స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము
3వ అధ్యాయము
లోమశుడు పలికెనుః దాక్షాయణి అనేక విడ్డూరాలు గల తన తండ్రి గృహమున కేగి అచట గొప్ప యజ్ఞము జరుగుచోటుకు చేరుకొనెను. ద్వారము వద్ద నిలుచున్నపుడు తమతమ ఆసవమునుండి దేవతలు దిగిరి. ఆనందముతోయుండిన వారిని, దేవలోకమును (సతీదేవి) చూచెను సతీదేవి తండ్రి, తల్లివి, మిత్రులను, బాంధవులను చూచి, ఆనందముగా తల్లికి, తండ్రికి అభివాదము చేసి ప్రస్తావమన్నట్లుగా ఇట్లు పలికెను.పరమకల్యాణుడైన శివుడు నీ చేత ఎందువలన ఈ యజ్ఞమునకు ఆహ్వానింపబడలేదు? ఎవరిచేత ఈ చరాచర మంతా పవిత్రముగా చేయబడుచున్నదో,యజ్ఞము తెలిసినవారిలో శ్రేష్టుడు, యజ్ఞాంగము, యజ్ఞముయొక్క దక్షిణము అగు శివునిచే విండినది ఈ ద్రవ్యము, మంత్రదికము. హవ్యం, పితృదేవతలకర్పింపబడు ఆహారము (కవ్యం), అట్టి శివుడు లేనిదే చేయబడినదంతా అపవిత్రముకాగలదు.
తండ్రీ! శంభుడు లేనిదే ఈ యజ్ఞమెట్లు కొనసాగును? బ్రహ్మతో సహా వీరంతా ఇక్కడికెలా వచ్చారు? ఓ భృగూ! ఓయీ కశ్యప! ఓ ఆత్రీ! ఓ వశిష్ఠ మీకు తెలియదా? ఇంద్రా! నీకేమైనదీ నాడు? ఓ విష్ణూ! నీకు పరమేశ్వరుడు తెలియును. బ్రహ్మ! నీకు మహాదేవుని విక్రమము తెలియదా? పూర్వము పంచముఖుడుగా వుండి సదాశివుని పట్ల గర్వము చూపినపుడే కదా చతుర్ముఖుడవయితివి. ఆ అద్భుతమును మరిచితివా? దారువనములో మునుపు భిక్షాటనమాచరించిన భిక్షుకుడగు రుద్రుడు సఖులైన మీ చేత శపింపబడినాడు. అట్టి శపింపబడిన రుద్రుని మీరెట్లు మరిచితిరి? "
ఎవరి అంశమాత్రము చేత ఈ చరాచరము లింగభూతమైన జగత్తంతా జనించిన క్షణముననే పూరింపబడినదో, దానిని లయించుటవలన లింగ మని అందురు. ఏ దేవుని నుండి ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఉద్భవించారో,అట్టి వేదాంత వేద్యుడగు (శివుని) దేవుని తెలుసుకొనుట నీవల్లకాదు.
సతీదేవి మాటలను విని దక్షుడు కోపించి ఇట్లు పలికెను. “నీవు పెక్కు మాటలాడినను ఇక్కడ ఇపుడు జరగవలసిన దేదీ లేదు. కల్యాణీ! వెళ్ళినా సరే! వుండినా సరే! వీ ఎందుకిక్కడకు వచ్చితివి? మీ భర్త అమంగళుడు, ఆశుభుడు. మంచి వంశమున జన్మించనివాడు. వేదములకు దూరముగా నుండువాడు, భూత ప్రేత పిశాచాల రాజు. ఆందుకే సుభాషిణి! ఈ యజ్ఞము కొరకు అతనిని ఆహ్వానించలేదు. పాపి, మందబుద్ధియే నేను ప్రయోజనశూన్యుడు, గర్వితుడు. దురాత్ముడగు రుద్రునికి విన్ను ఒసంగితిని. కనుకనీవు దేహాన్ని వదలి స్వస్థురాలవుగమ్ము, అనిలోకపూజితయగు పుత్రికనుద్దేశించి దక్షుడు పలికెను.
అపుడు విందతో కూడిన తన తండ్రిని చూచి సతీదేవి మిగుల రోషముతో శంకరుని చూడగోరి మందిరమున కెట్లు వెళ్ళగలను? అతను ప్రశ్నించినప్పుడు ఏమి చెప్పగలను? మహాదేవుని (శివుని) నిందించువాడు, నిందించుచుండగా వినువాడు వీరిద్దరూ సూర్య చంద్రులున్నంతవరకు నరకమును పొందెదరు. కనుక నేను అగ్నియందు ప్రవేశించి దేహమును వదిలేదను.” అని పరిపరివిధముల చింతించుచూ, 'శివ' రుద్ర' అని పలుకుచూ అవమానముచే దుఃఖితమైన సతీదేవి అగ్నియందు ప్రవేశించెను.
అపుడు గొప్ప హాహాకారముతో దిగంతరాలు నిండెను. ఆసనమునధిరోహించిన, శస్త్రమును ధరించిన పెక్కుమంది తమ శస్త్రములతో తమనే దెబ్బతీసుకొనినారు. తమ దేహములను ఛేదించినారు. మరికొందరు ఉత్సుకులై తమ తలలను చేతులయందు వుంచుకొని త్వరగా నీరాజనము చేయుచూ భస్మమై పోయినారు. అలాగే అందరూ పలికినారు, అతి భయంకరంగా గర్జించినారు.
మిగుల భయంకరులైనవారు ఆయుధ ప్రహారములచే తమ శరీర అవయవాలను ఛేదించుకొని సతీదేవితో పాటు అపుడు విలయమును పొందిరి. ఇరువది వేల గణాలట్లు (విలయము నొందుట) అద్భుతము వలెనుండెను. ఆ ఋషులు, దేవతలు, ఇంద్రుడు మొదలుకొని, మరుద్గణములు విశ్వదేవతలు, అశ్వినీదేవతలు, లోకపాలురు అపుడు మిన్నకుండిరి. మరికొందరు శ్రేష్ఠుడైన విష్ణువును ప్రార్థించసాగిరి. ఇట్లు అంతటా, దురాత్ముడైన బ్రాహ్మణబంధువగు దక్షుని యజ్ఞము ఏర్పడగా ఋషులు భయమునొందిరి.
ఓవిప్రులారా! ఇంతలోనే మహాత్ముడైన నారదునిచే దక్షుని ఈ క్రూరకర్మ పూర్తిగా (శివునికి) చెప్పబడినది. నారదుని ముఖమునుండి బయల్వెడలిన ఆవాక్యమును విని ఈశ్వరుడు మిగుల కోపించి ఆసనమునుండి ఒక్కమారుగా లేచి లోకసంహారమునకు కారకుడైన రుద్రుడు జటను పెటికీ పర్వతముయొక్క అగ్రముపైన కోపముతో కొట్టెను.
అట్లు కొట్టుటచే గొప్ప కీర్తిగల వీరభద్రుడు, భూతకోటిచే కూడిన కాళీ- జనించిరి మహాత్ముడైన రుద్రుడు కోపముచే విశ్వసించుటనుండి వందజ్వరములు, పదమూడు సన్నిపాతములు పుట్టినవి. రౌద్ర పరాక్రముడైన రుద్రుని వీరభద్రుడు 'ప్రభూ! మీకై నేను చేయగల పనిని శీఘ్రముగా తెలుపుడ'ని విజ్ఞాపించెను. అపుడు భగవంతుడైన రుద్రుడు 'గొప్పబాహువుల గల ఓ వీరా! వెళ్ళి దక్షయజ్ఞమును నాశనము చేయుము' అని త్వరగా పంపించెను.
శూలము ధరించు దేవదేవుని శాసనమును శిరసావహించి గొప్పతేజస్సుకల వీరభద్రుడు, కాళికాదేవితో, అన్ని భూతములతో కూడి దక్షయజ్ఞమునకు వెళ్ళెను. అపుడు ఒక్కసారిగా చెడుశకునములు కలిగెను. ఇసుకతో కూడిన గాలి గట్టిగా వీచెను. మేఘము రక్తమును కురిపించెను. దిక్కులన్నీ చీకటితో కప్పబడెను. అనేక వేలకొద్ది ఉల్కలు భూమిపై పడెను. ఇలాంటి అరిష్టములను దేవతలు మొదలైనవారు చూచిరి. దక్షుడు కూడా భీతినొంది విష్ణువును శరణుజొచ్చెను.
ఓమహావిష్ణూ రక్షించుము, రక్షించుము! నీవే మా పరమగురువు, ఓ సురశ్రేష్ఠ! నీవే యజ్ఞము. ఈ భయమునుండి నన్ను విడిపించుము. అని దక్షుడు ప్రార్థించిన, మధుసూదనుడగు విష్ణువు 'నీకు నేను రక్షణ కల్పించవలెననుట యందు సంశయము లేదు దక్షా! ధర్మము తెలియని నీవు అవమానమును కలిగించితివి. ఈశ్వరుని అవమానించుట చేత అంతా విఫలమగును ఎక్కడ పూజింపదగని వారు పూజింపబడుదురో, పూజ్యులు పూజింపబడరో అక్కడ దుర్భిక్షము, మరణము, భయము అను మూడూ కలుగును. కనుక పూర్తి ప్రయత్నముచేత వృషధ్వజుడగు శివుని పూజింపవలెను. అవమానింపబడిన మహేశ్వరుని నుండి నీకు గొప్ప భయము వచ్చి చేరినది. ఇక ఇప్పుడు మేమంతా నీ చెడునడతవలన ప్రభువులము కాకుండా పోయాము. ఇందు విచారణ చేయదగదు.
విష్ణువు యొక్క ఆ మాటలను విని దక్షుడు చింతాక్రాంతుడాయెను. పాలిపోయిన మొఖముతో నేలపై మిన్నక విల్చుండెను. రుద్రుని చేత ప్రేరితుడైన మహాబాహువైన వీరభద్రుడు మరియు కాళి, కాత్యాయని, ఈశానా. చాముండా, ముండమర్దినీ భద్రకాళీ, భద్ర త్వరిత, వైష్ణవియను నవదుర్గలు, భూతములగొప్ప గణము శాకిని, డాకిని మరియు భూతములు, ప్రమథులు, గుహ్యకులు అలాగే అరువది నాలుగుతో కూడిన యోగినీ చక్రము (అరువదినాలుగు యోగినుల సమూహము) ఒక్కమారుగా గొప్ప కాంతి కలిగిన యజ్ఞ వాటిక వైపు బయల్వెడలినవి - వందలు వేలకొద్ది గణాలు వీరభద్రుని వెంటవచ్చినవి.
శంకరుని అనుచరులైన వీరంతా రుద్రస్వరూపులు, ఐదు తలలుగలవారు, నీలకంఠులు, వీరంతా ఆయుధమును చేతబట్టినవారు ఛత్ర, చామరములచే పరివృతులు మరియు శివుని పరాక్రమము వంటి పరాక్రమము గలవారు, పది తలలు మూడు కన్నులు, జటలు, రుద్రుని భూషణముల వంటి భూషణములు గలవారు ఆర్థచంద్రుని ధరించువారు, వీరంతా అమితశక్తిశాలులు. వృషభమును అధిష్ఠించువారు, వేషభూషణములు గలవారు.సర్పరాజులచే పరివృతుడు, సహస్ర బాహువు, త్రినేత్రుడు, అమిత బలసంపన్నుడు, భయము గూర్చువాడు అగు వీరభద్రుడు వీరందరితో కలిసి యజ్ఞమునకు వెళ్ళెను.
రెండింతలు ప్రమాణము గలది, వేయి మేలుజాతి గుర్రములు మరియు పదిలక్షల సింహాలచేత లాగబడినది అగు రథము అతనిది. అలాగే, కవచము గలవారు, సింహములు అనేకములతని పార్వరక్షకులు, పులులు, మొసళ్ళు, చేపలు, ఏనుగులు వేలకొద్ది ఆతని పార్వరక్షకులు (వెన్నంటి కాపాడువారు) ఛత్రములను, చామరములను తలపైనుంచుకొని అన్ని వైపుల నడచిరి. ఆటుపై, గొప్పనాదమునిచ్చు భేరీ, వివిధ ద్వనులనిచ్చుశంఖములు, తప్పెటలు, మృదంగ వాద్యాలు,వివిధ బూరవాద్యాలు దట్టమైనవి. రంధ్రములుగలవి కూడా తమంతట తామే మ్రోగినవి. మధురమైన గానమును చేయువారు, మృదంగమును మోగించగలవారు అంతా పెక్కు లాస్యములతో కూడి వీరభద్రుని ముందు (నడచిరి) వుండిరి.
వారంతా మహాశక్తిసంపన్నులై రణవాద్యమును మోగించి గర్జించిరి. ఆ గొప్ప నాదముచేత మూడులోకములూ ధ్వనించినవి. రుద్రుని చేత ప్రేరితులైన ఆగణములిట్లు వచ్చిరి. ఆయుధముల గ్రహించి వినాశమొనర్చుటకై దక్షుని యజ్ఞవాటికన చేరిరి- అపుడు ఆకాశము ధూళితో కప్పబడినది. దిక్కులు చీకటితో కప్పబడినవి. పర్వతములు, అరణ్యములతో సహా సప్తద్వీపములు గల భూమి కంపించినది. దేవతలు, దైత్యులు, నిశాచరులంతా లోకమునకు క్షయమును కలిగించు గొప్ప ఆశ్చర్యాన్ని చూచి ఒక్కమారుగా లేచినిల్చిరి. భయమును కలిగించుచూ వచ్చుచున్న రుద్రసేనమ గాంచిరి.
కొందరు భూమిని చేరగా, కొందరు ఆకాశమును చేరిరి. మరికొందరు దిక్కులను, దిగంతరాలను చుట్టుముట్టునట్లు (నిలిచిరి) అంతములేని వారు, క్షయము లేనివారు అగు రుద్రునితో సమానులగు శూరులు యుద్ధమున (వుండిరి). రుద్రులచే చుట్టూ కమ్మబడిన ఆ సైన్యమును చూచి విస్మయముతో అందరూ శస్త్రములను ధరించి నేడు వెళ్ళెదము అనిరి.
ఇంద్రుడు గజమును, వాయువు మృగమును (జింకను) దండధారి యముడు మహిషమును, కుభేరుడు పుష్పకమును, వరుణుడు మొసలిని, అగ్ని మేకను, నిర్ఋతి శవమును అధిరోహించిరి. ఇదేవిధంగా ఇతర దేవతాగణాలు, యక్షులు, చారణులు, గుహ్యకులు అమిత ప్రతాపవంతులై తమ తమ వాహనాల నధిరోహించిరి.
తనవారి ప్రయత్నాన్ని చూచి దక్షుడు కన్నీటితో, దండము వలె భూమిపై పడి అందరినీ ఉద్దేశించి పలికెను. 'మీ అందరి బలము చేతనే నేనీ గొప్ప యజ్ఞమును మొదలిడితిని. గొప్పకాంతిగల మీరు సత్కర్మ సిద్ధించుటలో ప్రమాణము. ఓ విష్ణ! నీవు కర్మకు, యజ్ఞములకు సాక్షాత్తుగా పరిపాలకుడవు. ఓమాధవా! వేద గర్భితమైన ధర్మమునకు నీవు బ్రహ్మణ్యుడవు, కనుక ఈ యజ్ఞమునకు రక్షణను ఏర్పరచవలసినది' అనిన దక్షుని పలుకులను విని విష్ణువు పలికెను.
నేను ధర్మపరిపాలనయందు రక్షణను కల్పించవలెనని నీవన్నది సత్యమే కానీ ఈనాడు యజ్ఞమునకు ధర్మ వ్యతిక్రమమే కలిగినది. నైమిషక్షేత్రంలో సదాశివుని గూర్చి నీవన్నది గుర్తురావడం లేదా? ఈ రుద్రుడు గొప్పతేజస్వి, యజ్ఞమే రూపముగా గలవాడు. ఎల్లప్పుడూ శుభము చేకూర్చువాడు. మూర్ఖుడా! అట్టి రుద్రుడు నీ చెడు ఆలోచన వల్ల నేడు యజ్ఞమునకు దూరముగా నుంచబడినాడు. రుద్రుని కోపమునుండి నిన్ను రక్షింపగల సమర్థుడెవడిక్కడ? దుర్మతియగు నిన్ను రక్షించువాడిని నేను చూడలేకున్నాను.
ఓ దుర్మతి! ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకొనలేకున్నావు. ఎప్పుడైనా కేవలం కర్మ సమర్థము కాజాలదు. ఈశ్వరునితో కలిసిన (భావనతో) కర్మ మాత్రమే సమర్థమగునని తెలిసికొనుము. ఈశ్వరుడు దప్ప వేడొకడు కర్మల (ఫల) దాత నిశ్చయముగా లేడు ఎవరైతే ఈశుని భక్తులో, శాంతులో, శివుని గూర్చి ధ్యానించువారో వారి కర్మ యొక్క ఫలాన్ని సదాశివుడు వారికొసంగును. ఈశ్వరుడు లేడని భావించుచు, కేవల కర్మను ఆశ్రయించువారు శతకోటియజ్ఞములచే గూడ నరకమునకే వెళ్ళేదరు. ప్రతి జన్మయందునూ మరల కర్మ రూప పాశములచే కట్టి వేయబడి, ఈ కర్మ రూపులగు (జనులు) నరకములందు బాగుగా పచనము చేయబడుదురు.
శ్రీ స్కాందపురాణమందలి మొదటి మాహేశ్వరఖండములో కేదారఖండమునందు వీరభద్రుని ప్రాదుర్భావ వర్ణనమను మూడవ అధ్యాయము.
