నారాయణ ఉవాచ - నారాయణ ముని పలికెను:
తరువాత మహాదేవుడు వాడని ముఖ పద్మము గలదియు గంగాతీరమున శయనించి ఉన్నదియు మనోహరముగా నున్నదియు అగు దుర్గాదేవి యొక్క శరీరమును చూచెను. చేతిలో జపమాలతో కాల్చిన బంగారము వంటి శరీరకాంతిలో తెల్లని వస్త్రముతో తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ సతీ శరీరమును చూచి విరహాగ్నితో కాల్చబడినవాడై - తత్త్వములే రూపము ధరించినవాడైనను క్షణములో మూర్చిల్లెను. తాను ఆత్మారాముడు పరాత్పరుడు వేదములకు మూలమైనవాడు యోగీశ్వరులకు పరమగురువు ఐనను భార్యాదుఃఖము మిక్కిలి బలమైనది కనుక దానికి వశుడై కొంత సేపటికి మూర్ఛనుండి తేరుకొని ఆ త్రిలోచనుడు శిలాస్తంభము వలె స్థిరుడును ఐన స్థాణువు భార్య ముఖ పద్మమును చూచి కన్నుల నీరు నిండగా - దీనులకు రక్షణనిచ్చువాడైనను తాను దీనుడై - దీనుల దుఃఖము తొలగించువాడై కూడ చెప్పరానంతగా దుఃఖించెను.
శంకర ఉవాచ – శంకరుడనెను:
ఓ సుందరీ! లే లెమ్ము. ఓ నా ప్రాణేశ్వరీ! సతీ! ప్రియురాలా! నేను నీ భర్తను శంకరుడను. నీ సమీపమునకు వచ్చిన నన్ను చూడుము. నేను శివుడను, జీవులకు మంగళప్రదుడను. సర్వసంపదల రూపుడను. సిద్ధులకు సర్వసిద్ధులనిచ్చువాడను. సర్వమునకు ఆత్మవంటివాడను. సర్వమునకు ఈశుడను ఐనను నీవు లేనిచో శవముతో సమానమైన వాడను సుమా! సర్వశక్తి స్వరూపిణివైన నీతో కూడియున్నప్పుడు, నేను సర్వకార్యములందు శక్తుడను. శక్తిలేనివాడు సర్వకర్మలయందు చేష్టలేమీ లేనివాడు కనుక శవముతో సమానుడు. ఎవడు శక్తిని తెలిసికొనలేడో శక్తిహీనుడై నిందించునో వానిని వదిలి పెట్టుట ఉచితము కానీ ఓ విజ్ఞురాలా! ప్రియురాలా! నన్నెట్లు వదిలి పెట్టుచున్నావు? బ్రహ్మయు విష్ణువును నేనును నీకు సాధింపబడువారము కదా! చిరునవ్వుతో కడకంటి చూపుతో బాటు అమృతము పంటి మాటనోకటి పలుకుము. నీ వియోగ దుఃఖముతో కాల్చబడిన నన్ను మధురమైన నీ చూపుతో తడుపుము. ఇంతవరకు దూరమున నన్ను చూడగనే వెంటనే చిరునవ్వుతో బాటు స్నేహముగా పలుకుచుంటివి. నేడు నీ కోసము దుఃఖించుచున్న నన్ను కోపించిన దాని వలె ఉండి ఎందుకు మాట్లాడుచు లేవు. నా ప్రాణముల కంటే అధికమైన దానా! లెమ్ము. ఏడ్చుచున్న నన్నేల చూడవు? ఓ సుందరీ! జగదంబా! నా ప్రాణముల కాధారమైన పరమేశ్వరీ! నా ప్రాణముల నిక్కడ వదిలివేసి పోవుట నీకు తగదు లెమ్ము. ఓ పతివ్రతా! నేడు నన్నెట్లు సేవించుట లేదు. వేదములను కన్నదానా! తెలిసికూడ వ్రతభంగమేట్లు చేయుచున్నావు? లెమ్ము.
భార్యావియోగముచే జ్వరపీడితుడై ఇట్లు పలుకుచు ఆమె శవమును వక్షఃస్థలమున చేర్చి ఆలింగనము చేసికొని మాటి మాటికీ ముద్దులు పెట్టుకొనెను. ఆమె పెదవుల మీద తన పెదవులానించి వక్షః స్థలముపై వక్షః స్థలముంచి ఆ శంకరుడు మరల మరల కౌగిలించుకొని మూర్ఛ పొందెను. మరల స్మృతికీ వచ్చి ఆమెను తన వక్షఃస్థలమున చేర్చుకొని దుఃఖములో వేగముగా లేచి జ్ఞానులకు పరమ గురువైన శివుడు పిచ్చివాని వలె పరుగెత్తాను. సప్తద్వీపములను సప్త సముద్రములను లోకాలోక పర్వతమును మేరు పర్వతమును భ్రాంతుని వలే చుట్టి తిరుగుచుండెను. శతశృంగ పర్వత పార్శ్వమున జంబూద్వీపమున భారతవర్షమున నిర్జన ప్రదేశములలోను, అక్షయవటము గల గయా క్షేత్రమున గంగాతీరమున ఇతర నదీ తీరములందు ఆమెను పట్టుకొని సతీ! సాధ్వీ! అని పలుకుచూ గొంతెత్తి ఏడ్చెను. ఆ త్రినేత్రుని నేత్రముల నుండి స్రవించిన జలముతో ఒక సరస్సు ఏర్పడెను.
ఆ నేత్ర సరస్సు మునులకు తపస్సు చేయు స్థానము. ఆ మనోహరమైన పుణ్యతీర్థము రెండు యోజనముల విస్తీర్ణము కలది. ఓ హిమవంతుడా! అందులో స్నానమాడిన నరులకు నూరు జన్మలలో చేసిన పాపము కేవల స్నానముతోనే నశించి పునర్జన్మ లేకుండనగును. మానవ దేహము త్యజించి హరిస్తానమును చేరబోదురు. అట్టి సరస్సు వద్ద శంకరుడు దుఃఖించి మరల భూమండలమున భ్రమించెను.
మహాయోగియైన పరమేశ్వరుడిట్లు నిండుగా ఒక సంవత్సర కాలము వీరహాతురమైన మనస్సుతో తిరుగుచుండగా - ఓ పర్వతరాజా! అతడు మోసుకొని పోవుచున్న సతీ శరీరము యొక్క అంగములు ప్రత్యంగములు ఊడిపోయి ఎక్కడెక్కడ పడెనో ఆ ప్రదేశములు సిద్ధ పీఠములయ్యెను. ఆ స్థానములు నరులకు పాంఛలను తీర్చునవి. ఇక మిగిలిన అంగములకు మహాదేవుడు అగ్ని సంస్కారము చేసి ఎముకలను ఒక మాలగా నిర్మింపజేసి కంఠమున అలంకారముగా ధరించెను. భక్తితో ఎల్లప్పుడు ఆ భస్మమును శరీరమున పులుముకొనెను. సతీ ప్రాణేశ్వరీ అని పలుకుచు మరల మూర్ఛిల్లెను. కృష్ణపరమాత్మ నుండి ఆవిర్భవించిన అతడు పరబ్రహ్మను తనను కూడ మరచెను. ఆత్మారాముడు పూర్ణకాముడు వీరహజ్వరము వలన ఏ చేష్టలు లేని వాడయ్యెను. ఇట్లు తిరిగి కైలాస పర్వత సమీపమున వటవృక్షమూలమున పండుకొని ఉండగా ఆశ్చర్యపడి దేవతలందరు చేరవచ్చిరి.
భగవంతుడైన నారాయణుడు లక్ష్మీదేవిచేత పూజింపబడిన పాదపద్మములు గలవాడు రత్నాభరణముల ప్రకాశముతో వెలుగుచున్న శ్రేష్ఠుడు పీతాంబరధారి చతుర్భుజములు గలవాడు చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖమండలము గలవాడు “వనమాల” యన్న పుష్పహారముతో అలంకరింపబడినవాడు తన పారదులతో కూడి రత్నాలంకృతమైన రథము పై నెక్కి చేరవచ్చేను. అట్లే బ్రహ్మయు ఆదిశేషుడును ధర్మదేవతయు దేవతలు మహరులందరు చేరవచ్చి ఆ శివ సభలో లక్ష్మీసాధునికి నమస్కరించిరి.
జ్ఞానులకు ప్రభువైన శ్రీహరి జ్ఞానులకు గురువై ఏడ్చుచు మూర్ఛిల్లియున్న శంకరుని తన వక్షఃస్థలమున చేర్చుకొని ఇట్లు బోధించెను.
శ్రీ భగవానువాచ - భగవంతుడిట్లనెను :
ఓ స్వాత్మారాముడా! (ఆత్మయందే రమించువాడా!) మేల్కొనుము., నా మాటను వినుము. దుఃఖమును శోకమును ఖండించి వేయునట్టి హితమైన అధ్యాత్మ సారమును వినుము. సర్వజ్ఞుడవు. బ్రహ్మలకు శాసకుడవు జ్ఞాననిధివి. అన్ని ఆధ్యాత్మవిద్యలకు బీజమైనవాడవు నీవు. ఐనను నీకు బోధ చేయుచున్నాను. ప్రాణ సంకట పరిస్థితిలో పామరుడు కూడ పండితునకు బోధించుటకు సమర్ధుడే. ప్రతివ్యక్తికి వేరొక వ్యక్తి ఒకరికొకరు బోధించుకొను వ్యవహారము జనులలో నున్నది. సమస్త సుఖదుఃఖములకు మయనాశ్రయించి యున్న గుణములే కారణము (మూలము అగుచున్నవి. విష్ణుమాయ మిక్కిలి బలము కలది. అది గుణములతో (సత్త్వరజస్తమస్సులతో) కలిసి మిక్కిలి బాధించుచున్నది. ఓ ఈశ్వరా! దుర్దినము సంభవించినప్పుడు (వ్యతిరేక కాలములో} దుఃఖము శోకము భయము ఏర్పడుచున్నవి. అది గడిచిపోయి సుదినము రాగానే అప్పుడు హరము ఐశ్వర్యము దర్పము వృద్ధి పొందుచున్నవి. విద్వాంసులు వీటినన్నిటిని స్వప్నములుగా లెక్కించుచున్నారు. ఓ సనాతనుడా! జ్ఞానమునకు బీజమైనవాడా! మహాదేవా! జ్ఞానము పొందుము. నీలో మెలకువను (చేతనాశక్తిని పొందుము. నీకు శుభమగుగాక. నీవు సతీదేవిని ముందు పొందగలవు. అది నిశ్చయము. జలమేప్పుడును చల్లనిదే. అగ్నిని, దహించి వేయుశక్తి విడువదు. తేజస్సు సూర్యుని భూమి గంధమును విడువనట్లే నిన్ను సతీదేవి విడువదు అని ఈ మాటలను విని కన్నులు తెరచి హరీని వినుమనుచు త్రినేత్రుడు పలికెను.
త్రినేత్ర ఉవాచ - మూడుకన్నుల దేవుడు పలికెను :
తేజస్వరూపుడవగు నీవెవరు? నీ సమీపమున నున్న వీరెవరు? నీ నామమేమి? వీరీ నామములేవి? సతి ఎవలె? నేనెవడను? ఈ మాటలు పల్కుచున్న నీవెవడవు? ఈ కింకరులెక్కడి నుండి వచ్చిరీ? నీవెక్కడికి పోవుచున్నావు ? నేనెక్కడికి పోవుచున్నాను? వీరెక్కడికీ పోదురు? చెప్పుము” అని శివుడనుచుండగా వీని శ్రీహరి తన గణములతో పోటు రోదించెను. ఓ పర్వతుడా! తన కన్నీటితో తనవలె దుఃఖించుచున్న త్రినేత్రునిని శ్రీహరి తడిపెను. హరిహరుల నేత్ర జలము పడుట వలన అక్కడి లోకములను పావనము చేయునట్టి తీర్థము గల పుణ్యసరసొకటి - భారత ఖండములో అస్తగిరికి పడమట అక్షయవట. సమీపమున ఏర్పడెను. ఆ స్థలము తపస్సు చేయువారి తపస్సులకు ముక్తి బీజము (ముక్తి చేకూర్చు స్థానము) ఆయెను. . మరల శ్రీహరి హారునికి అధ్యాత్మ విద్యను - వినునట్టి సర్వదేవతలకును, నిష్ణాబ్రహ్మచారులైన మునులకును (జ్ఞాన ప్రదముగా) చెప్పనారంభించెను.
శ్రీభగవానువాచ - భగవంతుడిట్లనెను :
ఓ శంకరా! జ్ఞానానందములు గల సనాతనుడా! జ్ఞాననిధీ! పరాత్పరా! నీవు దుఃఖము వలన జ్ఞానమును మరచిపోతివి. ప్రకృతిలోని సర్వజీవులకు ప్రతిజన్మయందు మాటి మాటికి సుదినము దుర్దినము అన్నవి ఏర్పడుచునే ఉన్నవి. ఆ సుదిన దుర్దినములే సుఖ దుఃఖములకు బీజములు (కారణములు) అగుచున్నవి. సుఖము వలన హర్షము దర్పము శౌర్యము మిక్కిలి మదము రాగము (ప్రేమ) ఐశ్వర్యము కామము విద్వేషము నిరంతరము ఏర్పడుచున్నవి. ఇక దుఃఖము వలన శోకము భావతీవ్రత భయము అన్నవి నిత్యము ఏర్పడుచున్నవి. ఓ మహేశ్వరా! వీటికి బీజమైనది నశింపజేయబడినప్పుడు ఆ భావములన్నీయు చంపబడుచున్నవి. అట్టి బీజభూతములైన సుదిన దుర్దినములు సర్వవిధ కర్మల నుండి ఉద్భవించును. ఆ కర్మవలననే శుభాశుభములు కలుగుచున్నవి కనుక కర్మ తపస్సు చేత సాధింపదగినది. ఆ తపస్సు స్వభావముచేత సాధ్యము. స్వభావము అస్తము వలన ఏర్పడును. ఈ అభ్యాసము సంసర్గము (సహవాసాదులు! చేత సాధింపదగినది. సంసర్గము పుణ్యము మూలమున ఏర్పడును. అట్టి పుణ్యమునకు మూలము మనస్సు. ఆ మనస్సే చంచలమైనప్పుడు పాపమునకు మూలము. ఓ శంభూ! సర్వేంద్రియములు ముందు నడుచుచుండగా మనస్సు వ్యవహరించును. ఆ మనస్సు నా అంశమే. అన్నిటికి జనకుడను నేను. చిత్తమునకు ఈ బ్రహ్మఅధిపతి.
ఓ శంభూ! పరబ్రహ్మ మొక్కటియే. సత్త్వరజస్తమో గుణ భేదములను బట్టి ఎల్లప్పుడు మూర్తిభేదములేర్పడుచుండును. ఆ బ్రహ్మమే శివమై సగుణ నిర్గుణములైన వివిధ వస్తువులగును. మోయ నాశ్రయించి యున్న బ్రహ్మ సగుణము మాయ కతీతముగా నున్నబ్రహ్మ నిర్గుణము. నిర్గుణమైన బ్రహ్మమే ఇచ్ఛా శక్తితో కూడి స్వేచ్ఛామయుడు కనుక మార్పు పొందుచున్నాడు. ఇచ్ఛాశక్తి యన్నది - ప్రకృతియే. అది నిత్య, సర్వమును జన్మింపజేయునది (తల్లి). కొందరు సనాతనమై జ్యోతిరూపమైన బ్రహ్మము ప్రకృతి ఒక్కటే
అందురు. కొందరు ప్రకృతి పూర్వకమైన బ్రహ్మమును ద్వివిధముగా చెప్పుదురు. . వినుము. మాయా, పురుషులకంటే శ్రేష్ఠముగా ఒకే బ్రహ్మమని ఎవరు చెప్పుచున్నారో - ఆ అవికారి బ్రహ్మము. నుండీ ఆ యిద్దరు (ప్రకృతి పురుషులు) ఏర్పడుచున్నందున ఆ బ్రహ్మమే సర్వమునకు మూలము. ఆ ఒక్కటియైన పరబ్రహ్మ తన ఇచ్చచేత రెండు విధములగుచున్నది. ఇచ్ఛాశక్తియైతే ప్రకృతియే. ఆమె సర్వశక్తులను కనునది (పుట్టించునది) సగుణ బ్రహ్మము కొంత అశక్తుడైనను సర్వమున కాధారము సనాతనము సర్వసాక్షియై ఆ సర్వేశ్వరుడు ఫలదాతయై ఆంతట ఉన్నాడు. వికారము పొందిన బ్రహ్మ శరీరము నిత్యము ప్రాకృతము అని రెండు విధములు. నిత్యము నాశము లేనిది. ప్రాకృతము నశించు స్వభావము కలది. ఓయీ! నీవును నేనును ఉన్నామే మన ఇద్దరికి నిత్య విగ్రహములు మన అంశభూతులెవరున్నారో వారు ప్రాకృతులు కనుక నష్టవిగ్రహాలు. వారు నా అంశగల విష్ణురూపులు నీ అంశ గల ఏకాదశ రుద్రాదులు (వీరి ఆకారములు ప్రాకృతములు కనుక నశించును).
ఓ శంభూ! నాకు కూడని ద్విభుజము (రెండు హస్తములు కలది) చతుర్భుజము (నాలుగు హస్తములు కలది) అని రూపము రెండు విధములుగా నున్నది. వైకుంఠలోకములో లక్ష్మీదేవితో పార్షదులతో కూడి చతుర్భుజుడనుగా - గోలోకములో గోపీ గణములతో రాధాదేవితో కూడి ద్విభుజుడనుగా - ఆ మతములోనిట్లు రెండు ప్రధానమైనవిగా నా రూపము ద్వీషధమని చెప్పుదురు. పరమ పురుషుడు సదానిత్యుడు. సృష్టికి ఈశ్వరియైన ప్రకృతియు నిత్యురాలే. ఎల్లప్పుడా యిద్దరు గాఢముగా సంశ్లేషించి యుండి (ఆలింగనముతో ఒకరితోనొకరు కలిసి) సమస్త ప్రాణికోటికి తల్లిదండ్రులైరి. శరీరములు ధరించియు శరీరములు లేక కూడ తమ ఇచ్ఛానుసారము సర్వరూపములు గలవారై ఉన్నందున ఆ పురుషునకు. అట్లే ప్రకృతికి ఎల్లప్పుడు ప్రాధాన్యము కలదు. ఓ శంభూ! నీవు సతీదేవిని కోరుచుంటివేని ప్రకృతియొక్క స్తోత్రము చేయుము. ఆ స్తోత్రమింతకు ముందే దుర్వాసమునికి నీవిచ్చియుంటివి. అది కణ్వశాఖ యందు చెప్పబడిన దివ్యస్తవము. దానితో జగత్ర్పసువును (జగత్తును కన్న ప్రకృతిని భజించుము. శివా! నా ఆశీస్సుతో నీకు శోకము నశించి శుభమగుగాక, నీ మూర్ఛకు (ప్రాణముల ఆపదకు మూలమైన స్త్రీ విరహజ్వరము నీనుండీ దూరముగా పోవుగాక. ఇట్లు శివునితో పలికి లక్ష్మీనాథుడు సంభాషణము ముగించెను. అప్పుడు మహేశ్వరుడు స్నానమొనర్చి భక్తితో శ్రీకృష్ణునకు బ్రహ్మకు నమస్కరించి భక్తితో పులకరించిన శరీరము గలవాడై హస్తములను నమస్కార ముద్రగా చేసి ప్రకృతి స్తవనము చేయుటకారంభించెను.
మహేశ్వర ఉవాచ - మహేశ్వరుడనెను:
అంతట వ్యాపించు స్వరూపము గలదానా! బ్రహ్మపత్నివగు సరస్వతీ! సనాతనీ! నన్ననుగ్రహించుము. పరమాత్మ స్వరూపిణీ! పరమానందము రూపమైనదానా! ఓ భద్రా! భద్రములిచ్చుదానా! దుర్గా! ఆటంకములను నశింపజేయుదానా! శత్రుదుర్గములను భగ్నము చేయుదానా! సంసార సముద్రమును తరింపజేయుటకు నావ రూపము పొందిన ప్రాచీనురాలా! సన్ననుగ్రహించుము. సర్వేశీ! సృష్టి సర్వస్వము నీ రూపమైనదానా! సర్వమునకు బీజభూతురాలా! సర్వులకు ఆధారమైనదానా! సర్వవిద్యామూర్తీ! జయమిచ్చుదానా) నన్ననుగ్రహించుము. సర్వమంగళద్రవ్యములు నీ రూపమైనదానా! సర్వమంగళములిచ్చుదానా! సర్వమంగళా! సమస్త మంగళములకాధారభూమీ! అనుగ్రహించుము. నిద్రాదేవీ! జాడ్యమూర్తీ! క్షమాదేవీ! శ్రద్దాదేవీ! తుష్టి పుష్టి రూపిణీ! లజ్ఞాదేవీ! మేధాదేవీ! బుద్ధిరూపా! భక్తులయందు వాత్సల్యము {బిడ్డలమీదీ మాతృప్రేమ} గలదానా! అనుగ్రహించుము. వేదరూపా! వేదదాత్రీ! వేదమూలమ! వేదాంగములు రూపమైనదానా! వేదమాతా! నన్ననుగ్రహించుము. దయాదేవీ! జయమూర్తీ మహామాయా। జగదంబా! క్షాంతి శాంతిరూపా! సర్వజీవులయందు ఆకలిదప్పులే స్వరూపమైన తల్లీ నాకు ప్రసన్నురాలవు కమ్ము.
నారాయణుని ఒడిలో లక్ష్మిగా, బ్రహ్మవక్షఃస్థలమందు సరస్వతిగా, నా ఒడిలో మహామాయగా నున్న విష్ణుమాయా నా యందనుగ్రహము చూపుము. కాలము యొక్క అత్యలాంశములైన కళాకాష్ఠలు వ్యక్తాంశములైన దివారాత్రములు స్వరూపములైనధానా! ఋతువులు మొదలగు కాలపరిణామములనిచ్చుదానా! దేవీ! దీనులయందు దయగలదానా! అనుగ్రహించుము. సర్వశక్తి గుణములకు మూలమైనదానా! కృష్ణుని వక్షఃస్థలమున నున్న రాధాదేవీ! కృష్ణునికీ ప్రాణముల కంటే అధిక ప్రియమైనదానా! భద్రా! కృష్ణపూజితా! అనుగ్రహింపుము. కీర్తిరూపిణీ! కీర్తులకు మూలధారమా! కీర్తినిచ్చుదానా! సర్వ దేవీ స్వరూపములు ధరించుదానా! స్త్రీరూప నిర్మాణ దేవతా! నీ కళలలోని పదహారవ భాగమో సమస్త స్త్రీ రూపములు ధరించుదానా! నన్ననుగ్రహింపుము. సర్వసంపదలు స్వరూపమై సర్వసంపదలిచ్చు శుభమూర్తీ! సర్వసంపదలకు మూలమై పరమానందము రూపమైనదానా! అనుగ్రహింపుము. కీర్తిమంతులచేత పూజింపబడిన తల్లీ! యశస్పులకు నిధియైన దానా! అనుగ్రహింపుము. సర్వజగముల కాధారభూతురాలా! రత్నముల కాధారమైన వసుంధరా! చరాచర స్వరూపిణీ! ఆలస్యము చేయక నన్ననుగ్రహింపుము, యోగీశ్వరీ! యోగస్వరూపిణీ యోగమూలమా! యోగశక్తిదాత్రీ! యోగమునకధిష్టాన దేవతా! దేవీగణములకు నాయకురాలా సిద్ధయోగినీ సర్వసిద్ధుల రూపమైనదానా! అణిమాది సర్వసిద్ధిదాయినీ! సర్వసిద్ధులకు ! మూలమైన తల్లీ! సిద్ధేశ్వరీ! నన్ననుగ్రహించుము. ఓ మహేశ్వరీ! సర్వశాస్త్రముల వ్యాఖ్యానములో మతభేదము లేర్పడగా తత్వశాస్త్రమందే జ్ఞానము చెప్పబడినదో ఆ సర్వమును క్షమించుమా!
కొందరు ప్రకృతికి ప్రాధాన్యమును మరికొందరు పురుషునకు (ఈశ్వరునకు) ప్రాధాన్యము చెప్పుదురు. ఈ రెండు మతములేర్పడగా పండితులాస్థితినీ - వ్యాఖ్యానించుటలోని భేదముగా తెలిసికొనిరి. పూర్వము మహావిష్ణువు యొక్క నాభియందున్న కమలోద్భవుని (బ్రహ్మను) మధుకౌటభులనెడి మహాదైత్యులు చంపుటకు సిద్ధపడగా - అది చూచి బ్రహ్మ రక్షింపుమని స్తుతిచేయుచుండగా – ఆ యిద్దరు దౌత్యులను వినాశము చేయుటకు గోవిందునికి (జగన్మాత) బోధ చేసెను. అప్పుడు నారాయణుడు నీ భక్తి కారణముగా ఆ మహాసురులను సంహరించెను. నీతో కూడీ అతడు సర్వేశ్వరుడైనాడు. నీతో కూడిలేనప్పుడతడు అనీశుడు (కార్యనిర్వహణకు అసమర్థుడు). పూర్వము త్రిపురాసురులతో యుద్ధము చేయుచు నేను ఆకాశము నుండి క్రిందపడగా - ఓ సురేశ్వరీ!విష్ణువుతో కూడి యున్న నీ చేత రక్షింపబడితిని, ఓ ఈశురాలా! విరహాగ్నిలో మిక్కిలీ కాల్పబడిన, నన్ను ఇప్పుడు రక్షించుము. నీ స్వరూప దర్శనమను పుణ్యము చేత - ఓ పరమేశ్వరీ! నన్ను కొనవలసినది.
ఇట్లు పలికి ఆగిపోయిన శివుడు రత్నసార రథము మీద శతభుజములతో ఆకాశమందున్న ఆ దేవిని సంతోషముతో దర్శించేను. కరిగించిన బంగారము వంటి కాంతితో రత్నాభరణ భూషితురాలై- చిరునవ్వుతో ప్రసన్నముగా నున్న ముఖము గలదై ఉన్న ఆ జగన్మాతను - సతీదేవిని చూచి శివుడు విరహాసక్తితో త్వరగా మరల స్తుతించెను. ఏడ్చుచు ఎడబాటు వలన కలిగిన దుఃఖమును నివేదించెను. తన శరీరమందలి అస్థిమాలను (ఎముకల దండ) అలంకారముగా పులుముకొన్న భస్మమును చూపించెను. అనేకముగా తన దోష పరిహార వాక్యములు చెప్పి ఆ సుందరిని సంతోష పరచెను. నారాయణుడు బ్రహ్మ ధర్మదేవత శేషుడు దేవఋషులు ఈశ్వరీ! శివుని రక్షింపుమని పలికి ఆ సనాతనిని స్తుతించిరి. వారి స్తోత్రముతో సంతుష్టిపొంది ఆమె వెంటనే తన ప్రాణేశుడైన శంకరుని గూర్చి ఆ ప్రాణవల్లభ కృపతో ఇట్లు పలికెను.
ఓ మహాదేవా! నాకు ప్రాణముల కంటే అధిక ప్రియమైన వాడా! స్థిరుడవు కమ్ము, యోగీశుడవగు నీవు నాకు జన్మజన్మలకు ఆత్మవు నా భర్తవు. పర్వతరాజు యొక్క పత్నియందు నేను జన్మించి నీకు భార్యనగుదును. నీవిక విరహాజరము వదలుము. ఇట్లు శివునోదార్చి ఆమె అంతర్ధానమయ్యెను. సిగ్గుతో తన మెడను వంచుకొన్న శివుని దేవతలోదార్చి వెడలిపోయిరి. శివుడు విరహజ్వరము విడిచి పెట్టి వెంటనే తన గణములతో బాటు నర్తనము చేసి హర్షము పొందిన మనస్సుతో కైలాసమున కేగెను. శివకృతమైన ఈ ప్రకృతి స్తోత్రమును పఠించిన నరుడు జన్మజన్మలకు భార్యా వియోగము పొందకుండ నుండును. ఇహలోకములో ధర్మార్థకామ పురుషార్ధ సుఖములను అనుభవించి మోక్షము పొంది శివలోకమును చేరును. ఇందు సంశయము లేదు.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన శంకరుని శోకము తొలగింపబడుట అను కథాంశము గల నలుబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 43 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Enraged by the death of his elephant, King Kaṃsa ordered his invincible wrestling champions, Chāṇūra and Mūshika, to engage Kṛshṇa and Balarāma in mortal combat. The arena echoed with thunderous blows as the divine brothers wrestled the mighty champions effortlessly, lifting Chāṇūra high above their heads and hurling him lifeless to the ground. Seeing his champions slain, Kaṃsa commanded his guards to arrest the boys, but Kṛshṇa leaped swiftly onto the royal dais, grabbed the terrified king by his hair, and hurled him crashing down into the center of the arena, slaying the tyrant instantly and liberating Mathura from oppression.