స్కంద మహా పురాణము లోని మాహేశ్వర ఖండము లోని కేదార ఖండము

4వ అధ్యాయము

విష్ణువు చెప్పినది విని దక్షుడిట్లు పలికెను. 'ఓ మధుసూదనా! వేదములు అప్రమాణములుగా చేయబడినవి. వైదిక కర్మనొదిలి ఈశ్వరభావనను పొందుటెట్లు? కాన, ఓ మహావిష్ణూ! దేని చేత ధర్మము ప్రతిష్ఠింపబడినదో అద్దానిని గూర్చి తెలియజేయుము. దక్షుడట్లు పలకగా మహావిష్ణువు అతనినూరడిల్లజేయుచు, వేదములు త్రిగుణములతో కూడిన విషయములు గలవేయగుమ. వేరే విధముగా కావు.  వేదములో చెప్పబడిన కర్మలు ఈశ్వరుడు లేక విఫలములే యగును. సఫలము లెట్లగును?  కనక పూర్తి ప్రయత్నము చేత ఈశ్వరునే శరణము జొచ్చుము అని గోవిందుడు పలుకుచుండగనే (వీరభద్రుని) సముద్రమువంటి సైన్యము ఏతెంచెను.

వీరభద్రుని సమానమగు ఆ సేనను దేవతలప్పుడు చూచిరి. ఆత్మవాదనను చేయు విష్ణువును చూచి ఇంద్రుడు నవ్వుచూ వజ్రాయుధమును గ్రహించి ఇతర దేవతలతో కలిసి యుద్దము చేయగోరెను. ఉచ్చాటనపరుడైన శుక్ర మహర్షిచేత (ఇంద్రుడు) ప్రేరేపింపబడెను. అపుడు గణములన్నీ దేవతలతో యుద్ధము చేసినవి. ఆ రణమహోత్సవములో వారు పరస్పరము బాణములతో, లోహపు గదలతో, లోహపు బాణములతో ప్రహారముచేసికొనిరి. అనేక విధాల శంఖములను పూరించిరి ఆపుడు దుందుభివాద్యములు, తప్పెటలు, డిండిమములు మ్రోగినవి. ఆ గొప్ప నాదము చేత శ్లాఘింపబడిన దేవతలు  లోకపాలకులతో కలిసి ఆ శివకింకరులను హింసించిరి.

వందలవేలకొలది గణములన్నీ ఖడ్గప్రహారమువలన ప్రాణములు వదిలినవి, కొన్న గణములు గదా ప్రహారమువలన దెబ్బతినినవి. ఇట్లు దేవతల చేత పరాజయమునొందినవి. ఇంద్రాది దేవతల చేత, లోకపాలురచేత ఆ గణములు భృగుమహర్షి మంత్రబలము వలన వెనుదిరుగునట్లు ఆదే క్షణమున చేయబడినవి. దేవతలను పూజించుటకు, దీక్షితుడైన దక్షుడు తృప్తినొందుటకు భృగుమహర్షి ఆ గణముల ఉచ్చాటనమును చేసేను దాని చేత దేవతలు తళణమే జయమును పొందిరి. తనవారి పరాజయమును గాంచీ వీరభద్రుడు కోపించి  భూత, ప్రేత, పిశాచములను సృజించి, వృషభములనధిరోహించిన వానిని తన ముందు, వెనకల నిడుకొని తానూ స్వయముగా తీక్షమైన త్రిశూలమును గ్రహించి మహాబలుడై వారిని (దేవతలను) రణమునందు పడగొట్టెను.

శూలప్రహారములచేత ఆ గణములు దేవతలను, యక్షులను, పిశాచములను, గుహ్యకులను మిక్కిలి హింసించిరి. రణభూమిలో కొందరు ఖడ్గములచేత రెండుగా ఖండింపబడిరి, కొందరు గదల చేత పొడవబడిరి, గొడ్డళ్ళచేత ముక్కలుగా చేయబడిరి. కొందరు శూలములచేత వందలకొలదిగా పొడవబడి ముక్కలుగా చేయబడిరి. ఇట్లు పరాజయముపొందిన వారందరూ పలాయనముచిత్తగించిరి. ఒకరినొకరు కౌగిలించుకొని స్వర్గమునకు వెళ్ళిరి. ఉత్సుకులైన ఇంద్రుడు మొదలగు దేవతలు, లోకపాలకురు మాత్రము నిలిచిరి. వారు 'మాకు జయమెట్లు కలుగును?' అని బృహస్పతిని ప్రశ్నించిరి  అపుడు త్వరగా బృహస్పతి ఇంద్రునితో ఇట్లు పలికెను

 బృహస్పతి పలికెనుః మునుపు విష్ణువు చెప్పినది ఈనాడు నిజమైనది. ఈ కర్మకు ఫలరూపముగా ఏ ఈశ్వరుడైనా వుండినట్లయితే, అతను కర్తను మాత్రము చేరును - కర్తకాని వానికి అతను ప్రభువుకాడు. మంత్రాలు, ఔషధములు, లౌకిక అభిచారమంత్రాలు, కర్మలు, వేదాలు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస రెండూ, తెలుసుకొనశక్తి లేనివి- అనన్యభక్తిచే మాత్రమే (ఈశ్వరుడు) తెలియదగును. పరమశాంతి, పరమతృప్తి వీనిచే మాత్రమే సదాశివుని తెలీయదగును. అతని చేతనే సుఖదుఃఖ స్వరూపంగల ప్రపంచమంతా ఏర్పడును. అయిననూ,కార్యము,అకార్యము రెండింటినీ తెలియచేయుకోరికచే (మీకు) చెప్పెదను.

ఇంద్రా! నీవు మూడుడవై లోకపాలురతో కలిసి ఈనాడు (ఇక్కడకు) ఏతెంచితివి- ఇప్పుడేమి చేయగలవు? రుద్రునికి సహాయముగా వచ్చిన ఈ గణములు అత్యంత సుందరములైనవి. కోపించినవి దేనినీ మిగల్చవు. బృహస్పతి ఇట్లు పలుకగా విని ఆ స్వర్గలోకవాసులు, లోకపాలురు, గొప్ప ప్రభువులు చింతనొందిరి.

గణములచేత పరివృతుడైన వీరభద్రుడపుడు ఇట్లు పలికెను. 'మీరంతా మూర్ఖత్వము వలన అవదానము (కర్మవృత్తము=ప్రశస్తకర్మ కొఱకేతెంచితిరి ఇపుడు త్వరగా మీతృప్తికై అవదానాలను ఇచ్చెదను. అని పలికి వాడి బాణములచేత (వారిని) అతికోపముతో కొట్టెను. ఆ బాణములచేత కొట్టబడిన వారంతా దశదిశలకు వెళ్లారు. లోకపాలురంతా వెళ్ళిపోగా, దేవతలంతా పారిపోగా, వీరభద్రుడు తన గణములతో కలిసి యజ్ఞవాటమునకు ఏతెంచెను.

 అపుడు ఋషులంతా ఈశ్వరులకే ఈశ్వరుడగు జనార్దనునుద్దేశించి విజ్ఞాపనము చేయు కోరిక గలిగి ఇట్లు పలికిరి. నిస్సంశయముగా నీవే యజ్ఞము. దక్షుని యజ్ఞమును రక్షించుము'. ఋషుల ఈ మాటను విని విష్ణువు అధ్యాత్మమును ప్రకాశింపజేయువాడు యుద్ధము జేయదలిచి యుద్ద (రంగము)న నిలిచెను. గొప్పబాహువులుగల వీరభద్రుడు విష్ణువుతో ఇట్లు పలికెను. ఓ విష్ణూ!, జ్ఞానివగు నీవిక్కడికెట్లు వచ్చితివి? దక్షుని పక్షమున జేరి ఎట్లు జయించెదవు? తెలుపుము. ఓ ఆఘరహితా! (పాపములేనివాడా) దాక్షాయణి (సతీదేవి) చేసినదానిని నీవు చూడలేదా? నీవుకూడా దక్షుని యజ్ఞమున అవదానము కొఱకు వచ్చితివి. ఓ మహాభుజా! నీకుకూడా అవదానమునిచ్చెదను.

అని పలికి తగినరూపుదాల్చిన విష్ణువుకు మొదట నమస్కరించి, వీరభద్రుడు ఎదుటనిలిచి ఇట్లు పలికెను. నాకు శంకరుడిట్లో నీవున అట్లే. ఇందు సంశయము లేదు. అయిననూ ఓ మహాబాహూ! యద్దము చేయు కోరికతో ఎదుట నిల్చితివి. నీవు నిలుచుండినట్లయితే, తిరిగి వచ్చుట అనునది లేని స్థితి (అపునరావృత్తి) కి తీసుకొని వెళ్ళేదను బుద్ధిమంతుడైన వీరభద్రుని మాటలను విని గొప్ప ప్రభువైన విష్ణువు నవ్వుచూ ఇట్లు పలికెను.

'ఓ గొప్పబుద్ధిగలవాడా! నీవురుద్రుని తేజస్సు నుండి జన్మించినవాడవు, పవిత్రుడవు. ఇతను (దక్షుడు) ఇంతకుముందు నన్ను యజ్ఞము కొఱకై పెక్కు పర్యాయములు ప్రార్థించెను. నేను భక్తులకు వశుడను. మహేశ్వరుడూ అట్లేకదా! ఆ కారణము చేతనే ఇక్కడ దక్షుని యజ్ఞమునకేతెంచితిని. రుద్రుని కోపమునుండి జనించిన వీరభద్రా! నేను నిన్ను అడ్డగించెదను లేదా నీవే నన్ను అడ్డగించుము' అని గోవిందుడు పలుకగా నవ్వి, మహాభుజుడు, వినయము చేత వంగి, విష్ణువుతో ఇట్లనెను.

'శివుడెట్లో నీవట్లు, వీవెట్లో శివుడునూ అట్లే! మేమంతా నీకు లేదా శంకరునికి సేవకులము'. అతని ఆ మాటను విని విష్ణువు నవ్వి ఇట్లుపలికెను  'ఓమహాబాహూ! శంక లేకుండా నాతో యుద్ధము చేయుము. నీ అస్త్రముల చేత నింపబడిన నేను నా భవనానికి వెళ్ళేదను. 'అలాగే' అని పలికి గొప్ప బలముకలవాడు. వీరుడు అయిన వీరభద్రుడు గొప్ప అస్త్రజాలమును గ్రహించి సింహనాదములచే గర్జించెను. విష్ణువు కూడా గొప్ప ధ్వని గల శంఖమును పూరించేను. రణమును వదలి పారిపోయిన దేవతలందరూ ఆది విని మరలివచ్చిరి ఇంద్రుడితో సహాలోకపాలకులంతా వ్యూహమును రచించిరి. అపుడు నూరుకణుపులుగల వజ్రముచేత ఇంద్రుడు నందిని కొట్టెను

అపుడు నంది త్రిశూలముతో ఇంద్రుని వక్షస్థలముపై కొట్టెను. ఇట్లే వాయువు, భృంగి పరస్పరముదెబ్బతీసుకొనిరి. బలవంతుడైన మహాకాలుడు పదునైన శూలములో, దండమును ధరించిన యమునితో సహా యుద్ధము చేసెను. కూష్మాండపతి

 స్వయముగా కుబేరునెదుర్కొనెను. మహాబలుడైన ముండుడు వరుణునితో యుద్ధము చేసెను. అమిత బలముగల చండుడు నిర్ఋతితో మూడు లోకాలు విస్మయమొందునట్లు అమితశక్తితో యుద్దము చేసెను. నిర్ఋతిని అపహాస్యము చేయునట్లు పరమ అస్త్రముతో యుద్ధము చేసెను.

అపుడు యోగినీ గణముతో కూడిన గొప్ప నాయకుడగు భైరవుడు దేవతలనందరినీ చీల్చి అద్భుతముగా రక్తమును ద్రావెను. క్షేత్రపాలురు మరియు ఇతర భూత, ప్రమథ, గుహ్యకులు, శాకినీ, డాకినీ, రౌద్రులు, నవదుర్గలు, యోగిమలు, కూష్మాండక మొదలయిన పిశాచులు వినదించిరి, రక్తమును ద్రావిరి మరియు బాగా మాంసమును భుజించిరి అపుడు సైన్యము భక్షింపబడుటను గొంచి ఇంద్రుడు నందిని విడచి స్వయముగా వీరభద్రునెదుర్కొనేను వీరభద్రుడు విష్ణువును విడచి దేవేంద్రునెదుర్కొనెను. వారిద్దరి మధ్య బుధుడు మరియు అంగారకుని మధ్య జరిగిన యుద్ధమువలె ఘోరమైన యుద్ధము జరిగెను.

 త్వరగా ఎప్పుడైతే వీరభద్రుని ఇంద్రుడు దెబ్బతీయదలిచాడో అంతలోనే గజముపై నున్న ఇంద్రుని బాణములతో (వీరభద్రుడు) నింపివేసెను. కోపముతో నున్న వీరభద్రుడు అడ్డగింపవీలులేనివాడుగా, మహాబలుడిగా వుండెను. అపుడు ఇంద్రుడతనిని తన నూరు కణుపులుగల వజ్రాయుధముతో గొట్టెను. (వీరభద్రుడు) ఇంద్రుని ఏనుగుతో, వజ్రాయుధములో సహా మింగివేయడానికి ఉద్యుక్తుడవగా, ఆ ఆద్భుతమును చూచువారు గొప్ప హాహాకారమునొనర్చిరి. ఆ విధముగా ఇంద్రుని దెబ్బతీయదల పెట్టిన వీరభద్రుని (నిలువరించుటకు) విష్ణువు త్వరగా వచ్చి నిలిచెను. ఇంద్రుని వెనకనుంచుకొని యుద్ధము చేయమొదలిడగా వీరభద్రునికి, విష్ణువునకు మధ్య జరిగిన యుద్ధము గొప్పదిగా నుండెను.

వారిద్దరు వివిధాకారములుగల శస్త్రములతో యుద్ధము చేసిరి. యుద్ధవిశారదుడైన ఇంద్రుడు మరల నందిని చూచి (ద్వంద్వయుద్దము చేసెను) దేవతలకు ప్రమథులతో భీకరమైన ద్వంద్వ యుద్ధము జరిగెను. దేవతలచే పీడింపబడిన ప్రమథులంతా రణమును వీడి పారిపోయిరి. వెనుదిరిగిన గణములను చూచి రుద్రుని కోపమునుండి జనించిన వ్యాధులన్నీ దేవతలను కూడా తరిమినవి. జ్వరములచేత పీడితులైన దేవతలను చూచి విష్ణువు నవ్వి, దేవతలను, వ్యాధులను విడివిడిగా జీవించి యుండగానే పట్టుకొనెను. అపుడు దేవతావైద్యులను అశ్వినులను పిలిచి వ్యాధులను పోగొట్టుటకు బుద్ధిమంతుడైన (విష్ణువు) వారికి లెక్కించి భృతి విచ్చెను.

అపుడు సంతోషముగా అశ్వినులు జ్వరములను, సన్నిపాతములను ప్రాణికోటికి శత్రువులగు వానిని నిగ్రహించి దేవతలను ఈజ్వరరహితులుగా చేసి మోదము నొందిరి. వారిచే (దేవతలచే) యోగినీ చక్రము జయింపబడినది. భైరవసంఘము కల్లోలపరచబడినది. వారు పదునైన అంచుగల బాణములచే భూతగణములను పడగొట్టిరి. దేవతలచేత (తన) సైన్యం తరిమి గొట్టబడుటను, నేలబడగొట్టబడుటను చూచి కోపించిన వీరభద్రుడు విష్ణువుతో ఇట్లనెను.

ఓ గొప్ప బాహువు గలవాడా! నీవుశూరుడవు, దేవతల పాలకుడవు. ఒక వేళ నీకిలాంటి అభిప్రాయమున్న యెడల నాతో యుద్దము చేయుము.  అని పలికి ప్రభువులకే ప్రభువగు విష్ణువుని ఎదుర్కొని మహాబలముగల వీరభద్రుడు పదునైన బాణముల వర్షించెను. అపుడు విష్ణువు వీరభద్రునిపై చక్రమును ప్రయోగించేను. వచ్చుచున్న చక్రమును వీరభద్రుడు తత్క్షణమే మింగివేసెను. శత్రువుల నగరములను జయించు విష్ణువు, (తన) చక్రమును వీరభద్రుడు మీంగగా చూచి అతని (వీరభద్రుని) ముఖమును నిమిరి మరల అది బయల్వెడలునట్లు చేసెను. అన్నిలోకములను ఒక్కడుగా భరించు మహానుభావుడైన విష్ణువు తన చక్రమును తీసుకొని, తన శత్రువులాచరించినది సహింపవీలులేనిదిగా తెలుసుకొని స్వర్గమునకు వెళ్ళెను.

శ్రీ స్కాంద పురాణమందలి మాహేశ్వరఖండము యొక్క కేదారఖండములోని వీరభద్రాదులకు విష్ణువు మొదలైనవారితో యుద్ధము అను నాలుగవ అధ్యాయము సమాప్తము.