శ్రీ నారాయణ ఉవాచ :-
నారాయణమహర్షి యిట్లు పలికెను :
ఒకమారు నందుడు శ్రీకృష్ణునితో బాటు బృందావనమునకేగెను. అక్కడికి సమీపవనమైన భాండీర వనములో తమ ధనమైన(పశుసంపద) గోసమూహమును మేతకు విడిచి ఒక సరస్సులోని తియ్యని మంచినీటిని కుమారునకు త్రాగించి తాను త్రాగి తన వక్షస్థలముపై కుమారుని ఎత్తుకొని ఒక చెట్టు మొదట కూర్చుండెను.
ఓ నారదో ! ఇంతలో మాయలో మనుష్యరూపము ధరించిన శ్రీకృష్ణుడు తన మాయను ప్రయోగించి అకస్మాత్తుగా ఆకాశమంతయు మేఘములు క్రమ్ముకొనునట్లు చేసెను, మేఘము భావరించిన ఆకాశమును నల్లబారిన (చీకటి విస్తరించిన) అరణ్యభాగమును పెద్ద శబ్దముతో గూడిన వేగవంతమైన హోరుగాలిని పిడుగుపాటు వలన భయంకరమైన మహాశబ్దము కుండపోతగా నున్న వర్షధారను ఊగిపోవుచున్న చెట్లను కూలిపోవుచున్న చెట్ల మొదళ్లను చూచి నందుడు మిక్కిలి భయపడెను.
“అయ్యో! గోవులను దూడలను వదిలి నా నివా సస్థానమున కెటు పోదును. పోకపోయినచో ఈ బాలకునకీ పరిస్థితిలో ఏమీ సంభవించునో కదా" అనీ నందుడు పలుకుచుండగా వర్షధారలకు భయపడి తండ్రి కంఠమును కౌగిలించుకొని బాలకృష్ణుడేడ్చుచుండెను. ఇంతలో నక్కడకు రాజహంస నడకను తిరస్కరించు మందగమనముతో రాధాదేవీ శ్రీకృష్ణ సన్నిధికి ఏతెంచెను.
శరదృతువు నందలి పూర్ణిమనాటి చంద్రుని కాంతిని దొంగిలించినట్లున్న మనోహరమైన ముఖము గలదియు, శరత్కాలమందు పట్టపగటి పద్మముల సౌందర్యమును స్వాధీనపరచుకొన్న కన్నులు గలదియు, కనుపాపను చుట్టియున్న కనురెప్పల మీద విచిత్రమైన కాటుక యొక్క తళతళలు గలదియు, గరుడపక్షి చెంచుపు (ముక్కు} యొక్క ప్రశంసార్హమైన సౌందర్యమును తక్కువ పరచు నాసిక (ముక్కు) గలదియు, ఆ ముక్కున శోభాకరముగా ధరించిన పెద్ద గండు ముత్తెము యొక్క బెజ్జ్వల్యము (ధగధగలాడుట) కలదియు, మాలతీ పుష్పమాలలు చుట్టిన కబరీ భారము (వెండ్రుకల ముడి) గలదియు, గ్రీష్మ ఋతువులోని మధ్యాహ్న సూర్యుని తేజస్సును హరించిన కర్ణకుండలములు (చెవికమ్ములు) గలదియు, పండిన దొండపండు కాంతిని మించిన పెదవులు గలదియు, ముత్యాల వరుస వలె తెల్లని పలువరుసతో ప్రకాశించుచున్నదీయు, అరవిచ్చిన మొల్ల కుసుమముల కాంతిని తక్కువ పరచు చిరునవ్వు గలదియు, కస్తూరీ తిలకముతో బాటు సిందూరపు చుక్క బొట్టు అలంకరించుకున్నదియు, మంగళకరమైన మల్లె చేరును (జాలకదండలు) శిరస్సున ధరించినదియు, వర్తులాకారము (గుండ్రని గా సున్న మిక్కిలి అందమైన చెక్కిళ్లపై పులకలు కలదియు, శ్రేష్ఠములైన. నవరత్నముల హారములు వక్షఃస్థలమందలంకరించుకొన్నదియు, సుందరమైన మారేడు పండ్ల జంటవలె కఠిన స్తనములు గలదియు, ఆ ప్రదేశము రత్న తేజస్సుతోసు మకరీకా పత్ర రేఖలతోను (కస్తూరి కుంకుమ పువ్వు ద్రవముతో తీరు తీరు రేఖలు గీయుట) వెలుగుచున్నదియు, మనోహరమైన సౌందర్యముతో గుండ్రముగా నున్న పొట్టగలదియు, మూడు ముడతలు పైన గల లోతైన నాభి ప్రదేశము గలదియు, శ్రేష్ఠమైన రత్నములతో నిర్మించబడిన మొలనూలు దాని క్రింద చేరులు అలంకరించుకొన్నదియు, మన్మధుని అస్త్రముల సారము వంటి బొమ ముడులతో యోగీంద్రుల మనస్సులను గూడ మోహింపజేయునదియు, పర్వతములను తెగనాడు కఠినమైన పిరుదులు గలదియు,
నేలపై పూసిన పద్మముల కాంతిని దోచుకొనునట్టి అందమైన అడుగులు గలదియు, యావకద్రవము (పసుపుపూత వంటిది) రత్నాలంకారములు కలిగి నగల యందలి మణుల కాంతిని దోచుకున్న అలక (పారాణి) కము వలన మన్మధావిర్భావము కలదియు, సద్రత్న నిర్మితములై వ్రాయుచున్న అందాలతో రంజిల్లు పాదములు గలదియు, రత్న కంకణములు దండకడియములు సుందర శంఖాకృతి గల గాజులు అలంకరించుకొన్నదియు, రత్నాల ఉంగరములతో అగ్ని కాంతి వలె ఎరుపు పసుపు వన్నె గల వస్త్రములతో మిక్కిలి వెలుగుచున్నదియు, అందమైన సంపెంగ పువ్వుల కాంతిని దోచుకున్న పసిమీవన్నె) శరీరము గలదియు, వేయి రేకుల తామరపువ్వును విలాసముగా నొక చేతను శుభంకరమైన ముఖమండల శోభను దర్శించుటకు గాను రత్నముల యద్దము నొకచేతను ధరించీ యున్న దివ్యమూర్తినీ, జనరహితమైన ఆ ప్రదేశమున కోటి చంద్రుల కాంని దోచుకొన్న దివ్యశరీరకాంతితో పదిదిక్కులను వెళ్లించుచున్న ఆ రాధాదేవిని దర్శించి ఆ నందుడు పరమాశ్చర్యము నొందెను.
భక్తితో తలవంచి ఆనందాశ్రువులు పొంగివచ్చునట్టి కన్నులు గల నందుడామెకు నమస్కరించెను.
“గర్గమునీ వలన శ్రీహరికి నీవు లక్ష్మి కంటె ప్రియురాలవని తెలుసుకొంటినీ. ఇతనినీ మహావిష్ణువు కంటే పరుడైన - హేయగుణ రహితుడైన అచ్యుతునిగా ఎరుగుదును. ఇట్టి జ్ఞానము గలవాడనయ్యును మానవుడనైన నేను విష్ణువు యొక్క మాయచేత మోహితుడను {అజ్ఞానము గలవాడను) ఐతిని, ఓ మంగళమూర్తీ ! నీ ప్రాణనాథుని గ్రహించుము. నీ సుఖమున కనుగుణముగా పొమ్ము.. మీ ఉభయుల మనోరథము తీర్చుకొని తరువాత నా పుత్రుని నాకీయగలవు.” ఇట్లు నందుడు పలికి భయముతో ఏడ్చుచున్న పిల్లవానిని ఆమెకిచ్చెను. రాధాదేవి ఆ బాలకుని తీసుకొని అతని స్పర్శ సుఖము వలన మధురముగా నవ్వెను.
రాధాదేవి నందునీతో నిట్లనెను. నందుడా! ఈ రహస్యమును జాగ్రత్తగా కాపాడుము. బయట పెట్టకుము. అనేక జన్మల పుణ్య ఫలము వలన నీకు కన్పించితిని. నీవు ప్రాజ్ఞుడవు. (బాగుగా తెలిసినవాడవు) గరుని వచనముల వలన మా జన్మమూలము తెలిసికొంటివి. గోకులములో ఉభయుల రహస్య చరిత్రమును చెప్పగూడదు. ఓ గోకుల నాధుడా ! నీ మనస్సున గలవాంఛితమును పరముగా కోరుకొనుము. దేవతలకు దుర్లభమైనదైనను లీలగా నేను నీకిత్తును.
రాధాదేవి వాక్కు విని ఆ ప్రజనాథుడు ఆమెతో సీట్లనెను. ఓ జగన్మాతా 1 పరమేశ్వరీ మీ ఉభయుల పాదములయందు భక్తిని నాకిమ్ము. నాకితరమైన కోరిక లేదు. మిక్కిలి దుర్లభమైన మీయుభయుల సన్నిధియందు నీవాసము (సామీప్య ముక్తి) నాకిష్ణువు కనుక ఆ స్థితిని మా యిద్దరికి (యశోదకు తనకు) ఇమ్ము.
నందుని వచనము విని ఆ పరమేశ్వరి “ఓయీ! సాటిలేని మాదాస్యమీత్తును. ప్రస్తుతము. భక్తినీకేర్పడు గాక. మీ దంపతుల వికసించిన హృదయములలో ఇతరులకు మిక్కిలి దుర్లభమైన - మాయుభయముల పాదపద్మముల యందలి స్మృతి శాశ్వతముగా నుండుగాక. నా వరము వలన మీ ఉభయులను మాయ కప్పివేయదు. అంత్యమున మానవ శరీరములను విడిచి గోలోకమునకు పోవుదురు గాక”.
ఆమె సందునీతోనిట్లు పలికి బోలకృష్ణుని రొమ్మున చేర్చుకొని తన కోరిక ప్రకారము చేతుల నెత్తుకొనియు అతనిని శ్రీకృష్ణుని} దూరముగా కొనిపోయెను. కామముతో వక్షస్థలమున చేర్చుకొని మాటిమాటికి కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొనుచు సర్వాంగములు. పులకరింపగా రౌనమండలమును స్మరించెను.
అంతలో రాధాదేవి మాయా కల్పితమైన రత్న మంటపమును చూచెను. ఆ మంటపము వంద రత్న కలశముతో - నానా విధములైన ఆశ్చర్యకర చిత్రలేఖనములతో చిత్రకాననములతో శోభిల్లుచు - ఎజ్ఞనీ సిందూరమణి స్తంభములతో విరాజిల్లుచు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వులను పరిమళ పదార్థముల ద్రవముతో కూడి మాలతీ పుష్పమాలలతో కూడియున్న పుష్పశయ్యలో - నానా విధ భోగపదార్థములు దివ్యమైన దర్పణములు (అద్దములు} శ్రేష్ఠములైన ముత్యాల హారములు రత్నహారముల చేత అలంకరింపబడి - రత్న నిర్మితమైన కవాటము కళి, మంచి వస్త్రములతో పతాకములతో అలంకరింపబడి - కుంకుమ వర్గ సోపానములేడింటితో కూడియుండెను. పుష్పించిన వృక్షములందు తుమ్మెదలు తిరుగాడు ఉద్యానమును కూడ దర్శించి ఆ రాధాదేవి ఆ మంటపములోని అభ్యంతర గృహమునకు (లోపలి యిల్లు) సంతోషముతో నేగెను.
అక్కడ కర్నూరాది సుగంధ వస్తువులతో కూడియున్న తాంబూలమును రత్నకుంభమందున్న చల్లని మంచినీటిని సుధతోసు తేనెతోను నిండియున్న రత్నకుంభములను. రాధ చూచెను.
తన యొడిలోని కిశోరము (చిన్నవాడు) వలెనే శ్యామసుందరుడును కోరదగిన పురుషుడును కోటి మన్మథుల విలాసముతో వెల్లుచున్నవాడును. శ్రీగంధముచేత అలంకరింపబడిన వాడును, పుష్పశయ్యయందు పండుకొని యున్నవాడును, పరుల మనస్సులను హరించునట్టి చిరునవ్వు గలవాడును, పీతాంబరము ధరించి యున్నవాడును, ప్రసాదగుణముతో గూడిన చూపులు తేటనైన పదసము (ముఖము గలవాడును, శ్రేష్టమైన మణులతో నిర్మించబడినవియు ధ్వనించుచున్నవియు (కుణుకుణుమని) నైన మంజీరములు (అందెలు) తో విలసిల్లుచున్నవాడును, మేలి రత్నములతో నిర్మితములైన దండకడియములు ముంచేతి కంకణములు గలవాడును గండస్థలము (చెక్కిళ్లు - చెంపలు)న మణికుండలముల కాంతి గలవాడును, వక్షః స్థలమందు కౌస్తుభమణి ఉజ్జ్వలముగా వెలుచుండగా - శరదృతువులో పూర్ణిమనాటి చంద్రమండలకాంతిని దోచుకొన్న ముఖతేజస్సుతోను, శరత్కాలమందు వికసించిన కమలముల యందమును మరిపించు లోచనములతోను, మాలతిపూల దండలు చుట్టి నడుమ నెమలి పింఛము చెక్కిన సుందరమైన మువ్వంకలకొండె కొప్పుతో శోభను విరజిమ్ముచు ఆ రత్నమందిరమును కలయజూచుచున్న - నవయువకుని దర్శించి తన అక్కున (కౌగిలిలో చేర్చుకొనియున్న బాలకుడు కన్పించనందున సర్వప్రాణుల స్మృతిరూపిణియైనను ఆ రాధాదేవి ఆశ్చర్యము పొందెను. ఆ రాసమండల నాయిక మిక్కిలి మనోహరమైన నవబోపనుని రూపము చూచి మోహమును పొందెను.
రాధాదేవి నిలువెల్ల పులకించి కనురెప్పపాటు లేనిదై చిరునవ్వు చిందించుచు మన్మధుని వలన తొందరపాటు పొంది క్రొత్తనైన కూటమి యందు సంభోగము) ఆసక్తిగలదై తన కన్నులనెడి చకోరపక్షులతో అతని ముఖచంద్రుని సౌందర్యమును కోరిక వేడుకలు మీర త్రాగెను.
ముఖకమలమున చిరునవ్వు గలదై ప్రక్క చూపులతో చూచుచు నవసంగమమునకు యోగ్యతగలదై యున్న రాధతో శ్రీహరి ఇట్లు పలికెను.
శ్రీ కృష్ణ ఉవాచ :-
శ్రీ కృష్ణుడు యిట్లు పలికెను :
రాధా ! దేవ సభామధ్యమున గోలోకమున జరిగిన వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటివా ? ప్రియా ! పూర్వము నేను స్వీకరించిన అంగీకారమును నేడు సంపూర్ణముగా నెరవేరును. ఓ సుందరవదనా ! నీవు నాకు ప్రాణముల కంటే అధికముగా ప్రియురాలవు.
నా విషయమున నీవిట్లో సి విషయమున నేనట్లే. నిశ్చయముగా మసయుభయులకు భేదము లేదు. పాలలో తెల్లదనము వలె అగ్నిలో కాల్పడి శక్తివలె పృథివీ యందు గంధము వలె నీను నీయందు సంతతమున్నాను. మట్టీ లేకుండ కుమ్మరి కుండలు చేయ జాలనట్లు నీవు లేకుండ నేను సృష్టి చేయుటకు సమర్థుడను కాను. సృష్టికి ఆధారభూతురాలవు నీవు. నాశము లేని విత్తనము వంటివాడను నేను. ఓ సాధ్వీ ! శయ్యమీదికి రమ్ము. నన్ను నీ వక్షస్థలమున చేర్చుకొనుము.
ఓ సుందరముఖీ ! దేహమునకు భూషణము వలె నీవు నా శోభాస్వరూపురాలవు. నీవు లేని దశలో లోకులు నన్ను కృష్ణుడందురు. అట్టివారే నీతో నేను కలిసినప్పుడు పరమాత్మయైన శ్రీకృష్ణుడందురు (శ్రీకృష్ణపరమాత్మ) నీవే లక్ష్మివి, నీవే లోకమునకు సంపదవు. నీవు లోకములకు లోకులకు) ఆధారస్వరూపిణివి. సర్వవిధ శక్తుల స్వరూపురాలవు నీవు. సర్వరూపములు గలవాడనైన అక్షరుడను నేను నేను తేజః స్వరూపుడనైనప్పుడు నీవును తేజోరూపురాలవగుదువు. నేను శరీర రహితుడనైనప్పుడు నీవును శరీరము లేనిదానమే. ఓ సుందరీ ! నేను ఎల్లప్పుడెడబాయక కూడి యుండుట వలన సర్వబీజముల స్వరూపము గలవాడను. నీవు శక్తిస్వరూపవు. సర్వశ్రీరూపములు ధరించుదానవు, నా అంగము యొక్క అంశయే స్వరూపముగా గలదానవు, నీవే మూలప్రకృతివైన ఈశ్వరివి. శక్తిలో బుద్ధిలో జ్ఞానములో నాతో సమానురాలవు.
ఏ నీచమానవుడు మన యిద్దరిని వేర్వేరుగా (భేదబుద్ధితో) చూచునో వాడు సూర్యచంద్రులున్నంతవరకు కాలపాశబద్ధుడై నరకమున వసించును. వాడేడు తరములముందున్న వారిని తరువాత ఏడు తరముల వారిని కూడ పుణ్యలోకమునుండి క్రిందికి పడగొట్టును. కోటి జన్మల నుండి వాడార్జించిన పుణ్యము నశించిపోవుట నిశ్చయము. ఏ నరాధములు అజ్ఞాసము చేత మన ఉభయులను నిందింతురో వారు సూర్యచంద్రులున్నంత కాలము ఘోర నరకమున యాతనలననుభవింతురు.
“రా” యన్న శబ్ద ముచ్చరించు వానికి నేనే భయపడి ఉత్తమ భక్తి యోగమునిత్తును. “ధా” శబ్దమునుచ్చరించు వాని వెనుకబడి నీ నామమును వినవలెనన్న వ్యామోహముతో ప్రయాణము చేతును. మొత్తము జీవితమెవడు షోడశోపచారపూజతో నన్ను సేవించునో - దాని వలన నాకెంత ప్రీతికలునో రాధా శబ్దమును పల్కినందు వలన నాకంతటి ప్రీతి ఏర్పడును. రాధా ! నాకంతకంటె ప్రియమైన సేవయింకొకటి లేదు. అందువలన రాధాశబ్దము పల్కు వారధికుడు.
బ్రహ్మదేవుడు, అనంతుడు, శివుడు, ధర్మదేవత, నరనారాయణ ఋషులిద్దరు, కపిలుడు, గణపతి, నాకు ప్రియమైన కార్తికేయుడు (కుమారస్వామి) లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, సావిత్రి, ప్రకృతి, నాకు ప్రియమైన దేవగణములు ఇందరు నాకిషులే ఐనసు రాధా శబ్దమునుచ్చరించువానితో సమానమైన వారు కారు.
ఆ దేవాదులందరు నాకు ప్రాణములతో సములు. నీవు నా ప్రాణముల కంటే అధికురాలవగు సాధ్వివి. వారేమో వేరు వేరు స్థానములందున్నారు. నీవు నా వక్షఃస్థలమందే నిలిచియున్నావు. ఏ సాధ్వి నా చతుర్భుజ మూర్తిని తన వక్షస్థలమున భరించుచున్నదో ఆ కృష్ణస్వరూపుడనగు నేను ప్రియురాలవగు నిన్ను స్వయముగా నా వక్ష స్థలమున నెల్లప్పుడు మోయుచున్నాను.
శ్రీకృష్ణుడిట్లు పలికి మనస్సునానంద పరచు శయ్య మీద కూర్చుండెను.
అంతట రాధాదేవి భక్తితో తన శిరస్సు వంచి నాథునితో ఇట్లు పలికెను.
రాధికోవాచ :
రాధ యిట్లు పలికెను :
స్వామీ ! సర్వము జ్ఞప్తిలో నున్నది. అంతయునెరుగుదును. ఎట్లు మరతును. అన్నియు నేనని ఏమి చెప్పితివో అదియంతయు నీ పాదపద్మముల అనుగ్రహము వలన కల్గినదే. సర్వేశ్వరునకునకు కొందరు ప్రియమైనవారు కొందరు ప్రియము కానివారెక్కడ? ఎవరెవరు నన్ను ఎల్లెట్లు స్మరించరో వారి వారి యందు అట్లుట్లు నీ కృప లేకుండును. గడ్డిపరకను కొండను చేయుటకును కొండను గడ్డిపరకను చేయుటకును నీవు నమరుడవు ఐనను యోగ్యునియందును అయోగ్యునియందు నీకృప సమముగానే ఉండును.
నేను నిలిచియుండగా నీవు పడుకొని యుండి సంభాషణములతో ఏక్షణము గడచిపోయినదో యుగముతో సమమైన అట్టి క్షణమును వెనుకకు మరల్చుటకు నేను సమర్ధురాలను కాను. నామనస్సిప్పుడు నీవియోగమను అగ్నిలో బాధపడుచున్నది. - నీ పాదపద్మములను నా వక్షఃస్థలమున నా శిరస్సునుంచుము. మొదట నా చూపు నీ చరణాంబుజము మీద పడినది. అట్టి చూపును ఇతరమైన నీ యవయవములను దర్శించుటకు శ్రమపడియు మరల్చలేకపోతిని. ఒక్కొక్క యంగమును చూచుచూ ప్రశాంతమైన నీ ముఖారవిందమును దర్శించిన ఆ దృష్టి ఇంకొక దాని వైపు మరలుటకు శక్యముగానిదైనది.
రాధాదేవి మాటలు విని పురుషోత్తముడు నవ్వెను. శ్రుతులలో స్మృతులలో నిరూపించబడిన హితమైన సత్యమైన వాక్కు నామెతో ఇట్లు పలికిను.
శ్రీ కృష్ణ ఉవాచ :
శ్రీకృష్ణుడు పలికెను :
నాచేత పూర్వమే నిర్ధారించబడిన కార్యమును ఖండించరాదు (త్రోసివేయరాదు) ఓ మంగళురాలా.! క్షణమాగుము. ప్రియురాలా! నీకు మంగళము సమకూర్చుదును. నీ మనోరథము నెరవేరు కాలము వచ్చినది. పూర్వమందెవని కేది వ్రాయబడినది. {అనుభవము కావెలనని) ఏ కాలమందెక్కడ అది నిర్దారించబడినదో రాధా ! దానిని ఖండించుటకు నేను కూడ సమర్థుడను కాను. ఇక విధీయోపడు ? ప్రాణుల సుఖదుఃఖములు నిర్ణయించు సృష్టికర్తకు సృష్టికర్తనగు నేను ఎవరికేది వ్రాయబడినదో బ్రహ్మాదిదేవతలుకును, కద్రప్రాణులకును, ఆ అనుభవము ఎప్పుడును నాచేతనూ ఖండింపరానిదే.” అనునంతలో శ్రీహరి ముందుకు బ్రహ్మ చేరవచ్చును.
జపమాలను కమండలమును పట్టుకొన్న వాడును కొద్దిపాటి చిరునవ్వు గలవాడు నగు చతుర్ముఖుడు కృష్ణుని వద్ద కేగి నమస్కరించి శాస్త్రపద్ధతిలో స్తోత్రమొనర్చెను. సృష్టికర్తయగు బ్రహ్మ శ్రీహరి సన్నిధిని చేరి ఆనందబాష్పములు క్రమ్మిన కన్నులతో పులకించిన శరీరములో భక్తి వలన పంగిన శిరస్సుతో నమస్కరించి స్తుతించి ఆ ప్రభువునకు పొంగిన భక్తితో మరల నమస్కరించి రాధా సమీపమునకేగెను. ఆ తల్లి పాదపద్మములకు భక్తితో తలవంచి నమస్కరించి (తొందరతో తన జడల సమూహము ఆ పాదములకు చుట్టుకొనునట్లు) శీఘ్రముగా కమండల జలముతో సంతోషముగా పాదములు కడిగి చేతులు మొగ్గగా జోడించి అంజలి ఘటించి ఆగమములలో (వేదశాస్త్రములు) చెప్పిన ప్రకారము స్తోత్రమొనర్చిను.
బ్రహ్మోఽవాచ :
బ్రహ్మ పలికెను :
ఓతల్లీ ! సర్వజీవులకు విశేషించి భారతఖండమందున్న వారికి మిక్కిలి దుర్లభమైన నీపాదపద్మములు కృష్ణానుగ్రహము వలన దర్శనమైనవి. పూర్వము నేను శ్రీ కృష్ణ పరమాత్మ యొక్క మహిమాన్వితమైన పుష్కర తీర్థము నందు అరువది వేల సంవత్సరములు తపస్సు చేసితిని. అప్పుడు వరదాతయైన శ్రీహరి వరమిచ్చుటకు స్వయముగా వేంచేసెను. వరమడుగుమని స్వామి పలుకగా ముదముతో నా అభీష్టమును ఇట్లు కోరితిని, “ఓ ట్రిగుణాతీతుడా! సర్వజీవులకు దుర్లభమైన రాధాదేవి శ్రీపాదపద్మములను నాకు వెంటనే చూపించుము". నేనిట్లు పలుకగా తపస్సు చేసిన నన్ను చూచి శ్రీహరి ఇట్లనెను. “బిడ్డా! తగిన కాలమందు నీకు చూపించగలను. ఇప్పటికి ఓర్చుకొనుము.” ఆ ఈశ్వరాభై విఫలము కాలేదు. ఆ పరదానము వలననే నేడు నీ పాదారవింద దర్శనము కలిగినది. గోలోకవాసులు ఇప్పటి భారత వరవాసులు అందరు కోరినదీదీయే తల్లీ! మొత్తము దేవీ వర్గము ప్రకృతి అంశ గలికి ప్రకృతి వలన జనించిన వారన్నది నిశ్చయము. నీవు కృష్ణుని సగము శరీరము నుండి జనించిన దానవు. అన్నిటి కృష్ణునితో సమానమైన దానవు. శ్రీకృష్ణుడే నీ రూపమాయెనో (రాధగా) నీవే శ్రీకృష్ణుని రూపము ధరించితివో. వేదములందీదీ నాకు కన్పించలేదు. ఈ తత్త్యమిట్లని ఎవడు నిర్ధారించును. బ్రహ్మండమునకు బయట పై భాగమున ఎట్లు గోలోకమున్నదో ఒకరి చేత సృష్టింపబడని వైకుంఠమున్నదో అట్లే నీవు కూడ ఒకరిచేత సృష్టింపబడినదానవు కావు తల్లీ ! సమస్త బ్రహ్మాండమందలి జీవులేవిధముగా శ్రీకృష్ణుని అంశలోని అంశలో అట్లే నీవు శక్తి {బలము) స్వరూపపై ఆ జీవులందరి యందు నిలిచియున్నావు. సృష్టిలోని పురుషులందరు శ్రీహరి యంశ గలవారు స్త్రీలందరు నీయంశ గలవారు.
ఓ తల్లీ ! స్వామీ ఆత్మయే దేహరూపముగా నున్న నీవు అతనికి (మాకును) ఆధారము నీవే. అతని ప్రాణము ననుసరించి నీవు నా ప్రాణములనుసరించి ఈ ప్రభువును ఉన్నారు. ఏమి ఆశ్చర్యము. ఈ శిల్పకారుడు ఏ కారణముగా నిర్మించెను ! ఈ కృష్ణుడు ... నిత్యుడే అట్లే నీవును నిత్యవే (శాశ్వతురాలవే. అతనీ అంశపు నీవు నీ యంశ అతడు కావచ్చును. ఈ ఏషయ మెవడు నిర్ధారించును? జగత్ సృష్టికర్తను దేవతల తండ్రినైన నేను కూడ వాస్తవములైన {సహజముగా నున్న) నీ గుణములలోని నూరవపాలును చెప్పుటక సమర్ధుడను కాను. ఈ తత్త్వమును గురుముఖముగా చదివి జనులు పండితులగుదురు. వేదములు గాని పండితులు గాని నిన్ను సుతించుటకు సమర్థులు కారు. స్తోత్రములకు తల్లి జ్ఞానము. ఆ జ్ఞానమునకు తల్లి బుద్ధి. ఓ మాతా ! నీవు బుద్ధికి జననివి. {పుట్టించుదానవు) నిన్ను స్తుతించుట కెవడు శక్తుడు ? అందరికీ వస్తువు కన్పించునో దానినే పండితుడును చెప్పగలుసు. కన్నులకు కన్పించనిది చెవులకు వినబడినదే వస్తువో దానిని నిర్వచించుట కెవడు సమర్థుడు ? ఇది వేదశాస్త్రములను పెద్దల సూక్తిని అనుసరించి పల్కిన మాట. నీవీ విషయమున నన్ను నిందించవలదు. ఈశ్వరుల కీశ్వరుడగు వాని కృప యోగ్యుని యందు అయోగ్యుని యందు సమముగా నుండును. పాలింపబడు జనము యొక్క గుణదోషములు పాలకులకు క్షణము సేపు కన్పించీ కనుమరుగగును, తల్లిగాని తండ్రిగాని సంతానమందలి ప్రేమతో అన్నింటిని క్షమించును. ఇటు జగములకు సృష్టికర్తయగు బ్రహ్మ పలికి ఎల్లరీకి కోరదగిన - నమస్కరింపదగిన అమె పాదపద్మములకు మొక్కి ఆ ఉభయుల ముందు నిలిచెను.
బ్రహ్మకృతమైన ఈ స్తోత్రమును మూడు సంధ్యలయందు విడువక ఏ మానవుడు పఠించునో వాడు నిశ్చయముగా రాధా మాధవుల పాదములందు భక్తిని ఆ పాదములకు సేవజేయు భాగ్యమును (ముక్తిని) పొందును, మొత్తము పుణ్యపాపకర్మలను నిర్మూలనము చేసికొని మిక్కిలి గిలువశక్యము గాని మృత్యువును జయించి సర్వలోకములను దాటి ఉత్తమమైన గోలోకమును పొందును.
శ్రీ నారాయణ ఉవాచ :
నారాయణమహర్షి పలికెను :-
బ్రహ్మ చేసిన స్తవమును వీని రాధాదేవి "ఓ విధాతా ! నీ మనస్సునందున్న వరము గోరుకొమ్మ"నెను. ఆమె మాట విని సృష్టికర్త “మీ దంపతుల పాదపద్మములందు భక్తిని వరముగా నాకిమ్ము" అని పల్కగా రాధాదేవి వెంటనే “ఓం” అని అంగీకారము తెలిపెను, విధాత భక్తితో మరల నమస్కరించెసు.
బ్రహ్మ రాధాకృష్ణుల నడుమ అగ్నిని స్థాపించి జ్వలింప జేసి “హరిః ఓం శ్రీగోవింద గోవింద" అనీ హరిని స్మరించి శాస్త్రనియమము ప్రకారము హవనము (హోమము) చేసెను. కృష్ణుడు శయ్యనుండి లేచి వచ్చి అగ్ని సమీపమున కూర్చుండెను. బ్రహ్మ చెప్పిన విధిననుసరించి స్వయముగా హోమము చేసెను. బ్రహ్మ మరల రాధాకృష్ణుల నగ్నికి నమస్కరింపజేసి వివాహము జరిపించువాడై ఏడు సార్లు ప్రదక్షిణము చేయించెను. (ఏడు అడుగులు నడిపించు సప్తపది కావచ్చును). మరల రాధాదేవీతో నగ్నికి ప్రదక్షిణ నమస్కారములు చేయించి కృష్ణుని కూర్చుండ బెట్టి రాధాదేవి హస్తమును శ్రీకృష్ణుని చేత పట్టించి (పాణిగ్రహణము) వేదమునందు చెప్పబడిన ఏడు మంత్రములను మాధవునికి చెప్పి చదివించెను. వేదవేత్తయగు. ప్రజాపతి రాధాహస్తమును శ్రీకృష్ణుని వక్షస్థలమందును శ్రీకృష్ణుని హస్తము రాధాదేవి పృష్ఠభాగము (వీపు క్రిందిభాగము) నందును ఉంచి రాధాదేవితో మూడు మంత్రములు పఠింపజేసెను. మోకాళ్ల క్రింది వరకు వ్రేలాడునంతటి (పొడవైన పారిజాత పుష్పముల మాలను శ్రీకృష్ణుని కంఠముందు ముదముతో రాధాదేవి ద్వారా వేయించెను స్వామి నాభికమలమందు జన్మించిన బ్రహ్మ మరల రాధాకృష్ణుల చేత అగ్నికి నమస్కరింపజేసి మనోహరమైన పుష్పమాలను రాధా కంఠమున కృష్ణుని చేత వేయించెను. శ్రీకృష్ణుని గూర్చుండబెట్టి కృష్ణుని యందే మనస్సు పెట్టి చిరునవ్వు చిందించుచున్న రాధాదేవిని అతని ఎడమ ప్రక్కన కూడ్చుండబెట్టెను. ఓ నారదా ! రాధామాధవులను ప్రపత్తి పట్టించి (చేతులు జోడించి నమస్కారముద్ర పట్టుట వేదోక్తములైన పంచమంత్రములను పఠింపజేసెను. విధి ఈ విధముగా మరల సమస్కరింపజేసి తండ్రి తన బిడ్డను దానమిచ్చినట్లు బ్రహ్మ శ్రీకృష్ణునకు రాధాదేవిని సమర్పించి భక్తితో శ్రీహరి ముందు నిలిచెను.
ఇంతలో శరీరములందు ఆనంద పులకలు మొలకెత్తగా దేవతలు తప్పెటలను మురజములు (మద్దెలలు) మొదలగు వానిని దేవదుందుభిని (నగారాను) మ్రోగించిరి, పారిజాత పుష్పముల వర్షము కురిసేను. గంధర్వ రోజులు గానము చేసిరి. అప్సరసల బృందములు నాట్యము చేసిరి. బ్రహ్మ శ్రీహరిని స్తుతించి చిరునవ్వుతో నిట్లు పలికెను.
“మీ యుభయుల పాదపద్మములందు దృఢభక్తిని నాకు దక్షిణగా నిమ్ము” అను బ్రహ్మ వాక్కు విని శ్రీహరి “మా చరణ కమలములందు మిక్కిలి దృఢమైన భక్తి నీకుండుగాక. సంశయము వలదు. నీకు మంగళమగును, కుమారా ! నీ లోకమునకు వెళ్ళి నాయాజ్ఞ ప్రకారము నీకు నియమించిన కర్మ చేయుచుండుము" అనెను. ఓ నారదా ! సృష్టికర్త శ్రీకృష్ణుని వచనములు విని రాధాదేవికి శ్రీకృష్ణునకును నమస్కరించి సంతసముతో తన నివాసము కేగెను.
బ్రహ్మ వెళ్లిపోగా ఆ రాధాదేవి చిరునవ్వుతో ప్రక్క చూపుతో శ్రీకృష్ణుని ముఖమును దర్శించెను. సిగ్గుతో ముఖమును కప్పుకొనెను. మొత్తము శరీరము పులకించగా మన్మధ బాణములచేత పీడితురాలై శ్రీహరికి నమస్కరించి అతని శయ్యను చేరబోయేను.
తన నుదుట కస్తూరి తిలకమును కుంకుమ ద్రవముతో బాటు ధరించి చందనమును (అగురు ద్రవ్యముతో కలిసిన దానిని) శ్రీకృష్ణుని వక్షస్థలమున పులిమెను, అమృతపూడ్డమైన రత్నపాత్రను తేనె నింపిన మనోహర పాత్రను భక్తితో హరికందీయగా జగన్నాథుడు ఆ పదార్థమును త్రాగెను.
కర్పూరము మొదలగు పరిమళ వస్తువులతో కూడి శ్రేష్ఠముగా కంటికింపుగా నున్న తాంబూలమును రాధ కృష్ణునకిచ్చెను, దానిని హరి ఆదరముతో భుజించెను. శ్రీహరి తన కందించిన సుధారసము త్రాగీ అతడిచ్చిన తాంబూలమతనీ ముందే ఆమె తినెను.
శ్రీకృష్ణుడు తాను నమిలిన తాంబూలమును ప్రేమతో రాధకిచ్చెను. ఆమె అతని ముఖకమలమును పానము చేసినట్లుగా గొప్ప భక్తితో దానిని తినెను. మధుసూదనుడామె నమిలిన తాంబూలమును తన కిమ్మనీ యాచించెను. ఆమె సంతసముతో నవ్వి క్షమించుము అని పల్కి దానిని ఈయలేదు.
మాధవుడు చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల మేళన ద్రవ్యమును (సుగంధ ద్రవ్యమును) రాధాదేవి సర్వాంగములందు స్వయముగా పులిమెను. ఏమన్మథుడు ఎల్లప్పుడు ఏ స్వామి చరణకమలములను మాత్రమే ధ్యానించుచుండునో అట్టి స్వామి (శ్రీకృష్ణుడు) రాధాదేవిని సంతృప్తిపరచుటకై ఆ మన్మథునకు వశమయ్యెను. ఏ స్వామి యొక్క భృత్యులభృత్యుల (దాసులదాసులు) చేతిలో ప్రతిక్షణము మదనుడు జయింపబడునో (ఓడిపోవునో) అట్టి మన్మథుని చేతిలో స్వేచ్ఛామయుడైన (తన కోరిక ప్రకాము ప్రవర్తించువాడు) భగవంతుడు - తానోడవలెనన్న ఆసక్తిలో ఓడిపోయెను.
శ్రీకృష్ణుడు రాధను చేతితో లేవనెత్తి తన వక్షః స్థలమున చేర్చుకొని వస్త్రమును వదులు చేసి చతుర్విధములైన చుంబనములు చేసెను. (ముద్దు పెట్టుకొనెను) ఆ రతియుద్దములో ఆమె మొలనూలులోని చిరుగంట తెగిపడెను. ముద్దుల వలన పెదవుల మీది తొంబూలరాగము (ఎరుపుదనము) కౌగిలింతల వలన స్తనమండలమందలి పత్రరేఖలు చెదరిపోయెను. ఆ శృంగార చర్యలో కొప్పువీడెను. నుదుటి సిందూర తిలకము కరిగెను. విపరీత క్రియవలన పాదములకున్న లత్తుక పూత (పారాణి) ముద్రలు స్థలాంతరమునపడెను. ఇట్లు క్రొత్త కలయిక వలస సర్వాంగములు పులకింపగా రాధాదేవి వ్యామోహితురాలై మూర్ఛిల్లేను. రాత్రింబవళ్లెరుగరుండెను.
కామశాస్త్ర పండితుడైన శ్రీకృష్ణుడు రాధాదేవి అంగాంగములను తనయంగాంగములతో చేరునట్లు ఆలింగనమొనర్చి అష్ట విధ శృంగారములు సాగించెను. ప్రక్క చూపులతో చిరునవ్వుతో నున్న ఆమెను మరల కౌగిలించుకొని ఆమె సర్వాంగములను నఖక్షత దంతక్షతములతో (గోటిగాయములు పలుగాట్లు) నింపెను. ఆ శృంగార యుద్ధములో దంపతులకు మనోహరమై కంకణ ధ్వని మువ్వల సవ్వడి కాలియందెల రవళీ ఏర్పడెను.
కామశాస్త్ర విశారదుడైన శ్రీకృష్ణుడు మరల రాధను లాగి శయ్య పై చేర్చి ఆసక్తితో నేకాంత ప్రదేశమున కొప్పుముడిని వస్త్రములను తొలగించెను. రాధాదేవి అతని కొండె కొప్పును విడిచి ఇతరాలంకారమును వస్త్రములను తొలగించేను. వారిద్దరును కార్య విశారదులే కనుక ఒకరి వలన నొకరికి నష్టమన్నది హానియన్నది లేదు. రాధహస్తము నుండి మాధవుడు రత్న దర్పణము తీసుకొనెను. మాధవుని చేతి నుండి రాధ బలవంతముగా వేణువు లాగి కొనెను. మాధవుడు బలముగా రాధాదేవి చిత్తమునపహరించెను. మాధవుని మనస్సును రాధకూడ రాసముండలమునుండి లాగి అపహరించెను.
ఆ క్రీడ ముగిసిన తరువాత చిరునవ్వు ప్రక్క చూపులు గల రాధాదేవి మహాత్ముడైన శ్రీకృష్ణునకు ప్రీతితో మురళినిచ్చివేసెను. శ్రీకృష్ణుడామె రత్న దర్పణమును ప్రకాశించెడి క్రీడాకమలమును ఆమెకిచ్చెను.
శ్రీహరి రాధకప్పును సుందరముగా ముడిచి నుదుట సిందూర తిలకముంచి విచిత్రముగా మకరీకా పత్రరేఖలు అయాస్థానములందు కూర్చి ఆమెనలంకరించెను.
ఆ అలంకార పద్దతిని విశ్వకర్మయే ఎరుగడు. ఇక ఆమె చెలికత్తెలేమి ఎరుగుదురు ?.
శ్రీకృష్ణునికి అలంకార వేషము కూర్చుటకు రాధపూనుకొనగనే బాలరూపమును కూడ కాక, చంటిపిల్లవాడయ్యెను. ఇంతలో ఆకలితో పీడితుడై ఏడ్చుచున్న బాలరూపునీ నందుడు తనకిచ్చినప్పుడేట్లు భయపడుచుండెనో అట్టి అచ్యుతుని {బాలకృష్ణుని) ఆమె చూచెను. మిక్కిలి నొచ్చిన మనస్సుతో ఆ రాధ నిట్టూర్పు విడిచి ఇటునటు ఆ యావన రూపుని గూర్చి చూచుచు ఆవియోగమునకు బాధపడుచు భయపడుచు శోకార్తయై శ్రీకృష్ణునుద్దేశించి నిందోక్తిగా నిట్లు పలికెను.
ఓ మాయా నాధుడా ! ఇటువంటి నీ సేవకురాలిపై మాయను ప్రయోగించుచుంటివా ? ఇదెట్లు ? ఇట్లు పలికి రాధ నేలపై బడి ఏడ్చుచుండెను. బాలకృష్ణుడును అక్కడ ఏడ్చుచుండెను. అప్పుడు అశరీర వాక్కు ఇట్లు విన్పించెను. “రాధా! ఏల యేడ్చుచుంటివి? శ్రీకృష్ణ పాదపద్మములను స్మరింపుము. రాసమండలమెంతవరకీ అంతవరకు రాత్రిపూట స్వామి ఇక్కడకు వచ్చును. శ్రీహరితో అనుదినము ఇష్టసుఖమనుభవింతువు. ఏడువకుము. తన యింటిలో (గోకులమున) తన నీడను నిలిపి స్వయముగా శ్రీహరి ఇక్కడకు వచ్చును. శోకము వదలుము. నీ ప్రాణేశుడు మాయానాధుడైన ఈ బాలరూపుని చంకనెత్తుకొని గృహమునకు పొమ్ము” ఇట్లా సుందరీ ప్రబోధింపబడెను. ఆ అశరీరవాక్కువీని బాలుని తన ఒడిలోనికి తీసుకొని పుష్పోద్యానమును రత్నమండపమును చూచుచు బృందావనము నుండి త్వరగా నందమందిరమున కేగెను.
ఓ నారదా! ఆ రాధాదేవీ మనోవేగముతో అర్ధ నిమిషములో వానకు తడిసిన స్నిగ్ధ మధురమైన (మెరిసెడి అందమైన) వస్త్రములలో ఎఱ్ఱబారిన నయనములతో వెళ్లి యశోదా దేవికి శిశువు నీయబూని ఇట్లు పలికెను.
ఓ యశోదా ! ఆవుల మందలో నీ భర్త యివ్వగా ఆకలితో యేడ్చుచున్న ఈ శిశువును తీసుకొని త్రోవలో చాల బాధ పడితిని, ఈ శిశువు వస్త్రము నా వస్త్రము తడిసినవి. మేఘములు క్రమ్మీ సూర్యుడు కన్పించని ఈదుర్దినమందు బురద ఎక్కువై జారుచుండగా పిల్లవానిని మోయనశక్తురాలనైతీనీ, ఓ భద్రురాలా ! ఈ పిల్లవానిని తీసుకొని పాలిచ్చి బుజ్జగించుము. ఇల్లు వదిలి వచ్చి చాల సమయమైనది. వెళ్లుచున్నాను. ఓ సతీ ! సుఖముగా నిలువుము." అని రాధ పలికి బోలునిచ్చి తన గృహమున కేగెను.
యశోద బోలుని తీసుకొని ముద్దులు పెట్టుకొని పాలిచ్చెను. రాధ తన యింటిలో యింటిపనులలో నుండెను. ప్రతిదినము రాత్రియందు శ్రీహరితో రమించెను. నారదా ! ఇట్లు శుభకరము సుఖప్రదము మోక్షప్రదమైనది అగు శ్రీకృష్ణ చరిత నీకు చెప్పబడినది. పూణ్యకరమైన మరియొక విషయమును చెప్పుదును వినుము.
ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన రాధాకృష్ణుల వివాహము నవసంగమ మనెడి పదునైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 15 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
During a grand celebration when baby Kṛshṇa was lying peacefully in a cradle beneath a heavy wooden cart loaded with pots of milk and curds, a powerful demon named Shakaṭāsura entered the cart to crush the infant. Awakening and feeling hungry, baby Kṛshṇa gently kicked His tiny lotus feet in the air, creating a divine shockwave that shattered the heavy cart into a thousand pieces and hurled the demon demon to his death. The astonished cowherd women rushed to the spot, praising the divine grace that protected the child from unseen dangers, while mother Yashodā lovingly lifted little Kṛshṇa into her arms.