూతుని మాటలు విని ఋషులిట్లనిరి.

ఋషులు పలికిరి:- ఓ సూతుడా, మేము అడిగినంతనే భూమిపై ఉన్న పర్వతములోకెల్ల గొప్పదైన, పవిత్రమైన శేషాచలమును గూర్చి మాకు తెల్పితివి. ఆ పర్వతము పాపములను పోగొట్టునది. మోక్ష ఫలమును ఇచ్చునది. ఆ వరాహస్వామి భూదేవితో కలిసి వృషాద్రిని చేరి ఆమెకు ఏమి చెప్పెనో అది మాకు వివరముగా తెలియజేయుము.

ఇది ఎనభై ఒక వేల శ్లోకములు కలిగిన స్కాంద పురాణమందలి రెండవదైన వైష్ణవ ఖండమందు, శ్రీ వేంకటాచల మాహాత్మ్యమున, భూదేవి వరాహుల సంవాదసమయమున నారదుడు ప్రవేశించి యజ్ఞ వరాహమూర్తిని దర్శించుట అను మొదటి అధ్యాయము.