పద్మ మహా పురాణము లోని సృష్టి ఖండము

Table of Contents

35 - అధ్యాయము

భీష్ముడనెను. పురాణాశ్రయ సంయుతమైనదంటూ మీరు చెప్పితిరి. అట్లే శ్వేతుడు తన గురువుకు బ్రహ్మాండమును దానమిచ్చుటను చెప్పితిరి. ఇది విని నాకు, అతను ఆకలిని తొలగించుకొనుటకు ఎముకలను ఆస్వాదించుట ఎట్లు జరిగెనో తెలియ కుతూహలము కలిగినది. పృథివి పై అన్న దానమును చేసి స్వర్గమును పొందిన రాజులను గూర్చి విన కోరిక గలదు. ఋతువులు అన్న మే మూలముగా గలవి కదా! మహాత్ముడగు శ్వేతుడు బుద్దిహీను డెట్లాయెను? అతను అన్న దానమెందుకు చేయలేదు? ఋషు లై ననూ ఎందుకు దర్శించలేదు? ఆహా! అన్న దానము యొక్క మాహాత్మ్యమేమి! ఈ లోకమున దానమిచ్చిన దాని ఫలమును నరులు పర లోకమున ననుభవింతురు. ఆక్షయ స్వర్గమును పొందెదరు. అన్న దానమే వరమదానమని విజ్ఞులెల్లప్పుడూ కీర్తించెదరు. దానిచేతనే ఇంద్రుడు ముల్లోకముల ఆధిపత్యము ననుభ వించుచున్నాడు. విప్రో త్తములు ఇంద్రుని శతక్రతువని అందురు. అన్న దానము చేతనే దేవరాజు ఆట్టి స్థితిని పొందినాడు. దానము చేతనే స్వర్గమునకు వెళ్ళెనని మీ నుండి అంతా వింటిని, మునుపు ఎప్పుడైనా ఇలా జరిగి యుండినచో మరల విన గోరుచున్నాను . తెలియ జేయుమని భీష్ముడనెను.

అపుడు పులస్త్యుడు పూర్వము అగస్త్యుడు రామునికి చెప్పిన ఈ ఆఖ్యానకము నిప్పుడు నేను నీకు చెప్పెదననెను. అంత భీష్మడు రాముడను ఈ రాజ శేషుడే వంశమున జన్మించెనని అడిగేను. ఆపుడు పులస్త్యుడు ఇట్లనెను. “రాముడను మహా బలుడు రఘువంశమున జన్మించెను. దేవకార్యమును నిర్వర్తించిన యాతడు లంకయందు రావణుని జంపెను. అభిషేకము పూర్తి ఆయిన తరువాత రాముని నివాసానికి ఋషులు ఏ తెంచిరి. వారట్లు రాగా ప్రతీహారి అగస్త్వుని మాటను రామునికి చేరవేసెను. ఋషులు వచ్చిరని నివేదించుటకు వెళ్ళిన ద్వారపాలుడు ఉదయించిన పూర్ణ చంద్రునివలె నున్న రాముని చూచెను. ‘కౌసల్యా రామా! నీకు శుభమగుగాత! ఈనాడు సుప్రభాతమైనది. నీ అభ్యుదయమును గాంచ ఇక్కడికి వచ్చిన అగస్త్యుడు మునులతో ద్వారమువద్ద నిలిచి యున్నాడు.' అని ద్వారపాలుడనగా రాముడు వెంటనే 'ఆ ముని శ్రేష్టలను వెంటనే ప్రవేశ పెట్టుము. ద్వారమువద్ద వారినెందుకు నిలువరించితివి?' అని అనెను.

అని రాముడనగా ప్రతీహారి మునులను లోనికి ప్రవేశ పెట్టెను. వారిని చూచి రాముడు చేతులు జోడించి నమస్క రించెను. బంగారు చిత్రములు గలవీ, చక్కని మెత్తలుగల ఆసనములలో మునులను కూర్చుండ బెటెను. సమ్మతముతో దర్భాసన ముల పై కూర్చున్న ఆ ముని పుంగవులకు పురోహితుడు పాద్యమును, ఆచమనీయమును, అర్యము నిచ్చెను. రాముడు ఋషులందరి కుశ లమడగగా, వేదజ్ఞులగు మహరు లిట్లనిరి. 'ఓ రామా! నీకంతటా కుశ లమగుగాత! మా భాగ్యము చేత శత్రువుల దునుమాడి క్షేమముగానున్న నిన్ను చూచుచుంటిమి. దురాత్ముడగు రావణుడు సీత నపహరించగా, ఆమె తేజస్సు చేతనే రావణుడు మరణించెను. నీవొక్కడివే వేరొకరి సహాయము లేకుండా రణమున రావణుని సంహరించితివి. నీవు చేసినటువంటి దానిని చేయు వాడు వేరొకడు లేడు. నీతో మాట్లాడుటకు వచ్చిన మేము నిన్ను చూచి పవిత్రులమైతిమి. రావణుని వధ చే కన్నీళ్ళు తుడిచివేయబడినవి. ఈ జగత్తున పుణ్యమగు అభయ దక్షిణనిచ్చి ఆ జయముతో నీవు వర్ధిల్లుచుంటివి. రామా! నిన్ను చూచితిమి, మాట్లాడితిమి. ఇక మా ఆశ్రమములకు వెళ్ళెదము. ఆరణ్యమునకు వచ్చిన నీకు నేను ఇంద్రక రాసనమును, అక్షయ తూణీరములను కవచము నిచ్చితిని. మరల ఆశ్రమమునకు రమ్ము' అని మునులందరూ అంత ర్హితులైరి.

మునిపుంగవులు వెళ్ళిపోగా, రాముడు మునులనిన దానిని గూర్చి ఆలోచించేను. మరల ఆశ్రమమునకు రమ్మని అనిరి కదా! తప్పక అగస్త్యాశ్రమమునకు వెళ్ళెదను. దేవరహస్యమూ, ఇతర కార్యమూ ఏది వున్న నూ దానిని వినెదను. అని రాముడు ‘ధర్మము నాచరించెద, ధర్మమే కదా పరమగతి యని తలచి రాజ్యము చేయుచుండగా పదివేల సంవత్సరములు గడిచెను. దానములు, యజ్ఞములు చేయుచుండగా రామునికి పది వేల సంవత్సరములు ఒక్క సంవత్సరమువలె గడిచిపోయెను. అట్లు ప్రజా పాలన చేయుచున్న రాముని వద్దకు ఒక నాడొక వృద్ధ గ్రామీణ బ్రాహ్మణుడు తన పుత్రుని మృత దేహముతో వచ్చి ద్వారమువద్ద నిలిచేను. అతను స్నేహమయమైన పలుకులనేకముగా వలి కెను. పూర్వ దేహములో నే నే పాపము చేశాను కుమారా? నే నీనాడు నిన్ను మృతునిగా జూచుచున్నాను. ఐదు సంవత్సరాల వయస్సుననే నీవు యౌవనము పొందకనే మృత్యువు నొందితివి. నాకు దుఃఖము కలిగించుటకు ఆకాలమున మృత్యువు నొందితివి. పితృకార్యముల నెరవేర్చకనే మరణించితివి. మృత్యువిట్లు నిన్ను కబళించుటచే రాముని దుష్కృతము వ్యకమైనది. నేను నా భార్యతో మరణించి నట్లయితే రాముని బాలవధ, బ్రహ్మహత్య, శ్రీ హత్య చుట్టుకోన గలవు అని దుఃఖముతో ఆ వృద్ధ బ్రాహ్మణుడన్న మాటలను రాముడు వినెను.

ఆ బ్రాహ్మణుని నివారించి రాముడు వసిష్టునితో ఇట్లనెను. ఈ పరిస్థితిలో నేనేమి చేయవలెను? అగ్నిలో ప్రాణములను వేల్చవలెనా? పర్వతము పై నుండి క్రిందకు దూకవలెనా? బ్రాహ్మణుని మాటలు విన్న వెనుక నేనెట్లు శుద్ధిని పొందేదను? అని దీనముగా పలుకగా అక్కడనే వున్న నారదుడు ఋషల సన్నిధిలో రామునితో ఇట్లనెను. రామా! వినుము. కాలము ననుసరించి మృత్యువాత పడినాడు. పూర్వము కృత యుగమునందు బ్రాహ్మణు లధికము. బ్రాహ్మణుడు కానివాడు లేకుండెను. తపస్సు చేసి అందరూ మృత్యువులేక చిరంజీవులై యుండిరి. త్రేతాయుగము రాగా బ్రహ్మ క్షత్రియులు త్తములై యుండిరి. ద్వాపర మున ఆధర్మము వైశ్యులను, శూద్రులను ప్రవేశించెను. ఇట్లు నిరంతరముగా సేవింపడిన అనృతము మరల ఉద్భవించినది. మూడు పాదాల ఆధర్మము, ఒక పాదము మాత్రము ధర్మ మేర్పడినది. బ్రాహ్మణ మొదలైన మొదటి మూడు వర్ణములు మిగుల భయము కొందినవి. మరల ధర్మము యొక్క రెండవ పాద మేర్పడినది. ద్వాపరమను యుగమున తపస్సు వైశ్యు నాశ్రయించినది. మూడు యుగముల ధర్మము యొక్క ఉనికి నిలుచుచున్నది. కలియను ఈ చివరి యుగమున అధర్మము, అనృతము వర్ధిల్లుచున్నవి.

కలియుగమున శూద్రయోనియందు తపశ్చర్య కలుగ గలదు. ఓ రాజా! దుర్బుద్దియైన శూద్రుడొకడు నీ రాజ్యమున ఉగ్ర తపమును చేయుచున్నందుచే బాలుడు వధింపబడినాడు. ఏ రాజు యొక్క పాలనలో గానీ, పురమునగానీ అధర్మమునూ, అకార్యమునూ, చెడు బుద్దిగల నరుడు చేయునో, అతను ప్రళయము వరకు నరకము నొందును. అతని పాపమున నాలుగవ భాగమును రాజు కూడా పొందును. కనుక నీవు నీ రాజ్యమున తిరిగి వేదకుము. ఎక్కడ దుష్కృతమును చూచెదవో ఆక్కడే దాని ప్రతి క్రియకై యత్నింపుము. ఇట్లు చేసిన నీకు ధర్మబుద్ధి, బాలునికి జీవనము కలుగగలవు.' అని నారదుడనగా రాముడాశ్చర్యమునూ, ఆనందమునూ పొంది లక్ష్మణునితో నిట్లనెను. “నాయనా! వెంటనే బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి ఆతని ఓదార్చుము. ఆ బాలుని శరీరమును 'తైలద్రోణి' (నూనే పాత్ర) లో నుంచుము. ఆది నాశనము కాకుండా మంచి గంధ ములను, సుగంధముగల తైలములను ఉపయో గించుము. ఉత్తముడగు ఆ బాలుని శరీరమును కాపాడుము. విప తీగానీ, ఖేదముగానీ కాకుండునట్లు చేయుము. అని రాముడు శుభ లక్షణములు గల లక్ష్మణుని ఆదేశించెను.

రాముడపుడు అక్కడకు రమ్మని పుష్పకమును మనసులో ధ్యానించగా, అతని భావమును తెలిసి బంగారు అలంకరణలు గలిగి స్వేచ్చగా చరించు ఆ విమానము క్షణంలో రాముని వద్దకు వచ్చెను. చేతులు జోడించి రామునితో 'రామా! నీ కింకరుడనై ఎదుట నిలచితిని అనగా విని రాముడు మహర్షులకు నమస్కరించి ధనుస్సు, తూణీరములు, ఖడ్గమును చేతబూని విమానమును అధిరోహిం చెను. నగరమున వీరులగు భరత లక్ష్మణులను వుంచి త్వరగా రాముడు పడమటి దిక్కుకి బయలుదేరెను. తరువాత హిమాలయమున్న ఉత్తర దిక్కుకి వేళ్ళేను. తరువాత తూర్పు, పడమర దిక్కులకు వెళ్ళెను. అటు తరువాత శుద్దాచారము గలిగి, నిర్మలముగా నున్న దక్షిణ దిక్కుకు రాముడు చేరెను. పర్వతము యొక్క ఉత్తర భాగమున ఒక గొప్ప సరస్సును, ఆ సరస్సున ఘోర తపస్సు చేయుచున్న తాపసిని రాముడు చూచెను. ఆ తాపసి భయంకరముగా వుండి అధోముఖముగా తపము చేయుచుండెను. అతనిని సమీపించి రాముడు ఇట్లనెను.  ఓ తపస్వీ! నీవు ధన్యుడవు. ఏ యోనియందు తపోవృద్ధి యగును?

నేను దశరథపుత్రుడైన రాముడిని కుతూహలముతో నిన్నడుగుచుంటిని. నీవే ప్రయోజనమాశించి తపమాచరించు చుంటివి? స్వర్గలోకము కొఱకా? వేరొక టా? నీవేందుకు తపము చేయుచుంటివో వినగోరుచున్నాను. నీవు బ్రాహ్మణుడివా, క్షత్రియుడివా? తృతీయవర్ణుడగు వైశ్యుడివా? సత్యము పలుకుము. స్వర్గలోకమును పొందుటకు తపస్సు సత్యమైనది. ఆ సత్యమగు తపస్సు సాత్వికం, రాజసం అని రెండు విధాలుగా సృష్టికర్తచే జగదుపకారమునకై సృజింపబడినది. క్షత్రియ తేజస్సు చే జనించిన రౌద్రమగు తపస్సు రాజసము. ఇతరుల నాశనానికై చేయబడినది ఆసురము. రక్తంతో కూడిన తన శరీరావయవాలను ముక్కలుగా చేయువాడు, పంచాగ్ని ని సాధించువాడు, సిద్దినో, మృత్యువునో పొందును. నీ భావము ఆసురమని తోచుచున్నది. నీవు ద్విజోత్తముడి వలె లేవు. సత్యము పలికిన సిద్ధి కలుగును. అనృతము పలికిన మృత్యువే. అని రాముడనగా తలక్రిందులుగా తపమాచరించుచున్న ఆ తాపసి ఇట్లనెను. “ఓ రాజా! నీకు స్వాగతము. చాలాకాలము తరువాత నిన్ను చూచితిని. నేను నీకు పుత్రుడివంటివాడిని. నీవు నాకు తండ్రి వంటి వాడివి. లేదా, రాజు అందరికి తండ్రివంటివాడు. అట్టి నిన్ను ఆర్చించవలెను. మేము నీ పాలనలో తపము చేయు చుంటిమీ.

అందు మాకు పూర్వము బ్రహ్మ చే సృజింపబడిన భాగము కలదు. రామా! మేము ధన్యులము గాము. నీవే ధన్యుడవు నీ పాలనలో తాపసులిట్లు సిద్ధిని గోరి తవము జేయుచున్నందున నీవే ధన్యుడవు. నీవు నా తపస్సు చే సిద్ధిని పొందుము. ఏ జాతి యందు జన్మ యని నీ వడిగితివి కదా! శూద్రయోని యందు జన్మించితిని నేను. దేవత్వము కోరి నా శరీరముతో తపస్సు నాచరించు చుంటిని. దేవలోకమును జయింపగోరితిని. అబద్దమును పలుకుటలేదు. రామా! నేను శూద్రుడను . శంబూకుడని నా పేరు, అని అతను పలుకుచునుండగానే రాముడు అంద మైనది, కాంతిగలదీ యగు తన ఖడ్గమును ఒర నుండి లాగి అతని తలను నరి కెను. ఆ శూద్రుడట్లు చంపబడగా ఇంద్రుడు మొదలగు దేవతలు బాగు, బాగు యని రాముని పొగిడిరి. వారట్లు మరల మరల పొగడగా దేవతలు సుగంధము గల పుష్పముల వర్షించిరి. ఆకాశము నుండి పడిన ఆ పుష్పవృష్టి రాముని పై నంతటా వడెను. అపుడు ప్రితి నాందిన దేవతలు రామునితో నిట్లనిరి. రామా! నీవు దేవ కార్యమును పరిపూర్ణము చేసితివి. ఇష్టమైన వరము కోరుకొనుము. నీ చేత ఈ శూద్రుడు శరీరముతో స్వర్గమునకు వెళ్ళాను అని దేవతలనగా రాముడు కొద్ది కాలము ఆలోచించి, చేతులు జోడించి ఇంద్రునితో నిట్లనెను.

దేవతలు నా యెడ ప్రసన్ను లైన, నేను వరమున కర్ణుడనే నచో ఆ బ్రాహ్మణ పుత్రుడు జీవించు గాక! ఇదే మీ నుండి నే కోరు వరము. నా అపరాధము చేతనే బ్రాహ్మణ బాలుడు అకాల మృత్యువు వాత బడినాడు. అతనిని మీరు జీవింపుడు. నేను గురువుకు ఆనృతము చేయువాడను గాను . నేను నీ పుత్రుడిని బ్రతికించెదనని బ్రాహ్మణునికి మాట నిచ్చితిని. నా ఆయుష్టుతో, సగముతో లేదా పాదముతో నైనా ఈ బాలుడు బ్రతికిన చో ఇదే కోటి వరములకంటె ఎక్కువ.' అని రాముడనగా దేవతలు ప్రీతితో ఇట్లనిరి. 'రామా! నీవు ఆనందముగా నుండుము. బ్రాహ్మణుని ఏకైక కుమారుడు మరల బ్రతికి బంధువులతో కలిసియున్నాడు. ఏ క్షణమున శంబూకుడు నేల కూలెనో ఆ క్షణాన విప్ర పు తుడు జీవించెను. రామా! నీకు శుభమగు గాక! మేము వెళ్ళివచ్చెదము. అగస్త్యాశ్రమమున మహామునిని చూడబోవుచున్నాము. అనగా రాముడు అట్లే యని దేవతల నంపి బంగారు అలంకరణాలతో భూషిత మైన పుష్పకమను విమానము నెక్కెను.

ఇది ముప్పది ఐద - అధ్యాయము.