శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
ఒకసారి బలరాముడు కాక ఇతర గోపబాలురందరతో కలిసి శ్రీకృష్ణుడు కాళియ నాగరాజు నివసించెడి యమునానదీ తీరమునకు పోయెను. ఆ నదీ. తీరమునందలి వనములో ఆరమగ్గిన పండ్లను భుజించి ఆ స్వేచ్ఛామయుడు దప్పిగొని నిర్మలజలము త్రాగెను. గోపశిశువులతో కలిసి ఆయరణ్యమున గో బృందమును మేపుచు అంతట సంచరించి ఒక చోట ఆ గోబృందమును నిలిపెను. క్రీడలయందు మునిగి అతడును గోపాల బాలురును సంతోషముగా నుండిరి.
ఓ నారదా ! లేతగడ్డి మేసిన గోబృందము విషజలము త్రాగినవి. విషమిశ్రమైన జలము ( కాళియుడు నివసించు యమునా నది మడుగులోనిది) త్రాగి కాలకూట విషజ్వాలలచేత బాధపడి క్రూరమైన అంతకుని (యముని) చేష్టచేత గోబృందమప్పటికప్పుడే ప్రాణములు విడిచెను. మరణించిన గో సమూహమును చూచి గోపాలకులు విచారముతో మనస్సులు చెదరి భయపడుచు విషాదముఖములతో
అందరు వచ్చి మధుసూదనునకు చెప్పిరి. ఆ జగన్నాధుడంతయు తెలిసికొని గోబృందమును బ్రతికించెను. అదే క్షణములో ఆ గోవులన్నియు లేచి నిలబడి శ్రీహరి యొక్క ముఖమండలమును చూచినవి.
నరవేషధారియగు శ్రీకృష్ణుడు యమునా నది నీటి యొడ్డున పుట్టి పెరిగిన కడిమి చెట్టు నెక్కి ఆ కాళియుని భవనములో (నీటి మడుగులో) నాగముల (సర్పములు) మధ్య దుమికెను. ఓ నారదా ! అతడు దుముకుట వలన నూరు బారల యెత్తు జలము పైకెగిరెను. ఆశ్చర్యము ! అది చూచి గోప బాలురు ఒక్కసారి హర్షమును విషాదమును పొందిరి.
నారదా ! మనుష్యాకారమున నున్న స్వామిని చూచి కాళియనాగుడు క్రోధము చేత పరవశుడై వెంటనే శ్రీహరిని పట్టుకొనెను. ఎఱ్ఱగా కాలిన లోహమును పట్టుకొన్న నరుని వలె ఆ పరమాత్మ తేజస్సుకు వాడు కంఠము కాలి కడుపు దగ్ధమై మిక్కిలి భయపడెను. “నా ప్రాణములు పోవుచున్నవి” అని పలికి, వాడు క్రక్కుకొనెను. శ్రీకృష్ణుని ప్రజము వంటి కఠిన శరీరమును కొరికి నములుట వలన కాళియుని పండ్లూడిపోయి నోటినిండ రక్తమయ్యెను. శ్రీకృష్ణ భగవానుడు వాని తలమీదికెగిరి పడగల మీద నిలిచెను. ఆ నాగుడు విశ్వము నంతయు తనలో భరించెడి పరమాత్మ చేత అట్లాక్రమింపబడి ప్రాణములు విడుచునంత స్థితికి వచ్చి రక్తమును కక్కి మూర్ఛిల్లెను.
కాళియుడు మూర్చిల్లినది చూచి నాగులందరు ప్రేమ చేత మనస్సు వికలమై భోరున ఏడ్చిరి. కొందరు నాగులు భయపడి పారిపోయి బిలములలో చొచ్చిరి. తన భర్త మరణించనున్నట్లు గుర్తించి అతని భార్యయగు సురస తోడి నాగినీ స్త్రీలతో కూడి వచ్చి శ్రీకృష్ణుని ముందు కాంతుని మీద ప్రేమతో మిక్కిలి శోకించెను. వెంటనే భయముతో హస్తములు జోడించి శ్రీకృష్ణునకు నమస్కరించి అతని పాదారవిందములను పట్టుకొని భయము తత్తరపాటులతో స్వామితోనిట్లు పలికెను.
సురసోవాచ - సురన ఇట్లనెను :
ఓ జగన్నాథా ! నా నాధునిమ్ము. ఓ గౌరవప్రద ! నాకోదరమిమ్ము. స్త్రీలకు భర్త ప్రాణముల కంటె అధికుడు. భర్తకన్న వేరొక బంధువు లేడు. ఓ సకలలోకేశ్వరా ! ఓ అనంతా ! ఓ ప్రేమ సముద్రుడా ! ఉత్తమ బంధూ ! నా ప్రాణనాధుని వధింపకుము. సమస్త జీవకోటికి బంధువైన వాడా ! రాధాదేవి ప్రేమ సముద్రుడా ! సృష్టికర్తను సృష్టించినవాడా ! నాకు పతిదానము చేయుము.
శంకరుడు బ్రహ్మ ఆదిశేషుడు కుమారస్వామి ఐదు నాల్గు వెయ్యి ఆరు ముఖములు గలవారు ఐనను - సరస్వతీ దేవి విద్యాదేవత ఐనను - నిన్ను స్తుతించు విషయము తెలియనందున స్తోత్రమొనర్చుటకు సమర్థులుగారు కదా! వేదములును ఇతర దేవతలును అంతియే. ఐనను కొందరు విద్వాంసులు నిన్ను స్తుతించు విషయమున శక్తి గలిగియున్నారు (అది నీ కృప).
స్త్రీలలో అజ్ఞరాలను అధమురాలను ఐన నేనెక్కడ !! కన్నులకు కన్పించనివాడవైనను లోకములకు లోక జనులకు పొందదగినవాడవు ఈశుడవునగు నీవెక్కడ !! బ్రహ్మ విష్ణుమహేశ్వర శేషులచేత స్తోత్రము చేయబడువాడవును ఒకే ఆకారమను నియమములేని మహాపురుషుడవును ఈశ్వరుడవగు నిన్ను స్తుతింప గోరుచున్నాను. (ఇది ఆశ్చర్యము).
ఎవని స్తోత్రమొనర్చుటకు పార్వతియు లక్ష్మియు వేదమాతయైన గాయత్రీదేవియు భయపడుచు నిన్ను స్తుతించుటకు సమర్థులు గాకున్నారో - కలి కల్మషములలో మునిగినదానను వేదవేదాంగ శాస్త్ర విషయములలో మూడురాలను అగు నేను నిన్నేమి శక్తి గలదాననని స్తుతింపగోరుచున్నాను.
రత్నాభరణములతో అలంకరింపబడిన సర్వావయవములు గలవాడును రత్నాల శయ్యమీద రాధాదేవి వక్షస్థలమున కానుకొని శయనించినవాడును సర్వాంగములందు చందనము పులుముకొన్నవాడును చిరునవ్వుతో వెలుగు ముఖ పద్మము గలవాడును ఉప్పొంగెడు
ప్రేమ రససముద్రమున నెప్పుడు మునిగి సుఖముగా నున్నవాడును, మల్లెల మాలతుల పూమాలలతో శోభించు శిరము గలవాడును, పారిజాత పుష్పగంధమునకు తన్మయుడగువాడును, గండుకోకిలల మధుర ధ్వనులకు తుమ్మెదల ఛాతకు మన్మధ వికారము పొంది పులకరించు శరీరము గలవాడును ప్రియురాలు (రాధ) ఇచ్చిన తాంబూలము ముదముతోనెప్పుడును నములువాడును అగు స్వామిని స్తుతించుటకు వేదములశక్తములైనవి. పండితులు జడులైనారు. అట్టి అనిర్వచనీయుని నాగపత్నిని నేనేమి స్తుతించగలను.
బ్రహ్మ రుద్ర శేషుల చేత సేవించబడునదియు, లక్ష్మి సరస్వతి దుర్గ జాహ్నవి (గంగాదేవి) గాయత్రీదేవి సిద్ధ సంఘములు మునీంద్రులు మనువుల చేత ఎల్లప్పుడు సేవింపబడునదియునగు నీపాద పద్మమునకు నేను నమస్కరించుచున్నాను.
తనకింకొక మూలకారణము లేనివాడును మొత్తము ప్రపంచమునకు (జీవులు ప్రకృతి) మూలకారణమైనవాడును సర్వమునకు ఈశ్వరుడును ముక్త జీవుల కన్న శ్రేష్ఠుడును స్వయముగా ప్రకాశించువాడును ఇహపరములు (భుక్తి ముక్తులు) తన అధీనమైన వాడును బద్ధులు జ్ఞానులు ముక్తులు అన్న త్రివిధ జీవకోటికి ప్రభువునగు నీకు నమస్కారము.
ఓ శ్రీకృష్ణ కృష్ణా ! దేవదానవులకు బ్రహ్మరుద్రులకు శేషునకు ప్రజాపతులకు మునీంద్రులకు మనువులకు చరాచరములకు (జీవులు ప్రకృతి) అణిమాద్యష్ట సిద్ధులకు అవి పొందిన సిద్ధుల గణములకు ప్రభువైనవాడా నన్ను కాపాడుము.
ధర్మదేవతానాథా! సృష్టి స్థితిలయ ధర్మముల పాలించు దేవతలకు నాధుడా! పుణ్యపాప కర్మలకీశుడా! వేదప్రభూ ! వేదములలో నిరూపింపబడని తత్త్వమూర్తీ ! సర్వేశ్వరా ! సర్వము నీవైన వాడా! సర్వజీవబంధూ! దేహములకు దేహధారులకు ప్రభువైనవాడా! నాభర్తను కాపాడుము.
ఇట్లు స్తుతించి భక్తితో శిరస్సు వంచిన కాళియనాగరాజ పత్ని స్వామి పాదపద్మములను దృఢముగా పట్టుకొని నిలిచెను.
కాళియ నాగుని భార్య చేసిన స్తోత్రమును ప్రతిదినము మూడు సంధ్యాకాలములలో ఎవడు పఠించునో వాడు అన్ని పాపముల నుండి విముక్తుడై ఇహలోకమున క్రమముగా శ్రీహరి పాదభక్తిని తరువాత దాస్యభావమును అంత్యమున పరలోకములో శ్రీహరి స్థానమును పొంది గోలోకమున పార్షదులలో ఒకడై సాలోక్యాది ముక్తి చతుష్టయమును పొందును (33-34).
నారద ఉవాచ - నారదుడనేను :
ఓ మహానుభావా! నాగపత్ని వాక్యమును విని మిక్కిలి హర్షము చేత వికసించిన నేత్రములు గలవాడును అందరి నానందపరచు వాడునగు భగవంతుడు శ్రీహరి స్వయముగా ఆమెతో నేమనెనో ఆ మిక్కిలి అద్భుతమైన రహస్యమును చెప్పుము.
(సూత ఉవాచ - సూతుడనెను)::
నారదుని వాక్కులు విని అందరిని సమముగా చూచెడి భగవంతుడగు నారాయణ మహర్షి ప్రతిమాటలో తేనె బిందువులు నింపుచు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇట్లు చెప్పెను.
నారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
భయము తొందరతో పాదముల మీదపడి చేతులు జోడించియున్న నాగపత్ని వాక్కులు విని శ్రీకృష్ణుడామెతో ఇట్లనెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు పలికెను :
ఓ నాగరాణీ లేలెమ్ము. భయము విడువుము. వరము కోరుకొనుము. ఓ తల్లీ! నా వరము వలన ముసలి తనము మరణము లేని నీ భర్తను స్వీకరించుము. బిడ్డా! ఈ కాళింది మడుగు విడిచి పెట్టి నీ భర్తతో నీ నాగనాగినీ గణముతో బాటు నీ స్వగృహమునకు పొమ్ము. సుఖవంతులు కండు. ఓ నాగరాణి నేటి నుండి నీవు నా కూతురువైతివి. నీకు ప్రాణముల కంటె అధికుడైన ఇతడు నాకల్లుడు. సందేహమక్కరలేదు. ఓ సుమంగళీ తలపై నా పాద చిహ్నములు గల నీ భర్తను గరుడుడు చూచి స్తోత్రము చేసి భక్తితో నా పాదములకు (చిహ్నములకు) నమస్కరించును. గరుడుని భీతిని వదిలివేయుము. ఈ ప్రదము (మడుగు) నుండి మీ నివాసమగు రమణకమునకు త్వరగా పొండు. బిడ్డా! నీకిష్టమైన వరము కోరుకొనుము.
శ్రీకృష్ణుని మాటలు విని ప్రసన్నమైన చూపులు ముఖము గలదై భక్తితో తన శిరస్సు వంచి అశ్రువులు నిండిన కన్నులతో ఆమె ఇట్లు పలికెను.
నురసోవాచ - సురస అనెను :
వరములిచ్చువారికిని ప్రభువా! నాకు నీవిప్పుడు వరమొసగదలచితివేని నీ పాదపద్మములయందు నిశ్చలముగా నిలుచు ధృఢమైన భక్తిని నాకిమ్ము. కమలము మీదనే తుమ్మెద తిరుగునట్లు నా మనస్సు నీ పాదముల మీదనే ఎల్లప్పుడు చరించుచుండును గాక. సోకెప్పుడు గాని నీ స్మృతి తొలగకుండనుండుగాక. ఈ నా ప్రియనాధుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. నా సౌభాగ్యమితని మీదనే నిలిచియుండుగాక. ఇట్టి నా కోరిన కోరికను పరిపూర్ణము చేయుము అని పలికి ఆ నాగకాంత శ్రీహరి ముందు నిలిచెను.
ఆ సతి శరత్కాలపూర్ణిమ నాటి చంద్ర బింబము వంటి శ్రీకృష్ణ ముఖము దర్శించి రెప్పపాటు లేని కన్నులతో స్వామి ముఖ సౌందర్యమును త్రాగెను. సర్వాంగములు పులకరించగా ఆనంద బాష్పములు రాల్చుచు సుందరుడైన ఆ బాలకృష్ణుణి చూచి పుత్రుని మీదవలె ప్రేమను ప్రకటించుచు ఉప్పొంగిన భక్తి రసములో తడిసి మరల ఇట్లనెను.
నేను రమణకమునకు పోను. నాకక్కడ పనిలేదు. ఈ నాగుడు సంసారము చేసుకొను గాక. నన్ను నీ సేవకురాలిని చేసి కొనుము. ఓ కృష్ణా ! నాకు సాలోక్యము మొదలగు నాల్గు విధముల ముక్తి పైనను కోరికలేదు. అవి నీ పాద పద్మ సేవలో పదహారవ వంతునకును పోలవు. నీ పాద సేవను కాకుండ వేరొక్క వరము నేనరుడైన కోరుకొన్నచో భరత వర్షమున దుర్లభమైన జన్మ పొంది కూడ తనను తాను వంచించుకొన్న (మోసగించుకొన్న) వాడగును. ఇట్లు పలికిన నాగపత్ని మాట విని చిరునవ్వుతో గూడిన ముఖపద్మము గల స్వామి ప్రసన్నమైన మనస్సుతో ఓం (అట్లే అగుగాక) అని అంగీకారము తెల్పెను.
ఓ నారదా ! ఇంతలో రత్నసార నిర్మితమైన దివ్యరథమొకటి గొప్ప తేజస్సుతో వెల్గుచు తొందరగా అక్కడికి వచ్చెను. దానికి నూరు చక్రములుండెను. అనేక వస్త్రములతో పూలదండలతో ఇతర సామగ్రితో కూడిన దాని మీద కొందరు పారదులుండిరి. మనస్సంకల్పమును బట్టి వాయువేగముతో నడచు సుందర రధము నుండి శ్యామసుందరుని (శ్రీకృష్ణుని) సేవకులు నల్లని వారు దిగివచ్చి శ్రీకృష్ణునకు నమస్కరించి ఆ నాగస్త్రీని తీసుకొని గోలోకమునకేగిరి.
శ్రీహరి తన మహిము చేత నాగపత్ని యొక్క ఛాయారూపమును నిర్మించి నాగునకిచ్చెను. విష్ణుమాయతో మోహితుడైన (తెలియకున్న) కాళియుడీ విషయమేదియు తెలిసికొన లేకపోయెను. దయానిధియైన శ్రీకృష్ణుడు సర్పశిరస్సు (పడగ) నుండి దిగి కృపతో కాళీయుని శిరస్సును చేతితో స్పృశించెను. అప్పుడు వాడు తెలివి పొంది తనముందున్న శ్రీహరిని చేతులు జోడించి కన్నుల నీరు నింపుకొనుచున్న తన భార్యయగు సురసను చూచి వెంటనే ప్రేమ పట్టజాలక స్వామికి నమస్కరించెను మరియు రోదించెను.
ఉప్పొంగిన భక్తి వలన బాష్ప నేత్రయై పులకరించిన శరీరముతో మాట్లాడకుండ నిలిచియున్న ఆమెను (ఛాయారూపమున నున్న నాగకాంతను) చూచిన దయానిధి యైన శ్రీహరి ఇట్లు పలికెను. ఈశ్వరునకు యోగ్యునియందు అయోగ్యుని యందును ఎల్లప్పుడు కృప సమానముగా నుండును గదా.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
ఓ కాళియుడా! నీ మనస్సున గల వరము కోరుకొనుము. నీవు నాకు ప్రాణాధికుడవు. బిడ్డా! సుఖముగా నుండుము. భీతిని వద లుము. నా అంశతో పుట్టినవాడెవరో నాయందతి భక్తుడెవడో వానిని కొంచెము శిక్షించి అనుగ్రహింతును. నా దయకు పాత్రుని జేతును. ఏనరాధముడు నీ వంశజాతులైన సర్పములను హత్యచేయునో వానికి బ్రహ్మహత్యతో సమానమైన పాపమేర్పడును. ఇది నా నిశ్చయము. నా పాద చిహ్నము మీద (పాద చిహ్నము గల పడగ మీద) ఎవడు కఱ్ఱతో కొట్టునో వానికి బ్రహ్మహత్యకు రెండింతల పాపము సంభ వించును. లక్ష్మీదేవి వానికి ఘోరమైన శాపమిచ్చి వాని గృహము నుండి వెడలిపోవును. వానికి నిశ్చయముగా కీర్తి నశించును. వంశస్థుల ఆయుష్యము నశించును. వాడు నూరేండ్లు నా వాక్కు వలన కాలసూత్ర నరకము పొందును. అక్కడ వానిని నీ శరీరమంత నుండు పురుగుల గుంపులు సర్వదా కరచుచుండును. (కొరుకుచుండును) ఆ నరకానుభవము తరువాత వాడు భూమిపై జన్మించి పాము కరిచి మరణించును. . అతని వంశమున పుట్టినవారికి కూడ నీవంశము వారి వలన (సర్పముల వలన) భయము కల్గును. ఎవరు నాపాద చిహ్నములు తలపై గల సర్పములను చూచి భక్తితో నమస్కరింతురో వారు సమస్త పాపముల నుండి విమోచనము పొందుదురు. నీవు త్వరగా రమణకమునకు వెళ్లిపొమ్ము. గరుడుని భయము త్యజింపుము. నా పాద చిహ్నమును నీ తలపై చూచి వాడు నీకు భక్తితో నమస్కరించును. నీకును నీవంశమున పుట్టినవారికిన ఎప్పుడు గాని ఎక్కడ గాని గరుడ భయము లేదు. నీవు నా వరము వలన నీ
మొత్తము జాతి వర్గమునకు (సర్పములకు) నేటినుండి రాజువు కమ్ము. వత్సా! నీకు శ్రేష్ఠమైన ఏ వరమందు కోరికయో దానినిప్పుడు కోరుకొనుము. భయము విడిచి నీ దుఃఖమును దేనిని నశింపజేయవలెనో నాకు చెప్పుము.
శ్రీకృష్ణుని మాటలు విన్న కాళియుడు భయముతో వణుకుచు హస్తములు జోడించి (నమస్కరించుచు) స్వామితో ఈ క్రింది విధముగా పలికెను.
కాలియ ఉవాచ - కాళియుడనెను :
ఓ వరప్రదుడా ! వ్యాపకుడా! నాకితర వరములందు కోరికలేదు. నీ పదాబ్జములందలిని భక్తిని స్మృతిని నాకు జన్మజన్మకు కల్గునట్లు వరమిమ్ము. వేదము లెరిగిన బ్రాహ్మణుడుగానైనను లేదా తిర్యగ్జంతువుగా (వెన్నెముక అడ్డముగా నుండు పశుమృగ పక్షులు) నైనను ఏ జన్మనెత్తినప్పటికిని నీ పాదపద్మములందు స్కృతియుండునేని ఆ జన్మ సఫలము. నీ పాద స్మరణ లేనిచో స్వర్గ లోక నివాసము నిష్పలము. నీ పాద ధ్యానము గలవానికి ఏ స్థానమైనను శ్రేష్ఠమైనదే. ఒక జీవి జీవితము క్షణకాలముగాని కోటి కల్పములు గాని నూరేండ్ల పురుషాయువు లేక అల్పాయువు గాని నీ సేవతో అది గడచునేని సఫలము. కానిచో వ్యర్థము నిష్ఫలము. నీ పాదపద్మముల సేవించు సేవకులకు ఆయుః క్షీణము గాని జన్మమరణ రోగ శోకములు గాని అతిభీతి గాని కలుగవు. భక్తులకు నీ పాదసేవయందు తప్ప దేవత్వము (దేవతలలో నొకడు కావలెనన్న భావన) నందు గాని ఇంద్ర పదవియందు గాని అతి దుర్లభమైన బ్రహ్మ పదవి యందు గాని వాంఛ యుండదు. మిక్కిలి చినిగి పాతబడిన వర్రపు పీలికను (చిన్న భాగము) క్రొత్త వస్త్రమును సమముగా
భావించు భక్తులకు సాలోక్యాది చతుర్ముక్తులను గూర్చి అపేక్షయుండదు కదా. నాగరాజగు అనంతుని నుండి నీ మనువును (మంత్రము) నుపదేశము పొందిన నేను నీవాడనై నీ దయ వలన నీ భక్త రక్షణ దీక్షలో రక్షింపబడితిని.
నీయందు దృఢభక్తి గల గరుడుడు జ్ఞానపరివేక్వత లేని భక్తి లేని నన్ను గుర్తించి నా నివాస స్థానము నుండి నన్ను దూరముగా తొలగించి వేసెను. ఓ వరము లిచ్చు ఈశ్వరా ! నాకు నీవు దృఢభక్తిని అనుగ్రహించితివి. నీ పాద పద్మచిహ్నముల ముద్రలు గల నా శిరస్సునతడు చూచి నీ భక్తుడనని “ఇక ఇప్పుడు నన్ను నీవు విడిచి యుండవలదు” అని పల్కును. దోషములు గలవాడనైనప్పటికి నీ భక్తి యన్న గుణము గలవాడను కనుక ఇక నన్నతడు వదలజాలడు. నాకు పూజ్యులైన నాగేంద్రులిక నన్ను వధింపరు.. నా గురువగు
అనంతుని యెడల తప్ప నాకెక్కడ ఎవరి వలన గాని భయము లేదు.
దేవతల ప్రభువులు దేవతలు మునులు మనువులు మానవులు స్వప్నములో గాని ధ్యానించి గాని ఏ స్వామిని చూడజాలరో అట్టివాడు నాకు కన్నులకు గోచరించినాడు. “ఓ ప్రభూ! నిరాకారుడవు నిర్గుణుడవగు నీవు భక్తుల ఒత్తిడి వలన సగుణుడవు సాకారుడవగుచున్నావు కాని నీకు విగ్రహమెక్కడిది ? నీ యిచ్చా సంకల్పములను బట్టి మారువాడవు. ఓ సర్వము నివాసముగా గలవాడా! సర్వమునకు నీవు సనాతన బీజమువు. సర్వజీవకోటికి ప్రభువువు. అందరి చర్యలకు సాక్షివి. సర్వమునకాత్మవు సర్వరూప థారివి నీవు. బ్రహ్మ, రుద్రుడు ఆదిశేషుడు ధర్మదేవత వేదవేదాంగ వేత్తలు ఏ ప్రభువును స్తుతించుటకు మందబుద్ధులో (బుద్ధి శక్తి లేని వారు) అట్టి ప్రభువును ఒక సర్పము స్తుతించుచున్నది. ఓ నాధుడా ! కరుణాసముద్రుడా ! దీనబంధూ! ఈ అధముని క్షమించుము. పుట్టుకతో వచ్చిన దుర్జనత్వము వలన దానికి తోడున్న అజ్ఞానము వలన నేను నిన్ను నమిలితిని. ఆకాశమును అస్రములతో భేదింపబడనట్లు నీ అంతు చూడరాదు, నిన్ను దాటరాదు, నిన్ను తాకరాదు, నిన్ను చుట్టి తిరుగరాదు, నీవు తేజోమూర్తివి" అని నాగరాజు పలికి శ్రీకృష్ణుని పాదపద్మములపై పడెను.
శ్రీహరి సంతుష్టుడై సరియే అట్లే అగుగాక అని సర్వవరములిచ్చెను.
కాళియనాగరాజోనర్చిన ఈ స్తోత్రము నే మానవుడు ప్రాతః కాలమున లేచి పఠించునో వానికిని వాని వంశమున పుట్టిన వారికిని సర్పముల భయముండదు. వాడీ భూమి మీద ఎల్లప్పుడు నాగమును శయ్యగా (పడక) చేసికొని నిద్రించుటకు శక్తుడగును. నాగగ్రస్తుడైనను (నాగము చేత కొరుకబడినవాడు) నాగము కాటు దెబ్బ తిన్నను విష భోజనము చేయుట వలన ప్రాణములు పోవు స్థితిలోనున్నను ఈ స్తోత్రమును స్మరించినంతలోనే మానవుడారోగ్యవంతుడగును. ఈ స్తోత్రమును భూర్జపత్రము మీద వ్రాసి భక్తి యుక్తుడై ఎవడు కంఠమున గాని దక్షిణ హస్తమునగాని ధరించునో వానికి సర్పముల భయముండదు. ఏ గృహమున ఈ స్తోత్రముండునో అక్కడ సర్పములుండవు. అక్కడ విషము వలన అగ్ని వలన పిడుగు పాటు వలన భయమేర్పడదన్నది నిశ్చయము. ఈ స్తోత్రము తలంచువాడీ లోకమున నెల్లప్పుడు హరి భక్తిని హరి స్మృతిని కలిగియుండి చివరకు తన వంశమును పవిత్రమొనర్చి అంత్యమున హరిదాస్య ముక్తిని పొందునన్నది నిశ్చయము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి ఇట్లనెను :
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు నాగరాజునకిట్లు వరమిచ్చి తరువాత సుఖము కూర్చునట్టి మధుర వాక్యమిట్లు పలికెను.
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడిట్లనెను :
“ఓ నాగరాజూ! నీ బలగముతో బాటు యమునా నదీజలమార్గము ద్వారా ఇంద్ర నగరము వలె శ్రేష్ఠముగానున్న నీ రమణక ప్రదేశమునకు వెడలిపొమ్ము.” కాళియుడు హరియాజ్ఞ విని ప్రేమ విహ్వలుడై ఏడ్చెను. ఓ నాథా! నీ పాదపద్మములను తిరిగి ఎపుడు దర్శింతును' అని స్వామికి భార్యతో గణముతో బాటు నూరుమార్లు ప్రణామములొనరించి స్వామి ఎడబాటుకు బాధపడుచు నాగేంద్రుడు జలమార్గమున వెడలిపోయెను. ఆ తరువాత యమున మడుగులోని నీరు అమృతము వలెనాయెను. అక్కడి జంతువులన్నియు కాళియుడు వెడలిపోవుట వలన సంతసము ప్రశాంతత గలవయ్యెను. ఆ దయాసముద్రుడైన హరియాజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఇంద్ర
నగరము వంటి తన భవనమును (రమణకమును) చూచి నాగరాజు భార్యతో పుత్రగణములతో బాటు భయరహితుడై హర్షయుక్తుడై శ్రీహరి ధ్యాన తత్పరుడై అక్కడ కాపురముండెను. ఓ నారదా! ఇట్లు అద్భుతమైన హరి చరిత్రము మొత్తము సుఖదాయకము మోక్షదాయకమైన దానిని సారవంతమైన దానిని చెప్పితిని. ఇంకేమి వినగోరుదువు?
సూత ఉవాచ - సూతుడనెను :
నారాయణ మహర్షి వచనములను విని నారదుడు హర్షము పట్టజాలక పరవశుడై అన్ని సందేహములను తీర్చు ఒక సందేహమును నారాయణ మహర్షి నడిగెను.
నారద ఉవాచ - నారదుడనెను :
ఓ జగద్గురూ! కాళియుడు శ్రేష్ఠమైన తన పూర్వ నివాస భవనమును వదిలి పెట్టి యమునా తీరమున కెందుకు పోయెను? నాకది చెప్పుము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి వల్కెను :
నారదా! వినుము. సూర్యగ్రహణకాలమందు మలయ పర్వత సమీపమున సుప్రభానది పడమటి ఒడ్డున కృష్ణ కథాప్రసంగమేర్పడిన సందర్భమున మాతండ్రి ధర్మఋషి ద్వారా నేను విన్న పురాతణేతిహాసము చెప్పుచున్నాను. ఆనాడు మునుల సభలో పులహడు ధర్మఋషి నడుగగా ఆశ్చర్యకరమైన ఈ ఆఖ్యానమును ఆ దయానిధి చెప్పెను. అక్కడ నేనిది వినియుంటిని. నాగరాజగు శేషుని ఆజ్ఞ ప్రకారము నాగ గణములు ప్రతిసంవత్సరము కార్తీక పూర్ణిమనాడు భయముతో గరుడార్చన చేయుచుండిరి. వారు పుష్కర తీర్ధమున చక్కగా స్నానమాడి భక్తియుతులై పుష్పములు ధూపదీపములు నైవేద్యములు బలులు సమర్పించి ముదముతో గరుడుని పూజించుచుండిరి.
కాళియుడు మిక్కిలి అహంకరించి అందరివలె గరుడుని పూజింపక నాగులు కూర్చుకొన్న పూజాద్రవ్యమును బలవంతముగా తినబూనెను. ఆ మదోద్ధతుని (గర్విష్టిని) నాగులు నివారించి నీతిని బోధించిరి. కాని వారు నివారింపజాలకుండిరి. అప్పుడు గరుడుడు
ఆవిర్భవించెను. (ప్రత్యక్షమయ్యెను. వచ్చెను) ఆ పక్షిరాజును చూచి కాళీయుని ప్రాణములు రక్షించుటకై తమ ప్రాణశక్తులు కూడగట్టుకొని సూర్యోదయమగు వరకు నాగులు గరుడునితో యుద్ధము చేసిరి. ఆ పక్షిరాజు తేజస్సు (పరాక్రమము)నకు మిక్కిలి భయపడి వారందరు పారిపోయి అందరికభయ మిచ్చెడి అనంతనాగరాజును శరణు పొందిరి.
పారిపోవుచున్న నాగులను చూచి దయానిధియగు గరుడుడు అక్కడ నిలిచెను. భయములేని కాళియుడతనిని చూచి హరిపాదములు తలచి యుద్ధము చేసెను. ఒక ముహూర్తకాలము వారిద్దరికి భయంకర యుద్ధము జరిగెను. గరుడుని పరాక్రమమునకు నాగరాజోడిపోయి భయముతో పారిపోయి యమునా నది మడుగును చేరెను. సౌభరిముని శాపము మూలమున గరుడుడక్కడికి పోజాలకుండెను. కాళీయుడు గరుడ భయముతో అక్కడనే నివాసముండెను. అతని గణములు తరువాత పోయి చేరిరి.
నారద ఉవాచ - నారదుడనెను:
గరుత్మంతునకు సౌభరి శాపమెట్లు సంభవించెను. పరమ ప్రభువు యొక్క వాహనమగునతడు ఆ మడుగున కెట్టు పోజాలకుండెను.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
సౌభరిముని వేయి దేవతా సంవత్సరములు తపస్సు చేసి మహాసిద్ధి (అణిమాద్యష్ట సిద్ధులతో బాటు) పొంది శ్రీకృష్ణ పాదపద్మముల ధ్యానించెను. యమునా నది యొడ్డు సమీపమున నతడు ధ్యానము చేయుచుండగా పక్షిరాజగు గరుత్మంతుడు యమునానదీ జలములో భయము లేకుండ తన గణముతో బాటు సంతోషముగా తిరుగుచుండెను. అనేక విధములుగా తన తోకను ఎత్తి విసురుచు స్వేచ్చగా ముని చుట్టు ప్రదక్షిణము చేసి ఉల్లాసముతో వచ్చుచు పోవుచుండెను. తన గణముతో బాటు ఆ మహానుభావుని చూచుచూ చూచుచూ అతని సమీపమున (జలములో) నున్న చేపను ముక్కుతో పట్టుకొనెను. చేప వైపు పోవుచున్న గరుడుని మునీంద్రుడు కోపదృష్టితో చూడగనే చేప నీటిలో పడెను. మరల దానిని పట్టుకొనుటకు ముందే చేప గరుడ భయముతో ముని సమీపమున (శరణముగా) నిలిచెను. దానిని పట్టబోవుచున్న గరుడినితో మునీంద్రుడిట్లనెను.
సౌభరిరువాచ - సౌభరిముని ఇట్లనెను :
ఓ పక్షిరాజా! నా సమీపము నుండి దూరముగా పొమ్ము. దూరముగా పొమ్ము. క్రూరముగా నాముందు ఒక ప్రాణి పట్టుకొనుటకు నీకేమి సామర్థ్యమున్నది? నేను శ్రీకృష్ణుని వాహనమునని గొప్పగా భావించుకొనుచున్నావు. శ్రీకృష్ణుడు నీవంటి వాహకులను (మోయువారిని) కోట్లను సృష్టింప సమర్థుడు సుమా. నిన్ను నా కనుబొమ్మలకదలికతో వెంటనే భస్మము చేయుదును. నీవు పరమాత్మకు వాహనము వైనను మేము నీదాసులము కాము. ఓ పక్షీంద్రా! ఈ నాటినుండి నా ప్రదమునకు (మడుగు, నదిలో నొక లోతైన ప్రదేశము) నీవు వచ్చినచో వెంటనే నా శాపము వలన భస్మమై పోవుట నిశ్చయము. మునీంద్రుని వాక్కు విని పక్షిరాజు గడగడలాడెను. శ్రీకృష్ణ పాదములను స్మరించి స్మరించి మునికి నమస్కరించి అక్కడి నుండి వెడలిపోయెను. బ్రాహ్మణోత్తమా! నాటినుండి పక్షిరాజగు గరుడునికి యమునానది మడుగు స్మృతికి రాగానే వణుకు పుట్టునన్నది నిశ్చయము. ధర్మఋషి ద్వారా వినిన ఇతిహాసము నీకు చెప్పితిని.
ఎవరెరుగని రహస్య విషయములు గలదియు చెవులకు సుఖము కూర్చునదియు మంగళప్రదమైన ప్రసంగకథ వినుము. 'నీటి మడుగులో నుండి శ్రీకృష్ణుడు చాల సేపటి వరకు పైకి తేల లేదు' అని గ్రహించిన గోపబాలురు అజ్ఞానము వలన విషాదము పొంది యమునా తీరమున నేడ్చిరి. కొందరు బాలురు దుఃఖము చేత మనస్సు చెదరి తమ వక్షస్థలములను బాదుకొనిరి. కొందరు హరిలేడని నేలమీద పడి మూర్ఛిల్లిరి. శ్రీకృష్ణుని వియోగము భరించలేక కొందరు ఆ మడుగులో పడబోయిరి. మరికొందరు బాలురు వారి నట్లు పడకుండ వారించిరి. కొందరేడ్చి యేడ్చి ప్రాణములు విడువబూనుకొనిరి.
వారిలో కొందరు జ్ఞానాత్ములు ప్రయత్నించి రక్షామంత్రములతో రక్ష చేసిరి. కొందరు హాహాయని మరికొందరు కృష్ణ కృష్ణాయని పలికిరి. కొందరు నందునికీవార్త తెలుపుటకై అతనివద్ద కేగిరి. కొందరు శోకము మోహము భయములతో తొందర గలవారై ఒకచోట చేరి మన కృష్ణుడెక్కడ పోయెను ? మనమేమి చేయుదము ? ఓ నందకుమారా ! ఓ కృష్ణా! ప్రాణముల కన్న మిక్కిలి ప్రియమైనవాడా! ఓ బంధూ! మా ప్రాణములు పోవుచున్నవయ్యా నీ దర్శనమిమ్ము అని పలికిరి.
ఇంతలో కొందరు బాలకులు మిక్కిలి చలించి ఏడ్చుచు శోకముతో చెదరిన మనస్సులు గలవారై నందుని వద్దకేగి త్వరగా నతని కీవార్తను తెలిపిరి. యశోదాదేవి మూలబలము గోపాలురు ఎర్రదామరల వంటి కన్నులు గల గోపికలు అందరీ వార్తవిని దుఃఖముతో
యమునానదీ తీరమునకు పరుగెత్తిరి. బాలురతో గూడి దుఃఖించిరి. అందరొక చోట చేరి శోకముతో ఒడలెరుగక దుఃఖించిరి. ఆ మడుగులో పడబోయిన యశోదామాతను కొందరడ్డుకొని ఆపిరి. గోపాలురు గోపికలు దుఃఖముతో తమ అంగములను బాదుకొనిరి. కొందరు విలపించిరి. కొందరు మూర్ఛిల్లిరి. మడుగులో దూకబోయిన రాధనొక స్త్రీ వారించెను. ఆ రాధాదేవి దుఃఖముతో మరణించినట్లు నదీ తటమున మూర్ఛిల్లెను. నందుడు మిక్కిలి ఏడ్చి యేడ్చి మరల మరల మూర్ఛిల్లెను. మరి మరి యేడ్చి తిరిగి తిరిగి మూర్ఛపొందెను. మిక్కిలి ఏడ్చుచున్న నందుని శోకముతో బాధపడుచున్న యశోదను మూర్ఛలో మునిగిన రాధను గోపాలురను గోపికలను ఏడ్చుచున్న బాలకులను దుఃఖాన్వితలైన బాలికలను జ్ఞానులలో శ్రేష్ఠుడైన బలదేవుడందరినిట్లు బోధించెను.
శ్రీ బలదేవ ఉవాచ - శ్రీబలదేవుడిట్లనెను :
ఓ గోపాలులారా ! గోపికలారా ! ఓ బాలులారా! అందరు నామాట వినుడు. జ్ఞానులలో శ్రేష్ఠుడవైన ఓ నందుడా! గర్గమహర్షి వాక్యమును స్మరించుకొనుము. జగత్తును మోయునట్టి ఆదిశేషునకు జగత్ ప్రళయమును చేయు శంకరునకు సృష్టికర్తయగు బ్రహ్మకు ఈ ప్రపంచమున ఎవని ముందు పరాజయము పొందుట సంభవించునో అట్టి సర్వేశ్వరుడు అణువులకంటె అణువైన కారణమైనవాడు స్థూలముకంటె స్థూలమైనవాడు శ్రేష్ఠునికన్న శ్రేష్ఠుడు ఉండియు చూడబడనివాడు యోగులకు విశ్రాంతిస్థానము దిక్కులలో ఒక చోట కలియక లేనట్లు ఆకాశము స్పృశింపబడనట్లుండువాడు సర్వేశ్వరుడైనను బాధ్యుడతడేయని శ్రుతులు స్పష్టముగా చెప్పుచున్నవి.
ఆత్మ కన్పించునట్టివాడు కాడు. అస్రములకు గురికాడు. (అస్త్రముల చేత నరకబడడు) చంపబడడు. కనపడువాడును కాడు. అగ్నిచేత పట్టువడడు. హింసింపబడడు. ఈ విషయ మాధ్యాత్మిక వేత్త లెరుగుదురు. జ్యోతి స్వరూపుడగు ఆత్మకు జన్మ యౌవన మరణములను ఆదిమధ్యాంతము లేవు. శ్రీకృష్ణ పరమాత్మకు విగ్రహమన్నది భక్తులు ధ్యానించుట కొరకే.
బ్రహ్మాండమంతయు జలప్రళయకాలములో జలమున మునిగినప్పుడీ జనార్దనుడు ఆ జలమున శయనించువాడు. ఓ తండ్రి సృష్టికర్తయగు బ్రహ్మ ఎవని నాభి కమలమున పుట్టినాడో అట్టి ప్రభువునకు మడుగులో ఆపదయా ? ఒక దోమ బ్రహ్మాండమంతటిని
మ్రింగుటకు శక్తి కలదైనప్పటికిని కాళియ సర్పము స్వామిని మ్రింగుటకు సమర్ధము కాజాలదు.
ఈ విధముగా యోగులకును తెలియని రహస్యము సంశయములను ఛేదించు మూలసారము ఉత్తమమైన ఆధ్యాత్మిక తత్త్వము సర్వము చెప్పబడినది. ఇట్టి బలదేవుని మాటలు విని గర్గమహర్షి వాక్యమును తలంచుకొని నందుడు గోపాలకులు గోపస్త్రీలు శోకమును విడిచి అందరును ఆ జ్ఞాన విషయమును తలంచుకొనిరి. యశోద రాధ మాత్రము ప్రబోధము పొందకుండిరి. ఔను. బంధువుల ఆపద (వియోగము) విషయములో ఆసందర్భమున ఉపదేశము నందు మనస్సు నిలువదు కదా!
ఓ నారదా ! ఇంతలో నీటిలో నుండి పై కెగిరి వచ్చుచున్న శ్రీకృష్ణుని తేటనైన మనస్సులతో గోపాలురు గోపికలు దర్శించిరి. శరదృతువులో పూర్ణిమ నాటి చంద్రుని వంటి ముఖము గల వాడును మిక్కిలి మనోహరమైన చిరునవ్వు గలవాడును వస్త్రములు గాని తాను గాని నీటికి తడువక పులుమబడిన చందనము గాని కొటుక గాని చెదరిపోక ఉన్నవాడును సర్వాభరణములతో గూడి బ్రహ్మ తేజస్సుతో వెలుగుచున్నవాడును నెమిలియీక కొండెకొప్పున గలవాడును పెదవుల మీద పిల్లనగ్రోవి గలవాడునగు నాయచ్యుతుని (శ్రీకృష్ణుడు) తన బాలకుని యశోద కౌగిలించుకొని చిరునవ్వుతో ప్రసన్నముగా మారిన వదనమునేత్రములతో అతని ముఖపద్మమును ముద్దిడుకొనెను. నందుడును బలదేవుడును రోహిణియు ఒడిలోనికి తీసుకొనిరి.
అందరును కనురెప్పపాటు లేకుండ శ్రీకృష్ణుని సుందరముఖమును దర్శించిరి.. మిక్కిలి ప్రేమతో నున్న గోపాలబాలురందరు అతని నాలింగనము చేసుకొనిరి. గోపికలు తమ కన్నులనెడి చకోరపక్షులద్వారా అతని ముఖచంద్ర (కాంతిని) పానము చేసిరి.
ఇంతలోనక్కడ హఠాత్తుగా అరణ్యభాగమును వారినందరిని గోకులమునంతయు కారుచిచ్చు చుట్టుముట్టెను. అడవిలో అన్ని వైపులలో పర్వతమంత యెత్తుగా మండుచున్న అగ్నిని చూచి ఆయాపత్కాలములో భీతులై తామందరు నశింతుమనుకొనిరి. బాలురు గోపికలు మిక్కిలి భయపడినవారై భక్తితో తలలు వంచి గోకులవాసులందరు చేతులు జోడించి శ్రీకృష్ణుని స్తుతించిరి.
బాలా ఊచుః - బాలురనిరి :
ఓ పరబ్రహ్మా ! మధుసూదనా! ఇంతవరకే విధముగా సర్వాపదలలో మా గణములను (మావంశములను) రక్షించితివో ఇపుడట్లే మరల దావాగ్ని నుండి మమ్ము రక్షించుము. ఓ జగత్పతీ! జగములను సృష్టించి పాలించి సంహరించువాడవు. మాకిష్టదేవతవు మాకులదేవతవు నీవే. అగ్ని గాని వరుణుడు (జలదేవత) గాని చంద్రసూర్యులు గాని యముడు కుబేర వాయువులు ఈశానాది దేవతలు బ్రహ్మరుద్ర శేష ధర్మేంద్రాదులు మునీంద్రులు మనువులు మానవులు దైత్యులు యక్షరాక్షస కిన్నరులు చరాచర ప్రపంమంతయు నీ విభూతియే (నీ అంశ. నీసంపద) అందరి జన్మమరణములు నీ యిచ్చ (సంకల్పము) వలననే జరుగును. ఓ గోవిందా! మాకభయమిమ్ము.ఈ దావాగ్నిని నశింపజేయుము. మేము నిన్ను శరణు పొందుచున్నాము. శరణాగతులమైన మమ్ము రక్షింపుము. ఇట్లు పలికి వారందరు అతని పొదపద్మములు ధ్యానించి నిలిచియుండిరి.
శ్రీకృష్ణుని అమృత దృష్టి వలన దావాగ్ని దూరముగా తొలగిపోయెను. అదియట్లు తొలగిపోగా వారందరు సంతసముతో నృత్యము చేసిరి. హరి స్మరణము చేసినంతలో సర్వాపదలు నశించిపోవును.
మహాపుణ్యవంతమైన ఈ స్తోత్రమును ప్రాతఃకాలమున నిద్రనుండి లేచి ఎవడు పఠించునో వానికి జన్మజన్మకు వహ్ని (అగ్ని) భయముండదు. శత్రువులచేత పట్టువడిన సమయములో గాని దావాగ్ని సంభవించినపుడు గాని ప్రాణములకు సంకటమేర్పడిన ఆపత్తులో గాని ఈ స్తోత్రమును పఠించినచో వాటి నుండి విడుదల పొందును. ఈ విషయమున సందేహమే లేదు. శత్రు సైన్యము నశించి అంతట వాడు విజయము పొందును. ఇహలోకమున హరిభక్తిని అంత్యమున హరిదాస్యముక్తిని పొందుట సత్యము.
శ్రీనారాయణ ఉవాచ - నారాయణ మహర్షి అనెను :
శ్రీహరి ఇట్లు దావాగ్ని నుండి మోక్షణము చేసి వారితో బాటు కుబేరుని భవనమును పోలిన తన గృహమునకేగెను. నందుడు ముదముతో బ్రాహ్మణులకు నిండుగా ధనము దానము చేసి జ్ఞాతివర్గమునకు బంధువులకు భోజనములు పెట్టించెను. ఆపదలు గడచిన సంతోషముతో బ్రాహ్మణుల చేత వేదపారాయణము చేయించి నానావిధ మంగళములు జరిపించి హరినామ సంకీర్తనము చేయించెను. ఇట్లందరు బృందావనములో ప్రతి గృహమున శ్రీకృష్ణ పాదపద్మ ధ్యాన తత్పరమైన మనస్సులు కలవారై ఆనందించిరి. ఇట్లుగా శ్రీహరి యొక్క మంగళకరమైన చరిత్రము కలికల్మషము వలన నేర్పడు కష్టములను (ఆపదలను) కాల్చివేయుటలో అగ్నివంటిది అదియంతయు చెప్పబడినది.
ఇది బ్రహ్మవైవర్తపురాణములో శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన కాళీయదమనము దావాగ్ని మోక్షణమను భాగములు గల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 19 of the Brahma Vaivarta Mahā Purana - Śrī Kṛshṇa Janana Khaṇḍa is as follows:
Settling in the breathtaking bowers of Vṛndāvana, Kṛshṇa and Balarāma grew into handsome cowherd boys, taking charge of herding the calves into the lush forest meadows along with their cowherd friends. One day, a demon named Vatsāsura disguised himself as a calf and infiltrated the herd to kill Kṛshṇa. Spotting the demon, Kṛshṇa signaled Balarāma, caught Vatsāsura by his hind legs, whirled him furiously through the air until he breathed his last, and hurled him into the top of a wood-apple tree, liberating his soul while the cowherd boys cheered in joyous wonder.