స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
5వ అధ్యాయము
లోమశుడు చెప్పెనుః విష్ణువు వెళ్ళిపోగానే ఋషులతో సహా దేవతలందరు, యజ్ఞముపై జీవించువారంతా కూడా (శివ) . గణములచే జయింపబడిరి. భృగువును పడదోసిరి. మీసముల గొరిగిరి. వికృతమైన చేష్టలనొనరించు బ్రాహ్మణుల ఎత్తిపడవేసెను. అచట పితృదేవతలకొసగుబలి (స్వధా) హేళనపాలాయెను. ఋషులు ఎగతాళి పాలయిరి. వారు (శివగణములు) యజ్ఞాన్ని యందు కోపముతో పురీషమును వర్షించిరి. కోపముతోనున్న ఆగణములు అప్పుడు చెప్పరానిదంతా చేసిరి. దక్షుడు మిక్కిలి భయముచేత అంతర్వేది మధ్య చేరియుండెను అట్లు దాగిన అతనిని ఆజ్ఞాపించి కోపముతో బయటకు తెచ్చెను. ఆతని చెక్కిళ్ళను పట్టి ఖడ్గముతో తలను ఖండించెను.
ప్రతాపముగల వీరభద్రుడు ఆ శిరస్సు భేదింపవీలులేనిదని తలచి కాళ్ళతో భుజములను అణచిపట్టి గొంతుపై దెబ్బతీసెను. అపుడు దురాత్ముడైన దక్షుని శిరస్సు ఛేదింపబడెను. అపుడు బుద్ధిమంతుడైన వీరభద్రుడు ఆ శిరస్సును జ్వలించుచున్న కుండము నందు హవనము చేసెను. ఇక ఇతర ఋషులు, పితరులు, యక్షులు, రాక్షసులు గణములచేత తరిమికొట్టబడి అంతా పలాయనము చిత్తగించిరి. చంద్రుడు, సూర్యుడు, ఇతర గణములు, గ్రహములు, నక్షత్రములు, తారకలు అందరూ చెదిరిపోయిన వారైరి. వారు కూడా గణములచేత తరిమికొట్టబడిరి.
సత్యలోకమునకు వెళ్ళిన బ్రహ్మ పుత్రశోకముచేత పీడింపబడి ఇపుడు చేయవలసినదేమని మిగుల చింతించెను. మనసు బాధపడుతున్నందుచే శాంతిని పొందలేని పితామహుడు (బ్రహ్మ) ఆ పాపియొక్క దుష్కృతమును తెలుసుకొని కైలాస పర్వతమునకు వెళ్ళుటకు ఆలోచించెను. హంసనధిరోహించిన మహాతేజస్సుగల బ్రహ్మ దేవతలందరితో కలిసి పర్వతములలో గొప్పదైన (కైలాస) పర్వతమున ప్రవేశించి ఏకాంతముగా నివసించుచున్న రుద్రుని నందితో కూడియున్న వానిని చూచెను. జటాజూటములు గలిగి గొప్ప ప్రభచే కూడిన వేదాంగములచేకూడా చేరబడని శివుని అట్లు చూచి దక్షుడు. క్షోభనొందెను. దండమువలె నేల పైబడి క్షమను కోరుటకుద్యుక్తుడాయెను. శివుని పాదకమలమును తన నాలుగు మకుటముల అంచులతో తాకుచూ, బ్రహ్మ పరమాత్ముడైన శివుని స్తుతించుటకు మొదలిడెను . బ్రహ్మోవాచః
బ్రహ్మ పలికెనుః రుద్రునకు, శాంతునకు, పరబ్రహ్మ పరమాత్మునకు నమస్సులు, (ఓరుద్రా!) నీవే విశ్వమును సృజించువానిని సృజించెదవు, ప్రపితామహుడగు ధాతవు నీవే. గొప్పనైన రుద్రునకు, నీలకంఠునకు, బ్రహ్మకు, విశ్వరూపమున నున్నవానికి, విశ్వము యొక్క బీజమునకు జగత్తుకానందమును కలిగించువానికి నమస్కారము నీవే ఓంకారము, వషట్ కారము. అన్ని ప్రారంభములను మొదలు పెట్టువాడవు. నీవే యజ్ఞము, యజ్ఞకర్మ, యజ్ఞములను ప్రవర్తింపజేయువాడవు. యజ్ఞములు చేయువారందరి పాలకుడవు నీవు. మహాదేవా! అన్ని ప్రాణుల చేత శరణు వేడబడుదువు. ప్రభూ! మహాదేవా! పుత్రశోకము చేత బాధపడుచున్నవానిని రక్షింపుము, రక్షింపుము
మహాదేవుడవేనుః పితామహా! శ్రద్దగా నామాటనాలకింపుము. ఎప్పుడైనా దక్షుని యజ్ఞమును నేను భంగపరచలేదు. బ్రహ్మన్! నిప్పంశయముగా దక్షుడు తన కర్మ చేతనే హతుడయినాడు. ఇతరులకు బాధను కలిగించు పనినెప్పుడైననూ చేయరాదు. ఓ పరమేష్ఠి ఇతరులకు ఏది (చేయబడునో తనకు అదే కలుగును.
అని పలికి రుద్రుడు అపుడు బ్రహ్మతో మరియు దేవతలతో కలిసి ప్రజాపతి యజ్ఞవాటిక వుండిన కనఖలమను తీర్థమునకు వెళ్ళాను. రుద్రుడపుడు వీరభద్రుడు చేసిన దానిని చూచెను - స్వాహా, స్వధా మరియు పూషన్, భృగువు, ఋషులు, పితరులు అనేకమంది యక్ష, గంధర్వ, కిన్నరులతో సహా అందరూ రణ భూమిలో ముక్కలుగా చేయబడిరి. కొందరు మరణించిరి శివుని రాకను గాంచి వీరభద్రుడు గణములతో సహా దండప్రణామమాచరించి శివుని ఎదుట నిలిచెను. రుద్రుడు తన ఎదుటనిలిచిన మహాబలవంతుడగు వీరభద్రుని చూచి నవ్వి 'ఓ వీరా! ఇదేమిచేసితివి?' అనెను.
నాయనా! ఈ విధముగా చేసిన దక్షుని గొనీరమ్ము! అతని యజ్ఞమున ఈ విధమైన విలక్షణ ఫలితముకలిగినది.' అని శంకరుడు పలుకగా వీరభద్రుడు త్వరగా దక్షుని మొండెమును తెచ్చి శివుని ఎదుట పడవేసెను. అపుడు శివుడు వీరభద్రునితో 'ఈ దురాత్ముడైన దక్షుని శిరస్సునెవరు తొలగించారు” అనెను. కుటిలుడైననూ ఇప్పుడు నేనతనికి జీవితాన్ని ఇచ్చెదను' అని ఈశ్వరుడు పలుకగా వీరభద్రుడు ఇట్లనెను.
శంకరా! అప్పుడే నేను శిరస్సును అగ్నియందు ఆహుతి చేసాను. మిగిలినది వికృతమైన ముఖము గల ఈ పశువుయొక్క శిరస్సు ఆది తెలిసి శివుడు వికృతమైనది, భయమును కలిగించునది. కమబొమల మధ్య వెంట్రుకలు గలది అయిన పశుశిరస్సును మొండెముపై పడవేసెను. శివుని ప్రసాదము వలన దక్షుడు జీవితమును పొందెను. అపుడు తన ఎదుట శివుని చూచి సిగ్గిలిన దక్షుడు ప్రణతుడుగా లోకశంకరుడైన శంకరుని స్తుతించెను.
దక్షుడు పలికెనుః 'దేవతలలో శ్రేష్ఠుని, వరములిచ్చుదేవుని, శ్రేష్ఠుని, సనాతనుని నమస్కరించుచున్నాను. దేవతల ప్రభువుని, ఈశ్వరుని, హరుని, కల్యాణ కరుని, జగత్తుకు పూర్తి బంధువును నమస్కరించుచున్నాను. విశ్వమునకు ప్రభువుని,విశ్వముగా రూపుదాల్చిన వానిని, సనాతనుని, సర్వవ్యాపిని, నిజాత్మ రూపుదాల్చినవానిని నమస్కరించుచున్నాను- సర్వుని, నిజభావమును భావింపజేయువానిని, వరములనిచ్చు శ్రేష్ఠుని నమస్కరించు చున్నాను.'లోమశుడు పలికెను, దక్షుని చేత ఇట్లు స్తుతింపబడిన రుద్రుడు నవ్వుచూ రహస్యమునిట్లు పలికెను
హరుడు పలికెనుః ఓ బ్రాహ్మణశ్రేష్టా! పుణ్యాత్ములైన నాలుగు విధాల జనులు నన్ను సేవించెదరు. వారు ఆర్తుడు. జిజ్ఞాసువు (తెలుసుకొనగోరువాడు), ప్రయోజనముగోరువాడు, జ్ఞాని. వారిలో నాకు జ్ఞానులందరూ ప్రియమైనవారు. ఇందులో సందేహము లేదు. ఎవరు నన్ను జ్ఞానము లేకనే పొందయత్నించెదరో వారు నిజముగా మూర్ఖులు. కేవలం కర్మచేతనే నీవు సంసారమును దాటగోరుచున్నావు కర్మపై ఆధారపడు మూర్ఖులగు జనులు వమ్న వేదములచేత గానీ, దానముల చేతగానీ, యజ్ఞములచేత, తపస్సు చేతగాని పొందలేరు. కనుక, జ్ఞానమునాశ్రయించి సమాహిత చిత్తుడవై కర్మను ఆచరింపుము - సుఖదుఃఖములను పమానముగా గ్రహించుచు ఎల్లప్పుడూ సుఖముగా నుండుము.
లోమశుడు చెప్పెనః పరమేష్ఠియగు శివుడు అపుడు దక్షునికి ఉపదేశమునిచ్చి, అతనిని అక్కడే నిలిపి తన పర్వతమునకేగెను. భృగువు మొదలైన మహర్షులంతా కూడా బ్రహ్మ చేత ఊరడింపబడి, మరియు మేల్కొలుపబడి, ఆక్షణముననే జ్ఞానులైరి. పితామహుడగు బ్రహ్మ అటుపిమ్మట తన సదనమున కేగెను. దక్షుడు కూడా స్వయముగా ఆవాక్యమునుండి పరమజ్ఞానమునొందెను. శివుని ధ్యానమే పరముగా తలంచుచు ఆ మహాబుద్ధిమంతుడు తపస్సునాచరించెను. కనుక, భగవంతుడైన శివుడు ఏవిధముగానైననూ బాగుగా సేవింపబడవలెను.
శివప్రాంగణమున సంమార్జనముచేయు నరులు శివుని నగరమును చేరి జగత్తుకంతా పూజ్యులగుదురు. ఎవరు శివునికి గొప్ప కాంతీ గల దర్పణమును (చూపెదరో) ఇచ్చెదరో వారు శివుని ఎదుట శివుని సభలో వుండగలరు. దేవదేవుడగు శివునికి చామరములనిచ్చు వారు మూడులోకములయందు చామరములచేత వీచబడుదురు. శివాలయమున దీపదానము చేయు నరులు మూడులోకములకు కాంతి నిచ్చుచూ తేజోవంతులు కాగలరు పరమాత్ముడైన శివునకు ధూపము నిచ్చువారు కీర్తిమంతులై రెండు కులములనూ తరింప జేయుదురు. శివుని ఎదుట నైవేద్యమునిచ్చు వారు ప్రతి అన్నపుముద్ధయందునూ ఒక క్రతువు యొక్క ఫలమును పొందెదరు.
యే నరోత్తములైతే భగ్నమైన శివాలయమును బాగుచేయుదురో వారు నిస్సంశయముగా రెండింతల ఫలితమును పొందెదరు దానిని ఇటుకలతో గానీ, మట్టితో గానీ కొత్తగా చేయువారు భూమియందు (వారి) నిర్మలమైన కీర్తి నిలుచునంతవరకు స్వర్గమున ఆనందించెదరు. ఇందు విచారించవలసినది లేదు. బుద్ధిమంతులైన విప్రులారా! యే విప్రులైతే శివుని ప్రాసాదమున అనేక అంతస్థులతో చేయించెదరో వారు పరమగతిని (మోక్షమును) పొందుదురు. తన లేదా ఇతరుల శివమందిరమును శుద్ధమైనదిగా, తెల్లగా చేయువారు మోక్షమును పొందుదురు.
పుణ్యాత్ములైన నరులెవరైతే (శివునకు) మేల్కొట్లు నొసగుదురో వారు కులాన్నంతయూ తరింపజేసి శివలోకమును చేరుదురు. వాదముతో కూడిన మంటను శివాలయమున కట్టువారు మూడు లోకములందున తేజస్పును పొందినవారు, కీర్తిగలవారు అవుదురు. ఒక పర్యాయముగానీ రెండు పర్యాయములుగానీ మూడు పర్యాయములుగానీ గాంచువారు ధనికుడైనా, దరిద్రుడైనా సుఖముగా దుఃఖమునుండి విముక్తుడగును పరమాత్ముడైన శివుని శ్రద్దతో సేవించువాడు కులమునంతా ఉద్దరించి శివునితో కలిసి ఆనందించును. ఇందు 'ఇంద్రసేనునికి యమునికి మధ్య జరిగిన పురాతన, ఇతిహాస సంవాదమును ఉదాహరిస్తారు.
పూర్వము కృతయుగమున ప్రతిష్టానపురమును పాలించు ఇంద్రసేనుడను రాజుండెడివాడు. అతను వేటాడుట యందే ఎల్లప్పుడు ఆనందమును పొందెడివాడు. ఆచారహీనుడు, క్రూరుడు, కేవలము (తన) ప్రాణములచేత తృప్తినొందువాడు, ఇతరుల ప్రాణముల చేత తన ప్రాణములను పోషించువాడు మూడుడు ఇతరుల స్త్రీలయందు మిక్కిలి కామము గలవాడు, ఇతరుల ద్రవ్యములయందు కాంక్ష గలవాడు, బ్రాహ్మణుల హింసించువాడు, ఎడతెగక మద్యమును ద్రావువాడు గురువు యొక్క తల్పమునుచేరినవాడు, బంగారమును దొంగిలించువాడు. దురాత్ముడైన ఆరాజుననుసరించి ప్రజలు ప్రవర్తించెడివారు. ఇట్లు పెక్కు విధములుగా ఆ దురాత్ముడైన రాజు రాజ్యము చేసెను. అపుడు చాలాకాలము తరువాత (గొప్పదైన కాలముచేత) ఆ దుర్మతి పంచభూతములలో కలిసేను (మరణించెను) .
అపుడు దురాత్ముడైన ఇంద్రసేనుడు, కల్మషముతోగూడినవాడు, యమభటులచేత యముని వద్దకు గొనిరాబడెను. ఎదుట నిలిచిన ఇంద్రసేనుని చూచి యముడు. లేచినిలబడి, తలవంచి శివునకు నమస్కరించేను. ధర్మమును పోషించువారీలో శ్రేష్ఠుడగు యముడు దూతలను బెదిరించెను. తాళ్ళతో కట్టబడిన చంద్రసేనుని విడిచి, దర్మరాజిట్లు పలికెను. 'ఓ రాజ శ్రేషా! ఎక్కువ పుణ్యముగల లోకములను జేరి అనుభవింపుము. స్వర్గములో ఇంద్రుడున్నంతవరకు, ఆకాశమున సూర్యుడున్నంతవరకు, పంచభూతములున్నంతవరకు పుణ్యకర్మలనాచరించిన శివభక్తుడగు. నీవు నిత్యము సుఖముగా నుండుము.
యముని మాటను విని ఇంద్రసేనుడు బదులు పలికెను. 'వేటాడుట యందు మక్కువ గల నేను శివునెరుగన. ఆ మాట విని యముడు చెప్పవలసిన దానిని చెప్పెను. 'ఓ మానద (గౌరవప్రదుడా!) ఆహర (గొనిరమ్ము) ప్రహరస్వ (కొట్టుము) - అని ఎల్లప్పుడూ పలికితివి ఆకర్మ ఫలము చేత నీవు ఎల్లప్పటికీ పవిత్రుడవు. కనుక శంకరుని గూర్చి కైలాసమునకు వెళ్ళుము.
ఇట్లు మహాత్ముడైన యముడు మాటలాడుచుండగనే వృషభమును అధిరోహించిన వారు, గొప్పకాంతిగలవారగు శివదూతలేతెంచిరి. (వారు) నీలకణులు, పదిభుజములు గలవారు, ఐదు తలలు గలవారు, మూడుకళ్ళు గలవారు, జటాజూటమును, కుగ్గిలములను ధరించినవారు. శిరస్సుపై చంద్రుని ధరించినవారు వారిని చూచి, ధర్మప్రభువగు యముడు ఒక్కమారుగాలేచి మహేంద్రసమానులైన వారినందరినీ పూజించెను. వారంతా త్వరగా 'యమునుద్దేశించి పలికిరి. 'ఓ మహానుభావా! ఇంద్రసేనుడను గొప్ప కాంతిగలరాజు నిత్యమూ శివ నామము జపించువాడిచ్చటికి వచ్చెను.
వారి మాటలను విని యముడు ఇంద్రుసేనుని సత్కరించి విమానమందు కూర్చోబెట్టి శివుని నివాసమునకు పంపెను. తన పరివారములోని ఉత్తములచే తీసుకొనిరాబడిన ఇంద్రసేనుని శంభుడపుడు చూసెను.రుద్రుడు లేచి ఆ రాజును. కౌగిలించుకొనెను. సగం సింహసనముపై కూర్చుండబెట్టి ఇంద్రసేనుని ఉద్దేశించి ఇట్లు పలికెను. 'ఓ గొప్పరాజాః ఏమి ఇవ్వవలెను. నీవు కోరినది ఇచ్చెదను' అని మహేశుడు పలుకగా విని రాజు ఆనందముచే కన్నీరు వీడుచుచు ప్రేమ భావమువల్ల ఏది పలుకక మిన్నకుండెను.
ఆపుడు శివుని చేత ముండుడికి ప్రియమిత్రుడగు చండుడను సభ్యుడిగా (ఇంద్రసేనుడు) చేయబడెను. గొప్పపాపియైన ఇంద్రసేనుడనురాజూ పరమాత్ముడగు రుద్రుని నామమును ఉచ్చరించుట మాత్రముచేత సిద్ధిని పొందెను. హరే, హర అని శివునియొక్క, విష్ణువు యొక్క నామము చేత పరమాత్ముడైన శివుని ద్వారా అనేకమంది మానవులు రక్షింపబడిరి.
మూడులోకములయందునూ పరమశివుని కంటే వేరొక దైవము కనుపింపడు. కనుక అన్ని ప్రయత్నములచేత సదాశివుని పూజింపవలెను పత్రములచేత, పుష్పములచేత, స్వచ్చమైన జలముచేత, కరవీరములచేత పూజింపబడు శంకరుడు వరములిచ్చును కరవీరముల కంటె అర్కపుష్పము (జిల్లేడు) పదింతలు రెట్టింపు గుణముకలది. చరాచరమైన జగత్తు విభూతి మొదలైన వాని మండి సృజింపబడినది. శివుని శరీరమువంటియున్న ఆ విభూతిని ఎల్లప్పుడూ ధరించవలయును. ఓ ఉత్తమ
విప్రులారా! తరువాత, అన్ని పాపములను హరించు పుణ్యమైన త్రిపుఇమును గూర్చి వినుడు- రాజదూతల చేత ఒకానొక దొంగ మహాపాపి (ఆయినందుచే) చంపబడినాడు అతనినారగించుటకు వచ్చిన ఓ కుక్క తలపై నిలుచున్నది. ఆ పాపియొక్క రక్ష గోరుమధ్య భాగంలో చిక్కుకున్నది త్రిపుంకిత ముద్రచేత అతని ఫాలభాగముపై పడి చైతన్యము లేని అతని దేహమును మాత్రము తగులుకొనియున్నది.
అపుడా దొంగ శివదూతలచేత కైలాసమునకు తీసుకొని పోబడెను. విభూతియొక్క మహిమను ఎవరు విశేషముగా చెప్పగలరు? ఏ జనులైతే విభూతి చేత అలంకరింప బడిన దేహమును కలిగివుంటారో, ముఖమున పంచాక్షరమును కలిగివుంటారో అట్టి పుణ్యాత్ములగు జనులు రుద్రులే, ఇందు సంశయములేదు. ఎవరు జటలను ముడివేసి కొంటారో, రుద్రాక్షవిభూషణమును కలిగివుంటారో, వారు మనుష్య రూపమున నున్న రుద్రులే ఇందు సంశయము లేదు కనుక, సదాశివుడైన రుద్రుడు నిత్యము మానవులచే పూజింపబడవలెను. ప్రాతః కాలము, మధ్యాహ్నకాలము, సాయంసంధ్యా విశేషమైనవి. ప్రొద్దున శివుని దర్శనముచేత రాత్రి (చేసిన) పాపముతోలగిపోవును. మధ్యాహ్నమున దర్శనముచేత మానవులకు ఏడుజన్మలనుండి పొందిన పాపము నాశనమునొందును. రాత్రి యందైతే లెక్కీంపబడదు 'శివ' అను రెండక్షరాల పేరు గొప్ప పాపములను నశింపచేయునది. అది ఎవరి ముఖమునుండి బయల్వెడలునో వారి చేతనే ఈ జగత్తు ధరింపబడుతున్నది.
మూలముః
పుణ్యకర్ములైన జనులచేత శివాంగణము నందుంచబడిన భేరీనాదముచేత పాపరతులైన జనులు, పాషండులు, చెడువాదములుచేయువారు (నాస్తికులు) కూడా ఉత్తమ గతిని పొందెదరు శివాలయమునందు ఏ పశువునకు చెందిన చర్మముచేత భేరీ, మృదంగము, మురజము (మద్దెల) మొదలైనవి ఉంచబడుతాయో ఆ పశువు శివసన్నిధిని చేరుట తథ్యము.
కనుక వీణాది తంత్రీ వాద్యాలమ (తతం) వితతమును, పిల్లన గ్రోవిమొదలైన ముఖవాద్యాలను (సుషిరం) తాళము మొదలైన కంచు వాద్యాలను (ఘనం), గొప్ప చామరములను, మంచకములను, పరుపులను గాథలను, ఇతిహసములను (ఇతిహాసముల గాథలమ) గానమును యథావిథిగా, శివునకు ప్రియములైన వానిని వివిధ రూపములలో చేయవలెను. అట్లు చేసి పాపులైన వారునూ శివలోకమునకు వెళ్ళెదరు. మంచి ధర్మము గలవారు, మహాత్ములు, శివపూజనుతెలిసినవారు, మరియు గురువు ముఖమునుండి పొందిన శివపూజ యందు ఆనందించువారు విశ్చయమునొంది ఈ విశ్వమును శివుని రూపంలో చూచెదరు. మంచి బుద్దిచేత మంచి ఆచారమునుగల వారు, వర్ణాశ్రమము గల నరులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు మరియు ఇతర జనులు (జగత్తునంతా శివునిగా చూచెదరు) గొప్పవాడైన చండాలుడు కూడా శివునకు అత్యంత ప్రియుడే యగును. చరాచర జగత్తంతా శివుని చేతనే అధిష్ఠితమై యున్నది.
కనుక, అంతా శివమయమని విశేషముగా తెలియవలెను. వేదములచేత, పురాణముల చేత, శాస్త్రములచేత మరియు - ఉపనిషద్ధంథముల చేత, వివిధ ఆగమములచేత శివుని తెలియవలయును. ఇందు సంశయము లేదు. కోరికలు లేని వారు, కోరికలు గలవారు కూడా సదాశివుని పూజింపవలెను.
లోమశుడుచెప్పెను! మునుపు జరిగిన పురాతన ఇతిహాసమును తెలిపెదను. పూర్వము అవంతీపురమున నంది అను వైశ్యుడు నివసించెను. అతను శివుని ధ్యానమునే చేయుచూ శివపూజను చేసెను. నిత్యమూ తపోవనమునందున్న ఒక లింగమును అర్చించువాడు. ప్రతిదినము ఉషఃకాలముననే లేచి శివుని యందు ప్రీతిచే నంది మిక్కిటముగా శివలింగముయొక్క అర్చనయందే వుండెడివాడు. యథోక్తముగా శివలింగమును పంచామృతముచేతనే అభిషేకించువాడు. ప్రతిదినము వేదవేదాంగముల యందు పండితులైన బ్రాహ్మాణులతో కూడి శాస్త్రమునందు చెప్పిన విధముగా లింగార్చన చేయువాడు. స్నానము చేయించి, పిమ్మట నానావిధములైన పుష్పములచేత మరియు ముత్యములు ఇద్రనీలములు, నీలములు, గోమేదికము, వైడూర్యములు, మాణిక్యములచేత పూజించెడివాడు.
ఇట్లు మహానుభావుడైన నంది జనరహిత ప్రదేశంలోనున్న శివలింగమును రకరకాల భోగములతో కూడునట్లు పెక్కు - సంవత్సరములు పూజించెను. ఒక మారు, ప్రాణులను హింసించు కిరాతుడొకడు వేటయందాసక్తిచేత అవివేకముతో, పాపముతో, పలుముగముల గల గిరికందరమున (పర్వత గుహయందు) ఇటునటు తిరుగుచూ ఎక్కడైతే శివలింగము బాగుగా పూజింపబడినదో అచటికి అనుకోకుండా వచ్చెను.
మిగుల దప్పిక గొన్న ఆ కిరాతుడు నీటికోసము వెదకుచూ ఆ వనములో సరస్సును చూచి వెంటనే వీటియందు ప్రవేశించెను. ఒడ్డున వేట సామాగ్రినంతా వుంచి (నీటిలో ప్రవేశించి) నీటిని పుక్కిలించి, కొంతనీటిని తాగి బయటకొచ్చెను. ఎదురుగా అనేక ఆశ్చర్యములతో కూడిన శివాలయమును, వివిధ రత్నములతో విడివిడిగా పూజింపబడిన లింగమును చూచి ఎప్పుడైతే పూజను గ్రహించెనో (అపుడు) అన్ని విధాల రత్నములను త్రోసివేసి పుక్కిటినుండి నీరుతో ఆ లింగమునకు స్నానము చేయించెను. ఒక చేతితో మాత్రమే అతను పూజకై బిల్వపత్రములనర్పించెను. రెండవచేతితో ముగముయొక్క మాంసమునర్పించెను. దండము వలె ప్రణామము చేసి మనసులో సంకల్పించేను.'ఈ నాటినుండి ప్రయత్నపూర్వకముగా పూజచేసెదను. నేటినుండి శంకరా! నీవు నా స్వామివి. నేను నీ భక్తుడను.
ఇట్లు నియమమును గ్రహించి ఆ కిరాతుడింటికి వచ్చెను. కిరాతుడిట్లు చేయుటను నంది గాంచెను. నంది అపుడు చింతాక్రాంతుడాయెను. ఈరోజు ఏ లోపము నాకు జరిగినది. శివుని పూజియందుచెప్పబడిన విఘ్నములే నా దురదృష్టము వలన వచ్చినవి. చాలాసేపు ఇట్లు పలువిధముల ఆలోచించి, శివమందిరమును కడిగి, వెళ్ళిన మార్గముననే నంది ఇంటికి వచ్చెను.అట్లు వికలమనస్కుడై వచ్చిన నందిని గాంచి పురోహితుడు అడిగెను. 'ఏందువలన నీవు వికలమైన మనస్సుతో నున్నావు?”. అపుడు పురోహితుని ఉద్దేశించి నంది ఇట్లు పలికెను.
ఓ బ్రాహ్మణుడా! ఈనాడు నేను శివుని సన్నిధిలో ఆమేధ్యమును చూచితిని. ఎవరు దానినట్లు చేసారో పూర్తిగా నాకు తెలియదు. అంతట, నందితో పురోహితుడిట్లు పలికెను. రత్నములు మొదలైన వానిచేత (చేయబడిన) గొప్పపూజు ఎవరిచేత అట్లు తీసివేయబడినది? వాడెవరైననూ కార్యము, ఆకార్యము వీనియందు మందగించిన బుద్దిగల మూర్ఖుడు. కనుక ఓ ప్రభూ! నీవు అణువంతైననూ చింతించవలదు, ప్రొద్దున నాతో సహ శివాలయమునకు వెళ్ళుడు. ఆ దుష్టునికై నిరీక్షించుటకు, ఆటు పిమ్మట చేయవలసిన దానిని నేను ఆచరించెదను. పురోహితుని వాక్యము వీని నంది తన ఇంటియందే మనసున బాధపడుచూ, రాత్రిని గడిపి, ప్రొద్దున పురోహితుని పిలిచెను. పిలిచి నంది ఆ మహాత్మునితో శివాలయమునకు వెళ్ళి ముందురోజు దురాత్ముడైన కిరాతునిచేత చేయబడినదానిని చూచెను.
అనేక రత్నములతో కూడుకున్నవానివి, పంచ ఉపచారములచేత కూడుకున్న శివుని, ఏకాదశ రుద్రము పూర్తికాగా చక్కగా పూజచేసి పెక్కు స్తోత్రములచేత నందీ బ్రాహ్మణులతో కలిసి శివుని స్తుతించి రెండు యామములు (జాములు) గడిపెమ అపుడు మహాకాలుని వలె నున్న మహాబలుడు, చేతితో ధనుస్సుతో రౌద్రమూర్తియై వచ్చెను. అతనిని చూచి నంది భయపడినవాడై విలపించెను. పురోహితుడు కూడా ఒక్కమారుగా భయమునొందెను.
ఇంతుకుముందువలెనే కిరాతుడు అక్కడ పూజను పాడుచేస్తూ ఆంతా తీసివేసెను. బిల్వ పత్రమును సమర్పించెను. శివునికి పుక్కిటి జలముచేత స్నానము గావించి కిరాతుడు నైవేద్యముగా పండునర్పించెను.దండ ప్రణామముచేసి లేచి తన ఇంటికి వెళ్ళేను. వ్యాకుల పడిన మనస్సుతో ఈ ఆశ్చర్యమునంతా చూచిన నంది పురోహితునితో కలిసి చాలా సేపు ఆలోచించెను. వేదవాదులైన బ్రాహ్మణుల పెక్కుమందిని నంది పిలిపించి కిరాతుడు చేసిన దంతా నివేదించెను. 'ఓవిప్రులారా! ఇప్పుడేమి చేయవలెనో ఉన్నదున్నట్లుగా తెలుపుడు మిక్కిలి శంకించుచున్న నందిని, ఆవిప్రులు ధర్మశాస్త్రము ప్రకారమాలోచించి, అందరూ కలిసి ఇట్లు పలికిరి.
దేవతలు కూడా తప్పింపలేవి విఘ్నము కలిగినది కనుక ఓ వైశ్యశ్రేష్టా! శివలింగమును నీవు శృహమునకు కొని రమ్ము అలాగే తలిచిన నంది శివుని (శివలింగమును) పెకిలించి తన ఇంట విధిపూర్వకముగా ప్రతిష్ఠింపజేసి నవరత్నములతో అలరారు బంగారు పీఠముపై నిలిపి వివిధ ఉపచారములచేత అపుడు పూజించెను.
మరునాడు శివమందిరమునకు వచ్చిన కిరాతుడు లింగమునకై చూడగా ఆది లేకుండెను. మౌనమును విడచి - ఒక్కమారుగా నిట్లాక్రోశించెను. 'శంభూ! ఎక్కడికి వెళ్ళితివి? ఈ నాడే నిన్ను నీవు చూపింపుము నాకు నీవు కానరాకున్నావు. నేడే నేను శరీరమును వదిలెదను. శంభూ! జగన్నాథ! త్రిపురాంతక! ప్రభూ ఓ రుద్రా, మహాదేవా! కనిపింపుము ఇట్లు ఆక్షేపముతో కూడినన మధురములగు మాటలచే కిరాతుడు సదాశివుని ఆక్షేపించెను. అపుడు ఆ వీరుడు గోళ్ళతో తన ఉదరమును చీల్చెను. చేతితో కొడుతూ రోషముతో నిట్లు పలికెను. “హేశంభూ! కనిపింపుము! నన్నెందుకు వదలి వెళ్ళేదవు' అని పేగులను మాంసమును పెకిలించి, తెంపి ఆ గోతిలో ఒక్కమారుగా పడవేసెను
మనసు కుదుట బరచుకొని ఆ సరస్సు నందు స్నానమాడి అట్లే త్వరగా నీటిని, బిల్వ పత్రమును తెచ్చి విధి ప్రకారమర్పించి దండమువలె భూమిపై పడెను. అపుడక్కడ కిరాతుడు శివుని సన్నిధిలో ధ్యానమునందుండ, ప్రమథులతో గూడిన శివుడపుడు ఎదుట నిలిచెను. కర్పూరమువలె తెల్లని వాడు, కాంతిమంతుడు, జటలను ధరించినవాడు, చంద్రుని తలపైగలవాడునూ అగు రుద్రుడు కిరాతుని చేతిని పట్టుకొని ఊరడింపజేయుచూ పలికెను.
ఓ వీరుడా! గొప్ప బుద్దిగలవాడా! నీవు నాభక్తుడవు. నీవిచ్చగించిన వరమును ఆత్మహితమగుదానిని కోరుము ఇట్లు రుద్రుడు పలుకగా మహాకాలుడు సంతోషముతో, పరమభక్తితో దండమువలె భూమిపై పడెను. తరువాత రుద్రునితో ననెను - 'వరమును కోరెదను. రుద్రా! నేను నీదాసుడను - నీవు నాస్వామివి. ఇందుసంశయము లేదు. ఓ జ్ఞానీ! జన్మ జన్మలకు నీ పట్ల భక్తిని (వరముగా) నివ్వుము. నీవు తల్లివి, తండ్రివి, బంధువు, మిత్రుడవు కూడా. నీవు గురువువు. గొప్ప మంత్రమూ నీవే. మంత్రముచే తెలియదగినవాడవు. కనుక ఎప్పుడూ మూడులోకములలో నీవు దక్క వేరు లేదు.
ఏ కోరికయూ లేని కిరాతుని ఆ వాక్యమును విని అప్పుడు శివుడు తన పరిచరులలో ముఖ్యునిగా ద్వారపాలకునిగా చేసెను. అపుడు డమరునాదముచేత, భేరియొక్క శబ్దము చేత, శంఖములద్వని చేత మూడు లోకములు నినదించెను.అపుడు వేల కొలదిగా దుందుభులు, తప్పేటలు మ్రోగెను. ఆనాదమును విని నంది ఆశ్చర్యముతో త్వరగా ప్రమథులతో గూడి శివుడుండిన తపోవనమునకొచ్చెను. అపుడు నందికి కిరాతుడగుపించెను విస్మయముతో నంది పరమాసమాధి చేత కిరాతుని స్తుతింపగోరి వినయముగా, నిట్లు పలికెను.
ఓ పరంతపా! నీవు భక్తుడవు. శివుడు నీచే ఇక్కడికి తీసుకురాబడినాడు - భక్తుడివగు నీవు నేను వచ్చితినని శివునికి నివేదింపుము. ఆ మాట విని కిరాతుడు త్వరగా నంది చేయి బట్టి శివుని చేరవచ్చెను. భగవంతుడగు రుద్రుడు నవ్వి కిరాతునితో 'గణముల సన్నిధికి నీచే గొనిరాబడిన ఈతనెవరు?' అనెను
కిరాతుడనేనుః కిరాతునిచే లోకమునకు శుభము చేకూర్చు శివుడు ప్రార్థింపబడెను. ఓ దేవా! ఇతను నీ భక్తుడు. ఎల్లప్పుడూ నీ' పూజయందు ఆనందించువాడు నీవు నిస్సంశయముగా ప్రతిదినము రత్న మాణిక్యముల చేత, వివిధ పుష్పముల చేత జీవితముచే మరియు ధనముచే పూజింపబడితివి. భక్తులపట్ల వాత్సల్యమును గలవాడా! నందిని నా మిత్రునిగా తెలుసుకొనుము.
మహదేవుడనేనుః మహానుభావా! వైశ్య (శ్రేష్ఠుడైన) నందిని నేనెరుగను. మహాకాల! గొప్ప బుద్దిగల నీవే నా భక్తుడవు, మిత్రుడివి. ఏ రకమైన ఉపాధీ లేని వారు, అభిమానవంతులు మానవులలో ఉత్తములు, విశిష్టులు - నాకు మిక్కిలి ఇష్టమైనవారు." 'తండ్రీ! నేను నీ భక్తుడిని. అతను నాకు మిక్కిలి ఇష్టమైనవాడు' అనగా శివుడు వారినిద్దరినీ పరిచరులుగా స్వీకరించెను అపుడు గొప్ప ప్రకాశముగల విమానములు పెక్కు అక్కడికి వచ్చెను. గొప్పతేజస్వియగు కిరాతుని చేత వైశ్యశ్రేష్టుడు ఉద్దరింపబడెను. మిక్కుటమైన వేగముగల విమానములచేత (వారిద్దరూ) కైలాసపర్వతమును చేరిరి. ఈశ్వరునిచేత సారూప్యమును పొందిరి. శివునితో కలిసి అపుడు వారు పార్వతి చేత నీరాజనములివ్వబడిరి - అపుడు గజగామిని యగు పార్వతి నవ్వి ఇట్లనెను.
మహాదేవ! నిస్సంశయముగా నీవెట్లో వీరిద్దరూ అట్లే, స్వరూపము, గతి, హాస్య భావములచేత బాగా పూజింపబడిరి. వాచేత వీకడివే సేవింపబడితివి. ఇందు సందేహము లేదు. దేవి అట్లనగా విని కిరాతుడు, వైద్యుడు వెంటనే (మదిరిగి) శంకరునికి పరాజ్మఖులై (ఆనిరి) ఓ ముక్కంటీ! నీచే మేము దయచేత చూడబడవలెను. నీ ద్వారమువద్ద నిత్యమూ నిలిచెదము. (నీకు) నమస్కారము. వారిద్దరి భావమును తెలుసుకొని, శివుడు నవ్వుచూ ఇట్లనెను. 'పరమ భక్తిచేత మీరుకోరినది అగుగాక!' విప్రులారా అప్పటినుండి వారిద్దరు శివుని ద్వారము వద్ద నిలిచి ద్వారపాలురై మధ్యాహ్నమున శివుని గాంచుచూ నుండిరి.
మహాకాలుడు, నంది - వీరిద్దరు శివునికిష్టులు. వారిద్దరు సంతోషముగా ననిరి - సదాశివుడొకడే (అని) మహాదేవుడు చేతివేలినొకదానిని ఎత్తి పలికెను - తన చేతివేళ్లను రెంటినెత్తి నంది 'అట్లే' అనెను. ఇట్లు గుర్తుకలిగిన వారిద్దరూ గొప్పవాడైన (శివుని) ద్వారము వద్ద నిలుచుండిరి. ఓ ఋషులారా! దుష్కర్మలజేయు ప్రాణులయందు కృపచేత శిలాదుడైన నందిచేత చెప్పబడిన 'అనంతమైన శివధర్మమును' వినుడు.
పాపము చేయువారు, అధర్మము నాచరించు వారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులము లేనివారు, చెడు భావనగలవారు, చండాలురైవ మానవులు కూడా మిగతా వారెలాంటి వారైనా శివభక్తిని గలిగినచో దేవదేవుడైన శివుని సాన్నిధ్యమును పొందెదరు. బుద్ధిమంతులెవరు ఇసుకతో గూడిన శివలింగమును పూజింతురో వారు రుద్రలోకమును చేరుదురు. ఇందు విచారించవలిసినదిలేదు. (ఇది నిశ్చయమని భావము)
శ్రీ స్కాందమహాపురాణమందలి మాహేశ్వరఖండము నందలి కేదారఖండములోని శివశాస్త్రమున శివభక్తి మాహాత్మ్యవర్ణనము అను అయిదవ అధ్యాయము సమాప్తము.
